పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రం తిన్న గుగ్గిళ్లు జీర్ణం
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం
అబ్బాయి (అమ్మాయి) తాగిన ఉగ్గుపాలు జీర్ణం
నందిలాగ కూర్చుని
తాబేలులాగ పాకి
లేడిలాగా లేచి
కుందేలులా
బాబు (పాప) పరుగెత్తాలి

ఇల్లెక్కడ?
రామచిలుక ఇల్లెక్కడ?
చెట్టు తొర్రలో నా ఇల్లు
పిచుక పిల్ల ఇల్లెక్కడ?
వేలాడే గూడే నా ఇల్లు
కాకమ్మ కాకమ్మ ఇల్లెక్కడ?
ఎత్తయిన చెట్టుపై నా ఇల్లు
నాగరాజు ఇల్లెక్కడ?
చీమలపుట్టే నా ఇల్లు
సింహం మామ ఇల్లెక్కడ?
కొండ గుహలే నా ఇల్లు
నత్త గుల్లమ్మ ఇల్లెక్కడ?
నాతోనే ఉందిలే నా ఇల్లు

చక్కిలి గిలిగిలి
పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యి వేసి ముద్ద చేసి
తినిపించి తినిపించి
చేయి కడిగి మూతి కడిగి
తాతగారింటికి దారేదంటే
ఇట్లా పోయి ఇట్లా పోయి
మోచేతిపాలెం ముందర్నుంచి
ఇట్లా పోయి ఇట్లా పోయి
ఇదిగో ఇదిగో వచ్చాం
చక్కా వచ్చాం చక్కా వచ్చాం
చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి

నీకొకటి.. నాకొకటి..
చెన్నపట్నం చెరుకు ముక్క
నీకో ముక్క నాకో ముక్క
భీమునిపట్నం బిందెల జోడు
నీకో బిందె నాకో బిందె
కాశీపట్నం కాసులపేరు
నీకో పేరు నాకో పేరు
కొండపల్లి కొయ్య బొమ్మ
నీకో బొమ్మ నాకో బొమ్మ
నిర్మలపట్నం బొమ్మల పలక
నీకో పలక నాకో పలక
నూజివీడు మామిడిపండు
నీకో పండు నాకో పండు
కాకినాడ కాజా
నీకో కాజా నాకో కాజా
ఇస్తా ఉండు తెచ్చినాక
చూస్తూ ఉండు తెచ్చేదాక

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top