రోకంటి పాట

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

పాపాలు పుణ్యాలు పాలించు స్వామీ
పాపకర్మలను బట్టి బంధించు స్వామీ
పుణ్యమ్ము కొందరికి పూజ కొందరికి
పుణ్యస్త్రీ జన్మాన చావు కొందరికి

పుణ్యమ్ము పాపమ్ము ఒక వీధినుండె
పాలపండ్ల గంప మా వీధినుండె
అన్నెమ్ము పున్నెమ్ము ఒక వీధినుండె
అరటిపండ్ల గంప మా వీధినుండె

పాపకర్ముడి చేలో ఏమేమి పండు?
పాయకు పది పుట్లు పల్లేళ్లు పండు
కన్నవారి చేలో ఏమేమి పండు?
సకల ధాన్యం పండు సన్నవరి పండు

నట్టింట సిరిచాప నామాల పెట్టె
నరసింహదాసుల్లు మా కన్నవారు
నీర్కావి పంచెల్లు నిలువుటంగీలు
గోల్కొండ చౌదర్లు మా కన్నవారు

తూర్పు వీధి నుంచి మా ఎడ్లు రాగ
తులసెమ్మ కోటల్లె కొమ్ముళ్లు విసురు
పడమటి వీధి నుంచి మా ఎడ్లు రాగ
పట్టు కుచ్చులల్లె తోకళ్లు విసురు

పుట్టింటి దీపంబు చల్లంగ ఉంటే
పున్నమా చంద్రుడికి పూజలూసేతు
అత్తింటి దీపంబు చల్లంగ ఉంటే
ఆదిశేషుడికి నేను హారతులుయిత్తు

పొరుగు మంచిదని పోయి కూర్చుంటే
పోజూసి దెప్పితిరి పొరుగేమి పొరుగు
కాపరము చేసింది కల్ల చేసింది
రెండేళ్లలో యిల్లు గుల్ల చేసింది

కాకరచెట్టుకు పూల అందంబు
తల్లిబెట్టిన సొమ్ము బిడ్డకందంబు
కాకరచెట్టుకు కాయలందంబు
మా మాచెమ్మ తల్లికి కొడుకు లందంబు

కొడుకులు గల తల్లి మొగ్గల్లమోలు
కూతుళ్ల గల తల్లి ఆమల్లమోలు
మంచినీళ్ల బావి మల్లెలా బావి
చేదుకో తమ్ముడా చెల్లెళ్ల బావి

అరటిపండ్ల అస్తమ్ము చేతబట్టుకుని
అక్కలా యిళ్లేవ నడుగు తమ్ముడా!
నా చేతి రోకళ్లు నల్ల రోకళ్లు
చేయించు తమ్ముడా చేవరోకళ్లు
వేయించు తమ్ముడా వెండి పొన్నుళ్లు

విస్తరాకు-మట్టిగడ్డ

పుల్లి విస్తరాకు లేచి – పోవుచుండగా
మట్టిగడ్డ దాని నాపి – మాటలాడింది

గడ్డ: గాలిగాణ్ణి చూస్తె నీకు కంపమెత్తునా?
దొంగ వెధవ నన్నుజూసి
తొలగిపోతాడు

విస్తర: వానదేవుండటె నీకు
వణుకు పుట్టునా?
నన్నుజూచి నీరుగారి
తన్నుకొంటాడు

గడ్డ: అటులైన నీవు నాకు
అండగుండాలె
గాలి వస్తె మీద కురికి
కదలనిస్తానా?

విస్తర: వాన వస్తె నేను నిన్ను
వదిలిపోతానా?
కప్పులాగు మీద వ్రాలి కదలనిస్తానా?

గాలివాన కూడివస్తె కథ గతేమిటి?
తెల్పుడంటు పెంటపోగు
దెప్పి పొడిచింది

ఇంతలోనె గాలి-వాన ఎత్తుకొచ్చిందీ
విస్తరాకు లేచి రాజవీధి బడ్డాది

మట్టిపెడ్డ గరగిపోయి
మాయమైనాది
గాలివాన కలిసివస్తె
కథే ముగుస్తుంది

మంచిచెడ్డ లెరుగనట్టి
మనుజు లీలాగె
ముందేమగునో తెలిసికోక
ముచ్చటిస్తారు.

Review రోకంటి పాట.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top