‘వ్రతవ్యే అనేన
అనయావా అతి వ్రతం..’ అని స్తుతి.
జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది.
అటువంటి దివ్య వ్రతాన్ని ఆచరించే శుభ సంకల్పం శ్రావణమాసంలో సిద్ధిస్తుంది. అది కూడా మాసంలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజ. మన పెద్దలు దీనినే వ్రతం అన్నారు.
ఏమికోరినా అనుగ్రహించే తల్లి కాబట్టే ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు.
సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది.
సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం.. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి.. ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు.
ఈ లక్షణాలను ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు.
ఇవన్నీ ప్రాకృతిక శక్తులు.
పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే ఇవి అని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహార స్వరూపమే ‘లక్ష్మీదేవి’.
సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీ భావన- ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటోంది.
విజ్ఞులు మరో కోణంలో దీనికి శాస్త్రపరంగా గల అర్థాన్ని వివరించారు.
జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు గల అన్నింటినీ లక్షిస్తూ (గమనిస్తూ), ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తినే వారు ‘లక్ష్మి’గా నిర్వచించారు.
ఈ శక్తికే ‘శ్రీ’ (సిరి) అనే మరో పేరుంది. ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహా మవత్రంగా భావిస్తున్నాయి.
సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తినే ‘శ్రీ’ అంటారు.
ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం.
ఇది సూర్యుడిని ఆశ్రయించిన కాంతి.
చంద్రుని ఆశ్రయించిన చంద్రిక వంటిది.
భగవంతుడిని ఎన్నడూ ఎడబాయని ఆయన చిచ్ఛక్తి (చిత్, శక్తి)నే ‘శ్రీ’గా పరిగణిస్తారు.
ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం.
మానవాళికి ఆధారమయ్యే శక్తి, పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి.. ‘శ్రీ’. ‘లక్షణ శక్తి’యే ఈ శ్రీ.
ఈ శబ్దానికి నిఘంటుపరంగా శోభ, కాంతి, కళ, జ్ఞానం, విద్య అనే అర్థాలున్నాయి.
ఈ అర్థాలన్నింటి ఏక రూపమే శ్రీలక్ష్మి.
ప్రతి వారు భక్తిపూర్వకంగా కోరుకునేది ఈ లక్ష్మినే.
‘వరం’ అనే మాటకు ‘కోరుకునేది’ అని అర్థం.
అందుకే ఈ తల్లిని ‘వరలక్ష్మి’గా పిలుస్తారు.
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’
(శుక్ర)వారం నాడు ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది.
మాసాల్లో ‘ఆర్థ్రత’కు ప్రధానమైన వర్ష రుతువు మొదటి మాసమే శ్రావణం.
అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్ల పక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
‘ఆర్ధ్రాం పుష్కరిణీం..’ అని శ్రీసూక్తం వర్ణించిన ఆర్ధ్ర శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం.
శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతోంది. అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మం అని మన రుషులు అనుశాసించారు.
స్త్రీ మూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి.
దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రత కథలో సిద్ధి పొందిన కథానాయిక చారుమతి.
మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుందని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది.
స•ంపదలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే అంతరార్థం.
ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం.
Review మంచి బుద్ధి గలవారికే… లక్ష్మీసిది.