పూర్వం గంగానదీ తీరాన గల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు చదువు మీద శ్రద్ధ చూపకుండా ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడిపేవారు. కొడుకులు ఇలా సోమరులు కావడం సుదర్శనుడికి బాధ కలిగించింది. వారికి చదువుసంధ్యలు నేర్పించాలని తలచి ఆయన తన పట్టణంలోని విష్ణుశర్మ అనే గురువుకు కబురు పెట్టారు.
విష్ణుశర్మ రాగానే, రాజు తన బాధ చెప్పుకున్నాడు.
‘నా కొడుకులు చదువుకోకపోవడం వల్ల మూర్ఖులుగా తయారయ్యారు. వారికి ఏదోలా చదువు చెప్పి మంచి మంచి ప్రవర్తన, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్దాలి’ అని సుదర్శనుడు విష్ణుశర్మను వేడుకున్నాడు.
‘మహారాజా! అదెంతపని ? తమరి కుమారులను నీతి గలవారిగా తీర్చిదిద్దడం ఏమంత కష్టం కాదు. రత్నం ఎంతగొప్పదైనా సానపెడితేనే గానీ ప్రకాశించదు. బాలుడు ఎలాంటివాడైనా వాడికి తగిన శిక్షణ లేకపోతే రాణించడు. కనుక ఇప్పటి నుంచి ఆరు నెలల్లో తమరి కుమారులకు తగిన విద్యాబుద్ధులు నేర్పించి పంపుతాను’ అని హామీనిచ్చాడు విష్ణుశర్మ.
విష్ణుశర్మ మాటలు విని సుదర్శనుడు సంతోషించాడు. తన కుమారులను విష్ణుశర్మకు అప్పగించాడు. విష్ణుశర్మ వారిని ఇంటికి తీసుకువెళ్లాడు. చల్లని చెట్ల నీడలో కూర్చోపెట్టాడు. అయితే వారిని అక్షరాలు రాయమనలేదు. శ్లోకాలు వల్లించమనలేదు. చక్కని కథలు మాత్రం చెప్పాడు.
ఆ కథలే పంచతంత్రకథలుగా ప్రసిద్ధి చెందాయి.
ఆ కథలే విని ఆ రాజకుమారులు మంచి ప్రవర్తనను అలవరచుకున్నారు.
మరి ఆ కథల్లోని కొన్ని కథలను మనమూ చదువుదామా..!
విష్ణుశర్మ రాజ కుమారులను తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. వారికి మొదటి కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘రాజ కుమారులారా! ఏ సంపద లేకపోయినా బుద్ధిమంతులు స్నేహంతో మేలు పొందుతారు. పూర్వం ఒక ఎలుక, కాకి, తాబేలు, లేడి ఉండేవి. అవి అలా మంచి స్నేహంతో ఆపద నుండి బయపడ్డాయి. ఐకమత్యానికి మించిన బలం లేదు. మంచి గుణాలు పక్షులలో ఉన్నా, జంతువులలో ఉన్నా మనం నేర్చుకోవాలి’ అన్నాడు విష్ణుశర్మ.
‘కాకి, ఎలుక, తాబేలు, లేడి చేసిన పనులేమిటి?’ అవి ఎలాంటి ఆపద నుంచి కలిసికట్టుగా బయటపడ్డాయి?’ అని ఆసక్తిగా అడిగారు రాజకుమారులు.
వారికి విష్ణుశర్మ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పక్షులు ఆ చెట్టు మీద సేద తీరుతుంటాయి. అలా ఆ చెట్టు మీద ఉన్న లఘు పతనకమనే కాకి ఒకరోజు ఉదయమే లేచి, యముడిలా తిరుగుతున్న వేటగాడిని చూసింది. ‘ఉదయమే లేచి వీడిని చూశాను. ఏ కీడు జరుగుతుందో! ఏమో!!. వెంటనే ఈ చోటుని విడిచి పోవాలి’ అని మనసులోనే అనుకుంది కాకి.
