మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’ల పరిచయం..
ఆవు పొదుగులో అరవై ఆరు పిండివంటలు ఉన్నాయి
ఆవు హిందువులకు పవిత్రమైన జంతువు. దీనిని దైవ సమానంగా పూజించటం మన సంస్క•తీ సంప్రదాయాల ప్రత్యేకత. అందుకే గోవు అనాదిగా భారతదేశంలో పూజలు అందుకుంటుంది. ఇక, ఈ సామెత విషయానికి వస్తే ఇది ఆధ్యాత్మిక పరమార్థాన్ని బోధిస్తుంది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. అని వేమన తన శతకాల్లో నుడివాడు. అంటే, గరిటెడు ఆవు పాలు ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తాయని, వాటికి సాటి వచ్చేది ప్రకృతిలో మరేది లేదని గోవు పాల ఆరోగ్య రహస్యాన్ని, వాటి పవిత్రతను, ప్రాధాన్యాన్ని వేమన అలా చెప్పాడన్న మాట. ఇక, ఆవు పొదుగులో అరవై ఆరు పిండివంటలు ఉన్నాయంటే.. ఆవు పొదుగు నుంచే కదా పాలు వచ్చేది. ఆ పాల నుంచే పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి ఉత్పత్తులు తయారవుతాయి. అవన్నీ వివిధ పిండి వంటల్లో, మనం నిత్యం వండుకునే ఆహార పదార్థాల్లో వివిధ రూపాల్లో వినియోగిస్తుంటాం. ఆవుకు సంబంధించినంత వరకు అది మనకు ఇచ్చే ప్రతీదీ అమూల్యమైనదే. విలువైనదే. చివరకు ‘గోమూత్రం’ కూడా వివిధ చికిత్స పద్ధతుల్లో ఔషధంగా వినియోగంలో ఉంది. ఇక, ఆవు పేడ కూడా ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటే క్రిములు దరిచేరవు. అంటువ్యాధులు దరిచేరవు. ఇలా వీటన్నిటికీ పుట్టినిల్లు ఆవు పొదుగే కదా? అంటే, దాని నుంచి వచ్చే ప్రతీదీ మనకు ఆరోగ్యాన్నిచ్చేదే. మనకు నిత్యావసరాల్లో ఉపయోగపడేదే. కాబట్టే ఆవు పొదుగు అరవై ఆరు పిండివంటలకు మూలం అనే సామెత పుట్టింది
గోరు చుట్టు మీద రోకటి పోటు
అసలే దెబ్బ తగిలింది. ఆపై అదే దెబ్బ మీద
మరో దెబ్బ తగిలింది. అప్పుడిక ప్రాణం విలవిలలాడిపోదూ.. ఇటువంటి సందర్భాలు ఎదురైనపుడే ‘గోరు చుట్టు మీద రోకటి పోటు’ అనే సామెతను వాడుతుంటారు. ఇది తెలుగు నాట చాలా విరివిగా ఉపయోగంలో ఉన్న సామెత. దీన్ని ప్రతి ఒక్కరు దాదాపు ఏదో సందర్భంలో ఉపయోగించని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మీరు ఏదో పనిపై బయటకు వెళ్లారు. అదే ఆ పని ముగించడానికి చివరి రోజు అనుకోండి. దాన్ని ఎలా ముగించాలా అన్న హడావుడిలో మీరున్నారు. అందుకు అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ, మీరు చేయదల్చుకున్న పనికి సంబంధించి మరికొన్ని వివరాలు కావాలనో, లేకపోతే మరిన్ని ఆధారాలు చూపాలనో అవతలి వారు చెప్పారనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఇబ్బందిలో పడినట్టే. అసలే అన్నీ సిద్ధం చేసుకుని అయిపోతుందనుకున్న పనికి.. మళ్లీ పని పడటంతో ఏం చేయాలో ఒక్క క్షణం పాలుపోదు. అంతా అయిపోతుందనుకుంటే ఇలా జరిగిందేమిటి అని అనుకోవడమే ఈ సామెత ప్రయోగానికి తగిన సందర్భమన్న మాట. అంటే, అసలే పని పూర్తి చేయాలన్నది లక్ష్యం. దానికి మరో రూపంలో ఆటంకం కలగడమే రోకటి పోటు
Review సామెత కథ.