సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను
కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల
పరిచయం.

‘మాట వెండి – మౌనం బంగారం
వెండి కంటే బంగారం విలువైనది. అపురూపమైనది. వెండి శ్వేత వర్ణంలో తళతళలాడుతుండొచ్చు. కానీ, శబ్దం ఎక్కువ చేస్తుంది. బంగారంతో పోలిస్తే విలువలో తక్కువైనది. బంగారంతో పోల్చుకుంటే ఏ విషయంలోనూ అది సరితూగదు. మన ప్రవర్తన విషయానికీ ఇది వర్తిస్తుంది. కొందరు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. అందులో విషయం ఉండదు. మనం కాదు.. మనం చేసే పనులు మాట్లాడాలనేది విజ్ఞుల మాట. అంటే తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ పని చేయాలి. అటువంటి వారిని ఉద్దేశించి- ‘కాకిలా ఎంత అరిచినా ఏం ఉపయోగం? కోకిలలా ఒక్క పాట పాడినా చాలు’ అంటూ ఉంటారు. అంటే, విషయం లేని మాటలు ఎంత ఎక్కువగా మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. అదే విలువైన మాటలు రెండు మాట్లాడినా చాలనేది భావం. ఎక్కువగా మాట్లాడే వారిని అందుకే బంగారం కంటే తక్కువ విలువైనదైన వెండితో పోల్చారు. వినయ సంపన్నులకు మౌనమే అలంకారం. వారికి వారి మౌనమే సంభాషణ. వారికి వారి మౌనమే సమాధానం. అటువంటి విజ్ఞులు ఏం మాట్లాడకపోయినా, ఆ మౌనం మరెంతో నేర్పుతుంది. భర్త•హరి కూడా ఒక సందర్భంలో- మూఢులకు డాంబికాలే దర్పణం.. పండితులకు మౌనమే అలంకారం- అన్నారు మౌనం అంటే అసలేం మాట్లాడకుండా ఉండిపోవడం కాదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం మాట్లాడకూడదో అనే అవగాహన కలిగి ఉండి, ఆచరించే ఒక సాధనం. ఈ విధమైన మౌనం మనల్ని ఎన్నో సందర్భాల్లో ఆపదల నుంచి బయట పడవేస్తుంది.

ఒకరు మెచ్చేవిధంగా నడవాలి తాను మెచ్చి తినాలి
మన పూర్వీకులు అద్భుతమ వ్యక్తిత్వ సంపదను మనకు వేల సంవత్సరాల క్రితమే మనకు కానుకగా అందించారు. అటువంటి అద్భుత పద సంపదల్లో ఈ సామెతా ఒకటి. ఆరు పదాల్లో అరుదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా మంచి సామెతను సృష్టించారు. పై సామెతలో చాలా అర్థముంది. నేర్చుకుంటే జీవితం చాలా అర్థవంతమవుతుంది. మనం ఇష్టం వచ్చినట్టు తింటే రోగాల పాలవుతాం. కాబట్టే మితంగా, మనకు, మన శారీరక ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్నే తీసుకోవాలి. మేలు చేస్తుందని మన శరీర తత్వానికి పడని ఆహారాన్ని తీసుకోం కదా! కాబట్టి మనం తీసుకునే ఆహారం మనకు నచ్చేదై ఉండాలి. ఇష్టం లేని పనులు ఎలా చేయలేమో, నచ్చని ఆహారాన్ని అలాగే తీసుకోకూడదు. కాదూ కూడదని బలవంతంగా తీసుకుంటే ఇబ్బంది పడక తప్పదు. అలాగే, మన నడవడిక, ప్రవర్తన మనకు నచ్చినట్టు కాదు, ఇతరులు మెచ్చే విధంగా ఉండాలి. అలా అని నటించకూడదు. మన వ్యక్తిత్వంలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా మన చర్యలు ఉంటే వాటిని మానుకోవాలి. నలుగురిలో మంచి అనిపించుకోవడం కంటే మనిషి సంపాదించే గొప్ప ఆస్తిపాస్తులు ఇంకేముంటాయి? కాబట్టి ఆహారాన్ని మాత్రం నచ్చినదే తినాలి.. ప్రవర్తన మాత్రం ఇతరులు మెచ్చే విధంగా ఉండాలి. ఆ విషయాన్నే సూటిగా, సరళంగా, క్లుప్తంగా ఈ సామెత ద్వారా మన పెద్దలు చెప్పారు. వ్యక్తిత్వ వికాసం మన తెలుగు సామెతల్లో పుష్కలంగా లభిస్తుంది.

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top