ఆధ్యాత్మిక క్రాంతి

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సరారంభ మాసం- జనవరి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం
పుష్య మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది పదవ నెల. జవనరిలోని దాదాపు అన్నీ పుష్య మాస తిథులే.
చివరి రెండు రోజులే మాఘ మాస తిథులు. జవనరి 1వ తేదీ, పుష్య శుద్ధ విదియ, బుధవారం నుంచి జనవరి 20,
పుష్య బహుళ అమావాస్య, బుధవారం వరకు పుష్య మాస తిథులు. జనవరి 30 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఈ నెలలో వచ్చే ప్రధాన పర్వాల్లో సంక్రాంతి ముఖ్యమైనది. అలాగే ఉత్తర ద్వార దర్శనాలకు
ప్రతీక అయిన వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఈ నెలలోనే.

2025- జనవరి 1, బుధవారం, పుష్య శుద్ధ విదియ నుంచి
2025- జనవరి 31, శుక్రవారం, మాఘ శుద్ధ విదియ వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – పుష్యం – మాఘం – హేమంత రుతువు – ఉత్తరాయణం

పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ నిండార శీతాకాలంలో మంచు ఉధృతంగా కురుస్తుంది. చలి జివ్వుమనిపిస్తుంది. మంచు తెరల దుప్పటి ప్రకృతిని పరదాలా చుట్టుకుంటుంది. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని సస్యశ్యామలమైన (పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. హేమంత రుతువు కాలంలో వచ్చే పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని చెబుతారు. ఇక, పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం కూడా పుష్యమే. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఆశ్వయుజం అమ్మవారికి, భాద్రపదం వినాయకుడికి, మార్గశిరం శ్రీమహా విష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, కార్తీకం పరమశివుడికి ప్రీతికరమైన మాసాలైతే.. పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం.

ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. అందుకే ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. నెల పొడవునా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యం. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి. సంక్రాంతి వేళ ఏ ఇల్లు చూసినా అందమైన రంగవల్లులు హరివిల్లుల్లా పరుచుకుని ఉంటాయి. పాడిపంటలు ఇళ్లకు చేరుతుంటాయి. పిల్లల భోగిమంటల సన్నాహాలు, పెద్దల పండుగ పిండివంటల హడావుడి.. ఇవన్నీ కొత్త క్రాంతిని చేకూరుస్తూ సంక్రాంతిని ముంగిటకు తెస్తాయి. పుష్య ంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలనే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కూడా ఉంది. పుష్యంలో వచ్చే ప్రధాన పర్వాలు, ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం.

విశేషాల పుష్యం
ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు శ్రేష్ఠమైనది పుష్య మాసం. పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు.
• పుష్య మాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. • పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు హరిని తులసీ దళాలలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం. • పుష్య మాస సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చించాలని శాస్త్ర వచనం.
• శుక్ల పక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.
• శుక్ల పక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధించాలి. • పుష్య శుద్ధ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. • ప్రత్యక్ష నారాయణుడైన సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించేది ఈ మాసంలోనే.. • పుష్య మాసంలో వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ సదాచారం వెనుక గల సదుద్దేశం. • పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. ఈ రోజు- తిలల్ని ఆరు విధాలుగా ఉపయోగించాలని అంటారు. • ఈ మాసంలో చివరిదైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడుపాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ పాయ తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ స్నానం చేయడం విశేష పుణ్యం లభిస్తుంది.
• ఏపీలోని గోదావరీ తీర ప్రాంతాల్లో కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు.
• పుష్య శుక్ల అష్టమినాడు సంజ్ఞిక అనే శ్రాద్ధం చేస్తే పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

పుష్య శుద్ధ విదియ
జనవరి 1, బుధవారం

ఇది జనవరి మాసంలోని తొలి రోజు. తిథి.. పుష్య శుద్ధ విదియ. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు నుంచి సమాప్తమవుతుంది. ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు.
ఇక, జనవరి 1 ఆంగ్ల కొత్త సంవత్సర (న్యూ ఇయర్‍) దినం. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను ఈనాడు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

పుష్య శుద్ధ తదియ
జనవరి 2, గురువారం

పుష్య శుద్ధ తదియ నాడు ప్రత్యేకించి జరుపుకునే పర్వాలు కానీ, వ్రతాదులు కానీ ఏమీ లేవు. ఈనాడు వరల్డ్ నేచర్‍ డే నిర్వహిస్తారు.

