ఈ శుభ మాసంలో..

ఆంగ్లమానం ప్రకారం ఎనిమిదవ మాసం ఆగస్టు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ (అధిక)- శ్రావణ మాసాల కలయిక. ఈసారి శ్రావణం అధికమాసంతో కూడి వచ్చింది. పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఇలా జంట శ్రావణ మాసం అధిక మాసంతో కూడి వస్తుంది. ఆగస్టు 16, బుధవారం వరకు శ్రావణ (అధిక) మాస తిథులు, ఆపై ఆగస్టు 17, గురువారం, శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ మాస తిథులు కొనసాగుతాయి. అధిక మాసం సమయంలో గృహ ప్రవేశాలు, ఇతరత్రా శుభకార్యాలేవీ తలపెట్టరు. ఆగస్టు 17 నుంచి మొదలయ్యే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, రాఖీ పండుగ వంటివి ప్రధాన పర్వాలు..

2023- ఆగస్టు 1, మంగళవారం, శ్రావణ (అధిక) శుద్ధ పౌర్ణమి నుంచి
2023- ఆగస్టు 31, గురువారం, శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు..

శ్రీశోభకృతు నామ సంవత్సరం-శ్రావణం (అధిక)- శ్రావణం-వర్షరుతువు-దక్షిణాయణం

శ్రావణ మాసానికి శుభ మాసమనీ, నభో (ఆకాశ) మాసమనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా వర్ష రుతుకాలం. నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ శుభ శ్రావణంలో ప్రతి రోజూ పండుగే. ఈ మాసంలో చేపట్టే ఎలాంటి పనికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అటు విష్ణుమూర్తి – లక్ష్మీదేవి దంపతులకు, ఇటు శివపార్వతులకు మిక్కిలి ప్రీతికరమైన మాసమిది. మహా విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం. కాబట్టి ఈ మాసం విష్ణు, లక్ష్మి పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా అనువైనవి కాదంటారు. కానీ, శ్రావణ మాసంలో మాత్రం ఈ తిథులు కూడా పూజలు, శుభకార్యాలు తలపెట్టేందుకు అనువైనవి. అందుకే శ్రావణ మాసాన్ని శుభప్రదమైన మాసమనీ అంటారు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు.

ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇంకా, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు.. ఆయా తిథుల్లో ఆచరించాల్సిన ముఖ్య విధుల గురించి..

శ్రావణ శుద్ధ పౌర్ణమి (అధిక)
ఆగస్టు 1, మంగళవారం

ఆగస్టు మాసపు తొలి రోజు ఇది. అధిక మాసం కావడం వలన ఈనాడు ఆచరించదగిన ప్రత్యేక పూజాదులేవీ లేవు.

శ్రావణ బహుళ పాడ్యమి (అధిక)
ఆగస్టు 2, బుధవారం

ఈనాడు మన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి దినం. ఈయన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. 1876, ఆగస్టు 2న జన్మించారు. 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలో చోటుచేసుకున్న వివిధ ఘట్టాలలో ఈయన పాల్గొన్నారు. తొలిసారి ఈయన రూపొందించిన జాతీయ పతాకాన్ని 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‍ సమావేశంలో ఎగురవేశారు. 1947, జూలై 22న భారత రాజ్యాంగసభలో జాతీయ జెండా గురించి తీర్మానాన్ని ఆమోదించారు. ఈయన రూపొందించిన మునుపటి త్రివర్ణ పతాకంలో రాట్నం ఉండేది. దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు.

శ్రావణ బహుళ విదియ (అధిక)
ఆగస్టు 3, గురువారం

ఆగస్టు 3 నుంచి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఈ కార్తె కాలంలో కురిసె వాన ఆరోగ్యప్రదమైనదని నానుడి.

శ్రావణ బహుళ తదియ (అధిక)
ఆగస్టు 4, శుక్రవారం

ఈనాడు సంకష్టహర చతుర్థి. తెలుగు పంచాంగాల ప్రకారం ఈ చతుర్థి తిథి వరుసగా రెండు రోజులలో ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.47 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 5వ తేదీ శనివారం మధ్యాహ్నం 3.32 గంటల వరకు సంకష్టహర చతుర్థి తిథి సమయం కొనసాగుతుంది. ఈనాడు పూజలందుకునే ప్రధాన దైవం గణపతి. సంకటాలను హరించాలని ఆయనను విశేషంగా ఆరాధిస్తారు.

