భరతుడు.. భారతీయం
శ్రీహరి అంశతో పుట్టిన భరతుడు కణ్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపాడు. వనమే అతడికి క్రీడారంగం. మృగాలే అతడి స్నేహితులు. ఆ బలశాలి సింహం పిల్లలతో ఆటలాడే వాడు. ఆ పసివాడి బలపరాక్రమాలు చూసి తల్లి శకుంతల ఆశ్చర్యచకితురాలయ్యేది. స్వయంగా కణ్వ మహర్షి భరతుడికి జాతకకర్మలు చేసి విద్యాబుద్ధులు నేర్పాడు. ఒకనాడు కణ్వ మహర్షి అనుజ్ఞతో శకుంతల కుమారుడైన భరతుడిని తీసుకుని తన కుమారుడికి తండ్రి, తనకు భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్లింది.
రాజధర్మం కత్తి మీద సాము వంటిది. రాజు ఏది చేసిన ప్రజల హితం కోరి వారి ఆమోదంతోనే చేయాలి. శకుంతల నిండు రాజసభలోకి ప్రవేశించి, దుష్యంతుడిని ఉద్దేశించి, ఇతడే నీ కుమారుడు భర్తఉడు అని చూపించింది. ఆ విషయం తనకు, శకుంతలకు, కణ్వ మ హర్షికి మాత్రమే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా! ఆ విషయాన్ని ప్రజలకు విశ్వసనీయమైన రీతిలో తెలియజేయాలనే సంకల్పంతో ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి దుష్యంతులు ఏం మాట్లాడక ఊరుకున్నాడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుడిని కరుణించి, ఆకాశవాణి, అందరికీ తెలిసేలా ‘ఈ భరతుడే నీ పుత్రుడు. కాబోయే చక్రవర్తి ఇతడే’ అని స్పష్టంగా పలికింది. ఆ వాక్కు విని దుష్యంతుడు, శకుంతల సంతోషించారు. పుత్రుడైన భరతుడికి పట్టాభిషేకం చేసి, తాము తపోవనాలకు తపస్సు నిమిత్తం వెళ్లిపోయారు.
భరతుడు సమర్థమైన తన భుజస్కందాలపైన ఈ భూభారాన్నంతా నిలిపి ధర్మపాలన చేశాడు. ధర్మస్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాత ధర్మానికి విరుద్ధమైన శక, కబర, బర్బర, కుష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశాల రాజులను అణచివేశాడు. దేవతా స్త్రీలను చెరబట్టి పాతాళంలో ఉంచిన రాక్షసులను శిక్షించి, ఆ స్త్రీలకు విముక్తి కలిగించాడు. త్రిపుర రాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవుల్లో నిలబెట్టాడు. సత్యం, శౌచం, దయ, తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగానే జనాలు కోరినవన్నీ ఇచ్చేది.
ఈ భూమండలం అంతా భరతుడి పాలనలో ఉన్నా, కర్మభూమి అయిన ఈ భరతఖండంలోనే అతడు అన్ని యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేశాడు. దీర్ఘతవుడనే మహర్షిని పురోహితుడిగా చేసుకుని యమునా తీరంలో 78 అశ్వమేధ యాగాలు చేశాడు. గంగాతీరం పొడవునా 55 అశ్వమేధ యాగాలు చేసి దేవేంద్రుడిని అతిశయించిన వైభవంతో శోభించాడు.
13,084 పాడిఆవుల మందను ద్వంద్వం అంటారు. అటువంటి వెయ్యి ద్వంద్వాలను దూడలతో పాటు బంగారంతో గిట్టలు, కొమ్ములు అలంకరించి, బాగా పండితులైన వెయ్యి మంది విప్రోత్తములకు దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవీ, తెల్లని దంతాలు కలవి అయిన 14,00,000 నల్లని ఏనుగులను మష్కార తీర్థం ఒడ్డున దానమిచ్చాడు.
కుబేరుడితో సమానమైన సంపద, సాటిలేని శౌర్యం, దేవేంద్రుడితో సమానమైన విభవం, మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండి కూడా భరతుడు ఎన్నడూ గర్వించక అర్థశరీరాలు తృణప్రాయంగా భావించి, శాంతికాముకుడై భగవద్భక్తితో జీవించాడు. ఇలా 27,000 సంవత్సరాలు రాజ్యపాలన సాగించాడు. ఈ భరతుడి సంతతి వారం కాబట్టే మనం భారతీయులం అయ్యాం.
కథలోని నీతి
మనిషి నిజంగా మనసు పెట్టి ధర్మబుద్ధితో శ్రమిస్తే దేవతలనే మించిన మహామనీషి అవుతాడని భరతుడు నిరూపించాడు. ఈ భూమండలాన్నంతా అతడు తన ధర్మబద్ధ పాలనతో పునీతం చేశాడు. అందుకే నేటికీ భరతుడి పేరు మీదే మన భారతదేశం శోభిల్లుతోంది.
భర్తహరి వైరాగ్యం
మహానుభావుడైన కేశవశర్మకు దైవానుగ్రహంతో నలుగురు ఉత్తములైన కుమారులు కలిగారు. సంస్క•త వ్యాకరణకర్త, దివ్య శివమహిన్మా, స్తుతికర్త అయిన కాత్యాయన వరరుచి, అతిలోక సాహసవంతుడు, ధర్మాత్ముడు, మహాకాళీ భక్తుడు, అయోధ్యాలయ పునరుద్ధారకుడు, శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు, మహా వివేకవంతుడు, కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి, సంస్క•త మహాకవి, సుభాషిత రత్నావళికర్త అయిన భర్త•హరి అనే వారు ఆయన సంతానం.