పుష్య శుద్ధ చవితి
జనవరి 3, శుక్రవారం

పుష్య శుద్ధ చవితి నాడు చతుర్ధీ వ్రతం ఆచరించాలని వ్రత నియమం. ఏ మాసపు చతుర్థి తిథి నాడైనా గణపతిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. చతుర్థి తిథి గణపతికి ప్రీతికరమైనది.

పుష్య శుద్ధ పంచమి
జనవరి 4, శనివారం

ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షాల్లోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆచారమై ఉంది. ఇక, పుష్య శుద్ధ పంచమి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి.

పుష్య శుద్ధ షష్ఠి
జనవరి 5, ఆదివారం

పుష్య శుద్ధ షష్ఠి కుమారషష్ఠి. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని పూజించడానికి ఇది ఉద్ధిష్టమైన రోజు.

తమిళనాడులో ఈనాడు పెద్ద పర్వం నిర్వహిస్తారు. కుమారస్వామి తమిళుల ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ తెలుగునాట ఎక్కువగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు అందుకు నిదర్శనం. ఇక, మన ప్రాచీనాంధ్ర కవులు సైతం తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇదే పర్వాన్ని తమిళులు పుష్య శుద్ధ షష్ఠి నాడు ఘనంగా జరుపుకుంటారు.

పుష్య శుద్ధ సప్తమి
జనవరి 6, సోమవారం

పుష్య శుద్ధ సప్తమి సూర్యారాధన తిథి. ఈనాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలు చేయాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. సాధారణంగా పుష్య మాసమే సూర్యారాధనకు ప్రతీతమైనది. అటువంటిది ఈ సప్తమి తిథి నాడు ఆయనను మరింతగా ఆరాధించాలి.

పుష్య శుద్ధ అష్టమి
జనవరి 7, మంగళవారం

పుష్య శుద్ధ అష్టమి శక్తియుతమైనది. ఈనాడు శక్తికి మూలరూపమైన అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు. పుష్య శుద్ధ అష్టమిని మన పంచాంగాలలో మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో వ్యవహరించారు. ఈనాడు అష్టకా సంజ్ఞకమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని,
వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. పుష్య మాసం పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. కాబట్టి ఈనాడు పితృ దేవతల ప్రీత్యర్థం కార్యాలు తలపెట్టాలి. అందుకే దీనిని మాసిక దుర్గాష్టమిగానూ వ్యవహరిస్తారు.

పుష్య శుద్ధ నవమి
జనవరి 8, బుధవారం

పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం ఆచరిస్తారు. కేవలం ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

పుష్య శుద్ధ దశమి
జనవరి 9, గురువారం

పుష్య శుద్ధ దశమి నాడు ద్వార పూజ (గడపకు పూజ) చేయడం ఆచారం. అయితే ఈ పూజ చేయడం ఉత్కళ దేశంలో ఎక్కువ ఆచారంలో ఉంది. ఈనాడు ద్వార ధర్మ దేవతలను పిండి మొదలైన వాటితో పూజిస్తారు. తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, వివిధ వ్రత గ్రంథాలు ఈ దశమిని శాంభవి దశమి అని పేర్కొంటున్నాయి.

పుష్య శుద్ధ ఏకాదశి
జనవరి 10, శుక్రవారం

పుష్య శుద్ధ ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. అలాగే ఈ తిథి పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది. రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది.
ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.

రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు.
అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.

అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. మీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది.
దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమేణా సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు. ••వతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.

పుష్య శుద్ధ ద్వాదశి/త్రయోదశి
జనవరి 11, శనివారం

పుష్య శుద్ధ ద్వాదశి, త్రయోదశి ఘడియలు ఒకేరోజు ఉన్నాయి. మొదట ద్వాదశి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.

పుష్య శుద్ధ చతుర్దశి
జనవరి 12, ఆదివారం

పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేయాలి. గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు. అలాగే ఈ తిథి విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి.