శ్రావణ బహుళ పంచమి (అధిక)
ఆగస్టు 6, ఆదివారం

ఈనాడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. జీవితంలో చేదోడు వాదోడుగా ఉండే స్నేహితులను పరస్పరం గౌరవించుకోవడానికి, స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఉద్దేశించిన రోజిది. 1935లో యునైటెడ్‍ స్టేట్స్ కాంగ్రెస్‍ ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఇది ఏటా ఈ రోజున జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

శ్రావణ బహుళ అష్టమి (అధిక)
ఆగస్టు 8, మంగళవారం

ఈ తిథి నాటి నుంచి శుక్ర మౌడ్యమి ప్రారంభమవుతుంది. దీనినే మూఢమి లేదా మూడం అనీ అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించరు. బృహస్పతి లేదా గురు గ్రహం, శుక్రుడు, సూర్యుడి సమీపంలో ఉన్నపుడు మూఢమి సంభవిస్తుంది. ఆ సమయంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం తన శక్తిని కోల్పోతుంది. గ్రహ చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది. గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నపుడు గురు మూఢమి, శుక్ర గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నపుడు శుక్ర మౌడ్యమి సంభవిస్తాయి. గ్రహం తన సహజమైన బలాన్ని ఈ కాలంలో కోల్పోవడం వలన ఆ సమయం మనకు హానికరం లేదా అశుభం అవుతుందని అంటారు. శుక్ర మూఢమి సమయంలో నిశ్చితార్థాలు, వివాహాలు, ఉపనయనం, శంకుస్థాపనలు లేదా భూమిపూజలు, నవగ్రహ శాంతి పూజలు, భూమి రిజిస్ట్రేషన్లు, ఇల్లు ఇతరత్రా కొత్తవి, పాతవి అమ్మకాలు, కొనుగోళ్లు, యజ్ఞాలు, నామకరణం, అక్షరాభ్యాసం వంటివి చేయరాదని అంటారు.

శ్రావణ బహుళ ఏకాదశి (అధిక)
ఆగస్టు 12, శనివారం

ఈనాడు పరమ ఏకాదశి పర్వం. దీనినే పర్వ ఏకాదశి అని కూడా అంటారు. అధిక మాసం వచ్చినపుడు కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు జరుపుకునే పర్వమిది. అధిక మాసం అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అదనపు చంద్రమాసం. చాలా సందర్భాలలో అధిక మాసం ఆషాఢంలో వస్తుంటుంది. అయితే, పందొమ్మిది సంవత్సరాల తరువాత ఈసారి అధిక మాసం శ్రావణ మాసంలో వచ్చింది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ఆషాఢ అధిక మాస ఏకాదశి అనీ, శ్రావణంలో వస్తే శ్రావణ అధిక మాస ఏకాదశి అనీ అంటారు. ఇది విష్ణువుకు సంబంధించిన ఏకాదశి పర్వం. కాబట్టే ఈ ఏకాదశిని ‘పురుషోత్తమ కమల ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ ఏకాదశిని ఆచరించడం వలన భౌతిక పురోభివృద్ధి కలుగుతుందని, జీవితకాలంలో చేసే పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు. అన్ని ఏకాదశుల మాదిరిగానే ఈనాడూ ఉపవాసం ఉంటారు. ఈనాడు ఉప్పు వాడకుండా తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. దశమి నాటి నుంచి, అంటే ఏకాదశికి ముందు రోజు ప్రారంభించి, ఏకాదశి మర్నాడు వచ్చే ద్వాదశి నాడు ఈ ఉపవాస విధి ముగుస్తుంది. విష్ణువు విగ్రహాన్ని పూలు, తులసి ఆకులు, పండ్లు, ధూపంతో ఈనాడు పూజించడం ఆనవాయితీ. అలాగే, ఈ తిథి నాడు విష్ణు సహస్ర నామాలను పఠించడం, విష్ణు పురాణం చదవడం మంచిదని అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు ‘పరమ ఏకాదశి వ్రత కథ’ను కూడా చదవాలి. సాయంసంధ్య వేళ విష్ణువు ఆలయాలను సందర్శిస్తారు. రాత్రంతా భజనలు, కీర్తనలతో గడుపుతారు.

