పిల్లలంటే లేడిలా పరుగెత్తాలి. ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అది వారి వయసు సహజ స్వభావం. బడి నుంచి వచ్చాక మైదానంలోనో, ఇంటి ఆరుబయటో అలసిపోయేలా ఆడేవారు. ఆకలేసినపుడు ఇంటికెళ్లి అన్నం తినేవారు. హోంవర్క్, ఇతరత్రా పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించే ముందు పెద్దోళ్ల చేత కథలు చెప్పించుకుని కమ్మని నిద్రలోకి జారుకునే వారు. ఇదంతా గతకాలపు పిల్లల జీవితం. మరి ఈ కాలం పిల్లలు అలా ఉన్నారా?. బడి నుంచి ఇంటికి రాగానే అలసిపోయినట్టు అయిపోతున్నారు. అయితే పుస్తకాలతో కుస్తీ.. లేదంటే ఫోన్లతో కాలక్షేపం.. శారీరక వ్యాయామమన్నదే లేదు. అసలు శరీరపు సాధారణ కదలికలే లేవు. ఇది పజ్రారోగ్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ). ఈ సంస్థ ఇంకా ఏం చెబుతోందో బాలల దినోత్సవం (నవంబరు 14) సందర్భంగా మన పిల్లల క్షేమాన్ని కాంక్షించి ఒకసారి తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా బడికెళ్లే పిల్లల్లో 80 శాతం మంది (మరీ ముఖ్యంగా భారత్‍లో) రోజూ కనీసం గంటసేపైనా శారీరక వ్యాయామాన్నిచ్చే ఆటపాటల్లో కానీ, పనుల్లో కానీ పాలుపంచుకోవడం లేదు. బాలురలో 78 శాతం మంది, బాలికల్లో 85 శాతం మంది శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. వివిధ ఆర్థిక పరిస్థితులు గల 146 దేశాలలో 11 నుంచి 17 ఏళ్ల వయసు గల 16 లక్షల మంది పిల్లలపై ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఈ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటపాటైనా శారీరక శ్రమ కలిగించే ఆటపాటలు, వ్యాయామం లేదా పనుల వంటి కాలక్షేపాలు ఉండాలి. నిజానికి ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్బరంగా గల టోంగా, సమోవా, ఆప్ఘనిస్తాన్, జాంబియా- ఈ నాలుగు దేశాల్లోని పిల్లలు రోజూ గంటకుపైగా శారీరక శ్రమనిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, వీరికి తగినంత శారీరక శ్రమ ఉన్నా.. పోషకాహార లోపం పట్టిపీడిస్తోంది. ఇది మరో సమస్య. ఇక, భారత్ వంటి దేశాల్లోని పిల్లలు అసలు ఒంటికి చెమట పట్టనివ్వడం లేదు. అంటే శరీరాన్ని కనీస స్థాయిలో కూడా కదపడం లేదన్నమాట.
మన దేశంలో పదిహేడేళ్లలోపు వయసు గల 73.9 శాతం మంది శారీరక వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. 71.8 శాతం బాలురు, 76.3 శాతం బాలికలు తగినంత శారీరక వ్యాయామం లేకుండా ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది కొంచెం నయమైన పరిస్థితే అయినా, ఇది మునుముందు పెను ప్రజారోగ్య సమస్యను సృష్టించనుందని సదరు అధ్యయనంలో తేలింది.
భారత్‍లో 2001 నాటికి 76 శాతం బాలురు తగినంత శారీరక వ్యాయామం లేకుండా ఉండేవారు. బాలురు క్రికెట్ మోజులో పడటంతో ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైందట!. దీంతో ఇలాంటి పిల్లల శాతం 71.8 శాతానికి చేరుకుంది. శారీరక వ్యాయామమన్నదే లేని బాలికలు 2001 నాటికి 76.6 శాతం ఉండగా, 2016 నాటికి 76.3 శాతానికి చేరుకుంది. దీనిని పెద్ద మార్పుగా పరిగణించలేం. భారత్‍లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని బాలల జీవనశైలిలో వ్యత్యాసాలు చాలా ఉన్నాయని అధ్యయనంలో గుర్తించారు. అలాగే ఆయా కుటుంబాల ఆర్థిక నేపథ్యాలు కూడా పిల్లలను కనీస శ్రమకు దూరం చేస్తున్నాయని తేలింది. భారత్‍లోని గ్రామీణ ప్రాంతాల బాలలు తమ దినచర్యలో భాగంగా చేసే పనులతోనే తగినంత వ్యాయామం పొందగలుగుతున్నారు. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ అటువంటి పరిస్థితుల్లేవు. అయితే, బాలలకు తగినంత శారీరక వ్యాయామం లేని పరిస్థితులు భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్ది, బాలలకు తగిన వ్యాయామం లభించేలా ప్రభుత్వాలు, కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కారణాలు అనేకం..