పుష్య శుద్ధ పూర్ణిమ
జనవరి 13, సోమవారం

పుష్య నక్షత్రంతో కూడిన పున్నమిని ‘పౌషీ’ అంటారు. ఇక, పుష్య శుద్ధ పూర్ణిమనే మహా పౌషీ అని కూడా అంటారు. దీనికే హిమశోధన పూర్ణిమ అనే మరో పేరు కూడా ఉంది. పుష్య పూర్ణిమను తమిళులు ‘పూసమ్‍’గా వ్యవహరిస్తారు. తై పూసమ్‍ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్‍వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్‍వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది. తమిళనాడులోని అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్‍ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది. • శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.• పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. • పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
•మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది.
ఇక, జనవరి 12 స్వామీ వివేకానందుని జయంతి తిథి. ఏటా ఆయన జయంతి దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆయన చేసిన బోధనల నుంచి స్ఫూర్తి పొంది యువత అన్ని రంగాల్లోనూ రాణించాలనేది ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.

పుష్య బహుళ పాడ్యమి/సంక్రాంతి భోగి
జనవరి 14,మంగళవారం

పుష్య బహుళ పాడ్యమి తిథి నాడే భోగి పర్వదినం. సాధారణంగా ఏదైనా ప్రధాన పర్వానికి ముందు రోజును భోగి అనడం కద్దు. అంటే అట్లతద్దికి ముందు వచ్చే తిథిని అట్లతద్ది భోగి అంటారు. అలాగే పెద్ద పండుగగా వ్యవహరించే సంక్రాంతికి ముందు వచ్చే తిథిని భోగి అంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వాల్లో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ వ్యవహరిస్తారు. ఈనాడు పిల్లలు భోగిమంటలు వేస్తారు. పిల్లలకు కలిగిన దిష్టి దోషాలు పోవడానికి వారికి తలంటి పోసిన తరువాత తలపై భోగిపళ్లను జారవిడుస్తారు. దీనివల్ల వారికున్న గ్రహ, దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మిక. సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగి మంటలు వేసే సంప్రదాయం ఏర్పడింది. సూర్యుడు ఉత్తరాయణం (సంక్రాంతి)లోకి మళ్లింది మొదలు వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని, వాతావరణ మార్పును తట్టుకునేందుకే భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది.
ఈనాడు ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలని అంటారు. అందులో ఒకరు ఇంద్రుడు. మరో కథ ప్రకారం ఈనాడు బలి చక్రవర్తి పాతాళానికి తొక్కబడిన దినంగా కూడా భోగిని భావిస్తారు. భోగి నాడే విష్ణువు వామనడై బలి చక్రవర్తి నెత్తిన మూడో పాదాన్ని పెట్టి అతనిని పాతాళానికి తొక్కేశాడు. బలిని మూడు అడుగులతో అణచివేసిన దినం కాబట్టి, సంక్రాంతి పర్వం మూడు రోజులనే ఆచారం ఏర్పడిందని కూడా అంటారు. అందుకే, ఈనాడు వామన నామస్మరణ, బలిచక్రవర్తి ప్రస్తుతి చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం.
ఇక, ఈనాడు పూజలందుకునే మరో దేవత.. గోదాదేవి. గోదాదేవిని కూడా ఈనాడు విశేషంగా పూజిస్తారు. శ్రీవిల్లిబుత్తూర్‍ అనే గ్రామంలో విష్ణుచిత్తుడనే పరమ భాగవత శిఖామణి ఉండేవాడు. ఆయన కూతురు గోదాదేవి. ఆమె పెళ్లీడుకి వచ్చింది. శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథుడిని తప్ప మానవమాత్రులైన ఎవరినీ పెళ్లి చేసుకోనని గోదాదేవి తండ్రితో తెగేసి చెబుతుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఆమె ధనుర్మాస వ్రతం పూనుతుంది. ఈ వ్రతం ఆచరించిన నెల రోజుల్లో ఒక్కో రోజు తనకు కలిగిన అనుభూతుల్ని వర్ణిస్తూ తమిళంలో కవిత చెప్పి, రోజుకు ఒక పాశురం (మన తెలుగులో సీస పద్యం వంటిది) చొప్పున ముప్ఫయి రోజులు ముప్ఫై పాశురాలను రచించి స్వామికి అంకితం ఇచ్చేది. ఆ నెల రోజులు ఆమె పొంగలి మాత్రమే తీసుకునేది. ఈ ముప్ఫయి పాశురాలతో కూడిన గ్రంథమే ‘తిరుప్పావై’. తిరుప్పావై పూర్తయిన ముప్ఫయ్యోనాడు స్వామి ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని చెబుతాడు. ఆమెను శ్రీరంగం రావాలని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలు సమకూరుస్తానని మాటిస్తాడు. గోదాదేవి ఈ విషయాన్ని తండ్రికి చెబుతుంది. తండ్రి ఆమెను శ్రీరంగం తీసుకువెళ్తాడు. ఆశేష ప్రజానీకం సమక్షంలో ఆమెకు శ్రీరంగనాథునితో వివాహం చేస్తారు. పెళ్లితంతు పూర్తి కాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్లి స్వామి వారి శేషతల్పం ఎక్కివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది. మహిమోపేతమైన ఇంతటి కార్యం నడిచిన పుణ్య దినం, పర్వదినం భోగి.

