ఉగాదులు..ఉషస్సులు

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది తొలి మాసం. సంవత్సరానికి ఇది మొదటి నెల కాబట్టి దీనినే ‘సంవత్సరాది’గా పరిగణిస్తారు. ఇదే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి మనకు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఏప్రిల్‍లో 12వ తేదీ వరకు ఫాల్గుణ మాస తిథులు.. ఆపై ఏప్రిల్‍ 13 నుంచి చైత్ర మాస తిథులు కొనసాగుతాయి. చైత్ర మాస ఆరంభ దినమైన 13నే ఉగాది. ఇంకా ఈ నెలలో ఏప్రిల్‍ 21న శ్రీరామ నవమి పర్వదినం కూడా.

శ్రీప్లవ నామ సంవత్సరం – ఫాల్గుణం – చైత్రం – వసంత రుతువు- ఉత్తరాయణం

మన భారతీయ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం వచ్చే ప్రధానమైన యాభై పండుగలకు నాంది పలుకుతూ ఆదిగా నిలిచే పండుగ- ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి తిథే.. ఉగాది. ఇది చైత్ర మాసానికి ఆరంభ దినం కాగా, భారతీయ పండుగలు, పర్వాలకు కూడా ఆరంభ పండుగ. ఆ సంవత్సరంలో వచ్చే అన్ని పండుగలకు ఇది ఆరంభ పర్వం కాబట్టి దీనిని సంవత్సరాదిగానూ వ్యవహరిస్తారు. చైత్ర మాసం ఏప్రిల్‍ 1, ఫాల్గుణ బహుళ చతుర్ధి నుంచి ఆరంభమై.. ఏప్రిల్‍ 30, చైత్ర బహుళ చతుర్థి వరకు కొనసాగుతుంది. ఇది వసంత కాలం. ఒకపక్క చెట్లు ఆకులు రాల్చే కాలమిది. మరోపక్క కొత్త చివుళ్లు తొడుగుతాయి. పచ్చటి ఆకులు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మన మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. చిత్తా నక్షత్రంలో పూర్ణ చంద్రుడు ఉండే మాసం కాబట్టి ఇది చైత్ర మాసం అయ్యింది. ఈ నెలలో ప్రాధాన్యం వహించే పండుగ ఉగాది. యుగాది అనే పదం నుంచి ఉగాది పుట్టింది. యుగమంటే ఒక కాల విభాగం. నూతన కాలం. దానికి ఆది యుగాది. దూరాన్ని కొలిచేందుకు ‘గజము’ బద్ద వలే, ధనమును లెక్కించడానికి ‘రూపాయి’ నాణెం వలే, అనంతమైన కాలాన్ని, దాని పరిమితిని తెలుసుకునేందుకు ‘సంవత్సరం’ ఉపయోగపడుతుంది. కాబట్టి కాలాన్ని కొలిచే కొలబద్ద వంటిది ‘సంవత్సరం’.
ఆ సంవత్సరానికి ప్రామాణికంగా నిలిచేది ఉగాది.
ఉగాది సమయంలో పితృకర్మలు, వ్రతాలు చేయడం మన భారతీయ
సంప్రదాయం. ఇంకా రమణీయమైన సీతారామ కల్యాణానికి
ఈ మాసమే వేదిక..

ఫాల్గుణ బహుళ చతుర్థి
ఏప్రిల్‍ 1, గురువార

వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయలు వారి సమకాలికుడు. వ్యాసరాయులు కృష్ణదేవరాయలుకు తలలో నాలుకలా ఉండేవారట. యుద్ధాలలోనూ, యుద్ధ వ్యూహాలలోనూ ఈయన సలహా సూచనలు తీసుకునే శ్రీకృష్ణదేవరాయలు ముందడుగు వేసేవారట. అనేక యుద్ధాలలో వ్యాసరాయలు సలహాలతోనే రాయల వారు విజయాలు సాధించారని అంటారు. అందుకే ఈయనను కృష్ణదేవరాయలు గురు సమానుడిగా పూజించే వారు. ఫాల్గుణ బహుళ చతుర్థి నాడు ఆయన స్మ•త్యర్థం వ్యాసరాజ స్మ•తి దినంగా పాటించడం ఆచారంగా ఉంది. ఇంకా ఏప్రిల్‍ 1 నాడు భారతీయ బ్యాంకులకు సెలవు దినం. అలాగే, ఈనాడు పాశ్చాత్యులు ఏప్రిల్‍ ఫూల్‍ డేగా పరిగణిస్తారు.