అదే సమయంలో వేటగాడు ఆ చెట్టు దగ్గర కొన్ని నూకలు చల్లి, వలపన్ని, దగ్గరలో ఉన్న పొదలో దాగాడు. చితగ్రీవుడనే పావురం ఆకాశంలో ఎగురుతూ నేల మీద పరిచి ఉన్న నూకలు చూసింది.
వెంటనే అనుమానం వచ్చి, తోటి పావురాలతో ఇలా చెప్పింది- ‘మనుషులులేని ఈ అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి? ఇదేదో నమ్మశక్యంగా లేదు. కాబట్టి మనం ఈ నూకలకు ఆశపడకూడదు సుమా!’ అంది.
తిరిగి చితగ్రీవుడనే పావురం తన తోటి పావురాలతో ‘పూర్వం ఒకడు కంకణం కోసం ఇలాగే ఆశపడి, పులి నోటపడి చనిపోయాడు’ అంటూ ఆ కథ చెప్పసాగింది.
పులి – బ్రాహ్మణుడు
ఒక చెరువులో స్నానం చేసిన ముసలి పులి గట్టున నిలబడింది. ఆ దారిన వెళ్తున్న బ్రాహ్మణునితో ‘బాటసారీ! ఇదిగో బంగారు కంకణం. దీనిని తీసుకో’ అంది.
బ్రాహ్మణునికి ఆశ కలిగింది.
అయినా అనుమానంతో ‘నీవు క్రూరమృగానివి. నిన్ను ఎలా నమ్మడం?’ అన్నాడు.
‘అయ్యా! నేను వయసులో ఉండగా జీవులను తిని మహాపాపం చేసిన మాట నిజమే. ఒక పుణ్యాత్ముడు కలిసి ఇకనైనా మంచిపనులు చేస్తే మంచిది అని బోధించాడు. అప్పటి నుండి పాపాలు మానివేసి మంచి పనులు చేస్తున్నాను. నీవు పేదవాడివి కనుక ఈ కంకణం నీకు దానం చేస్తాను. చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో. ముసలిదానను నన్ను చూసి భయపడతావెందుకు?’ అంది పులి.
బ్రాహ్మణుడికి ఆ పులి మాటలపై నమ్మకం కుదిరింది. దాని మాటలు నమ్మి దురాశతో స్నానం చేయడానికి చెరువులోకి దిగాడు. అంతే.. వెంటనే చెరువు నీటిలోని బురదలో కూరుకు పోయాడు. బ్రాహ్మణుడు ప్రాణభయంతో కేకలు వేశాడు.
పులి లేనిపోని అమాయకత్వాన్ని నటిస్తూ, ‘అయ్యో! ఎంతపని జరిగింది? భయపడకు’ అంటూ బ్రాహ్మణుడిని ఒడ్డుకు తీసుకు వచ్చినట్టే తీసుకువచ్చి, చంపి తినివేసింది.
‘దురాశ దు:ఖానికే కాదు, ఒక్కోసారి మరణానికీ కారణమవుతుంది. కాబట్టి మనం కూడా ఆ పులి – బ్రాహ్మణుడి కథలోని మాదిరిగా ఈ నూకలకు ఆశపడి నేలమీద దిగడం ప్రమాదం’ అంటూ తను కథ చెప్పడం పూర్తి చేసింది చితగ్రీవుడనే పావురం.
ఆ మాటలకు ఒక ముసలి పావురం వెటకారంగా నవ్వింది.
‘ఇబ్బందులు వస్తే పెద్దల మాట వినాలి. అనుమానాలతో నోటి దగ్గర ఆహారం పోగొట్టుకోకూడదు. చితగ్రీవుడి మాటలు నమ్మకండి. రండి! నూకలు తిందాం!’ అని అనగానే తోటి పావురాలు అన్నీ నేలమీద వాలాయి. వెంటనే అవి వలలో చిక్కుకున్నాయి. తమకు ఇటువంటి పరిస్థితి తెచ్చిన ముసలి పావురాన్ని అవన్నీ కలిసి తిట్టాయి.
