ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదో మాసం- అక్టోబరు. ఇది మనకు,
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఏడవ మాసం. అక్టోబరు మాసం భాద్రపద – ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబరు 2వ తేదీ, బుధవారం వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్ 3వ తేదీ, గురువారం నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం- ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ నెలలో దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పేరిట సాగే పూల పండుగ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెలలోనే కనులపండువ చేస్తాయి. ఇంకా అనేకానేక పర్వాల సమాహారం ఆశ్వయుజ మాసం.
2024- అక్టోబరు 1, మంగళవారం,
భాద్రపద బహుళ చతుర్దశి నుంచి
2024- అక్టోబరు 31, గురువారం, ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – భాద్రపదం- ఆశ్వయుజం – శరదృతువు- దక్షిణాయనం
అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలమిది. అందమైన ఈ శరదృతు కాలంలో ఆధ్యాత్మిక వికాసం వెల్లివిరుస్తుంది. ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజి అంటే స్త్రీ. అందుకే ఆశ్వయుజం అతివల పర్వం. శక్తి (అమ్మవారి) ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసమిది. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ నెలలో వైశిష్ట్యం. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా దర్శనమిస్తారు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మన: కారకుడు. ఈ ఇద్దరూ కలిసి ఈ నెలలో ఆరాధించే అమ్మవారి భక్తులపై తమ శక్తులను ప్రసరిస్తారు. సృష్టికి మూలం స్త్రీ. పురుషుడు ప్రాణదాత అయితే, స్త్రీ శరీరధాత్రి. అటువంటి శక్తికి ఆలవాలమైన మాసం- ఆశ్వయుజం. ఈ మాసమంతా అతివల పర్వాలే. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి.
సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ ముగ్గురమ్మలు శరన్నవరాత్రుల పేరిట ఏకకాలంలో పూజలందుకునేది ఆశ్వయుజ మాసంలోనే. ఇదే దసరా ప•ర్వంగా ప్రసిద్ధి. దసరా నాడే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని అంటారు. అర్జునుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలను తీసి కౌరవ వీరులను జయించినదీ విజయదశమి నాడేనని పురాణోక్తి. ఈ మాసంలో వచ్చే పండుగలు,
• నక్షత్రాలలో మొదటిది అశ్వని నక్షత్రం. ఈ నక్షత్రంలో పూర్ణిమ వచ్చే నెల ఆశ్వయుజం.
• ఆశ్వయుజ మాసంలో సూర్యుడు కర్కాటక లేదా మకర రేఖ వైపు తన దిశను మార్చుకుని పరివర్తనం చెంది, భూమధ్య నుంచి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తద్వారా అనేక మార్పులు కలిగి.. ఈ సమయంలో ప్రకృతి నిద్రాణస్థితిలో ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యానికి భంగం కలిగించే వ్యాధులు పుట్టుకొస్తాయి. ప్రకృతి, వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా శరీరం ప్రభావితమవుతుంటుంది. అందుకే దేవీ శరన్నవరాత్రుల సమయంలో సాత్వికాహారం తీసుకోవాలని పెద్దలు నిర్దేశించారు. భగవంతుని ఆరాధనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా శారీరక, మానసిక వికారాలు దరిచేరకుండా చూసుకోవాలి.
• వసంత రుతువు, శదృతువులను కలిపి యమద్రష్టల కాలంగా పరిగణిస్తారు. రోగపీడలు వ్యాపించే ఈ కాలంలో జన నాశనం అధికంగా ఉంటుంది. అందుకే ఈ రెండు రుతువుల్లో అమ్మవారి ఆరాధనను, అమ్మవార్లకు నైవేద్య రూపంలో నివేదించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
• శరన్నవరాత్రులతో పాటు పాశాంకుశ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, బతుకమ్మ ఉత్సవాలు, పద్మనాభ ద్వాదశి, వాల్మీకి జయంతి, అట్లతద్ది, కాలాష్టమి, తిరులమ శ్రీవారి బ్రహ్మోత్సవాల వంటివి ఈ నెలలో వచ్చే ముఖ్య పర్వాలు, పండుగలు.
• దసరా తరువాత ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాల్లో అట్లతద్ది ఒకటి. ఇది పూర్తిగా అతివల పర్వం. యువతులు, బాలికలు ఈనాడు ఆడిపాడుతూ ఉల్లాసంగా గడుపుతారు. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటారు.
• శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి.. ఈ మూడు రోజుల్లోనైనా పూజలు చేయాలి.
