కుర్రకోతుల్ని వెంటనే అడివిలోకి పంపిద్దాం. ఏదో ఒక ఆహారం తెమ్మందాం. ఇది ముందు జరగాలి’’ అనింది మరో బాలింత కోతి.
ఒక అడవిలో ఒక కోతుల గుంపు వుండేది. ఆ గుంపులోని ఆడకోతులన్నీ కలిసి ఒకరోజు ఒకచోట చేరాయి. వాటిలో పెద్ద ఆడకోతికి ఒక ఆలోచన వచ్చింది.
‘‘ఒకరోజు మనమంతా ఉపవాసం వుంటే ఎంత బావుంటుంది’’ అని తన ఆలోచనను అది బయటపెట్టింది. మిగిలిన ఆడకోతులన్నీ ‘‘భలే పని మనమేగాదు మన మొగుళ్ళు, పిల్లలు అందరం ఉపవాసం వుందాం. మనుషుల కంటే మనమేం తక్కువ?’’ అన్నాయి.
రాత్రికి ఆడకోతులన్నీ మగ కోతులకు, పిల్లలకు సంగతి చెప్పాయి. ఏదో మంత్రం వేసినట్లు కోతులన్నీ సరే అన్నాయి.
తెల్లవారింది. కోతుల గుంపంతా ఒక పెద్ద మర్రిచెట్టు కింద చేరింది. ‘‘మనం ఇప్పటి నుంచి రాత్రిదాకా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకూడదు. సరేనా’’? అని పెద్ద ఆడ కోతి ప్రకటించింది. కోతులన్నీ తోకలు పైకెత్తి ‘సరే సరే’ అన్నాయి.
‘‘ఉపవాసం రాత్రికి గదా పూర్తయ్యేది. అప్పుడు తినడానికి ఏం దొరుకుతుంది’’ అనింది ఒక గండు కోతి.
‘‘అవునవును. ఆకలితో మలమలలాడి పోతుంటాం. ఉపవాసం పూర్తికాగానే కడుపులో ఏదో ఒకటి పడాలి. పిల్లకోతు లైతే అసలే తట్టుకోలేవు’’ అనిందొక ముసలికోతి.
‘‘కుర్రకోతుల్ని వెంటనే అడివిలోకి పంపిద్దాం. ఏదో ఒక ఆహారం తెమ్మందాం. ఇది ముందు జరగాలి’’ అనింది మరో బాలింత కోతి.
వెంటనే కుర్రకోతులన్నీ బయలుదేరాయి. అడవిలోకి వెళ్ళి మంచి అరటిపళ్ళ గెలలు ఎక్కడినుంచో పట్టుకొచ్చాయి. కోతుల గుంపుకు వాటిని చూడగానే నోట్లో నీళ్ళూరసాగాయి. అయినా ఉపవాసం గదా ఏదీ నోరెత్తలేదు.
‘‘ఉపవాసం అంటే మాటలు కాదు. చచ్చేంత ఆకలి వేస్తుంది. తట్టుకోవాలి. ముగిసేటప్పటికి బాగా చీకటిపడి పోతుంది. అప్పుడు ఆ ఆకలితో, ఆ చీకట్లో ఈ పండ్లు అందరం పంచుకోవడం బోలెడు ఆలస్యమవుతుంది. అప్పుడు ఏం జరిగినా జరగొచ్చు. ఆకలి మహాచెడ్డది. అందువల్ల ఇప్పుడే వీటిని అందరం పిల్లా పాపలతో సహా పంచేసుకొందాం’’ అనిందొక బక్క కోతి.
‘చాలామంచి ఆలోచన’ అనింది పెద్ద ఆడకోతి. కోతులన్నీ అరటిపండ్లు పంచుకొన్నాయి. ఎవరి అరటిపండ్లు అవి తమ దగ్గర వుంచుకొన్నాయి.
ఇంతలో ఇంకో కోతి పళ్ళు బయటపెట్టి ‘‘ఏమో నబ్బా ఉపవాసం తర్వాత మనకు చేతులు కాళ్ళు కదిల్చే శక్తి వుంటుందో లేదో ఎందుకైనా మంచిది. ఈ అరటి పండ్లు ఇప్పుడు తొక్కతీసి వొలిచి పెట్టుకొని వుంటే అప్పుడు ఏ శ్రమా వుండదు. ఆలోచించండి’’ అని ఓ సలహా పారేసి అందరివైపూ చూచింది.
కోతులంతా దీన్ని ‘నిజమేగదా’ అనుకొన్నాయి. తక్షణం తొక్కలు తీసేసి పండ్లు మాత్రం చేతుల్లో పట్టుకొ న్నాయి. అప్పుడొక పిల్లకోతి ‘‘అమ్మా అమ్మా నేను దీన్ని బుగ్గలో పెట్టుకొని వుంటానే. ఉపవాసం కాగానే మింగేస్తాను. ఏం తప్పా? ఇలా ఉపవాసం చెయ్యకూడదా? తింటే నీమీద ఒట్టు’’ అని బుంగమూతిపెట్టి వాళ్ళమ్మను గోముగా అడిగింది.
‘‘తప్పేమిటి?’’ అనింది అమ్మ. ‘‘పిల్లకోతులేమిటి’’ అందరూ చెయ్యొచ్చు’’ అని ఒక తిండిపోతు కోతి తీర్పు చెప్పింది.
కోతులన్నీ అరటిపళ్ళు నోట్టో పెట్టుకొని, బుగ్గలో కుక్కుకుని ఉపవాసం మొదలెట్టాయి. ఆ తర్వాత ఏం జరిగి వుంటుంది? చెప్పాలంటారా?
Review వానరాల ఉపవాస.