పుష్య బహుళ విదియ/మకర సంక్రమణం
జనవరి 15, బుధవారం

తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః
సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరరాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః
సంక్రాంతి ఆగమనాన్ని తెలిపే ఈ శ్లోకం జయసింహ కల్పద్రుమంలోనిది. ‘సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది’ అని పై శోక్లానికి అర్థం.
పుష్య బహుళ విదియ నాడే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరగతుడవుతాడు. ఈనాటి నుంచి ఉత్తరాయణ దినాలు ఆరంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు మకర సంక్రాంతి పర్వాన్ని ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వంలో సంక్రాంతి రెండో రోజు. దీనినే పెద్దల పండుగ అనీ అంటారు. పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నాన్ని ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్థం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు. అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టేనని భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తమకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకులు ఎటూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది. సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజులు చలికాలం. ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు.
మకర సంక్రాంతి నిజానికి తిథి పర్వం కాదు. కానీ, మహా పండుగై ఆచారంలో ఉంది. ముఖ్యంగా ఇది తిలలతో (నువ్వులతో) ముడిపడి ఉన్న పర్వమని ఈ తిథి నాడు ఆచరించే వ్యవహారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకే
ఈనాడు ఆచరించే వ్రతాన్ని తిల పర్వమనీ అంటారు. అయితే, దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. మకర సంక్రాంతి నాటి ఉదయం లేవగానే, నువ్వులు ముద్ద చేసి దానిని ఒంటికి రుద్దుకోవడం ఈనాటి ముఖ్య విషయాల్లో ఒకటి. నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకుని ఇంట్లో అందరూ తలంటి పోసుకున్న తరువాత పుణ్యస్త్రీలు చక్కగా అలంకరించుకుని ఐదు మట్టి ముంతలు తీసుకుని, తమకు తెలిసిన పేరంటాళ్ల ఇళ్లకు వెళ్తారు. ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, క్యాబేజి ముక్కలు, చెరుకు ముక్కలు ఉంచుతారు. ముంత మీది మూకుడు మూతలో బెల్లం పాకంలో నువ్వులు వేసి తయారు చేసిన ఉండలు ఉంచుతారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిడత ఇచ్చి ఆ ఇంటిలో నుంచి మళ్లీ అటు వంటిదే ఒక్కొక్క పిడత తీసు కుంటారు. తెలిసి ఉన్నవాళ్ల అందరి ఇళ్లలోనూ ఇలా మార్చుకున్న పిమ్మట ఆ స్త్రీలు తమ ఇళ్లకు వచ్చేస్తారు. సంక్రాంతి నాడు స్నానం చేయనివాడు ఏడు జన్మల వరకు రోగిగా, దరిద్రుడిగా ఉంటాడట. దక్షిణాయన గత పాపం ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి. అందుకోసం ఈనాడు సూర్యుని ఆరాధించి తిలలు, కూష్మాండం, భాండం, కంబళ, ధాన్య, లోహ, వస్త్ర, తైల దీప దానాలు చేయాలని శాస్త్ర వచనం. సంక్రాంతి నాడు తిలలతో ముడిపడిన ‘దధిమంధన’ వ్రతం చేసే ఆచారమూ ఉంది. ఈ వ్రతాన్ని జాబాలి మహర్షి సునాగుడనే మునికి వివరించాడట. సంక్రాంతి నాడు శివుడి ప్రతిమకు నేతితో అభిషేకం చేయాలని, నువ్వుపూలతోను, మారేడాకులతోను పూజించాలని ఈ వ్రత విధానం చెబుతోంది. దధిమంధన వ్రతం వల్ల అఖండ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని దూర్వాస మహాముని చెప్పగా, ద్రోణాచార్యుడి పత్ని కృపి ఈ వ్రతం ఆచరించి దారిద్య్రం నుంచి విముక్తి పొందిందని, అశ్వత్థామను పుత్రుడిగా కన్నదని ఐతిహ్యం. అలాగే నందుని భార్య యశోద ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కుమారునిగా కన్నదని పురాణాల ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానమాచరించి, బ్రాహ్మలకు పెరుగు, తిలపాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి కుందెలు, గొడుగులు, ఇతర వస్తువులు కూడా బహుమానాలుగా అందచేస్తారు.
సంక్రాంతి నాడు బ్రాహ్మణుడిని ఇంటికి భోజనానికి పిలుస్తారు. నువ్వుల పప్పుతో చేసిన లడ్లు ఆనాటి ప్రధాన భక్ష్యాలు. భోజనం అయిన తరువాత బ్రాహ్మణుడికి దక్షిణ ఇస్తారు. కొత్త అల్లుడిని ఈ పండుగకు తప్పకుండా తీసుకువస్తారు. శబరిమలైలో స్వామి అయ్యప్ప మకర జ్యోతి దర్శనం అయ్యేది కూడా ఈనాడే.