భాద్రపద బహుళ చతుర్దశి/బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
అక్టోబరు 1, మంగళవారం
భాద్రపద బహుళ చతుర్దశి తిథి మాసశివరాత్రి. ఈనాడు ఉపవాసం ఉంటే శివలోకప్రాప్తి కలుగుతుందని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ తిథి గురించి ‘శస్త్రాదిహితన్యైకోదిఇష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు. ఇక, ఈనాటి నుంచి తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్క•తి, సంప్రదాయాల గొప్పతనాన్ని బతుకమ్మ చాటిచెబుతుంది. బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండుగ. దసరా ఉత్సవాలతో సమానంగా మహిళలు వైభవంగా నిర్వహించుకునే వేడుక ఇది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పర్వమిది. భాద్రపద బహుళ చతుర్దశి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రకృతిలో భాగమైన సూర్యచంద్రులను కొలిచిన విధంగానే ప్రకృతి నుంచి లభించే వివిధ పూలను కొలిచే పండుగ ఇది. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి ఇలా తీరొక్క రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను అందులో ప్రతిష్ఠించి, దాని చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడతారు. ఆడబిడ్డలను పుట్టిళ్లకు ఆహ్వానించి కుటుంబమంతా సంబరాలు చేసుకుంటారు. ఇదొక సామాజిక ఉత్సవం. కుల, మత, వర్గ, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ ఈనాడు ఈ పండుగ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటుకుంటోంది. తెలంగాణలో ఈ పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. నాడు నైజాం రజాకార్లు తెలంగాణ పల్లెల్లో ఘోరకృత్యాలకు పాల్పడిన సందర్భంలో, నిర్బంధకాండను అమలు చేసిన క్రమంలో నాటి ఆడపడుచులంతా ఒకచోట కూడి బతుకమ్మ ఆడి తమ నిరసనను తెలిపేవారు. నిజాంకు వ్యతిరేకంగా సాగిన ఆనాటి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఉత్సవం కూడా ఉద్యమపాత్ర పోషించింది. తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల వివరాలిలా..
మొదటి రోజు: ఉత్సవాల తొలిరోజును ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండో రోజు: ఈనాటి బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. చప్పిడిపప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడో రోజు: ఈనాటి బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలు, ఇతర పాల పదార్థాలను అమ్మకు నివేదిస్తారు.
నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ ఈనాడు పూజలందుకుంటుంది. అంటే నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం అమ్మవారికి సమర్పిస్తారు.
ఐదో రోజు: ఈనాటి బతుకమ్మ పేరు అట్ల బతుకమ్మ. అట్లు (దోశలు) తయారుచేసి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఆరో రోజు: అలిగిన బతుకమ్మ పేరుతో ఈనాడు వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను పేర్చరు. ఎలాంటి నైవేద్యం కూడా సమర్పించరు.
ఏడో రోజు: ఈనాడు పూజలందుకునే గౌరమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. సకినాల పిండిని వేపకాయల్లా తయారుచేసి, నూనెలో వేయిస్తారు. వాటిని అమ్మకు నైవేద్యంగా పెడతారు.
ఎనిమిదో రోజు: ఈనాటి బతుకమ్మ పేరు వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్నముద్ద, బెల్లం వంటి పదార్థాలు అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు: ఇది తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు. ఈనాడు సద్దుల బతుకమ్మ పేరిట అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఉత్సవాల్లో చాలా ముఖ్యమైన రోజు. సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అని కూడా పిలుస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం అమ్మవారికి సమర్పిస్తారు. ఈనాటితో ఉత్సవాలు ముగుస్తాయి.
భాద్రపద బహుళ అమావాస్య
అక్టోబరు 2, బుధవారం
భాద్రపద భాద్రపద బహుళ అమావాస్య పితృకామావాస్య అనీ ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. పితృ దేవతల సంతృప్తి కోసం ఈ తిథి నాడు తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. అక్టోబరు 2, మన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి దినం. ఈనాడు భారతదేశంతో పాటు వివిధ దేశాల్లో కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
అక్టోబరు 3, గురువారం
ఆశ్వయుజ మాస తిథులు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి. తొలి తిథి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. ఈనాటి నుంచే దేవీ నవరాత్రులు ఆరంభమవుతాయి. ఇక, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని ఉంది. శరన్నవరాత్రుల్లో తొలి రోజైన ఈనాడు అమ్మవారు శైలపుత్రి అలంకరణలోదర్శనమిస్తారు. దేవీ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకుని ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు కొనసాగుతాయి. ఈ గడియల్లోనే భద్రకాళి అమ్మవారు అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారని పురాణ గ్రంథాలలో ఉంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి. ఇక, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈనాటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనాడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.