శ్రావణ బహుళ ద్వాదశి (అధిక)
ఆగస్టు 13, ఆదివారం

ఈనాడు ప్రదోష వ్రత దినం. ఇది ముఖ్యంగా శివారాధనకు సంబంధించినది. శివుడికి పుష్ప నైవేద్యాలు, పండ్లు, ధూప ద్రవ్యాలను సమర్పించాలి. దైవాన్ని బిల్వ ఆకులతో అభిషేకించాలి. శివుడి 108 నామాలను పఠిస్తూ, శివలింగంపై నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి పోస్తారు.

శ్రావణ బహుళ త్రయోదశి (అధిక)
ఆగస్టు 14, సోమవారం

ఈనాడు మాస శివరాత్రి. సోమవారం కూడా కలిసి వచ్చినందుకు ఇది శివుడికి ప్రీతికరమైన తిథి. ఇది శివుడికి సంబంధించిన తిథి అయినందున, ఈ తిథిని మాస శివరాత్రి తిథి అన్నారు. శివరాత్రి అంటే లింగోద్భవ కాలం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

శ్రావణ బహుళ చతుర్దశి (అధిక)
ఆగస్టు 15, మంగళవారం

ఈనాడు భారత స్వాతంత్య్ర దినోత్సవం. 1947, ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అందుకే ఏటా ఈ రోజున జాతీయ పతాకాలను ఆవిష్కరించి, గౌరవ వందనాలను సమర్పిస్తారు. ఇక, ఇదే రోజు అరవింద యోగి జన్మతిథి. ఈయన 1872, ఆగస్టు 15న పశ్చిమబెంగాల్‍లో జన్మించారు. సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఈయన పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఈయనే. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఈయన అలీపూర్‍లోని కారాగారంలో శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులయ్యారు. యోగ, భగవద్గీతపై ఈయన పలు గ్రంథాలను రచించారు. ‘ది లైఫ్‍ డివైన్‍’ అనేది అరవిందుల ప్రసిద్ధ గ్రంథం.

శ్రావణ బహుళ అమావాస్య (అధిక)
ఆగస్టు 16, బుధవారం

ఈనాడు కుశ గ్రహణంగా పంచాంగాలలో పేర్కొన్నారు. ‘కుశ’ అంటే దర్బ అని అర్థం. గ్రహణ సమయాలలో దర్బలను వినియోగించడం మన సంప్రదాయం. ఇదే రోజు పోలా వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ అమావాస్య తిథిని పోలాల అమావాస్య తిథి అనీ, ఈనాడు ఆచరించే కార్యాన్ని పోలా వ్రతమనీ అంటారు. సంతానప్రాప్తికీ, సంతానం రక్షణకు ఉద్దేశించినదీ వ్రతం. ఈనాడు పూజలందుకునే దేవత పోలాంబ. తెలుగు నాట, తెలంగాణ పల్లెల్లో ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. రైతులు కూడా ఈ పండుగ విధుల్లో పాల్గొంటారు.

శ్రావణ శుద్ధ పాడ్యమి
ఆగస్టు 17, గురువారం

ఈనాటితో శుక్ర మౌడ్యమి కాలం ముగిసిపోతుంది. అధిక మాసం ముగిసి, సిసలైన శ్రావణ మాసం ఆరంభమవుతుంది. శ్రావణ మాసపు తిథుల్లో మొదటిది శ్రావణ శుద్ధ పాడ్యమి. ఆగస్టు 17వ తేదీ నుంచి శ్రావణ మాస తిథులు ఆరంభమవుతాయి. అమావాస్యకు మరుసటి దినం కావడంతో ఈనాటి నుంచి తిరిగి చంద్ర దర్శనం. ఈనాటి నుంచి శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల్లో ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవ అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలకే ‘పవిత్రం’ అని మరో పేరు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. దీనినే• పవిత్రారోపణోత్సవ పక్రియ అంటారు.