ఫాల్గుణ బహుళ పంచమి
ఏప్రిల్‍ 2, శుక్రవార

ఫాల్గుణ బహుళ పంచమి తిథిని రంగ పంచమిగా వ్యవహరిస్తారు. మార్చి 29న జరిగే హోలీ ఉత్సవాలకు కొనసాగింపుగా కొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు రంగ పంచమి పేరుతో వేడుకలు నిర్వహించుకుంటారు. ఈనాడు కూడా రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకుంటారు. హోలీ పర్వం జరిగిన ఐదు రోజులకు వచ్చే మరో ఆనందోత్సాహాలను పంచే పర్వమిది. ఇక, ఏప్రిల్‍ 2.. క్రైస్తవులకు గుడ్‍ ఫ్రైడే అయి ఉంది.

ఫాల్గుణ బహుళ అష్టమి/సీతాష్టమి
ఏప్రిల్‍ 4, ఆదివారం

చైత్ర మాసంలో సీతారాములకు సంబంధించి రెండు విశేషాలు ఉన్నాయి. ఏప్రిల్‍ 21న శ్రీరామ నవమి. అంతకు ముందు ఏప్రిల్‍ 4న సీతాష్టమి. అంటే ఈనాడు సీతాదేవి పుట్టిన రోజు. ఈనాడు సీతాదేవిని పూజించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. సీతాష్టమికి సంబంధించి ఆసక్తికరమైన కథ ఉంది.

సీత పూర్వజన్మలో వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి దంపతుల ముద్దులపట్టి ఈమె. కుశధ్వజుడు వేదాలు అధ్యయనం చేస్తుండగా శిశువు పుట్టడం వల్ల ఆ శిశువుకు వేదవతి అనే పేరు పెట్టారు. తన కుమార్తెను శ్రీహరికి ఇచ్చి పెళ్లి చేస్తానని కుశధ్వజుడు అంటుండేవాడు. ఒకసారి దంభుడు అనే రాక్షసుడు వేదవతిని తనకిచ్చి వివాహం చేయాలని అడగగా, కుశధ్వజుడు నిరాకరించాడు. దీంతో ఆ రాక్షసుడు ఒకనాడు నిద్రలో ఉన్న కుశధ్వజ మునిని హతమార్చాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య మాలవతి సైతం ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి.. తండ్రి కోరిక మేరకు శ్రీహరినే పెళ్లాడాలని నిశ్చయించుకుని తపస్సుకు దిగింది. దీక్షలో ఉన్న ఆమెను ఒకసారి రావణుడు చూసి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. విష్ణువును తప్ప వేరెవరినీ పెళ్లాడనని వేదవతి చెప్పింది. అయినా రావణుడు మోహావేశంతో వేదవతిని తాకాడు. ‘నీచుడవైన నువ్వు తాకిన నా శరీరాన్ని ఇప్పుడే త్యజిస్తున్నాను. నేను అయోజనిగా తిరిగి భూమ్మీద పుట్టి నిన్ను పుత్ర, మిత్ర కళత్రంగా నాశనం చేస్తాను’ అని శపించి వేదవతి యోగాగ్నిలో దహనమైంది. అనంతరం వేదవతి శిశువుగా జన్మించి లంకలోని తామర కొలనులో ఒక తామరపువ్వు బొడ్డులో సూక్ష్మరూపంలో దాగుండి తపస్సు చేసుకోసాగింది. శివపూజకు ఒకనాడు లంకాధీశుడైన రావణుడు
తామరపూలను కోస్తూ కాస్త బరువుగా ఉన్న ఈ పువ్వును తన మందిరానికి తీసుకెళ్లాడు. అక్కడి ఆస్తాన జ్యోతిష్యులు పరిశీలించి.. ఆమె పుట్టుక అరిష్టమని చెబుతారు. దీంతో శిశువును ఒక బంగారు పెట్టెలో పెట్టి రావణుడు సముద్రంలోకి విడుస్తాడు. అది కొట్టుకెళ్లి జనక మహారాజు రాజ్యంలో భూస్థాపితమైంది. జనకుడు ఒకనాడు భూమి దున్నుతుండగా ఈ పెట్టె బయటపడింది. దానిని తెరవగా శిశువు కనిపించింది. ఆ రోజు ఫాల్గుణ బహుళ అష్టమి. నాగలి చాలుకు తగిలిన కారణంగా పెట్టెలో నుంచి బయటపడిన ఆ శిశువుకు ‘సీత’ అనే పేరు పెట్టి జనకుడు పెంచుకున్నాడు. నాగలిచాలునే సంస్క•తంలో సీత అంటారు. తరువాత ఆమెను రాముడికి ఇచ్చి వివాహం చేయడం, రావణుడు అపహరించడం.. సీతాన్వేషణలో భాగంగా రాముడు లంకకు వెళ్లి రావణుడిని హతమార్చడం తెలిసిందే. ఇంకా ఫాల్గుణ బహుళ అష్టమి నాడు శీతలాష్టమి, కాలాష్టమి వ్రతాలు కూడా ఆచరించాలని గ్రంథాలలో ఉంది. క్రైస్తవులు ఏప్రిల్‍ 4ను ఈస్టర్‍ సండేగా పరిగణిస్తారు.