ఆశ్వయుజ
శుద్ధ విదియ
అక్టోబరు 4, శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ప్రత్యేక పూజలేమీ లేవు. శరన్నవరాత్రుల్లో ఇది రెండో రోజు. ఈనాడు స్థానిక సంప్రదాయాలను అనుసరించి అమ్మవారు బాలా త్రిపురసుందరి, బ్రహ్మచారిణి అలంకరణలలో దర్శనమిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ తదియ
అక్టోబరు 5, శనివారం
ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఈ తిథి నాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇది శరన్నవరాత్రులలో మూడవ రోజు. ఈనాడు అమ్మవారు గాయత్రీదేవిగా, చంద్రఘంటా దేవిగా దర్శనమిస్తారు. తదియ ఘడియలు అక్టోబరు 6, ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈనాడు నాటి సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారిని అలంకరించి పూజిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ చవితి
అక్టోబరు 7, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ తదియ ఘడియల్లోనే చవితి తిథి కూడా ప్రవేశిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఈ రోజు ఆచరిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ పంచమి
అక్టోబరు 8, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి లలితా పంచమిగా ప్రసిద్ధి. ఈ తిథి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలి. శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాడు శ్రీవారి గరుడ సేవ నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాల్లో జరిగే సేవల్లో ఇదే విశేషమైన సేవ.
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
అక్టోబరు 9, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి స్కంద షష్ఠిగా ప్రతీతి. ఈనాడు కుమారస్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్టితో దేవీ శరన్నవరాత్రులు ఏడవ రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారిని కాళరాత్రిగా, శ్రీ సరస్వతిదేవిగా అలంకరించి పూజిస్తారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. ఇది ఈ వేడుకల ముగింపు రోజు. దసరా వేడుకల్లో ఇది మూలా నక్షత్ర దినం. ఇది సరస్వతీ దేవి జన్మ నక్షత్రం కావడంతో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈనాడు అమ్మవారిని సరస్వతిగా అలంకరించి పూజిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
అక్టోబరు 10, గురువారం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి సూర్యారాధనకు ఉద్ధిష్టమైనది. అందుకే ఈ తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు.
అలాగే, ఈనాడు గరుడ జయంతి దినం అని కూడా అంటారు. ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, పంచగవ్యములను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి. ఈనాడే దేవీ త్రిరాత్ర వ్రతం కూడా ఆచరిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
అక్టోబరు 11,
శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమీ తిథి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమీగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు. దుర్గాష్టమి వ్రతం ఆచరించాలి. ఇక, మాళవ దేశంలో ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు ఈనాడు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు. ఇది మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఉన్న ఘడియల్లోనే తెలుగు పంచాంగాలు నవమి వేడుకలను కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఈనాడు మహర్నవమి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈనాడు దుర్గాదేవిని మహిషాసురమర్దనిదేవిగా, సిద్ధిధాత్రిదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈనాటి అమ్మవారి ప్రధాన అలంకరణ- మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు ఈనాడే సంహరించారని అంటారు. ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. వివిధ కులవృత్తుల వారు తమ పనిముట్లను, విద్యార్థులు తమ విద్యాసామగ్రిని, వివిధ బతుకుదెరువులు, జీవనోపాధులకు ఆధారమైన వస్తువులను ఈనాడు విశేషంగా పూజిస్తారు.ఇంకా ఈనాడు మాతృ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు.
ఆశ్వయుజ శుద్ధ నవమి/దసరా/విజయదశమి
అక్టోబరు 12, శనివారం
ఆశ్వయుజ శుద్ధ నవమి ఘడియల్లోనే దశమి కూడా కూడి ఉండటంతో ఈనాడే దసరా పండుగ. కాబట్టి ఆశ్వయుజ శుద్ధ దశమి.. విజయదశమి/దసరా పర్వదిన తిథి. ఈనాడు జమ్మిచెట్టు వద్ద పూజలు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూరులో దసరా, ఆయుధపూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని ఈనాడు నిమజ్జనం చేస్తారు. అలాగే, విజయవాడ కనకదుర్గమ్మకు ఈనాడు వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా ఏనుగుల సంబరం జరుగుతుంది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు తిరుచానూరు పద్మావతి తాయార్ల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దశమి నాటితో ముగుస్తాయి. ఇక, విజయదశమి పర్వదిన విశేషాల్లోకి వెళ్తే.. ప్రాచీన కాలం నుంచి విజయదశమి (దసరా) ఆచరణలో ఉంది. మైసూరులో ఈనాడు గొప్ప వేడుక నిర్వహిస్తారు. అలాగే, శమీ పూజలు విశేషంగా ఆచరిస్తారు. ఈనాటితో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తిథినాడు శక్తిపూజ మహోత్క•ష్టమైనది. రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం ఈ వృక్ష దర్శనం చేసుకుంటారు. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో ఆ దేవి పూజలందుకుంటుంది. ప్రాంతాలు, ఆచారాలను బట్టి ఆయా రోజులలో అవతారాలు మారుతుంటాయి. సాధారణంగా మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి ప్రజల పూజలు అందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరింపబడే దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి.
గదాధర పద్ధతి, ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథాలలో ఈ తిథిని అపరాజితా దశమిగా పేర్కొన్నారు. ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. ఆమె పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ నిమజ్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మున్నగునవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయావిధానాలతో ప్రజలచే పూజలను పొందే శుభవాసరాలివి.
లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను లాలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన పిదపే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి
అక్టోబరు 13, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ దశమి మధ్వాచార్య జయంతి దినం. విళంబి, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. మత త్రయాచార్యులలో శ్రీమధ్వాచార్యులు ఒకరు. వైష్ణవ మత బోధకులలో వీరు అగ్రగణ్యులు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ఆయన తాను వాయుదేవుని మూడవ అవతారమని చెప్పుకునే వారు. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోజ్జీవాన్ని కలిగించారు.
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
అక్టోబరు 14, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పాశాంకుశైకాదశిగా ప్రతీతి. దీనినే పరాంకుశ ఏకాదశి అనీ అంటారు. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది అని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాపాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మాలు పెట్టాలి. వాటిలో అయిదు దీపాలు ఉంచాలి. అయిదు విధాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 14, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి సమయంలోనూ ద్వాదశి తిథి కూడా కూడి ఉంది. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి తిథి పలు విధాలుగా ప్రసిద్ధి. ఈనాడు విశోక ద్వాదశి, గోవత్స ద్వాదశి వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అఖండ ద్వాదశి, పద్మనాభ ద్వాదశి వ్రతం చేయాలని, వాసుదేవ పూజ ఆచరించాలని ఆయా గ్రంథాలలో ఉంది.
ఈనాడు ఉపవాసం ఉండాలని స్మ•తికౌస్తుభంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు.
ఆశ్వయుజ
శుద్ధ త్రయోదశి
అక్టోబరు 15, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆచరించాల్సిన, నిర్వర్తించాల్సిన ప్రత్యేకమైన పూజావిధులేమీ లేవు.
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
అక్టోబరు 17, గురువారం
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాటి వివరణలో మన పంచాంగకర్తలు కౌముద్యుత్సవం, అక్షక్రీడ, కోజాగర్తి వ్రతం, లక్ష్మీంద్ర కుబేరాది పూజ అని పేర్కొంటారు. ఈనాడు ముఖ్యంగా కౌముదీ వ్రతం ఆచరించాలని, లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రి జాగరణ చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ రాత్రి అంతా మేల్కొని ఉండటానికి అక్షక్రీడ (జూదం) అనే వినోదాన్ని కూడా ఈ వేడుకలో జోడించారు. ఇక, ఆంధప్రదేశ్‍లో ఈనాడు గొంతెమ్మ పండుగ జరుపుతారు. మాలలు ఈ దేవతను ఎక్కువగా పూజిస్తారని అంటారు. ఇందుకో కారణం కూడా ఉంది.
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుద్ధంలో మరణించిన వారికి తిలోదకాలు, తర్పణాలను ధర్మరాజు విడుస్తుండగా మధ్యలో కర్ణుని చెయ్యి వచ్చింది. ఇదేమిటని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. ‘అతను మీ అన్న. తర్పణం విడువు’ అని వ్యాసుడు చెప్పాడు.
అలాగే చేసి ధర్మరాజు ఇంటికి వచ్చి తల్లి కుంతిని నిజం చెప్పాలని బలవంతం చేశాడు. ఆమె చిన్నప్పటి తన గాథను విచారంతో చెప్పింది.
‘ఇదే విషయం ముందు చెప్పి ఉంటే కర్ణుడిని చంపకుండా ఉండేవాళ్లం కదా! ఈ తప్పునకు కారణం నువ్వే. కాబట్టి నువ్వు మాలలకు దేవతవు కమ్ము’ అని శపించాడు. ఈ సందర్భంలోనే ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు’ అని కూడా శపించాడు. ఈ కారణంగానే గొంతెమ్మ (కుంతి) మాలలకు ఇలవేల్పు అయ్యింది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఈ వ్రతం చేయదగినది.
ఇంకా ఈనాడు కోజాగౌరీ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైన వ్రతమిది. ఈనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. ఆహ్వానించిన అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచిపెడతారు. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో విశేష భాగ్యప్రదమైన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించాడట. అందుకు బదులుగా వాలఖిల్యుడు ‘కోజాగౌరీ’ వ్రతాన్ని గురించి చెప్పాడు.
ఆశ్వయుజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ దిరుగుతూ ప్రతి ఇంటి వద్దా నిలిచి పిలుస్తుందట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి అయ్యే వరకైనా మేలుకుని ఉంటారు. అర్థరాత్రి వేళ లక్ష్మి వచ్చి ప్రతి ఇంటి వద్ద ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే చల్లగా వెళ్లిపోతుందట. దాంతో ఆ ఇంటి వారికి లక్ష్మీ ప్రసన్నం లేకుండా పోతుందట.
అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి సమీపంగా ఉండే రోజున కోజాగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి ఇది శుక్ల పక్ష చతుర్దశిని కానీ, పౌర్ణమిని కానీ కృష్ణ పక్ష పాడ్యమిని కానీ పడవచ్చు. ఈ పండుగను సాయంత్రం చేయాలి. తన తొలి చూలి బిడ్డకు ఈనాడు తల్లి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ తల చుట్టూ ఒక దీపం తిప్పుతుంది. ఆపై అక్షతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవిస్తుంది. ఇది దేవవైద్యులైన అశ్వనీ కుమారుల రక్షణలో తన బిడ్డను ఉంచడానికి తల్లులు చేసే పర్వంలా దీనిని బట్టి తోస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు నారదీయ పురాణాన్ని దానం చేస్తే ఇష్టలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు.
ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి వాల్మీకి జయంతి తిథిగా ప్రసిద్ధి. రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకిని ఈనాడు ఆరాధిస్తారు. అలాగే, కృష్ణ భక్తురాలైన మీరాబాయి జయంతి దినం కూడా ఈనాడే. తులా సంక్రమణ దినమిది.
ఆశ్వయుజ బహుళ పాడ్యమి
అక్టోబరు 18, శుక్రవారం
ఆశ్వయుజ బహుళ పాడ్యమి నాడు జయావాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఆశ్వయుజ బహుళ విదియ
అక్టోబరు 19, శనివారం
ఆశ్వయుజ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరించాలని పురుషార్థ చింతామణిలో ఉంది. దీనినే అట్లతద్ది భోగి అని కూడా అంటారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు వచ్చే ముందు రోజును భోగి అని వ్యవహరిస్తారు. అంటే అట్లతదియకు
ముందు వచ్చే రోజు ఇది. ఉండ్రాళ్ల తద్ది భోగి నాటి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా తలంటి పోసుకుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు, చేతులకు పెట్టుకుంటారు. తెల్లవారుజామునే ఉట్టి కింద ముద్ద తింటారు. తాంబూలం వేసుకుని కన్యలు, మహిళలు సాయంత్రం వరకు ఆటపాటలతో గడుపుతారు. అట్లతద్ది భోగి, అట్లతద్ది పర్వాలు ఒకప్పుడు పల్లెల్లో కమనీయంగా జరిగేవి.
ఆశ్వయుజ బహుళ తదియ
అక్టోబరు 20, ఆదివారం
ఆశ్వయుజ బహుళ తదియ తిథి అట్లతద్ది పర్వం. ఈనాడు కనక గణేశ వ్రతం, లలితా గౌరీ వ్రతం, చంద్రోదయోమా వ్రతం మొదలైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. వీటిలో చంద్రోదయోమా వ్రతం అట్లతద్ది పేరుతో తెలుగునాట వ్యావహారికంలో ఉంది. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజిస్తారు. భోగి నాడు మొదలుకుని తెల్లవారి తద్ది నాడు పగటి పూజ భోజనం చేయరు. తాంబూలం మాత్రం తరచూ సేవిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. పగటి వేళలో వీలైనంత వరకు ఉయ్యాలలూగుతారు. ఈ ఉయ్యాలలను ఇళ్లలో కాక తోటల్లో, దొడ్లలో పెద్దచెట్లకు వేస్తారు. సాయంత్రం ఉమాదేవిని పూజించి, చంద్రుడిని చూసిన తరువాత అట్లు తదితర పిండి వంటలతో భోజనం చేస్తారు. ఇదీ అట్లతద్ది నాటి తెలుగు మహిళల కార్యకలాపం. ఇది అతివల పండుగ. నగర స్త్రీల కంటే పల్లెటూరి పడుచులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు. అట్లతద్ది నోము నోస్తే కన్యలకు ముసలి మొగుడు రాడని, వివాహమైన వారికి నిండు ఐదవతనం కలుగుతుందని అంటారు. అట్లతద్ది నాడు పగటి పూట భోజనం చేయరు. పొద్దు పొడిచాక స్త్రీలు అందంగా ముస్తాబై తోటలు, దొడ్ల వెంట తిరిగి సాయంకాలం తాము చేయబోయే పూజకు అవసరమైన పువ్వులు, పత్రి సమకూర్చుకుంటారు. పగలంతా వీలైనప్పుడల్లా ఊయల ఊగుతారు. ఆ సాయంత్రం ఉమాదేవి (పార్వతి)ని పూజించి చంద్రుడిని చూసి అట్లు తదితర పిండివంటలతో భోజనం చేస్తారు. ఇది అతివల పర్వం. తోటలలో, దొడ్లలో విలాసంగా తిరుగుతూ పత్రి, పువ్వులు సేకరించడం, యథేచ్ఛా విహారం, ఊయలలూగడం, వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. నగరాలలో కంటే పల్లెల్లో ఈ పండుగను మనోజ్ఞంగా జరుపుకొంటారు. తెల్లవారుజామునే చద్ది అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల ఉండ, ఉల్లిపాయ పులుసు వంటివి తినకపోయినా, అట్లతద్ది నోము నోచకున్నా, గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలి మొగుడు వస్తాడని మరీ భయపెట్టి తమ ఆడపిల్లలు ఈ నోము ఆచరించేలా ఇంట్లోని పెద్దలు చేస్తారు. గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్లకు వరణీయం. ఆషాఢంలో ఒకసారి, భాద్రపదంలోని ఉండ్రాళ్ల తద్దికి, ఆశ్వయుజంలోని అట్లతద్దికి.. ఇలా ఏడాదిలో మూడుసార్లు అతివలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది ఎంత బాగా పండితే అంత శుభప్రదమని భావిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం, పెళ్లయిన వారు భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం చేయడం తెలుగు నాట ఆచారంగా కొనసాగుతోంది.
