
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
గంగులు కూతురి పెండ్లాయే
గమ్మత్తేమిటో విన్నార?
పెండ్లి కుమారుండొకనాడూ
పెండ్లముతో నిట్లన్నాడు
పెండ్లికొడుకు:
మోసము చేశా చూశావా?
మూలము దెలిసికొన్నావా?
గాజు కన్ననీ మీ వారు
గమనింపకె నిన్నిచ్చారు
పెండ్లికూతురు:
ఏదేదీ చూపించండి?
ఎందుకు కప్పెట్టారండీ?
మీకంటే తరుగెవరండీ?
మేమొక పని చేశామండీ.
పెండ్లికొడుకు:
అంత తెలివి మీకేడ్చిందా?
అయితే చెప్పుదు చూతాము?
కావలసిన చూడంటూనే
కంటి లొట్ట చూపెట్టాడు.
పెండ్లికూతురు:
ఎట్టెకార మనుకొన్నారా?
లొట్టకన్ను చూపెడతారు?
పట్టుక చూడండంటూనే
కట్టె కాలు చూపెట్టింది
అంతటితో,
నక్కిళయ్యకు బడ్డాయీ
నాలుక వెళ్లాపెట్టాడు
పెండ్లికుమారిత నవ్వినదీ
పెదవులు కిందికి విరిచింది.
అప్పుడు
తలుపు చాటుగా దాసీదీ
తగిన శాస్తి జరిగిందంది
ఏమేయని అత్తడిగిందీ
మామేమో సణిగాడు
తాడెక్కువాడుంటేనూ
తలదన్నే వాడుంటాడు
పరులను మోసము చేస్తారా
పదిరెట్లనుభవిస్తారు.
ఊరిలోన కాటకం.. ఇంటిలోన నాటకం
ఇంటినిండ చిప్పలు
చెరువులోను కప్పలు
పిల్లులన్ని పెళ్లికెళ్లె
పిల్లల్ని కుక్క కరిచె
కుక్కలెల్ల మోరలెత్తి
చందమామను చూచి అరిచె
ఆ మామకు హడలెత్తి
అంతలోనే అస్తమించె
ఊరిలోను కాటకం
ఇంటిలోను నాటకం
చందమామ నాది
చందమామ నాది
చక్కిబెల్లం నాది
చుక్కలన్నీ నావి
సూర్యుడంత నాది
పువ్వులన్నీ నావి
పోకచెట్టు నాది
చెట్టుచేమ నాది
చేపజెల్ల నాది
మిన్నుమన్ను నాది
నీదేమీ లేదు పో!
సరిగమపదనిస
సరి నీ పని సరి
సరి నీ పాపపని సరి
సరి నీ మామపని సరి
సరి నీ దాసిపని సరి
సరి నీ మగనిపని సరి
సరి నీ పాగపని సరి
సరి నీ సరిగపాగపని సరి
సరి నీ పని సరి, మా పని సరి
Review లొట్టకన్ను.. కట్టె కాలు.