
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
చందమామ రావే
చందమామ రావే జాబిల్లి రావే
రైలెక్కి రావే రష్యా కథలు తేవే
ఇంజనెక్కి రావే ఇంగ్లిషు కథలు తేవే
బస్సెక్కి రావే బంగ్లా కథలు తేవే
కారెక్కి రావే కాంమ్రేడ్ కథలు తేవే
హారన్ కొడుతూ రావే ఆకలి కథలు తేవే
కొండెక్కి రావే కోటివేలు తేవే
ఒలిచిన చాకొలెట్లు ఒళ్లో పెట్టుకుని
కరిగిన ఐస్‍క్రీమ్ చేత్తో పట్టుకుని
అలా అలా అలా వచ్చి మా
తెలుగు పిల్లల తీపి నోట్లో వేసి పోవే
పిల్లికూన
కుక్కపిల్ల:
పిల్లికూనా పిల్లికూనా
గళ్ల గళ్ల పిల్లికూనా
కళ్ల నీళ్లు ఎందుకమ్మా?
పిల్లికూన:
కుక్కపిల్లా కుక్కపిల్లా!
ఒక్క సంగతి చెప్పగలవా?
ఆకలేస్తే పాల కోసం
అమ్మనేమని అడుగుతావ్?
కుక్క పిల్ల:
భౌ భౌమని అరుస్తాను
పసందైన కుక్క భాష
పాలు నీకు కావాలా?
భౌ భౌమని అరచి చూడు
పిల్లి కూన:
భౌ భౌమని అరవలేను
బాగు లేదు కుక్క భాష
మాతృభాష తప్ప నాకు
మరో భాష వద్దు వద్దు
(అమ్మ భాష తెలియక పిల్లికూన ఏడవసాగింది. అంతలో ఓ పెద్దపిల్లి కనిపించింది. ఎందుకేడుస్తున్నావని అడిగింది)
పిల్లి కూనా పిల్లి కూనపా
ఎందుకమ్మా ఏడుస్తావ్?
పిల్లి కూన:
ఆకలేస్తే పాల కోసం
అమ్మనేమని అడుగుతావ్?
పెద్దపిల్లి:
మ్యావ్ మ్యావ్ మ్యావ్
(వెంటనే పిల్లి కూన మ్యావు మ్యావంటూ ఇంట్లోకి వెళ్లింది. తల్లి పిల్లి దాని భాషను తెలుసుకుని పాలిచ్చింది)
సీత – ఉడత
సీత:
ఏరోప్లేన్ తెచ్చావా ఉడతా, ఉడతా, నే
యూరోపు వెళ్లాలి ఉడతా, ఉడతా!
ఉడత:
హోరుగాలి కొట్టొచ్చు
కారుమబ్బు పట్టొచ్చు
ఏరోప్లేను తేలేను సీతా, సీతా నే
యూరోపు రాలేను సీతా, సీతా!
సీత:
స్టీమరేనా తెచ్చావా ఉడతా, ఉడతా నే
సీమకెళ్లి రావాలి ఉడతా, ఉడతా!
ఉడత:
ఏ తుపాను వస్తుందో!
ఏ కెరటం లేస్తుందో!
స్టీమరేనా తేలేను సీతా, సీతా! నే
సీమకేనా రాలేను సీతా, సీతా!
సీత:
రైలుబండి తెచ్చావా ఉడతా, ఉడతా, నే
రామేశ్వరం వెళ్లాలి ఉడతా, ఉడతా!
ఉడత:
అడుగడుక్కి వంతెనలు
నడుమ నడుమ సొరంగాలు
రైలుంబడి తేలేను సీతా, సీతా, నే
రామేశ్వరం రాలేను సీతా, సీతా!
సీత:
కారుగాని తెచ్చావా ఉడతా, ఉడతా, నే
కాకినాడ వెళ్లాలి ఉడతా, ఉడతా!
ఉడత:
పెద్దబస్సు లెదురొస్తయ్
ఎద్దుబళ్లు అడ్డొస్తయ్
కారేన తేలేను సీతా, సీతా, నే
కాకినాడ రాలేను సీతా, సీతా!
సీత:
సైకిలేన తెచ్చావా ఉడతా, ఉడతా, నే
సరదాగా వెళ్లాలి ఉడతా, ఉడతా!
ఉడత:
మలుపు గిలుపు తిరగాలి,
మనిషొస్తే ఒరగాలి
సైకిలేన తేలేను సీతా, సీతా, నే
సరదాగా రాలేను సీతా, సీతా!
Review పిల్లల ఆటపాటలు.