‘ఎవరు బుద్ధిమంతుడో వాడు పెద్ద కానీ, వయసు పెరిగినవాడు కాదు. కాబట్టి తొందరపడి ఒకరినొకరు నిందించుకోవద్దు. నాకు ఒక ఉపాయం తోచింది. మనంమంతా ఒక్కసారిగా వలతో సహా ఎగిరిపోదాం’ అన్నాడు చితగ్రీవుడు.
పావురాలన్నీ కలిసికట్టుగా ఒకేసారి పైకిలేచి వలతో సహా ఆకాశంలోకి ఎగిరాయి.
పొదల చాటున ఉన్న వేటగాడు అది చూసి ఆశ్చర్యపోతూ వాటి వెనుక పరుగుతీశాడు.
ఇదంతా చూసిన లఘుపతనకం అనే కాకి, ఏం జరుగుతుందో చూడాలని పావురాలని వెంబడించింది.
ఆ పావురాలు కొంత దూరం ఎగిరాక అలసిపోయాయి.
‘ఇలా ఎంత దూరం ఎగురుతాం? వలను విడిపించుకునే మార్గం ఏదైనా ఆలోచించాలి!’ అనుకున్నాయి పావురాలు.
అప్పుడు చితగ్రీవుడు అడవిలో ఉన్న ఒక చెట్టును చూపి ‘మిత్రులారా మనం ఇక్కడ వాలుదాం. ఈ చెట్టు కింద ఉండే హిరణ్యకుడనే ఎలుక నా స్నేహితుడు. మనకు సహాయపడతాడు’ అన్నాడు.
గుంపుగా వలతో సహా వాలుతున్న పావురాలను చూసి హిరణ్యకుడు ఎవరో శత్రువులు వచ్చారని అనుకొని కలుగులోకి వెళ్లబోయాడు.
అప్పుడు చితగ్రీవుడు, ‘హిరణ్యకా! నేను నీ స్నేహితుడైన చితగ్రీవుడిని. నీ సహాయం కోసం వచ్చాం’ అన్నాడు.
హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చాడు. వలలో చిక్కుకుని, వలతో సహా ఎగిరివచ్చిన పావురాలను చూసి ‘ఇది ఎలా జరిగింది?’ అంటూ హిరణ్యకుడు అడుగుతూ మొదట వల బారి నుంచి తన మిత్రుడైన చితగ్రీవుడిని తప్పించబోయింది.
అందుకు చితగ్రీవుడు తిరస్కరించాడు.
‘ముందు నా తోటి వారిని తప్పించు’. ఆ తరువాత నన్ను విడిపిద్దువు గాని’ అన్నాడు చితగ్రీవుడు.
‘నాకు పావురాలన్ని ఉన్న వల కొరికి దాన్నుంచి విడిపించేంత బలం లేదు. అందుకే ముందు నిన్ను విడిపించి తర్వాత శక్తి ఉంటే వారిని విడిపిస్తాను’ అన్నాడు హిరణ్యకుడు.
‘నీ శక్తి మేరకు సహాయం చేయి. కానీ ముందు వీరిని విడిపించు’ అన్నాడు చితగ్రీవుడు.
ఆ మాటలకు సంతోషించిన హిరణ్యకుడు ‘నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం’ అంటూ వల తాళ్లు అన్నింటినీ కొరికేశాడు.
అప్పుడు పావురాలు అన్నీ హిరణ్యకుడు చేసిన మేలుకు ఎంతగానో కృతజ్ఞత తెలిపాయి. చితగ్రీవుడు కూడా స్నేహితునికి కృతజ్ఞతలు చెప్పి మిగతా పావురాలతో కలిసి తన నివాసానికి వెళ్లిపోయాడు.
ఇదంతా చూసిన లఘుపతనకం (కాకి) ఆనందించింది. హిరణ్యకుడితో స్నేహం చేయాలని అతడిని పిలిచింది. హిరణ్యకుడు ‘ఎవరు నీవు?’ అడి అడిగాడు.
‘నేను లఘుపతనకమనే కాకిని. నీ స్నేహం కోరి వచ్చాను’ అని కాకి బదులిచ్చింది.
ఆ మాటలు విని హిరణ్యకుడు పెదవి విరిచాడు.
