సామెత కద

మన ముందు తరాల వారు మనకు అందించిన మహత్తర కానుకల్లో
అపురూపమైనవి- సామెతలు. తమ అనుభూతుల్ని, అనుభవాల్ని రంగరించి
మదించగా పుట్టినవే సామెతలు.
ఒకవిధంగా అవి చిన్న చిన్న పదాల్లో అనంతరమైన అర్థాన్నిఇముడ్చుకుని ఉంటాయి.
వాటిలో జీవితపు అనుభవసారం ఉంటుంది. వికాసం ఉంటుంది.
అటువంటి సామెతల వెనుక ఉన్న అంతరార్థపు కథలను తెలుసుకుందాం.
వాములు తినే వారికి పచ్చగడ్డి ఫలహారమా?
సామెతలను వ్యావహారికంలో ఉపయోగించడానికి మాత్రమే కాదు.. వాటిని వినడం.. అర్థం చేసుకోవడం.. తదనుగుణంగా నడుచుకోవడం వల్ల జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోగల అవకాశం కలుగుతుంది. చిన్న చిన్న సామెతల్లో అంతగా పరమార్థం ఇమిడి ఉంది. సామెతల్ని అర్థం చేసుకోవాలంటే మొదట సామెతల్ని తెలుసుకోవాలి. వాటిని క్షుణ్ణంగా చదవాలి. వాటి అర్థం-అంతరార్థం తెలుసుకోగలగాలి. అప్పుడే వాటిని నిత్య జీవితంలో సందర్భానుసారం ఉపయోగించగలం. ఆయా సమయ సందర్భాలను బట్టి నడుచుకోగలం. మానవ విలువలు మారక విలువలుగా, వ్యక్తి ప్రపంచం వస్తు ప్రపంచంగా మారిపోతున్న ఈ కాలంలో సామెతల గురించి, వాటి అర్థం-అంతరార్థాల గురించి తె•లిసిన వారు ‘నానాటికీ తీసికట్టు.. నాగం••ట్లు’ అన్నట్టు తగ్గిపోతున్నారు. ఈ కాలంలో వేళ్లపై లెక్కించగలిగే వారు మాత్రమే సామెతలను తెలిసినవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మన తెలుగుకు సామెతలే బలం. మన భాషకు సామెతలే వెన్నుదన్ను. మన భారతీయం పల్లెసీమలకు ఆలవాలం. 70 శాతం జనాభా ఈనాటికీ గ్రామాల్లోనే జీవిస్తున్నారు. ఈ కారణంగానే కొద్దిగానైనా సామెతలు పల్లెవాసుల నాలుకలపై మిగిలి ఉన్నాయి. గ్రామీణ జీవనంలో చాలా ఆలవోకగా సామెతలు వినిపిస్తాయి. గ్రామీణులు వాటి ఉనికికి నేటికీ ఊపిరి పోస్తూనే ఉన్నారు. అందుకే పల్లెవాసుల మాటల్లో చాలా యథాలాపంగా సామెతలు దొర్లిపోతుంటాయి. సునిశితంగా గమనిస్తే, పరిశీలిస్తే ఆయా సామెతల్లో ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, పని విలువ, వయసు, పెద్దరికానికి గౌరవం, ముందుచూపు, సోమరితనంపై నిరసన వంటి ఎన్నెన్నో వ్యంగ్యాలు.. ఆ అలతి పదాల్లో ఎంతో ఉన్నతమైన అర్థం, అంతరార్థం గోచరిస్తాయి.
మచ్చుకు కొన్ని సామెతలు.. వాటి అంతరార్థాల గురించి తెలుసుకుందాం.
పని చేయకుండా ఫలితాన్ని ఆశించేవారు ఎక్కువ మందే ఉంటారు. అటువంటి వారికి చురక అంటిస్తుందీ సామెత- ‘పనికి దూడల్లో.. తిండికి దున్నల్లో’. ఇక- పశువుకి, పనికి, మనిషికి తొలిరోజుల్లోనే పరస్పర సంబంధాన్ని తెలుపుతుందీ సామెత.
పల్లెల్లో చాలా తరచుగా వినిపించే మరో సామెత- ‘ఊడుపులపుడు ఊళ్లకు పోయి కోతలపుడు కొడవలి పట్టుకొచ్చినట్టు..’. తిండికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వారిని ఆక్షేపిస్తూ- ‘పందుం తిన్నా పరగడుపే. ఏదుం తిన్నా ఏగడుపే’.
అలాగే- ‘వాములు తినే వారికి పచ్చగడ్డి ఫలహారమా?’. గ్రామం అనగానే వ్యవసాయం ప్రధాన వృత్తి. అందువల్లనే వ్యవసాయ పనులకు సంబంధించిన సామెతలు నిత్యం అక్కడి గ్రామీణుల నాలుకలపై కొల్లలుగా వినిపిస్తుంటాయి. •

Review సామెత కద.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top