కేశవశర్మ నలుగురిలోనూ చిన్నవాడైన భర్త•హరిని యోగ్యుడిగా భావించి, ఆయనకు రాజ్యభారం అప్పగించి, తాను వానప్రస్థానికి వెళ్లిపోయాడు. చిన్ననాటి నుంచే భర్త•హరి సాధు సజ్జనుల సేవలు చేస్తూ ఉండేవాడు.
భర్త•హరి రాజ్యంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధనానికి పేద కాని గుణానికి కాదు. సౌశీల్యుడు, మంత్రశాస్త్ర కోవిదుడైన ఆ విప్రోత్తముడు భువనేశ్వరీదేవి ఉపాసకుడు. మాత అతడిని అనుగ్రహించదలచి, ఒకనాడు అతడి ముందు ప్రత్యక్షమైంది. ‘కుమారా! నీ గుణసంపదను, భక్తిని మెచ్చాను. ఈ దివ్యఫలం తీసుకో. ఇది తిన్నవాడిని జరామరణాలు ఉండవు’ అని జగజ్జనని పలికింది. గుణాగ్రగణ్యుడైన ఆ బ్రాహ్మణుడు ఇలా ఆలోచించాడు.
‘నేను ఒక పేద బ్రాహ్మణుడిని. అమృతత్వం సంపాదించినా నేను ఎవరిని కాపాడగలను? ఈ పండు కనుక మన మహారాజు గారు తింటే ఎందరో నిర్భాగ్యులను రక్షించగలడు. అప్పుడే నేనీ ఫలాన్ని సద్వినియోగం చేసినవాడినవుతాను’ అనుకున్నాడు.
వెంటనే ఆ బ్రాహ్మణుడు మహారాజైన భర్త•హరి వద్దకు వెళ్లి, ఆయనను ఆశీర్వదించి, ఆ దివ్య ఫలాన్ని ఆయనకు ఇచ్చేశాడు.
ఆ ఫలం యొక్క మహిమను అర్థం చేసుకోలేక భర్త•హరి దాన్ని తన ప్రియురాలైన అనంగసేనకు ఇచ్చేశాడు. కుటిలాత్మురాలైన ఆ అనంగసేన తన సఖుడైన అశ్వపోషకుడికి ఆ దివ్య ఫలాన్ని ఇచ్చింది. మూర్ఖుడైన అశ్వపోషకుడు తన దాసికి ఆ ఫలాన్ని ఇచ్చాడు. ఆమె ఆ ఫలాన్ని తన ప్రియుడైన గోపాలకుడికి ఇవ్వగా, వాడు దాన్ని తన ప్రియురాలికి ఇచ్చాడు.
చిట్టచివరిగా ఫలం అందుకున్న ఆ పడుచు ఆ దివ్యఫలాన్ని పశువుల పెంట ఉన్న బుట్టలో పెట్టి రాజమార్గం గుండా వెళ్లసాగింది. భర్త•హరి తన రాజమందిరం నుంచి ఈ దృశ్యాన్ని చూశాడు. బ్రాహ్మణుడు మహాత్యాగం చేసి లోకహితార్థం తనకిచ్చిన దివ్యఫలం చివరకు పెంటబుట్టలోకి చేరిందని బాధపడ్డాడు. ఆ పండు చేతులెలా మారిందీతెలుసుకున్నాడు.చివరకు నిజం తెలిసి భర్త•హరికి ఒక్కసారిగా వైరాగ్యం వచ్చేసింది. సంసారం మీద విరక్తి పుట్టింది. తను ఎవరినైతే ప్రియులు అనుకుంటున్నానో వాళ్లు నిజమైన ప్రియులు కాదని, పరమేశ్వరుడు ఒక్కడే తన ప్రాణబంధువని తెలుసుకున్నాడు. విషయభోగాలను త్యజించి, ఈశ్వరుడిపై అనురక్తితో, వైరాగ్యంతో తపోవనాలకు వెళ్లడానికి సిద్ధపడ్డాడు. దేవీ ప్రసాదమైన ఆ దివ్య ఫలాన్ని తన సోదరులలో ఒకడైన విక్రమార్కుడికి ఇచ్చి, తన రాజ్యభారాన్ని కూడా అతడికే అప్పగించి తపస్సుకు వెళ్లిపోయాడు.
మహా ఔదార్యుడైన విక్రమాదిత్యుడు తన వద్దకు వచ్చిన ఒక దీనుడైన బ్రాహ్మణుడిపై జాలిపడి ఆ దివ్య ఫలాన్ని ఇచ్చివేశాడు.
కథలోని నీతి
– తను కడు పేదవాడైనా, ఆ బ్రాహ్మణోత్తముడు లోకహితాన్ని కోరి దివ్యఫలాన్ని మహారాజు భర్త•హరికి ఇచ్చేశాడు.
– ‘అంతా మిథ్య’ అని తెలుసుకున్న వాడు భర్త•హరి. తనెలా మోసపోయిందీ తెలుసుకుని, వైరాగ్యభావనతో అడవులకు వెళ్లిన ఆయన లోకానికి ఆణిముత్యాల్లాంటి సుభాషితాలను అందించారు. వాటిని చదివి అర్థం చేసుకుని నిత్య జీవితంలో అనుసంధానం చేసుకోవడం మన విధి.
– చివరిగా విక్రమార్కుడి ఔదార్యం గొప్పది. దీనుడైన విప్రుడికి ఆ దివ్యఫలాన్ని దానం చేసి తన త్యాగబుద్ధిని లోకానికి చాటాడు.
Review భరతుడు.. భారతీయం – భర్తహరి వైరాగ్యం.