శ్రావణ శుద్ధ విదియ
ఆగస్టు 18, శుక్రవారం

శ్రావణ శుద్ధ విదియ నాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది. మనోరథం అంటే మనసులో తలచిన కోరిక. అది తీర్చే తిథి మనోరథ ద్వితీయ. శ్రావణ మాసపు తొలి శుక్రవారం కావడం మూలాన ఈనాడు లక్ష్మీదేవి పూజలు విశేషంగా జరుగుతాయి. ఈ శుక్రవారం తరువాత వచ్చే మలి శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతంగా నిర్వహించుకుంటారు.

శ్రావణ శుద్ధ తదియ
ఆగస్టు 19, శనివారం

శ్రావణ శుద్ధ తదియ నాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్ఛయం అనే వ్రత గ్రంథం చెబుతోంది. అందులో ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అలాగే, పంచాంగాలలో ఈనాడు స్వర్ణగౌరీ వ్రతంగా ఆచరించాలని ఉంది. అనోన్య దాంపత్యాన్ని కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించి, పదహారు ముడులు కలిగిన తోరమును మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడమ చేతికి లేదా మెడలో కట్టుకోవడం ఈనాటి ప్రధాన విధాయ కృత్యం. ఈ వ్రతాన్ని గురించి శివుడు తన దేవేరి అయిన పార్వతికి చెప్పాడని అంటారు. ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఓ రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ నదీతీరాన మహిళలంతా గుమికూడి ఉంటారు. అక్కడేం చేస్తున్నారని రాజు అడుగుతాడు. స్వర్ణగౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని మహిళలు బదులిస్తారు. ఈ వ్రతకథ చెప్పాలని ఆయన కోరగా, వారు చెబుతారు. దీంతో ఆయన తన రాజమందిరానికి చేరుకుని తన భార్యలకు ఈ వ్రత విశేషం గురించి చెబుతాడు. ఆ ఇద్దరి భార్యలలో పెద్దావిడ వ్రతాన్ని పట్టించుకోకపోగా, హేళన చేస్తుంది. రెండో భార్య మాత్రం శ్రద్ధగా వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రతాన్ని నిర్లక్ష్యం చేసిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. చిన్న భార్య మాత్రం వ్రతాచరణ ఫలంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవిస్తుంది. గౌరీదేవి అంటే పార్వతీదేవి.

శ్రావణ శుద్ధ చతుర్థి
ఆగస్టు 20, ఆదివారం

శ్రావణ శుద్ధ చతుర్థి నాడు సాధారణంగా గణేశ పూజలు విశేషంగా జరుగుతాయి. ఈనాడు ఆచరించే పూజనే చతుర్థి వ్రతం లేదా దూర్వా గణపతి వ్రతం అని అంటారు. ఇక, శ్రావణ శుద్ధ చతుర్థి.. నాగ చతుర్థిగా ప్రతీతి. ముఖ్యంగా తెలంగాణలో నాగుల పూజ ఈ నాగ చతుర్థి నాడే విశేషంగా జరుగుతుంది. పుట్టల వద్ద పూజలు చేస్తారు. ఆంధప్రదేశ్‍లో మాత్రం ఈ తిథి మర్నాడు వచ్చే నాగ పంచమి నాడు నాగుల పండుగ జరుపుకుంటారు.

