మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
రాజుగారి ముక్కు మీద
దోమ కుట్టింది
రాజ్యంలో ప్రజలంతా
హడలెత్తిపోయారు.
సామంతులు, సర్దార్లూ,
బంట్లూ, సైన్యాధిపతులు
కత్తులతో, ఈటెలతో
కదనానికి లేచినారు
కత్తులతో నరకలేక
ఈటెలతో పొడవలేక
సర్దార్లూ సామంతులూ
చలచల్లగ జారినారు
తిరిగి తిరిగి దోమ మళ్లీ
రాజు కడకె వచ్చింది
జనమంతా చూస్తుండగా
ముక్కు మీద వాలింది
జనమంత విస్తుపోయి
నోళ్లు తెరచి చూస్తుంటే
బంటొకడు బుద్ధిశాలి
పరుగెత్తెను రాజు కడకు
ఏమరుపాటు నుండిన
దోమను గురిచూచివాడు
రాజు గారి ముక్కు మీద
చేతికొద్దీ గుద్దినాడు
ఆ దెబ్బకి రాజుగారు
హరిహరి అని అరిచినారు
ఆ దెబ్బకు దోమగారు
హరహరమని వాలినారు
బంటుసేవ బంటుచేవ
ప్రజలంతా మెచ్చినారు
తక్షణమే రాజతణ్ణి
తన మంత్రిగ చేసినాడు
మాట మాట ఏమి మాట?
మాట మాట
ఏమి మాట?
మంచి మాట
ఏమి మంచి?
పూలు మంచి
ఏమి పూలు?
మల్లెపూలు
ఏమి మల్లె?
తెల్ల మల్లె
ఏమి తెల్ల?
పువ్వు తెల్ల
ఏమి పువ్వు?
నవ్వు పువ్వు
ఏమి నవ్వు?
మామ నవ్వు
ఏమి మామ?
చందమామ
వెన్నెల బంతి
వెలిగింది వెలిగింది వెన్నెలా బంతి
వెలుగులో పాపల్లు వెలిగిపోతారు
దేదీప్యమానమౌ దివ్యతేజముతో
దీప్తివంతంబైన దీ పెద్దబంతి
అందచందాలతో అలరారు బంతి
ఆకాశవీధిలో అమరినా బంతి
పిల్లలందరకునూ ప్రియమైన బంతి
వెండి వెలుగుల బంతి, వెన్నెలా బంతి
రవివంశ తిలకుండు రామచంద్రుండు
మారాము పెట్టినా గారాలబంతి
అందాలమేడలో అద్దాలలోకి
దిగివచ్చి మాతోటి తిరిగేటి బంతి
చుట్టాల రాక
అమరావతి నుంచి అమ్మగారు రాక
నరసాపుర నుంచి నాన్నగారు రాక
అనకాపల్లి నుంచి అత్తగారు రాక
మచిలీపట్నం నుంచి మామగారు రాక
హైదరాబాద్ నుంచి అప్పగారు రాక
అనంతపురం నుంచి అన్నగారు రాక
ఒంగోలు నుంచి ఒదిన గారు రాక
బాపట్ల నుంచి భర్తగారు రాక
చెన్నపట్నం నుంచి చందమామ రాక
Review రాజుగారు దోమగారు.