‘బాగుంది. నీతోనా స్నేహం? నువ్వు ఎలుకల్ని ఆహారంగా తింటావు. నీతో స్నేహం ఆపదలకు కారణం అవుతుంది. ఇలాగే పూర్వం ఒక లేడి నక్కతో స్నేహం చేసి చాలా బాధలు పడింది. చివరికి ఒక కాకి వల్ల ప్రాణాలతో బయటపడింది. కనుక నీతో స్నేహం చేసి కష్టాలు తెచ్చుకోలేను’ అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకం నిరాశపడింది.
‘సరే. నాతో స్నేహం చేయవద్దు. కానీ, లేడి నక్కతో స్నేహం చేసి ఇబ్బందులు పడిన ఆ కథ గురించి నాకు వివరంగా చెప్పు’ అని అడిగింది కాకి.
హిరణ్యకుడు లఘుపతనకమనే కాకికి ఆ కథను ఇలా చెప్పసాగాడు.
లేడి, కాకి, నక్క కథ
పూర్వం మగధ దేశంలో మందారవతి అనే వనం ఉండేది. అందులో ఒక లేడి, కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడిపేవి. ఒకసారి ఒక నక్క ఆ వనంలోకి వచ్చింది.
వనంలో చెంగుచెంగున గంతులేస్తున్న లేడిని చూసింది. ‘ఆహా! ఈ వనంలోని పచ్చికను మేస్తూ ఈ లేడి ఎంత కండపట్టి ఉందో కదా! దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. ఎలాగయినా సరే ఈ లేడిని ఆహారంగా తీసుకోవాలి’ అనుకుంది నక్క.
నక్క లేని వినయాన్ని నటిస్తూ, లేడి దగ్గరకు వెళ్లింది.
‘అయ్యా! నేను దిక్కులేనివాడను. నీతో స్నేహం చేయాలని ఉంది. నా కోరిక తీర్చవా?’ అంది నక్క.
నక్క మాయ మాటలు నమ్మిన లేడి, దానిని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మందార చెట్టు మీద కూర్చున్న లేడి స్నేహితుడైన కాకి, లేడి వెంట వచ్చిన నక్కను చూసింది.
‘ఇతనెవరు? ఎందుకు వచ్చాడు?’ అని అడిగింది లేడిని కాకి.
‘పాపం దిక్కులేని వాడట. నా స్నేహం కోసం వచ్చాడు’ అంది లేడి.
‘అయ్యో! మిత్రమా! మంచి చెడులను చూడకుండా కొత్తవారితో స్నేహం చేయవచ్చా? ఇలాగే పూర్వం ఒక గద్ద, పిల్లి మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకుంది’ అని కాకి తన మిత్రుడైన లేడికి ఆ కథ చెప్పసాగింది.
గద్ద – పిల్లి కథ
భాగీరథీ తీరంలో గొప్ప జువ్వి చెట్టు ఉండేది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉండేది. అది గుడ్డిది. కాబట్టి స్వయానా ఆహారం సంపాదించుకోలేకపోయేది.
ఆ చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు దాని మీద జాలిపడి, రోజూ తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత దానికి పెట్టి కడుపునింపేవి. ఒకరోజు ద్వీపకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లల్ని తినడానికి ఆ చెట్టు దగ్గరకు వెళ్లింది. దానిని చూసిన పక్షి పిల్లలు భయపడి అరవసాగాయి.
ఆ అరుపులు విని గద్ద ఎవరో వచ్చారనుకొని ‘ఎవరది?’ అని గట్టిగా అడిగింది.
అప్పుడు పిల్లి కపట నాటకమాడుతూ ‘నేను ద్వీపకర్ణుడనే పిల్లిని’ అంది.
‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. లేకపోతే నీ ప్రాణం దక్కదు’ అని అరిచింది గద్ద.
వెంటనే పిల్లి ‘నేను మాంసం తినేదానిని కాదు. చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. నీవు సకల శాస్త్రాలు తెలిసిన దానివని జంతువులు చెప్పుకోవడం విన్నాను. అందుకని నీ సేవ చేయడానికి వచ్చాను’ అని వినయంగా బదులిచ్చింది పిల్లి.