నేడు పిల్లలు ఆటపాటలకు దూరమైపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. చదువుల్లో పెరిగిన పోటీతో పిల్లలను పుస్తకాలు తప్ప మరే వ్యాపకానికీ తల్లిదండ్రులు అలవాటు చేయడం లేదు. పిల్లలు కూడా అయితే చదువు.. లేదంటే ఫోన్‍తో కాలక్షేపం చేయడాన్ని ఓ అలవాటుగా మార్చుకుంటున్నారు. నిజానికి ఆటలాడటం, రోజులో కొంతసేపు శారీరక వ్యాయామం చేయడం పిల్లల ప్రాథమిక హక్కు. అందుకు తగిన అవకాశాలను అటు ప్రభుత్వాలతో పాటు ఇటు తల్లిదండ్రులు కల్పించాలి. టీనేజీ పిల్లలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని, విద్య, పట్టణ ప్రణాళిక, రోడ్డు భద్రత వంటి అంశాల్లో మౌలికమైన మార్పులు తేవాలని డబ్ల్యూహెచ్‍ఓ సిఫారసు చేస్తోంది. పిల్లలకు తగినంత శారీరక వ్యాయామం లేకుంటే వారు స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై అకాల మరణాలకు బలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పిల్లల మానసిక, శారీరక వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో నలుగురు శారీరక వ్యాయామానికి దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలనేది ఆరోగ్య నిపుణుల మాట.
పిల్లల్ని వ్యాయామానికి దూరం చేస్తున్నవివే..
టీవీ, స్మార్ట్ఫోన్లు, వీడియోగేమ్స్ వంటి ఎలక్ట్రానిక్ వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా పిల్లల జీవనశైలిలో పెను మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వినోద సాధనాలు పిల్లలను వ్యాయామానికి, ఆరుబయటి క్రీడలకు దూరం చేస్తున్నాయి. పాఠశాలల్లో, చదువుల్లో కలిగే ఒత్తిడి నుంచి బయటపడటానికి పిల్లలు తీరిక వేళల్లో టీవీ కార్యక్రమాలు చూడటానికి, వీడియోగేమ్స్ ఆడటానికి అలవాటు పడుతున్నారు. మితిమీరిన పట్టణీకరణ కూడా పిల్లలను వారి సహజసిద్ధమైన ఆటపాటలకు దూరం చేస్తోంది. పట్టణాలు, నగరాల్లోని ఇరుకిరుకు ఇళ్లలో, అపార్ట్మెంట్ ఫ్లాట్లలో పిల్లలకు ఆడుకునేందుకు కాసింత స్థలమే కరువవుతోంది. చాలాచోట్ల కనీసం ఇళ్లకు చేరువగా పిల్లల పార్కులు కూడా ఉండటం లేదు. ఉన్న కాసిన్నీ మాయమైపోతున్నాయి. బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ముందేసుకుని చదువులో మునిగిపోయే పిల్లలను బుద్ధిమంతులుగా పరిగణించడం, ఆరుబయట ఆటల కోసం పరుగులు తీసే వారిని ఆకతాయిలుగా చూడటం వంటివి పిల్లలపై చాలా ప్రభావం చూపుతున్నాయి. మారిపోతున్న సామాజిక విలువలకు పై ధోరణి అద్దం పడుతుంది.
పిల్లలకు వ్యాయామం ఎందుకంటే..
ఎదిగే వయసులో పిల్లలకు తగినంత శారీరక వ్యాయామం అవసరం. ముఖ్యంగా 11 నుంచి 17 ఏళ్ల మధ్య పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఆ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటసేపు సాధారణ శ్రమ కలిగించే స్థాయి నుంచి కాస్త తీవ్రస్థాయి శ్రమ కలిగించే వ్యాయామం అవసరం. ఈ వయసులో వ్యాయామం చేయడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
• వేగంగా పరుగులు తీయడం, సైకిల్ తొక్కడం, ఆరుబయట ఆటలాడటం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
• ఆరుబయట శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
• బరువులు ఎత్తడం, క్రికెట్, వాలీబాల్, ఫుట్‍బాల్ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాల, ఎముకల దారుఢ్యం పెరుగుతుంది. వెన్నెముకకు బలం కలిగి నిలుచునే తీరు చక్కగా మారుతుంది.
• శ్రమ కలిగించే ఆటల వల్ల శరీరంలోని కొవ్వు కరిగి స్థూలకాయం రాకుండా ఉంటుంది. బరువు ఆరోగ్యకరమైన రీతిలో అదుపులో ఉంటుంది.
• పిల్లలంతా కలసిమెలసి బృందాలుగా ఏర్పడి ఆడుకోవడం వల్ల పిల్లల్లో స్నేహశీలత, సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి దూరమవుతాయి.
• కొత్త కొత్త ఆటలు ఆడే క్రమంలో పిల్లలు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. ఆటల ద్వారా పిల్లల్లో ఆకళింపు శక్తి పెరుగుతుంది.
• గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆడే ఆటల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దూరమై, చక్కగా నిద్ర పడుతుంది.
పిల్లలకు ఎలాంటి
వ్యాయామాలు అవసరం?
