పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

సీనూ-భానూ

సీనూ భానూ చక్కని
స్నేహితులని చెప్పాలి
కలిసి బడికి పోతారు
కలిసి యిళ్లకొస్తారు

సీనూ భానూ ఎంతో
స్నేహంగా ఉంటారు
కలిసి చదువుకొంటారు
కలిసి ఆడుకొంటారు

కొత్త కొత్త పుస్తకాలు
కొనడం వాళ్లకి సరదా
కొత్త కొత్త ఆటల్లో
కూడా వాళ్లకి సరదా

ఆటలలో ఒకరోజున
మాట మీద మాట వచ్చి
సీనుడొచ్చి భానుగాణ్ణి
చెంప మీద వేశాడు
భాను మాత్రం మేం తక్కువ?
సీను మీద విరుచుకు పడి
వీసె గుద్దులొక నాలుగు
వీపున వడ్డించాడు

వీళ్లిట్టా పోట్లాడే
వేళ వాళ్ల నాన్నలు ఆ
చోటికొచ్చి చూశా రీ
చోద్యమైన గుద్దులాట

సీను నాన్న తప్పంతా
భాను దనీ, భాను నాన్న
సీనుదనీ తీవ్రంగా
వాదనలో పడ్డారు

వాదనతో ఆగలేదు
వాళ్లిద్దరి మధ్యా అది
పెరిగి పెరిగి చిట్టచివరకు
పెద్ద గుద్దులాటయింది

తండ్రుల యుద్ధం చూస్తే
తమ కెంతో వింత కలిగి
సీనూ భానూ ఎప్పటికీ
స్నేహితులై మిగిలినారు

మళ్లీ వాళ్లిద్దరు తమ
మామూలాటల్లో పడి
కొట్లాడే తమ తండ్రుల
మాటే మరిచారు

ఆ పిల్లలు వెనుకటి వలె
ఆటలాడుతున్నారు
తండ్రుల యుద్ధం మాత్రం
తగ్గే సూచన లేదు

పొడుపు పద్యములు

పైన పెచ్చుదీసి భక్షింప మధురంబు
కాయమెల్ల ముండ్లు కల్గియుండు
కాయపైని జూడ కనిపించు మొక్కలు
ఇందు భావమేమి, చందమామ?
(జవాబు: అనాస కాయ)

ఉన్నచోట నలిచి యొరుల దాటింతును
పరులనెక్కి యెపుడు బయనమగుదు
నాదు కాళ్లును రెండె, నరుని కాళ్లును రెండె
నన్ను దెలిసికొనుము చందమామ
(జవాబు: నిచ్చెన)

పచ్చన్ని పెట్టెలో విచ్చుకోనుంది
తెచ్చుకో బోతేను గుచ్చుకుంటుంది
ఎంత గుచ్చుకున్న ఏమైన గాని
తెచ్చుకొందు రదేమొ తెల్పు మామయ్య?
(జవాబు: మొగలి పొత్తి)

పొడల పొడల గువ్వ, పొంకమైన గువ్వ
గువ్వలోకి మొవ్వ, పురుగులు తినే అవ్వ
రాజుల పొడిచే రవ్వ, రాత్రి తెలిపే రవ్వ
నున్ననైన గువ్వ, నూకలు తినే తవ్వ
(జవాబు: కోడిపుంజు)

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top