అయ్యో దేవుడా!
తాళ్లపాక అన్నమయ్య రాసిన 32 వేల కీర్తనలు చెక్కిన రాగిరేకులు తిరుమలవాసుడి చేరువన చీకటి కొట్లో పడి ఉన్న సంగతి ఏడు దశాబ్దాల క్రితం వరకు మనకెవరికీ తెలియదు. తేటతెలుగు తీయందనాన్ని చవులూరించేలా అక్షరీకరించిన అలాంటి మరుగున పడిన మాణిక్యాలను వెలికితీత నిరంతర యజ్ఞంలా సాగాలి. అన్నమయ్య ఒక సంకీర్తనలో ‘‘… ఇంతి చెలువపు రాశి’’ అని వర్ణిస్తాడు. ఇది అచ్చ తెలుగు పదం. దీనికి అర్థం- ‘అందాల రాశి’’ అని.
మనం నిత్యం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఆ మాటల్లో ఎన్నో పదాలు పలుకుతుంటాం. వాటిలో చాలా పదాలు ‘తెలుగు’వే అనుకుంటాం. నిజానికి ఒకసారి అటువంటి పదాలను తెరచి చూస్తే.. మనం మాట్లాడే భాషలో తెలుగు పాలెంతో తెలిసి వస్తే ఆశ్చర్యం కలగక మానదు.
అసలు మనం మన తెలుగును గౌరవించుకుంటూ ‘మాతృభాష’ అని సంబోధిస్తుంటాం. కానీ, ‘భాష’ అనే పదం సంస్క•తం. అంతెందుకు? ‘దేవుడు’. ‘దేవత’ వంటి దైవ సంబంధ పదాలు, మాటలన్నీ సంస్క•తంలోనివే. మరి తెలుగులో ‘దేవుడు’ని ఏమంటారు? దేవుడికి అన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు అర్థమవుతాయి కాబట్టి సరిపోయింది కానీ, ఆయనకు తెలుగు మాత్రమే వచ్చి ఉంటే మన పరిస్థితి ఏమిటి? మన పూజలు, ప్రార్థనలు ఆయనకు అర్థం కాకుంటే మన గతి?!
‘దేవుడు’ని తెలుగులో సంబోధించా లంటే.. ‘వేలుపు’, ‘ఎల్లడు’, ‘ఎల్లి’ అని పిలవాలి. సరే, ఇక మనం (తెలుగు వాళ్లం) ‘దిక్కు’ లేని వాళ్లం. అవును! మనం దిక్కులుగా పలికే ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం.. ఈ పదాలన్నీ సంస్క•తమే. ఆయా దిక్కుల్ని తెలుగులో ఏమంటారో చాలామందికి తెలియనే తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే తీరిక, ఓపిక అసలు ఎవరికీ లేదు.
నిత్యం ఏదో సందర్భంలో ‘ముఖం అద్దంలో చూసుకున్నావా?’ అనేస్తాం. కానీ, ‘ముఖం’ తెలుగు పదం కాదు. మరి తెలుగులో ఏమనాలి?. ఏ ఆంగ్ల భాష, పరభాష వాళ్లో వచ్చి మనల్ని ‘ముఖాన్ని తెలుగులో ఏమంటా’రంటే మనం ఏ ముఖం పెట్టుకోవాలి?.
లంగా, ఓణీల్లో వెలిగిపోయే ఆడపిల్లల్ని అచ్చ తెలుగమ్మాయి అనీ, పదహారణాల తెలుగమ్మాయి అనీ అందంగా కితాబు ఇచ్చేస్తాం. నిజానికి వర్ణన వరకే ఇది. ఎందుకంటే అసలు, ‘లంగా’, ‘ఓణీ’, ‘జాకెట్టు’ అనేవి తెలుగు పదాలు కావు. కానీ విచిత్రంగా ఆ వస్త్రధారణలో ఉన్న అమ్మాయిల్ని అచ్చ తెలుగు అమ్మాయిలని అనేస్తాం. ‘లంగా’ అసలు రూపం ‘లెహంగా’. ఇది హిందీ శబ్దం. ‘ఓణీ’.. ‘ఓణ్నీ’ నుంచి వచ్చింది. ఇదీ హిందుస్థానీ మాటే. ఇక, ‘జాకెట్’, ‘గౌను’ ఆంగ్ల పదాలు. ‘ధోతి’ హిందీ శబ్దమే. ఇలా మనం పలికే నాలుగు పలుకుల్లో మూడు పరభాషా పదాలే. వాటినే తెలుగుగా భ్రమిస్తున్నాం.
మన దైనందిన జీవితంలో ప్రతి చర్యకూ ఒక పదం, ఒక మాట ఉంటాయి. అదే భాష. అయితే ఏవేవో కారణాల వల్ల ఆ పలుకుల్లో పరభాషా పదాలు చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. నిజానికి పరభాషా పదాలను అనివార్యంగా, అకారణంగా తెచ్చేసుకోవడం సులభమే. కానీ, మనం పలికే పదాలు, మాట్లాడే మాటల్లో అచ్చ తెలుగు పదాలను తెచ్చుకోవడం మాత్రం యజ్ఞం చేసినంత పని. తెలుగు రాయడం, తెలుగు మాట్లాడటం తక్కువతనంగా భావిస్తున్న తెలుగుతరం ఇది. పరిస్థితులు, కాలానుగుణ మార్పులు, పట్టణీకరణ, నగరీకరణ, అవసరార్థ ఆంగ్ల విద్య, అభివృద్ధి… ఇంకా ఇటువంటి కారణాలతో తెలుగు మాటలకు కాలం చెల్లిపోతోంది. ‘రాచిప్ప’ అంటే ఇప్పటి తరంలో ఎంతమందికి తెలుసు? ఇదిప్పుడు ఎవరికీ అక్కర్లేని పదమైపోయింది. అలాగే, శిబ్బెం, గోకర్ణం, స్తాళీ, చెంబు, బిందె, జాంబులాంటి వస్తువుల వాడకమూ తగ్గిపోయింది. వాటి ‘పలుకు’బడీ తగ్గిపోయింది. పొయ్యి, రోలురోకలీ వంటివీ అంతరించి పోయే దిశగా అడుగులు వేస్తున్నాయి. విసుర్రాయి (తిరగలి), రుబ్బురాయి కనుమరుగైపోతున్నాయి. నిజానికి నిత్య జీవితంలో, జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని వస్తువులు కనుమరుగు కాకతప్పదు. ఇలా అవసరం లేకుండా అంతరించిపోయే వాటిని ఎవరూ ఏ భాషలోనూ ఆపజాలరు. అవి నిఘంటువుల్లో మాత్రం భద్రంగా ఉంటాయి. కానీ దైనందిన జీవితంలో అక్కరకు వచ్చే అచ్చ తెలుగు పదాల్నీ అంతరింప చేసుకోవడం మాత్రం సరికాదు.
Review పలుకుబడి.