ఆశ్వయుజ బహుళ చతుర్థి
అక్టోబరు 20, ఆదివారం
ఆశ్వయుజ బహుళ తదియ ఘడియల్లోనూ చతుర్థి తిథి కూడా కూడి ఉంది. ప్రతి నెలలోనూ వచ్చే బహుళ చతుర్థిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. ఇది వినాయక పూజకు ప్రసిద్ధి. తమ సంకటాలను తొలగించాలంటూ మహిళలు, పురుషులు ఈనాడు విఘ్నేశ్వరుడిని పూజించి, కటిక ఉపవాసం చేస్తారు.
ఆశ్వయుజ బహుళ పంచమి
అక్టోబరు 21, సోమవారం
ఆశ్వయుజ బహుళ పంచమి తిథిని గధాధర పద్ధతిలో ఘోటక పంచమిగా పేర్కొన్నారు. అయితే, ఈ పంచమి వ్రతాచరణకు సంబంధించిన వివరాలేవీ అందుబాటులో లేవు.
ఆశ్వయుజ బహుళ షష్ఠి
అక్టోబరు 22, మంగళవారం
ఆశ్వయుజ బహుళ షష్ఠి నాడు షష్టి వ్రతం ఆచరించాలి. ఇది కుమారస్వామి సంబంధమైన పూజాధికం.
ఆశ్వయుజ బహుళ సప్తమి
అక్టోబరు 23, బుధవారం
సప్తమి తిథి సూర్యారాధన తిథి. కాబట్టి ఆశ్వయుజ బహుళ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించాలి.
ఆశ్వయుజ బహుళ అష్టమి
అక్టోబరు 24, గురువారం
ఆశ్వయుజ బహుళ అష్టమి తిథి జితాష్టమిగా ప్రతీతి. ఈనాడు జీమూతవాహన పూజ చేస్తారు. ఇది స్త్రీలకు పుతప్రదాన్ని కలిగించే వ్రతం. సౌభాగ్యప్రదమైనది. సాయంకాల ప్రదోష సమయాన ఈనాడు పూజలు ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతం మిక్కిలి ఆచారంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు మంగళావ్రతం, కృత్సరా సముచ్ఛయంలో మహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. కృత్యసార సముచ్ఛయంలో ఈ అష్టమిని జీవత్పుత్రికాష్టమీ అని పేర్కొన్నారు. అంటే పుత్ర సంతానాన్ని కలిగించే వ్రతమని ప్రతీతి. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని కాలాష్టమిగా వ్యవహరించారు. ప్రతి నెలలో వచ్చే అష్టమి నాడు కాలభైరవుడిని పూజించాలని అంటారు. కాలభైరవుడు కాశీ విశ్వేశ్వర క్షేత్ర పాలకుడు.
ఆశ్వయుజ బహుళ నవమి
అక్టోబరు 25, శుక్రవారం
ఆశ్వయుజ బహుళ నవమి నాడు రథ నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాపూజ చేయాలని వ్రత విధానంలో ఉంది. వివిధ వ్రత గ్రంథాలలో ఈ పూజా విధానం గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు.
ఆశ్వయుజ బహుళ దశమి
అక్టోబరు 26, శనివారం
ఆశ్వయుజ బహుళ దశమి నాడు దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు.
ఆశ్వయుజ బహుళ ఏకాదశి
అక్టోబరు 27, ఆదివారం
ఆశ్వయుజ బహుళ ఏకాదశి తిథిని రమైకాదశిగా ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తి పొందాడని ప్రతీతి. కొన్ని గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జన్మించిన రోజు అని ఉంది. బోయి కులస్తులు కొన్ని ప్రాంతాలలో వాల్మీకి జయంతిని ఈనాడు కూడా నిర్వహిస్తారు. ఏకాదశి తిథి అక్టోబరు 28, సోమవారం కూడా కొనసాగుతుంది.