ఫాల్గుణ బహుళ నవమి
ఏప్రిల్‍ 5, సోమవారం

నవమి తిథి నాడు దుర్గాదేవిని పూజించడం ఆచారం. ఈనాడు బాబూ జగ్జీవన్‍రామ్‍ జయంతి దినం.

ఫాల్గుణ బహుళ ఏకాదశి
ఏప్రిల్‍ 7, బుధవారం

ఇది పాపవిమోచన ఏకాదశి. మంజుఘోష అనే అప్సర.. మేధావి అనే మునికి తపోభంగం కలిగించి శాపానికి గురైంది. చివరకు ఆమె ఈ ఏకాదశి నాడే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తనకు శాపాన్ని కలిగించిన పాపాన్ని పోగొట్టుకుంది. శాప, పాప విమోచనం పొందిన ఏకాదశి కాబట్టి ఫాల్గుణ బహుళ ఏకాదశి పాప విమోచన ఏకాదశి అయ్యింది. ఈ మేరకు గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరాలు ఉన్నాయి. ఇంకా ఈనాడు ఛందో దేవపూజ ఆచరించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఫాల్గుణ బహుళ ఏకాదశిని కృష్ణైకాదశిగానూ వ్యవహరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది. కశ్మీర్‍లో ఈనాడు ఛందో దేవపూజ ఆచరిస్తారని నీలమత పురాణంలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే శ్రీ చైతన్య మహాప్రభు జన్మించారు. ఇక, ఏప్రిల్‍ 7.. ప్రపంచ ఆరోగ్య దినంగా పాటిస్తారు. ఆరోగ్యంపై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని ఏటా ఈ తేదీన నిర్వహిస్తుంటారు.

ఫాల్గుణ బహుళ ద్వాదశి
ఏప్రిల్‍ 8, గురువారం

సాధారణంగా ఫాల్గుణ బహుళ ద్వాదశి తిథి పుష్యమితో కూడి వస్తే ఆ ద్వాదశిని గోవింద ద్వాదశిగా పరిగణిస్తారు. ఈసారి శతభిష నక్షత్రంతో కూడిన తిథి వచ్చింది. ఈ ద్వాదశి నాడు మనోరథ ద్వాదశి, సుకృత ద్వాదశి, సుగతి ద్వాదశి, విజయా ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకి వ్రతం చేయాలని మరికొందరు అంటారు. ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు గంగా స్నానం మహా పాపాలను హరిస్తుందని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ప్రస్తావించారు. మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం చేయాలని, యోగేశ్వర భగవానుడిని పూజించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ త్రయోదశి
ఏప్రిల్‍ 9, శుక్రవారం

ఫాల్గుణ బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.