శ్రావణ శుద్ధ పంచమి
ఆగస్టు 21, సోమవారం

శ్రావణ శుద్ధ పంచమి తిథి నాగపంచమిగా ప్రసిద్ధి. నాగుల పూజలు విశేషంగా జరుగుతాయి. అయితే, ఇది తెలంగాణలో మాత్రమే ఎక్కువ ఆచరణలో ఉంది. ఆంధప్రదేశ్‍లో మాత్రం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను పూజించడం ఆచారంగా వస్తోంది. పంచమి నాటి పూజను ‘నాగ పంచమి’ అనీ, చవితి నాటి పూజను ‘నాగుల చవితి’ అనీ అంటారు. నాగ పంచమి గురించి హేమాద్రి స్కాంద పురాణంలో ఉంది. అందులో శివుడు పార్వతితో ఇలా చెప్పాడు.
‘ఓ పార్వతీ! శ్రావణ మాసాన శుక్ల (శుద్ధ) పంచమి నాడు ద్వారములకు రెండు పక్కలా పేడతో సర్ప చిత్రములను గీసి పూజించాలి. చతుర్థి నాడు ఒక్క పొద్దు ఉండి, పంచమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఐదు పడగల పామును చేయించాలి. లేక పసుపుతో కానీ, చందనంతో కానీ ఐదు లేక ఏడు పాముల చిత్రములు గీయాలి. విధిప్రోక్తంగా పంచామృతంతోనూ, గన్నేరు, సంపెంగ, జాజి మున్నగు పూవులతోను ఈ నాగపంచకమును పూజించాలి. పిదన ఘృతపాయసమోదకములతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. పిదన అనంతాది నాగరాజులను ధ్యానించాలి. నాగులను ఎప్పుడూ భక్తితో పూజించాలి. పంచమి నాడు పాలు, పాయసాలను నైవేద్యంగా పెట్టాలి. ఆనాడు పగలు కానీ, రాత్రి కానీ భూమిని తవ్వరాదు’’.
ఇవీ శ్రావణ శుద్ధ పంచమి నాటి నాగుల పంచమి విధాయకం గురించి శివుడు పార్వతికి చెప్పిన వివరాలు.
శ్రావణ శుద్ధ పంచమి నాడు స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఈనాటి ఆచారం. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి నాడు భూమి దున్నకూడదని అంటారు. ఈ పంచమినే గరుడ పంచమి అని కూడా అంటారు.
నాగపంచమి నాడు ప్రజలు శిరస్నానం చేసి ఉదయాన్నే సర్ప విగ్రహాలకు పాలు, కొబ్బరి, పాయసం నైవేద్యం పెట్టాలి. పిదప పుట్టల వద్దకు వెళ్లి పత్తితో వస్త్రములు వంటివి, యజ్ఞోపవీతముల వంటివి చేసి పుట్టలను అలంకరించి పూజించాలి. పుట్టలలో పాలు పోసి ప్రదక్షిణ నమస్కారములు చేయాలి. ప్రతి గ్రామంలో వేపచెట్టు మూలము వద్దో, అశ్వత్థ మూలం వద్దో నాగ విగ్రహాలు ఉంటాయి. వాటికి నాగపంచమి నాడు పూజలు జరుగుతాయి. బాలబాలికలు కొబ్బరి గిన్నెలను చిత్ర విచిత్రంగా అలంకరించి వాటి మధ్యలో బెజ్జము వేసి రెండు దారములు కట్టి తిప్పుట కొన్ని ప్రాంతాలలో ఆచారం. సాయంకాలం తోటలకో, ఊరి బయట అడవులకో వెళ్లి చెట్ల కొమ్మలకు తాళ్లు వేలాడగట్టి ఉయ్యాలలూగుతారు. ఈనాడు స్త్రీ, పురుషులు చాలా ఆత్మీయతతో ప్రవర్తిస్తారు.

శ్రావణ శుద్ధ షష్ఠి
ఆగస్టు 22, మంగళవారం

శ్రావణ శుద్ధ షష్ఠి నాటి నుంచే మంగళగౌరీ వ్రతాలు ఆరంభమవుతాయి. ఇది శ్రావణ మాసపు తొలి మంగళవారం. శ్రావణ మాసంలో వచ్చే ఈ తొలి మంగళవారం నుంచే శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తారు. ఈ నెల పొడవునా వచ్చే ప్రతి మంగళవారం తను సౌభాగ్యవతిని కావాలని పడుచులు, మంచి మగడిని పొందాలని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
అలాగే, శ్రావణ శుద్ధ షష్ఠి నాడు కల్కిజయంతి నిర్వహించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉన్నాయి. అలాగే ఈనాడు స్కందషష్ఠి పర్వం కూడా. కుమారస్వామి పూజకు ఈ తిథి ఉద్ధిష్టమైనది.

శ్రావణ శుద్ధ సప్తమి
ఆగస్టు 23, బుధవారం

శ్రావణ శుద్ధ సప్తమి తిథి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం).
‘రామచరిత మానస్‍’ రచించిన తులసీదాస్‍ జయంతి తిథి కూడా ఈనాడే.

శ్రావణ శుద్ధ అష్టమి
ఆగస్టు 24, గురువారం

శ్రావణ శుద్ధ అష్టమి పుష్పాష్టమిగా ప్రతీతి. దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి తిథి అనుకూలమైనది. ఇది దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు.

