మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి
చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
సాధిస్తాం!
తెలుగు తల్లి బిడ్డలం
వెలుగు నింపు దివ్వెలం
చేయిచేయి కలుపుతాం
చెలిమితోడ మెలగుతాం
జాతి గీతి పాడుతాం
చదువులన్నీ చదువుతాం
క్రమశిక్షణ పాటిస్తాం
శ్రమదానం సాగిస్తాం
పరిశుభ్రతను పాటిస్తాం
ప్రగతిబాట పయనిస్తాం
చక్కటి పాదులు చేసేస్తాం
మొక్కలు ఎన్నో నాటేస్తం
పచ్చదనాన్నే తెచ్చేస్తాం
ప్రకృతి అందం పెంచేస్తాం
స్నేహసుధలనే చిందిస్తాం
శాంతిని మేమూ పంచిస్తాం
ఆదర్శంగా జీవిస్తాం
అందరమొకటై సాధిస్తాం
తెలుగుతల్లి బిడ్డలం
వెలుగు నింపు దివ్వెలం
చెట్లు
వరాల వర్షం కురవాలంటే
పసిడిపంటలే పండాలంటే
చిన్నా పెద్దా చేతులు కలిపి
చెట్టూ చేమా పెంచాలి
జగతిలో హర్షం నిండాలంటే
ప్రగతికి బాటలు వేయాలంటే
తరువులు బాగా పెంచాలి
కరువును దూరం చేయాలి
చల్లని నీడలు కావాలంటే
వ్యాధుల పీడలు పోవాలంటే
వృక్ష సంపదను పెంచాలి
స్వచ్ఛతనే సాధించాలి
కలుషిత వాయువు తొలగాలంటే
మనిషికి ఆయువు పెరగాలంటే
పచ్చని చెట్లను పెంచాలి
ప్రాణవాయువునె పంచాలి
చెట్టే పుడమికి ప్రాణాధారం
చెట్లే కలిమికి మూలాధారం
చెట్లు లేనిదే బతుకే లేదు
మానవజాతికి మెతుకే లేదు.
స్వేచ్ఛ
అన్నయ్య తెచ్చాడు
చిన్నికొక చిలుక
చిన్ని తన గారాల
చెల్లాయి కనుక
చిన్న పంజరమొకటి
చేయించి అందు
చిన్నారి చిన్ని, తన
చిలుక నుంచింది
ఒకరోజు అమ్మాయి
ద్రాక్ష కొని తెచ్చింది
ప్రేమతో తన చిలుక
నోటి కందించింది
నీకేమి తెలుసులే
చిన్ని నా బాధ?
పండ్లతో నా బాధ
బాపలేవమ్మ।
స్వేచ్ఛగా నింగిలో
సంచరిస్తుంటే
దాని కన్నా సుఖము
నాకెక్కడుంది?
పచ్చ పచ్చని చెట్ల
పచ్చరంగులతో
కలిసిపోతు మనసు
తేలిపోతుంది
బంగారు పంజరమె
బందిఖానా నాకు
స్వేచ్ఛలేకున్నప్పుడు
సుఖమెక్కడుంది?
అని చిలుక బాధతో
కన్నీరు కార్చింది
అది చూసి పాపాయి
గుండె కరిగింది
దయదలచి పంజరపు
తలుపు తెరిచింది
చిలకమ్మ తుర్రుమని
ఎగిరి పోయింది
Review పిల్లల ఆటపాటలు.