‘పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా! అందుకే అలా అన్నాను. ఏమీ అనుకోకు’ అంటూ పిల్లిని చేరదీసింది గద్ద.
ఆ రోజు నుండి నిత్యం పిల్లి.. గద్ద దగ్గరకు వస్తూ పోతూ ఉండేది. పిల్లి తగిన సమయం చూసి, గద్దకు తెలియకుండా నిశ్శబ్దంగా పక్షిపిల్లలను తినసాగింది. తిన్న తరువాత వాటి ఎముకలను గద్ద ఉన్న తొర్రలో పడవేసేది. ఇలా కొద్దిరోజులుగా జరుగుతోంది.
ఒకసారి పక్షులు తమ పిల్లలు కనిపించడం లేదని బాధపడుతూ గద్ద తొర్ర దగ్గరకు వచ్చాయి. అక్కడ తమ పక్షి పిల్లల ఎముకలు కనిపించాయి.
గద్ద తమ పిల్లలను తిని ఉంటుందని నమ్మి పక్షులన్నీ కలిసి గద్దను గోళ్లతో రక్కి చంపేశాయి.
ఈ కథ చెప్పి ‘కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు’ అంది కాకి లేడితో.
కాకి మాటలు విని నక్క ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘నువ్వు మొదటిసారి ఈ లేడిని కలిసినపుడు నీవూ కొత్త దానివేగా? ఆనాటి నాటి నుండి మీరు స్నేహంగాలేరా? ఇకనై నీ చెడుబుద్ధిని, చెడుగా ఆలోచించడాన్ని మాని మంచిగా జీవించు’ అంది.
లేడి కలగజేసుకుని ‘మంచిగా జరిగినంత కాలం మనం జతగా ఉండటం మేలు’ అంది. ఆ రోజు నుండి లేడి, కాకి, నక్క స్నేహంగా ఉండేవి. నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి ‘ఇక్కడకు దగ్గరలో దట్టంగా పెరిగిన పొలాన్ని చూశాను. అక్కడి పంటలు బ్రహ్మాండమైన రుచికరంగా ఉంటాయి. రా వెళ్దాం’ అంది. లేడి ఆశపడటంతో దానిని తీసుకుని నక్క పొలానికి వెళ్లింది. అప్పటి నుండి ప్రతి రోజూ పొలంలో పంటను లేడి తినసాగింది. తన పంట రోజూ నాశనం కావడం, ఎవరో రోజూ పొలంలో పంట తింటున్నారని గ్రహించిన రైతు ఒకసారి వలపన్నాడు. రోజూ మాదిరిగానే పంట తినడానికి వచ్చిన లేడి అతడు పన్నిన వలలో చిక్కుకుంది.
ఇంతలో నక్క అక్కడికి వచ్చింది. వల తాళ్లను కొరికి తనను రక్షించాలని నక్కను లేడి అడిగింది.
‘ఈ వలను నరంతో చేసినట్లున్నారు. ఆదివారం నేను నరాలను కొరకను’ అని అంటూ నక్క పక్కనే ఉన్న ఒక పొదచాటుకు వెళ్లిపోయి దాక్కుంది. రైతు రాగానే లేడిని కర్రతో కొట్టి చంపుతాడని, ఆపై లేడిని తాను చక్కగా ఆరగించవచ్చుననేది నక్క ఆలోచన. తన స్నేహితుడైన కాకి చెప్పిన చక్కని మాటలను నమ్మకుండా నక్కను నమ్మినందుకు లేడి బాధపడింది.
మరోపక్క సాయంకాలం అయినప్పటికీ లేడి రాకపోయేసరికి కాకి వెతుకుతూ పొలం దగ్గరకు వచ్చి లేడిని చూసింది.
