బాలలకు స్వాగతం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

ఆటలతో కడు డస్సి నారురా
మొగాలు కడుగుక రారండీ
ఆకాశంలో వెన్నెల అదిగో
వెండి కంచములు సర్దిందీ

వెచ్చని బువ్వల నారగించి, ఎం
చక్కగ రండీ నాదరికీ
ఎన్నో కతలూ, ఎన్నో పాటలు
చెబుతా త్వరగా రారండీ

మంచి సంగతులు వింటే లోకపు
పోకడలన్నీ తెలియునురా
మంచి చెడ్డా వెలుగూ యిరులా
అల్లీ బిల్లిగ కలిసేను

ఆటలు ఒంటికి పుష్టికూర్చగా
మాటలు మనసును పెంచేను
మంచి సంగతులు వింటే మనసులు
తీయని కలలను కంటాయి
తెలివిడి పెరుగక విడదీయగలే
మసలే మనుషుల నైజములు
చక్కని మాటలు కూర్చిన పాటలు
మంచి సంగతులు తెరిచేను

పూర్వకాలమున విష్ణుశర్మయను
మహానుభావుడు పిల్లలకై
పంచతంత్రములు మృగముల పరముగ
మనసుల రంజిల తెలిపాడు.

అట్లే చక్కని పాటలతోనే
మంచి సంగతులు తెలిపెదను
బ్రతు కతిస్వల్పము – జ్ఞానమనంతము
ఎన్నో తీరుల పొందాలి

బతుకు చక్కనిది మల్లెపూవువలె
పరిమళాలె వెదజల్లేను
మంచి వెలుగు వలే మనసునిండితే
చీకటి చెడుగులు తొలగేను
నిరాశ గుడ్డిది బతుకు చిగురులను
నిర్దయగా నలిపేస్తుంది
దురాశ రక్కసి విషములు మిసి మన
మనసున మంటలు రేపేను

చీకటిలో పడి మసలే వాడికి
ఆశ కిరణమై నడిపేను
జ్ఞానమె ఆశాకిరణము మనిషికి
తెలియని దారులు తెరిచేను

పిల్లలు దురాగ్రహాలకు లోనై
చెడుదారులలో పడిపోక
సమగ్ర జీవన సాహసయాత్రగ
బతుకు పొడుగునా గడపాలి

కులాలు మతాలు ఎచ్చులు తగ్గులు
చెడు నమ్మకముల పెంచుకునీ
తరతరాలుగా పెద్దలందరూ
చిన్ని బుద్ధులను కొలిచారు

మనుషులందరూ సమానమంటూ
మంచీ చెడుగే తేడాలంటూ
ఇరుగు పొరుగులను ప్రేమించాలని
అప్సరాయకవి తెలిపాడు

లోకపు సంపదలందరివీ, మన
కళలూ గానం అందరివీ
అన్నీ అందరి వగుటకు బ్రతుకున
అందరమూ కృషి సల్పాలి

బాల సూర్యుడరుదెంచే తూరుపు
లేత కిరణములు అందరివీ
చల్లని వెన్నెల పంటలనిచ్చే
చందమామ మన అందరిదీ

మంచి తలపులను పెంచుక బతుకును
సుందర స్వప్నం మలచాలి
బాలకులంతా కలసిమెలసి, వి
జ్ఞాన వాహినుల నీదాలి

తామర పూవున ఎన్నో రేకులు
కలసి మెలసి శోభించు కదా!
ఒక్కొక్కటిగా రేకులూడగా
వెర్రిగాలి ఎగరేసేను

ఎన్నో కతలూ ఎన్నో పాటలు
చెబుతా త్వరగా రారండీ
ఆటల పాటల డస్సినారు- ఇక
చీకటి ముసిరెను మరలండి..

Review బాలలకు స్వాగతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top