పుష్య బహుళ తదియ/కనుమ పండుగ
జనవరి 16, గురువారం

పుష్య బహుళ తదియ నాడు కనుమ పండుగ. సంక్రాంతి తొలి రెండు రోజులూ (భోగి, సంక్రాంతి) మన కోసం నిర్వహించుకునే పండుగలైతే, చివరి రోజైన కనుమ నాడు మాత్రం మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులనూ స్మరించుకోవడం, వాటికి వివిధ రూపాల్లో కృతజ్ఞత తెలుపుకోవడం ఆచారంగా వస్తోంది. అలాగే, ఈనాడు పితృదేవతలనూ స్మరించుకుంటారు. వ్యవసాయాధారితమైన మన దేశంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండేవి ఎద్దులు. అవి మనకు చేసే సాయానికి ప్రతిగా వాటికి ఎంత చేసినా తక్కువే. అందుకే ఉన్నంతలో తమ కృతజ్ఞతను తెలుపుకునేందుకు కనుమ రోజు పశువులను ఇతోధికంగా పూజిస్తారు. సంక్రాంతి నాటికి పొలం పనులన్నీ పూర్తయి ఉంటాయి. కనుక, పశువులు కూడా అలసిపోయి ఉంటాయి. ఇలా నిస్త్రాణంగా ఉన్న పశువులకు కాస్త బలాన్ని చేకూర్చేందుకు ఉప్పు చెక్క పేరుతో వాటికి ఔషధులతో కూడిన పొట్టును తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి కొట్టాలను శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతో, పూలదండలతో అలంకరిస్తారు. కనుమ నాడు పశువులను అలంకరించే తీరు అవర్ణం. కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకు చిరుగంటల గజ్జెలు, మెడలో దండలు.. ఇలా తనివితీరా రైతులు తమ పశువులను అలంకరిస్తారు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ వీటికి పందాలు నిర్వహించడం మొదలైంది. ఇంట్లో ఉండే జీవులనే కాదు మన పరిసరాల్లో ఉండే జీవుల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇంటి నిండా ధాన్యపు రాశులు నిండిన ఈ పుణ్య కాలంలో ఇంటి చూర్లకు ధాన్యపు కంకులను కుచ్చుగా కట్టి వేలాడదీస్తారు. పిచ్చుకలు, ఇతర చిన్న పక్షులు వీటిని తిని కడుపు నింపుకొంటాయి. అలా మనిషికి పశువులు, పక్షులతో ఉన్న అనుబంధాన్ని చాటుతుంది కనుమ పండుగ. తనతో పాటు ఉన్న మూగజీవాల ఆకలి తీర్చినపుడే మనిషి జీవితానికి సార్థకత అని చాటే పండుగ సంక్రాంతి.
కనుమ నాడు రథం ముగ్గు వేసి ఆనాటితో సంక్రాంతి సంబరాలకు ముగింపు పలకడం రివాజు. సంకురుమయ్య (సూర్య దేవుడు/ సంక్రాంతి దేవుడు) ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకా అన్నట్టు ఇలా రథం ముగ్గును వేయడం ఆచారం. ఈ ముగ్గుకు ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు.
కనుమ నాడు పొలిమేర దాటకూడదని నియమం.
పశువులకే కాదు.. వాటి యజమాలకూ కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. తమిళనాడులో కనుమ నాడు జరిగే పశువుల సందడిని ‘మట్టు పొంగల్‍’ అంటారు. ‘మట్టు’ అంటే ఎద్దు.
ఒకసారి శివుడు తన నంది వాహనాన్ని పిలిచి, భూలోకంలో ఉన్న ప్రజలకు ఒక సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట.
‘రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలనీ, నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలన్న’దే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారులో శివుడి సందేశాన్ని సరిగా వినలేదు. ఆ కంగారులో- ‘రోజూ చక్కగా తిని ఉండాలి. నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని భూలోకంలో చెప్పాడట.
నంది గారి నిర్వాకానికి నివ్వెరపోయిన శివుడు- ‘మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి. అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే వెళ్లి సాయం చెయ్యి’ అని నందిని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహార పంటలను పండించడంలో, వ్యవసాయ పనుల్లో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయట.
తమిళనాట ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది.