ఇంతలో కర్ర పట్టుకుని వస్తున్న రైతుని చూసింది కాకి. లేడిని ఊపిరి బిగపట్టి చనిపోయినట్లు నటించమంది. ‘నేను నీ పై కూర్చుని నీ కనులు పొడుస్తున్నట్లు నటిస్తాను. సమయం చూసి నేను అరవగానే లేచి పారిపో’ అని ఉపాయం చెప్పింది కాకి. లేడి, కాకి చెప్పినట్లే చేసింది. రైతు లేడిని చూసి చనిపోయిందనుకొని వలను తప్పించాడు.
వెంటనే కాకి అరిచింది.
లేడి మెరుపులా లేచి పరుగుపెట్టింది.
రైతు కోపంతో కర్రను బలంగా విసిరాడు.
అది గురి తప్పి పొద చాటున ఉన్న నక్కకు బలంగా తగలింది. ఆ దెబ్బకు నక్క చనిపోయింది. ‘ఈ కథ వల్ల పరులకు హాని చేయాలనుకునే వారు తామే చెడిపోతారు’ అంది కాకి. ఈ కథ చెప్పిన హిరణ్యకుడితో కాకి ‘ఇన్ని మా•లెందుకు? నిన్ను చంపి తినడం వల్ల నా ఆకలి తీరుతుందా! చితగ్రీవునితో స్నేహం చేసినట్లు నాతోనూ ఉండు. నీ స్నేహం పొందలేని జన్మ ఎందుకు?’ అంది. ఆ మాటలు విన్న హిరణ్యకుడు,
‘నీవు నా శత్రుపక్షానికి చెందిన దానివి కనుక మనకు స్నేహం కుదరదు. నీ దారిన నీవు వెళ్లు’ అని ఖరాఖండీగా చెప్పాడు హిరణ్యకుడు.
‘హిరణ్యకా! నీవు చెప్పినట్లు నేను శత్రుపక్షం దానినే కావచ్చు. కాని నీ మంచితనం మెచ్చి వచ్చాను. నీవు కాదంటే చనిపోతాను’ అంది కాకి. కాకి మాటలతో హిరణ్యకుడు మెత్తబడ్డాడు. ఆ కాకితో స్నేహానికి ఒప్పుకున్నాడు. వారిద్దరూ స్నేహంగా ఉండగా ఒకరోజు కాకి, ఎలుక (హిరణ్యకుడు)ను చూసి ‘మిత్రమా! నాకు ఇక్కడ ఆహారం సరిగా, తగినంతగా దొరకడం లేదు. మరోచోటికి వెళదామనుకుంటున్నాను. దండకారణ్యంలోని సరోవరంలో నా మిత్రుడైన తాబేలు ఉంది. అక్కడికి వెళతాను’ అంది కాకి.
‘నీవు లేకుండా నేనిక్కడ ఉండలేను’ అంది ఎలుక.
దీంతో కాకి ఎలుకను వీపుపై కూర్చోబెట్టుకుని మంధరుడనే తాబేలు ఉన్న సరోవరానికి వచ్చింది. వాటిని చూసి తాబేలు పైకి వచ్చింది. కాకిని చూసి ‘మిత్రమా! చాలా కాలానికి వచ్చావు. సంతోషం’ అంది తాబేలు. కాకి ఎలుకను, తాబేలుకు పరిచయం చేసింది. అప్పుడు తాబేలు ‘మిత్రమా! పట్టణాలు ఎన్నో ఉండగా నీవు అడవిలో ఎందుకు ఉంటున్నావు’ అంది.
దానికి ‘నేను మొదట పట్టణంలో నివసించాను. ముందు సుఖంగా ఉన్నా తరువాత బతుకు భారమయింది.
అందుకే అడవికి వచ్చి ఉంటున్నాను. ఆ కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఎలుక.
హిరణ్యకుడు చెప్పిన కథ
‘సన్యాసులు నివసించే చంపకవతి అనే పట్టణం ఉండేది. చూడాకర్ణుడనే సన్యాసి రోజూ తాను తినగా మిగిలిన ఆహారాన్ని చిలుక కొయ్యకు తగలించి నిద్రపోయేవాడు. నేను చిలుక కొయ్య మీదకు ఎగిరి ఆ పదార్థాలను తినేదానిని. ఒకరోజు చూడాకర్ణుడు, వీణాకర్ణుడనే సన్యాసితో మాట్లాడుతూ తన గిలక కర్రతో నన్ను బెదిరిస్తున్నాడు. అది చూసి వీణాకర్ణుడు ‘పైకి చూసి నేల మీద కొడుతున్నావేమిటి?’ అని అడిగాడు.