శ్రావణ శుద్ధ నవమి
ఆగస్టు 25, శుక్రవారం

ఈ శుక్రవారమే వరలక్ష్మీ వ్రతారంభ దినం. సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం.. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి.. ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు. ఈ లక్షణాలను ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు. ఇవన్నీ ప్రాకృతిక శక్తులు. పరమేశ్వరుడి నుంచి వ్యక్తమయ్యే శక్తి విశేషాలే అని భక్తులు విశ్వసిస్తారు. నిజానికి ఈ లక్షణ శక్తులే అసలైన ఐశ్వర్యాలు. ఈ ఐశ్వర్య రూపాలైన లక్షణ శక్తుల సమాహార స్వరూపమే ‘లక్ష్మీదేవి’.
సనాతన ధర్మంలోని ఈ లక్ష్మీ భావన- ప్రకృతి రూపంలో గోచరించే పరమాత్మ విభూతిగా ఆరాధన అందుకుంటోంది. విజ్ఞులు మరో కోణంలో దీనికి శాస్త్రపరంగా గల అర్థాన్ని వివరించారు.
జగతిలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు గల అన్నింటినీ రక్షిస్తూ (గమనిస్తూ), ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఇవ్వాలో నిర్ణయించి అనుగ్రహించే శక్తినే వారు ‘లక్ష్మి’గా నిర్వచించారు.
ఈ శక్తికే ‘శ్రీ’ (సిరి) అనే మరో పేరుంది. ఇదే నామాన్ని శాస్త్రాలు ఒక మహా వ్రతంగా భావిస్తున్నాయి. సృష్టి, స్థితి, లయలను నిర్వహించే పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ ఆశ్రయం అత్యంత ప్రత్యేకం. ఇది సూర్యుడిని ఆశ్రయించిన కాంతి. చంద్రుని ఆశ్రయించిన చంద్రిక వంటిది. భగవంతుడిని ఎన్నడూ ఎడబాయని ఆయన చిచ్ఛక్తి (చిత్‍, శక్తి)నే ‘శ్రీ’గా పరిగణిస్తారు. ఆ శక్తే మానవాళి పాలిట ఆశ్రయం.
మానవాళికి ఆధారమయ్యే శక్తి, పరమాత్మను ఆశ్రయించుకున్న శక్తి.. ‘శ్రీ’. ‘లక్షణ శక్తి’యే ఈ శ్రీ. ఈ శబ్దానికి నిఘంటుపరంగా శోభ, కాంతి, కళ, జ్ఞానం, విద్య అనే అర్థాలున్నాయి. ఈ అర్థాలన్నింటి ఏక రూపమే శ్రీలక్ష్మి. ప్రతి వారు భక్తిపూర్వకంగా కోరుకునేది ఈ లక్ష్మినే. ‘వరం’ అనే మాటకు ‘కోరుకునేది’ అని అర్థం. అందుకే ఈ తల్లిని ‘వరలక్ష్మి’గా పిలుస్తారు.
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’ (శుక్ర)వారం నాడు ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ‘ఆర్థ్రత’కు ప్రధానమైన వర్ష రుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్ల పక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ‘ఆర్ధ్రాం పుష్కరిణీం..’ అని శ్రీసూక్తం వర్ణించిన ఆర్ధ్ర శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతోంది. అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మంగా భాసిల్లుతోంది. స్త్రీ మూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంతి, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రత కథలో సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుందని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సంపదలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం.
ఇక, శ్రావణ శుద్ధ నవమి.. మరో విధంగానూ విశేషమై ఉంది. కౌమార దశలో ఉన్న బాలికలు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి. అందుకే ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్‍’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న యువతులు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.

శ్రావణ శుద్ధ దశమి
ఆగస్టు 26, శనివారం

శ్రావణ శుద్ధ దశమి తిథి ఆశా దశమిగా ప్రసిద్ధి. మనసులో సంకల్పించే ఆశలన్నిటినీ తీర్చేది కాబట్టి ఇది ఆశా దశమి అయ్యింది. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని అంటారు. ఈనాటి పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలని నియమం.

శ్రావణ శుద్ధ ఏకాదశి
ఆగస్టు 27, ఆదివారం

మహిజిత్తు అనే అతడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి ఇది పుత్రదైకాదశి అయింది. ఈ మేరకు ఈ వ్రతం వివరాలు ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉన్నాయి. సంతానం లేని వారు, సత్సంతానం కావాలనుకునే వారు ఈ ఏకాదశి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఏకాదశినే మతత్రయ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు.