ఆశ్వయుజ బహుళ ద్వాదశి
అక్టోబరు 29, మంగళవారం
ఆశ్వయుజ బహుళ ద్వాదశి తిథి ధన్వంతరి జయంతి దినం. ధన్వంతరి గొప్ప వైద్య విద్యావేత్త. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అది ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు జరిగిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. భరద్వాజుని వద్ద ధన్వంతరి శిష్యరికం చేసి ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాడని ప్రతీతి. దివోదాసు పేరుతో ఆయన కాశీకి రాజయ్యాడని కూడా పురాణ కథనం. ఒక చేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం వల్ల అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం. ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి పూజ చేసే వారికి రోగ భయం ఉండదని చెబుతారు. ఇక, ఇదే రోజును దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాఘ్ర ద్వాదశిగా కూడా జరుపుకొనే ఆచారం ఉంది. గుజరాతీలు దీనిని ‘వాగ్‍బరాస్’ అంటారు. అక్కడి వాగ్ బరాస్ నాటికి దీపావళి మూడు రోజులు ఉంటుంది. దీపావళి పండుగ గుజరాతీయులకు కొత్త సంవత్సరాది. మాళవ దేశ మహిళలు గోవత్స ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దూడతో కూడిన ఆవును పూజించడం వారి ఆచారం. ఈ పూజ శిశువు క్షేమార్థం నిర్వహిస్తారని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి
అక్టోబరు 30, బుధవారం
ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన త్రయోదశి పర్వం. తెలుగు రాష్ట్రాల్లో ధన త్రయోదశిని మరో విధంగా జరుపుకుంటారు. ధన్‍తేరస్‍గా కూడా దీనిని వ్యవహరిస్తారు. ఈనాడు ఎంతో కొంత మొత్తంలో బంగారం కానీ, కనీసం వెండినైనా కానీ కొనాలనే ఆచారం ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. వర్తక, వ్యాపారాలు మంచి లాభసాటిగా కొనసాగుతాయి. ఇక, తెలుగు నాట ఇళ్లలో లక్ష్మీపూజ కూడా ఈనాడు ఆచరిస్తారు. దీపావళికి ముందు ఈ పుణ్యతిథి వస్తుంది.
ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథం ఈ రోజును ధన త్రయోదశి అంటోంది. త్రయోదశి అనగా పదమూడో తిథి. పాశ్చాత్యుల్లో 13 అంకె మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ, భారతీయ సంప్రదాయంలో ఇది మంచి తిథి. ఈ రోజు పూజలు ఆచరిస్తే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ధన త్రయోదశి రోజు శుచిగా, శుభ్రంగా ముస్తాబై ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాల్ని పాలతో కడుగుతారు. ఇక, మాళవ దేశంలో ఈ రోజున వర్తకులు తమ లెక్కలు సరి చూసుకుంటారు. ఈనాడు యమలోకంలోని పితరులు తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ధన త్రయోదశి నాడు సాయంత్రం వారు తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితరులకు అది దారి చూపుతుందని నమ్ముతారు. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. ఈనాడు గోత్రిరాత్ర వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి
అక్టోబరు 31, గురువారం
తెలుగు క్యాలెండర్లు, పంచాంగాల ప్రకారం నరక చతుర్దశి, దీపావళి ఈ ఏడాది ఒకే తేదీన చూపుతున్నారు. అలాగే కొన్ని పంచాంగాల్లో వేరే తేదీలు చూపుతున్నారు. ఇక ఈ తిథి విశేషాల్లోకి వెళ్తే ఏ చతుర్దశి నాడు అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి అని పేరు. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈనాడు నరకముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి – చతుర్దశి తిథుల మధ్య కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆచారం. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన దినం కావడం వల్లనే దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని చెబుతారు. కానీ, వ్రత గ్రంథాలను బట్టి చూస్తే నరకాసురునికి, నరక చతుర్దశికి సంబంధం లేదని తెలుస్తోంది. నరకం నుంచి ఉద్ధరించేదే నరక చతుర్దశి అని శాస్త్ర వచనం. ఈనాడు అభ్యంగన స్నానం చేసిన అనంతరం యముడికి తర్పణం చేయాలి. తర్పణం చేసేటప్పుడు ఉత్తరేణి ఆకుల్ని తలపై ఉంచుకోవాలి. ఇది పద్నాలుగవ (చతుర్దశి) తిథి. కాబట్టి యముడిని పద్నాలుగు నామాలతో అర్చించాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచారు.
ఇక, ఆశ్వయుజ కృష్ణ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. దీపమాలికలతో లక్ష్మికి నీరాజనం ఇచ్చే దినం కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. నరకలోక వాసుల కోసం దీప + ఆవళి కల్పించే దినం కాబట్టి దీపావళి అయ్యింది. హిందూమత సంస్క•తికి, హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నమని చెప్పాలి. ఈ తిథికి ఉన్న విశేషాలివీ..
రాక్షస రాజైన బలి చక్రవర్తి పాతాళానికి విష్ణువునే అణగదొక్కబడిన దినం కావడం చేత ఇది ఒక మహోత్సవ దినంగా మారింది.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కాబట్టి మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. రాముడు రావణుడిని సంహరించి ఈనాడే అయోధ్యకు తిరిగి వచ్చాడట. ఆనాడు భరతుడితో సమావేశమై రాజ్యం గురించి చర్చించాడట. అందుకే ఇది ఉత్తరాదిలో ‘భరత్ మిలాప్’గా ప్రసిద్ధి చెందింది.