‘ఒక ఎలుక ప్రతిరోజూ నా ఆహారాన్ని తింటోంది’ అన్నాడు చూడాకర్ణుడు. ‘ఒక సామాన్యమైన ఎలుకకు అంత ఎత్తుకు ఎగిరే శక్తి ఎలా వచ్చింది. ఏదో కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా ఏ పనీ జరగదు కదా ! దీనికి ఒక కథ చెబుతాను విను’ అంటూ వీణాకర్ణుడు చెప్పసాగాడు.
బ్రాహ్మణి – నువ్వులు
ఒక గ్రామంలో నేను ఒక బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్లాను. బ్రాహ్మణుడు భార్యను పిలిచి ‘ రేపు అమావాస్య బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి’ అన్నాడు.
అందుకామె ‘ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవు’ అంది.
‘పేదవాళ్లం ఉన్నంతలో గడుపుకోవాలి. బియ్యం ఎలాగూ ఉన్నాయి. నువ్వులు బాగుచేసి ఏదైనా చెయ్యి’ అన్నాడు. ఆమె నువ్వులు దంచి పప్పును వాకిట ఆరబెట్టింది. ఒక కోడి నువ్వుల్ని కాళ్లతో చిమ్మి తినసాగింది.
ఇది చూసిన బ్రాహ్మణుడు ‘ఇవి బ్రాహ్మణ భోజనానికి పనికి రావు. మంచి మాటలతో ఇవి ఎవరికైనా ఇచ్చి కొత్త నువ్వులు తీసుకురా’ అన్నాడు. అపుడామె పొరుగువారికి పప్పు ఇచ్చి తిరిగి మంచి నువ్వులు తెచ్చుకుంది.ఈ కథ చెప్పి వీణాకర్ణుడు ‘పప్పు ఇచ్చి నువ్వులు తెచ్చుకోవడానికి కారణం ఉన్నట్టే ఎలుక ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఉండి ఉంటుంది’ అన్నాడు.
‘అవును నిజమే’ అన్నాడు చూడాకర్ణుడు.
ఆ తరువాత వారు రెండు గునపాలు తెచ్చి మేముంటున్న కన్నం తవ్వసాగారు. ఎలుకలన్నీ పారిపోయాయి. నేను ఒక మూలదాగి ఉన్నాను. మా సంపదనంతా వారు దోచుకున్నారు. నేను పేదనయ్యానని నన్ను హేళన చేశారు.
అపుడు నేను ‘అడుక్కు తినడం, దొంగతనం చేయడం నీచమైన పనులు కనుక అడవికి పోదాం’ అనుకుంటుండగా చూడాకర్ణుడు నన్ను చూసి ‘ఓసీ ఇంకా ఇక్కడే ఉన్నావా?’ అంటూ గునపాన్ని విసిరాడు. ఆ దెబ్బ ఎలాగో తప్పించుకున్నాను. ఆ తరువాత అక్కడ ఉండలేక పోయాను. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బతికే కన్నా అడవిలో కాయలు, పళ్లు తినడం మేలు అనుకుని ఈ అడవిలోకి వచ్చి నివసిస్తున్నాను’ అంటూ హిరణ్యకుడు తన కథ ముగించాడు.
ఆ మాటలకు మంధరుడనే తాబేలు నవ్వి ఇలా అంది.
‘నీవు అవసరానికి మించి సంపాదించావు. దానాలు చేయలేదు. నీ పిసినారి బుద్ధి వల్లనే ఇలా జరిగింది. చివరకు నీకు బాధ మిగిలింది’ అంటూ మరో కథ చెప్పడం ప్రారంభించింది.
Review విష్ణుశర్మ – పంచతంత్ర కథలు.