శ్రావణ శుద్ధ ద్వాదశి
ఆగస్టు 28, సోమవారం

శ్రావణ శుద్ధ ద్వాదశి తిథినే దామోదర ద్వాదశి అనీ అంటారు. ఈనాడు విష్ణు ప్రతిమను దానం చేయడం ఆచారం. ఈ పూజా పక్రియనే శ్రీధర పూజగానూ వ్యవహరిస్తారు.

శ్రావణ శుద్ధ త్రయోదశి
ఆగస్టు 29, మంగళవారం

శ్రావణ శుద్ధ త్రయోదశి తిథి నాడు శనీశ్వరుడిని విశేషంగా పూజిస్తారు. ఆయనకు ప్రీతికరమైన నువ్వులు, నువ్వుల నూనెతో పూజించాలి. అలాగే, ఈ తిథిని అనంగ త్రయోదశి అని కూడా అంటారు. అనంగుడు అంటే మన్మథుడు. శ్రావణ శుద్ధ త్రయోదశి ఆయనకు ప్రీతికరమైనది. అందుకే ఈనాడు అనంగ వ్రతం చేయాలని, రతీ మన్మథులను పూజించాలని వ్రత గ్రంథాల్లో ఉంది. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. ఈనాడు ఆయనకు పవిత్రారోపణం చేయాలి.

శ్రావణ శుద్ధ చతుర్దశి
ఆగస్టు 30, బుధవారం

శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు శివునికి పవిత్రారోపణం చేయాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక ఆయా వ్రత గ్రంథాలలో నిర్దేశించిన పరిమాణం మేరకు దర్భలు వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అని అంటారు.

శ్రావణ శుద్ధ పూర్ణిమ
ఆగస్టు 31, గురువారం

శ్రావణ శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా విశేషమై ఉంది. ఇది పౌర్ణమి తిథి. శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. నేటి వాడుకలో రక్షాబంధన్‍ అనీ అంటున్నారు. రాఖీ పూర్ణిమ పేరుతో ఈనాడు ఉల్లాసకరమైన వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ. ఈ రోజు ‘అధ్యాయోపాకర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయనం ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడు, అన్నకు చెల్లెలు కట్టడం ఆచారంగా మారింది.
అన్నాచెల్లెలు అనుబంధానికి అద్దం పట్టే పర్వమిది. మన హిందూ సంప్రదాయంలో కుటుంబ అనుబంధాలను బలపరిచే అనేక పర్వాలను ఏర్పరిచారు. అటువంటి అనేకానేక పర్వాల్లో రాఖీ పౌర్ణమి ఒకటి. తనను రక్షణ కోరి వచ్చిన సోదరిని బలి చక్రవర్తి ఆమెను రక్షిస్తూ, ఆ క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి రక్షనివ్వాలని కోరుతూ తన సోదరుడి కుడిచేతికి ఒక దారపు పోగును కడుతుంది. అదే రాఖీగా ప్రసిద్ధి పొందింది. సోదర – సోదరి ప్రేమకు ప్రతీకగా నిలిచే పర్వమిది.
ఇక, జంధ్యాన్ని ధరించే వారు శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడే పాతది వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే వేద పరిభాషలో ఉపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మనే యజ్ఞోపవీతంగానూ వ్యవహరిస్తారు. జంధ్యం అంటే యోగకర్మతో పునీతమైన దారం అని అర్థం. ఈ కారణంగానే పాల్కురికి సోమనాథుడు ఈ పూర్ణిమను నూలి పూర్ణిమగా వ్యవహరించాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించే రోజు కాబట్టి ఆ విధంగా ఆయన వర్ణించారు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈనాడు ఉపనయనం కూడా నిర్వహించే ఆచారం ఉంది.
ఈనాడు ముంబై ప్రాంతంలో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్ర తీరానికి వెళ్లి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఇంకా పూణె, గుజరాత్‍ ప్రాంతాల్లోనూ గొప్ప ఉత్సవంగా శ్రావణ పూర్ణిమను జరుపుకుంటారు.
అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు. హయగ్రీవుడు అంటే గుర్రపు ముఖము కలవాడని అర్థం.

Review ఈ శుభ మాసంలో...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top