ఇక, విక్రమ శక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం పొందిన దినం కూడా ఇదే.
పైన ఉదహరించిన వాటిలో బలి చక్రవర్తి కథ తప్ప మరేదీ దీపావళి వ్రత గ్రంథాలలో లేదు. నరకుని వథతో ఆనందపరవశులైన జనులు టపాసులు కాల్చి దీపావళిని జరుపుకున్నారని ప్రస్తుతం మిగుల ప్రచారంలో ఉన్నా.. ఆ వివరాలు దీపావళి వ్రత గ్రంథాలలో లేకపోవడం విశేషం.
దీపావళి నాటి రాత్రి చేసే లక్ష్మీపూజ పుణ్యప్రదమైనది. ఈనాడు లక్ష్మీదేవి భూలోకానికి దిగి వచ్చి ఇల్లిళ్లూ తిరుగుతుందని, శుభ్రంగా ఉన్న ఇంటిలో తన కళను ఉంచి వెళ్తుందని విశ్వాసం. అందుచే భారత స్త్రీలు ఈనాడు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, నగలు, నాణేలు ఉంచుతారు. లక్ష్మీపూజ అనంతరం ఆనాటి రాత్రి ఇక నిద్రపోకూడదు. జూదం మొదలైన క్రీడలలో పర్యాప్తులూ మేలుకొని ఉండాలని శాస్త్ర వచనం. ఇలా పవిత్రంగా పూజ జరిగింది కాబట్టి లక్ష్మి ప్రసన్నురాలై ఆ ఇంట ప్రవేశిస్తుంది. లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో అలక్ష్మికి స్థానం లేదు. కాబట్టి అక్కడి నుంచి అలక్ష్మి వెళ్లిపోతుంది.
మహారాష్ట్ర, గుజరాత్‍లలో దీపావళి ఐదు రోజుల పర్వం. దీపావళి అనగా దీపాల సమూహమని అర్థం.
ఈనాడు విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి అణచివేసి అతని కారాగారంలో ఉన్న దేవతలను విడుదల చేశాడు. అలా విడుదల చేసిన ఆ దేవతల్ని ఆయన లక్ష్మితో పాటు క్షీరసాగరానికి తీసుకువెళ్లాడు. ఆ దేవతలు చాలా కాలం అక్కడే ఉండిపోయారు. దేవతలు బలి ఖైదు నుంచి విడుదలై లక్ష్మితో క్షీరసాగరానికి చేరి పొందిన ఆనంద దినాలకు స్మారకంగా ఈ పండుగ ఏర్పడింది. ఈ పండుగ లక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. కావునే దీపావళి పర్వ సందర్భంలో లక్ష్మీపూజ ప్రధాన కార్యమై ఉంటుంది. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. నెయ్యి లేక నూనె, పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగించాలి. దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే, చప్పుడు చేసే, బాణాసంచా కాల్చడం సంప్రదాయం.
మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండే పితరులు ఈనాడు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళ్తారు. వారికి వెలుతురు చూపడం నిమిత్తం నరకలోక వాసులు చేతులతో కాగడాలు పట్టుకుని ఆకాశం వైపు చూపాలని శాస్త్ర వచనం. ఆ కాగడాలే నేడు దీపావళి పండుగలో మతాబులు, ఇతర టపాసులు కాల్చడంగా మారింది.
నరక చతుర్దశి నాడు కానీ, దీపావళి అమావాస్య నాడు కానీ స్వాతీ నక్షత్రం వస్తే ఉత్తమ యోగమని మన పెద్దలు అంటారు.
దీపావళి అమావాస్య మొదలు నెల రోజులు అనగా, మళ్లీ అమావాస్య వరకు ఇంటి వెలుపల ఆకాశదీపం ఉంచే వారికి అనంత పుణ్యమని శాస్త్ర వచనం.
మన పెద్దలు కొన్ని పండుగలకు కొన్ని కొన్ని ఆకులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ రుతువుకు ఆ ఆకుల వాడకం ఆరోగ్యదాయినిగా ఉంటుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వేప పువ్వు, చైత్ర శుద్ధ అష్టమి నాడు అశోక కలికా ప్రాశనం, మకర సంక్రాంతికి బూడిద గుమ్మడి ఆకులు, రథసప్తమికి చిక్కుడాకులు, దీపావళి నాడు మాష పత్రాలకు మన పెద్దలు పెట్టపీట వేశారు. మాష పత్రాలు అంటే మినప ఆకులు. ఈనాడు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి ఐదు రోజుల పర్వంగా కొనసాగుతోంది.
Review ఆశ్వయుజం..‘అపరాజితం’.