ఫాల్గుణ బహుళ చతుర్దశి
ఏప్రిల్‍ 10, శనివారం

ఫాల్గుణ బహుళ చతుర్దశిని పిశాచి చతుర్దశి అంటారు. ఈ తిధి నాడు పరమశివుడిని పూజించి, పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని అంటారు. అలాగే, మరికొన్ని వ్రత గ్రంథాల ప్రకారం ఈ తిథి నాడు లలిత కాంత్యాఖ్యదేవి వ్రతం చేయాలని, మహేశ్వర వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే, ఇది ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి దినం కూడా.

ఫాల్గుణ బహుళ అమావాస్య
ఏప్రిల్‍ 12, సోమవారం

ఫాల్గుణ బహుళ అమావాస్యను వివిధ ప్రాంతాలలో కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు. ఇది సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించే రోజు. అందుకే దీనిని మీన సంక్రమణం అని కూడా వ్యవహరిస్తారు. షడతీతి సంక్రాంతి అనీ అంటారు. ఈ తిథి నాడు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని అంటారు. ఈ తిథి నాడు ఆ సంవత్సరాంత శ్రాద్ధ కార్యాలు నిర్వహించాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఇక, తెలుగు నాట ఈనాడు కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులు ఏరువాక సాగుతారు. గ్రామ దేవతలకు గొప్ప ఉత్సవాలు జరిపి, జాతరలు నిర్వహిస్తారు. ఈనాడు పల్లెల్లోని వీధి వీధుల్లో ఉండే అమ్మవార్లు విశేష పూజలు అందుకుంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి/ఉగాది
ఏప్రిల్‍ 13, మంగళవారం

చైత్ర శుద్ధ పాడ్యమి తిథి నూతన సంవత్సరారంభ దినం. ఈనాడే ఉగాది లేదా సంవత్సరాది పర్వం. 2021, ప్లవ నామ సంవత్సరం. ఇది అనేక సంప్రదాయాల సమ్మిళిత పర్వం. సాధారణంగా మన దేశంలో పుష్య, మాఘ మాసాల్లో పంటలు పండి ప్రకృతి పంటల బరువుతో, పచ్చదనపు సొగసులతో తులతూగే కాలం. రైతులు తమ శ్రమ ఫలాన్ని కళ్లెదుట చూసుకుని పొంగి పోతుంటారు. ఈ సమయంలో వచ్చేదే సంక్రాంతి పర్వం. సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలమని, విషువత్పుణ్య కాలమని అంటారు. విషువత్తంటే పగలు, రాత్రి సమానంగా ఉండే కాలం. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. ఈనాటి నుంచి ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి సంక్రాంతినే పూర్వం ఉగాదిగా భావించేవారు. అయితే, నక్షత్ర గణకులు, సిద్ధాంతకర్తలు చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పర్వదినంగా తరువాత కాలంలో నిర్ణయించారు. అలా ఉగాది పుష్య, మాఘ మాసాలను దాటుకుని చైత్రంలో నిర్ణయమైంది. చైత్రంలోని తొలి తిథి అయిన శుద్ధ పాడ్యమి ఈ పర్వానికి
నెలవైంది. ప్రస్తుతం మనకు ఇదే సంవత్సరారంభ దినం.
కాబట్టి ఇదే సంవత్సరాది అయ్యింది.
ఈనాడు చంద్ర దర్శనం.

చైత్ర శుద్ధ విదియ
ఏప్రిల్‍ 14, బుధవారం

ఒకనాడు పార్వతి భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉండగా, ఆ సమయంలో అక్కడికి అగ్ని భట్టారకుడు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు శివుడికి వీర్య పతనమైంది. దీంతో తన క్రీడాభంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాల్సిందిగా అగ్నిని ఆజ్ఞాపించింది. అగ్ని ఈ వీర్యాన్ని ధరించి కుమారస్వామి జననానికి కారణభూతుడయ్యాడు. ఇది బ్రహ్మ పురాణంలో ఉన్న కథ. కాబట్టే ఈనాడు ‘ఉమా శివాగ్ని’ పూజ ఆచరించాలని పంచాంగకర్తలు నిర్ణయించారు. ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను దమనంతో పూజించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. ఇదే వ్రత గ్రంథంలో ఈనాడు బాలేందు వ్రతం ఆచరించాలని కూడా ఉంది. కాగా, స్కంద పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే వ్రతం. చైత్ర శుద్ధ విదియ వేదవ్యాస తీర్థానాం పుణ్యదినం అని శ్రీమధ్వ పుణ్యతీర్థమనీ ప్రసిద్ధి. పెరియ పెరుమాల్‍ తిరు నక్షత్రం ఈనాడేనని ఆళ్వాచార్యుల చరిత్ర చెబుతోంది.
కాగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ జయంతి దినం ఏప్రిల్‍ 14.