పుష్య బహుళ చవితి/ముక్కనుమ
జనవరి 17, శుక్రవారం

పుష్య బహుళ చవితి నాడు ముక్కనుమ పండుగ. కనుమ మర్నాడు వచ్చే ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అనే పేరూ ఉంది. సంక్రాంతితో పాటు కనుమ నాడు గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయం. అప్పుడప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్‍ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు. ఇక, ముక్కనుమ నాడు గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగానూ పిలుస్తారు.

పుష్య బహుళ పంచమి
జనవరి 18, శనివారం

ఈనాడు వేమన జయంతి. ఈనాడు దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. పంచమి తిథి జనవరి 19, ఆదివారం కూడా కొనసాగుతుంది.

పుష్య బహుళ షష్ఠి
జనవరి 20, సోమవారం

కుమారస్వామిని పూజించాలి. షష్ఠి తిథి ఆయన పూజకు ఉద్ధిష్టమైనది.

పుష్య బహుళ సప్తమి
జనవరి 21, మంగళవారం

పుష్య బహుళ సప్తమి తిథి నాడు సూర్యుడిని ఆరాధించాలి. సప్తమి తిథి ఆయనకు ఇష్టమైనది.

పుష్య బహుళ అష్టమి
జనవరి 22, బుధవారం

పుష్య కృష్ణ (బహుళ) అష్టమి నాడు దుర్గాపూజలు చేస్తారు. పుష్య బహుళ అష్టమి నాడు కాలాష్టమి వ్రత దినమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. కాలభైరవుని పూజకు, శక్తిపూజకు అనువైన దినమిది.

పుష్య బహుళ నవమి
జనవరి 23, గురువారం

పుష్య బహుళ నవమి తిథి నాడు అన్వష్టకా శ్రాద్ధమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించారు.

పుష్య బహుళ దశమి
జనవరి 24, శుక్రవారం

పుష్య కృష్ణ (బహుళ) దశమి నాడు దశహరా దేవి.. అంటే దుర్గాదేవిని పూజించాలని నియమం. దశమి తిథి అమ్మవారి పూజకు ఉద్ధిష్టమైనది.

