పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

చలికంఠము
చలి చలి చలి చలి చందాయమ్మ
గొంగళి కప్పుకో గానాయమ్మ

వడ వడ వడ వడ వణికేనమ్మ
చలిమంటకు చితుకులు తేవమ్మ
(పిల్లలు చలికి వణుకుతూ కంఠము (మెడ) చుట్టూ దుప్పటిని మడత పెట్టి రెండు మూడు చుట్లు కాళ్ల దాకా వచ్చేటట్టు చుట్టించుకుని రెండు పక్కలా ముడి వేయించుకుంటారు. ఇలా దుప్పటిని చుట్ట చుట్టి మెడ చుట్టూ కప్పుకోవడాన్ని ‘చలికంఠము’ అంటారు. పిల్లలు శీతాకాలంలో తొందరగా నిద్రలేవరు. బారెడు పొద్దెక్కినా దుప్పటి ముసుగు తన్ని పడుకుని ఉంటారు. వారిని నిద్రలేపడానికి పెద్దలు పాడే పాట ఇది.

మేలుకొలుపు
చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి
చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు

తెల్లవారొచ్చింది కోడి కూసింది
చూచేటి అక్కల్లు చూడరాదమ్మ

ఆడేటి అక్కల్లు ఆడరాదమ్మ
ఆడుకో రారమ్మ అక్కల్లు మీరు

ఆడేటి వారికి అచ్చావు పాలు
పాడేటి వారికి పాలు పంచదార అలాగే చలిని తలుచుకుని పిల్లలు

ఉగ్గు
ఊ ఊ ఉంగన్న
ఉగ్గుపాలు ఇందన్న
గుంటెడు కక్కక మింగన్న

ఊ ఉ ఉ ఉంగన్న
లుంగలు పెట్టకు గ్రుక్కన్న
ఓర్వని సవతులు దిష్టన్న
ఒప్పగ మసలర బుచ్చన్న

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రాలు తిన్న గుగ్గిళ్లరిగి

ఏనుగులు తిన్న వెలక్కాయలరిగి
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి
గణపతి తిన్న ఖజ్జాలరిగి

అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి
నందల్లే నడిచి గుర్రవంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ, ఈ బిడ్డను సంజీవరాయా!

శ్రీసూర్య
నారాయణా..

పుట్టేటి భానుడా, పుష్యరాగపుఛాయ
శ్రీసూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగు బంగరుఛాయ
శ్రీసూర్యనారాయణా!

జామెక్కి భానుగా, జాజిపువ్వులఛాయ
శ్రీసూర్యనారాయణా!
జాజిపూవుల మీద సంపెంగపువుఛాయ
శ్రీసూర్యనారాయణా!

మధ్యాన్నభానుడా మల్లెపూవులఛాయ
శ్రీసూర్యనారాయణా!
మల్లెపూవుల మీద మంచి వజ్రపుఛాయ
శ్రీసూర్యనారాయణా!

మూడ్జాముల భానుడా,
మునగపూవులఛాయ
శ్రీసూర్యనారాయణా!
మునగపూవుల మీద ముత్యాల పొడిఛాయ
శ్రీసూర్యనారాయణా!
క్రుంగేటి భానుడా, గుమ్మడిపూవు ఛాయ
శ్రీసూర్యనారాయణా!
గుమ్మడిపూవు మీద కుంకుంపువుఛాయ
శ్రీసూర్యనారాయణా!

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top