ఎదిగే వయసులోని పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. తరగతి గదుల్లో గంటల తరబడి కూర్చుని గడిపే వారికి రోజులో కొంతసేపైనా కాస్తంత ఆటవిడుపు ఉండాలి. ఆ ఆటవిడుపు ఫోన్లు, టీవీలు, వీడియోగేమ్స్తో కాలక్షేపం వంటివి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి నుంచి బయటపడే సాకుతో పిల్లలు టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా కాస్త ఆరుబయట ఆటపాటల్లో కాలక్షేపం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలతో పాటు తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాల్లోనూ పిల్లలు పాల్గొనాలి. టీనేజీ పిల్లలకు రోజుకు కనీసం గంటసేపు శారీరక వ్యాయామం అవసరం. వారానికి మూడు రోజులు కాస్త తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి.
• వేగంగా నడక, ఈత, సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, తోట పని, ఇంటి పనులు వంటివి సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలు. ఇలాంటి వ్యాయామాలతో కూడిన వ్యాపకాలు పిల్లల జీవనశైలిలో రోజూ ఉండేలా చూసుకోవాలి.
• పరుగు, పరుగులతో కూడిన క్రికెట్, ఫుట్‍బాల్, హాకీ వంటి ఆటలు శరీరానికి కాస్త శ్రమను కలిగిస్తాయి. ఎముకలకు, కండరాలకు దారుఢ్యాన్ని కలిగించేలా బరువులు ఎత్తడం, గుంజీలు తీయడం, పుషప్స్, మెట్లు లేదా ఎత్తయిన గుట్టలపైకి ఎక్కడం వంటి వ్యాయామాలు కూడా తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాల కోవలోకే వస్తాయి. టీనేజీ పిల్లలకు ఇలాంటి వ్యాయామాలు కనీసం వారంలో మూడు రోజులైనా అవసరం.
వ్యాయామం లేని పిల్లలు..
కలిగే అనర్థాలు..
కనీస వ్యాయామం లేని జీవనశైలి కారణంగా పిల్లలకు అప్పటికప్పుడే ఎలాంటి అనర్థాలు కలగకపోవచ్చు. కానీ, దీర్ఘకాలికంగా ఈ జీవనశైలి దారుణమైన దుష్ప్రభావాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.
• తగినంత వ్యాయామం లేకుంటే స్థూలకాయం ఏర్పడే ముప్పు పెరుగుతుంది. స్థూలకాయం వల్ల చిన్న వయసులోనే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు తలెత్తుతాయి.
• వ్యాయామం లేని పిల్లల్లో కండరాలు, ఎముకలు తగిన రీతిలో బలంగా ఎదగవు. ఇలాంటి వారు పెరిగే కొద్దీ ఎముకలను బలహీనపరిచే ఆస్థియోపొరాసిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలుంటాయి. • శారీరక వ్యాయామం లేని వారిలో మానసిక స్థైర్యం కూడా తక్కువ ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇలాంటి వారు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో కుంగిపోయే ప్రమాదం ఉంది. • ఆరుబయట ఆటపాటల్లో గడపాల్సిన సమయంలో స్మార్ట్ఫోన్లు, టీవీ, ల్యాప్‍టాప్ తెరల ముందు కాలక్షేపం చేయడం వల్ల పిల్లల్లో కంటి సంబంధ రుగ్మతలు పెరుగుతాయి.
• వ్యాయామం లేని పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు తరచూ ఇన్‍ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• వ్యాయామం లేని వారిలో ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి ఊపిరితిత్తుల ఇన్‍ఫెక్షన్లు, ఉబ్బసం వంటివి తరచూ ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉంటాయి. • దీర్ఘకాలం వ్యాయామం లేని జీవనశైలి గడిపే వారికి కొన్ని రకాల కేన్సర్లు సోకే ప్రమాదం కూడా ఉందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే తేలింది.
ఎవరి బాధ్యత ఎంతంటే..?
చాలా కొద్దిమందిని మినహాయిస్తే పిల్లల్లో ఎక్కువ మందికి ఆటపాటలపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులను గమనించి తల్లిదండ్రులు వారిని ఆటల వైపు మళ్లించాలి. శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే ఇంటి పనులు చేయించడం అలవాటు చేయాలి. స్వయంగా చేసే పనుల్లోని ఆనందం వారికి తెలిసేలా చేయాలి. ప్రతి పాఠశాలకూ, క్రీడా మైదానం, క్రీడా పరికరాలు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తమ పిల్లలు చేరబోయే పాఠశాలలో క్రీడా సౌకర్యాలు, ఇతరత్రా పిల్లల్లో వికాసాన్ని కలిగించే కార్యకలాపాలకు చోటుందో లేదో గమనించాలి. ఆటలను, వ్యాయామాన్ని పిల్లల రోజువారీ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. పిల్లల శారీరక వ్యాయామ అవసరాలపై ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.




























































































































Review లేజీ టీన్స్.. డేంజర్ బెల్స్.