పుష్య బహుళ ఏకాదశి
జనవరి 25, శనివారం

పుష్య బహుళ ఏకాదశిని షట్‍ తిలైకాదశి (షట్‍ + తిల + ఏకాదశి) అనే పేరుతో ‘ఆమాదేర్‍ జ్యోతిషీ’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. చతుర్వర్గ చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు.
షట్‍ తిలైకాదశి అంటే.. ఆరు విధాలుగా తిలలను ఉపయోగించే ఏకాదశి. ఆ ఆరు విధాలు ఏమిటంటే..
1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి.
2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాచుకోవాలి.
3. ఆరు నువ్వుల గింజలను తినాలి.
4. తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి.
5. గురుజనులకు తిలలు దానం చేయాలి.
6. తిల తర్పణం విడువడం ద్వారా దేవతలకు నువ్వులు సమర్పించాలి.
నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించాలనే ఆచారం వల్ల దీనికి షట్‍ (ఆరు) తిలైకాదశి అని పేరు.

పుష్య బహుళ ద్వాదశి
జనవరి 26, ఆదివారం

ద్వాదశి తిథి సంప్రాప్తి ద్వాదశి దినం. ఇంకా మహా ఫల ద్వాదశి, సురూప ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. కూర్మ ద్వాదశి ఆచరిస్తారని మరికొన్ని పంచాంగాలలో ఉంది.

పుష్య బహుళ అమావాస్య
జనవరి 29, బుధవారం

పుష్య బహుళ అమావాస్యతో పుష్య మాస తిథులు ముగుస్తాయి. పుష్య కృష్ణ అమావాస్యనే ‘బకులామాస్య’ అనీ అంటారు. తిథి తత్త్వం దీన్ని ‘అర్థోదయామావాస్య’ అంటోంది. ఈనాడు సముద్ర స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని శాస్త్ర వచనం. అలాగే ఈనాడు పితృతర్పణం చేస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుంచి బయటపడి స్వర్గానికి వెళ్తారని పురాణగాథ. గోదావరి ప్రాంతంలో పుష్యకృష్ణ అమావాస్యను ‘చొల్లంగి అమావాస్య’ అంటారు. చొల్లంగి అనేది ఊరి పేరు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఇది ఉంది. ఇది సముద్రతీర గ్రామం. గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సముద్రంలో కలిసే చోటు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం కలుగుతుంది. చొల్లంగిలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గోదావరి జిల్లాలలో ‘సప్తసాగర యాత్ర’ అని ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అది చొల్లంగి అమావాస్యనాడే ఆరంభమవుతుంది. సాగర యాత్ర ప్రారంభం.. ముగింపు ఈ పర్వంతోనే ముడిపడి ఉన్నాయి.
గౌతముడు, తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఏడుగురు రుషుల పేరుతో ఏడు గోదావరి శాఖలు సప్త గోదావరి శాఖలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఏడు ప్రదేశాలకు వెళ్లి స్నానం చేసి రావడాన్నే ఉభయ గోదావరి జిల్లాల్లో సప్తసాగరయాత్ర అంటారు. ఈ యాత్ర చొల్లంగి స్నానంతో అనగా, పుష్య బహుళ అమావాస్యతో ఆరంభమవుతుంది. ఏడు తావులు చూసుకుని ప్రాయకంగా మాఘశుద్ధ ఏకాదశి నాటికి వశిష్ఠా సాగరసంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగు తుంది. ఆ ఏకాదశికి అంతర్వేది ఏకాదశి అని పేరు. సప్త సాగర యాత్రకు ఇలా ప్రారంభ, ముగింపు దినాలు పర్వదినాలయ్యాయి.

మాఘ శుద్ధ పాడ్యమి
జనవరి 30, గురువారం

మాఘ శుద్ధ పాడ్యమి నాటి నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఇది సూర్యారాధనకు అనువైన మాసం. ఈ మాసం పొడవునా సూర్యుడిని విశేషంగా ఆరాధిస్తారు.

మాఘ శుద్ధ విదియ
జనవరి 31, శుక్రవారం

మాఘ శుద్ధ విదియ త్యాగరాజ స్వామి ఆరాధన తిథి. ఈనాడు త్యాగరాజ కృతులను ఆలయాల్లో ఆలపించడం ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో త్యాగరాజ స్వామి ఈనాడు విశేష ఆరాధనలు అందుకుంటారు.

Review ఆధ్యాత్మిక క్రాంతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top