మంటమారితనం తో ప్రయోజనం లేదు!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం..
సుందోపసుందులు
చాలాకాలం పాటు అన్యోన్యంగా ఉండి, ఏదైనా కారణం వల్ల బద్ధ శత్రువులుగా మారిన అన్నదమ్ములు, మిత్రుల విషయంలో ఉపయోగించే జాతీయం ఇది. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది.
నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకసారి బ్రహ్మ కోసం తపస్సు చేసి, మెప్పించి, బలానికి సంబంధించిన వరాలు దక్కించుకున్నారు. ఆ వరగర్వంతో తమకు తిరుగు లేదనుకుని అరాచకాలు సృష్టించడం మొదలుపెట్టారు. విషయం తెలిసిన బ్రహ్మ నాలుక కరుచుకుని, ఈ సోదరుల పని పట్టడానికి ఒక అందాల రాశిని సృష్టించాడు. లోకంలో గొప్ప అందగత్తెల నుంచి తిల ప్రమాణమంత (నువ్వు గింజంత) అందాన్ని సేకరించి ఈ ముద్దుగుమ్మను తయారుచేశాడట. అందుకే ఆ అమ్మడి పేరు తిలోత్తమ అయ్యింది. తిలోత్తమను చూసి మతిచెడిన సుందోపసుందులు- ఆమెను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. ‘ఆమె నాది’ అంటే, ‘కాదు నాది’ అని కయ్యానికి కాలు దువ్వి, భీకరంగా పోట్లాడుకుని చనిపోయారట. అప్పటి వరకు కలిసి ఉండి, అహంతో విడిపోయి, చెడిపోయిన మిత్రులు, అన్నదమ్ముల గురించి ఈ జాతీయాన్ని ఉప యోగిస్తుంటారు.

మంటమారితనం
తన కోపమే తనకు శత్రువు అంటారు. ఎందుకంటే, కోపం మంటలాంటిది. మంట ఎలాగైతే దహించి వేస్తుందో, కోపం కూడా మనలోని సహనాన్ని, ప్రేమను, సద్గుణాలను దహించి వేస్తుంది. ఫలితంగా ‘నష్టం’ అనే బూడిద తప్ప ఏమీ మిగలదు. హద్దులు దాటిన కోపాన్ని ప్రతిఫలించే జాతీయమే ఈ ‘మంటమారితనం’.
ఏదైనా సందర్భంలో అందుకే, ‘నీ మంటమారితనంతో నష్టమే తప్ప ఆవగింజంత ప్రయోజనం లేదు’ అంటుంటారు కొందరు. అలాగే.. ‘మంటమారితనం ఇతరులకు నష్టం కలిగించడమే కాదు, నిన్ను కూడా నిలువునా దహించి వేస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకో’ అని హితవు కూడా చెబుతుంటారు పెద్దలు.

తృటిలో..
‘తృటిలో తప్పిన ప్రమాదం’ అనే మాటను తరచుగా వింటుంటాం, వాడుతుంటాం. ‘అతి తక్కువ సమయం’ అనే దానికి సూచనప్రాయంగా ‘తృటి’ని వాడుతుంటారు. ఇంతకీ ఏమిటీ తృటి? తామర తూడును తెంచడానికి పట్టే కాలాన్ని ‘తృటి’ అంటారు. తామర తూడు తెంచడానికి ఎంతో సమయం పట్టదు. దానిని తుంచడానికి అంత తక్కువ సమయం పట్టింది కాబట్టి తృటిలో అనేమాట వాడుకలోకి వచ్చింది. అంటే ఏదైనా రెప్పపాటు కాలంలో జరిగితే, లేదా కొద్దిలో అపాయం తప్పిపోతే తృటిలో తప్పిపోయిందని అనడం వ్యావహారికమైంది. (రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువు ఒక త్రసరేణువు. మూడు త్రస రేణువులు ఒక త్రుటి. దీనిని బట్టి తృటికి అర్థం అత్యంత తక్కువ కాలం అని కూడా చెబుతుంటారు).

Review మంటమారితనం తో ప్రయోజనం లేదు!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top