
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
గుంటనక్క- విశ్వప్రేమ
నక్క బావ డొక్క కాలి
ఎక్కడేమి దొరకక
తిక్కపట్టినట్టు తిరిగి
తిరిగి చివరకు
గుడిసెపైన కూరుచున్న
కోడిపుంజు వైపు చూసి
‘మంచి వార్త.. మంచి వార్త’
అంచు పిలిచెను
గుంటనక్క గారి జోరు
కంట జూచి కోడిపుంజు
‘ఏమిటేమి?’టంచు ప్రశ్న
వేసి నంతనె
‘విననె లేదటోయి! నీవు
‘విశ్వప్రేమ’ అనెడి పేరు!
ఇంక మీరు, మేము ఆప్త
బంధు మిత్రులం
నేటి నుంచి విశ్వప్రేమ
చాటవలయు మనము
రమ్ము, కట్టకేగి కాస్త షికారు
కొట్టి వత్తము’
నక్కబావ ఇట్టులనగ కోడిపుంజు
పట్టలేని సంతసాన
గొంతుచాచి ఒక్కమారు
కూత వేసెను
‘ఒక్క క్షణము తాళు మదుగొ
కుక్క బావ వచ్చుచుండె
వాని తోడ కలిసి పోవ
వచ్చు’నన్నది కోడిపుంజు
తక్షణంబె గుంటనక్క
తారుకొంచు నుంచ జూచి
‘పోదువేటి కం’చు కోడి
పుంజు పలికెను
‘కుక్క బావ ఎరుగుదాయె
విశ్వప్రేమ యనెడి పేరు’
అంచు నక్క తిరిగి చూచి
పరుగు తీసెను
‘వట్టి పాడు రోజింతకు
ఒకరి ననిన ఫలమే’మని
పరుగు తీస్తూ గుంటనక్క
పలవరించెను.
పాలబుగ్గల పాపాయి
పాలబుగ్గలా పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
పాలబుగ్గలా పాపాయికి
పాలు కావాలి
ఓ లాలి కావాలి
బోసినవ్వులా పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
బోసినవ్వులా పాపాయికి
అమ్మ కావాలి
ఓ బొమ్మ కావాలి
జిలిబిలి పలుకుల పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
జిలిబిలి పలుకుల పాపాయికి
జిలేబి కావాలి
ఓ గులాబి కావాలి
బుడిబుడి నడకల పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
బుడిబుడి నడకల పాపాయికి
బువ్వ కావాలి
ఓ అవ్వ కావాలి
పరుగులు తీసే పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
పరుగులు తీసే పాపాయికి
పండ్లు కావాలి
బొమ్మరిండ్లు కావాలి
Review పిల్లల ఆటపాటలు.