చైత్ర శుద్ధ తదియ
ఏప్రిల్‍ 15, గురువారం

చైత్ర శుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రుల తొమ్మిది రోజులలో తదియ మూడవ రోజు. ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. శివ డోలోత్సవం నాడు ఉమా శివులను దమనములతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుందని అంటారు. ఈ తిథిన మహారాష్ట్ర పంచాంగాలు గౌరీ తృతీయగా పేర్కొంటున్నాయి. వ్రత గ్రంథాలను బట్టి చూస్తే చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరిని పూజించాలి. ఆ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి. రాత్రికి జాగరణం ఉండాలి. అలాగే, ఈనాడు సౌభాగ్య శయన వ్రతాన్ని కూడా ఆచరించాలని అంటారు. ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకు చెప్పినట్టు మత్స్య పురాణంలో ఉంది. చైత్ర శుద్ధ తృతీయ పూర్వాహ్న వేళ ఉమా మహేశ్వర ప్రతిమలకు వివాహం చేసి కల్పోక్త్రం ప్రకారం పూజలు, దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ చతుర్ధి
ఏప్రిల్‍ 16, శుక్రవారం

సాధారణంగా ప్రతి నెలలో వచ్చే చతుర్థి తిథి గణపతి పూజకు ఉద్ధిష్టమైనది. చైత్ర శుద్ధ చతుర్థి తిథి నాడు గణపతిని దమనములతో పూజించాలని నియమం. ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. సాధారణ పంచాంగాలలో ఈనాడు చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం ఆచరించాలని ఉంది.

చైత్ర శుద్ధ పంచమి
ఏప్రిల్‍ 17, శనివారం

చైత్ర శుద్ధ పంచమి తిథి శాలి హోత్రయ పంచమి దినం. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు హయపూజ చేయాలని నియమం. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండేదని తెలుస్తోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది బాగా ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఈనాడు లక్ష్మీపూజ చేయలని, ఈ పక్రియనే ‘శ్రీ వ్రతం’గా వ్యవహరిస్తారని అంటారు. లక్ష్మీ పంచమిగానూ పరిగణనలో ఉంది.

చైత్ర శుద్ధ షష్ఠి
ఏప్రిల్‍ 18, ఆదివారం

షష్ఠి తిథి కుమారస్వామి పూజకు ప్రతీతి. అందుకే ఈనాడు స్కంద పూజ ఆచరిస్తారు. ఈనాడు కుమారస్వామిని దమనములతో పూజించాలి. అర్క, కుమారషష్ఠి వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథాలలో ఉంది.

చైత్ర శుద్ధ సప్తమి
ఏప్రిల్‍ 19, సోమవారం

సప్తమి సూర్యుడికి సంబంధించిన తిథి. కాబట్టి చైత్ర శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని దమనాలతో పూజించాలి. ఈనాడు ఇంకా గోమయాది సప్తమి, నామ సప్తమి, సూర్య, మరుత్‍, తురగ సప్తమీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు వాసంతీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. అలాగే, ఈనాడు అర్క వ్రతం ఆచరించే వారు రాత్రి భోజనం చేయకూడదు. అర్క అంటే సూర్యుడికి గల మరో పేరు. ఈ తిథి సూర్యారాధన దినం.

చైత్ర శుద్ధ అష్టమి
ఏప్రిల్‍ 20, మంగళవారం

పలు విధాలైన వ్రతాల ఆచరణకు చైత్ర శుద్ధ అష్టమి నెలవుగా ఉంది. ఈనాడు భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని పంచాంగకర్తలు రాశారు. దీనిని బట్టి ఇది భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణనలో ఉంది. భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుని నిరాదరించాడు. ఆ కోపాన దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు. ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు. దీనికి పార్వతిని తప్ప అందరినీ పిలిచాడు. కానీ పార్వతి పుట్టింటిపై మమకారంతో వెళ్లింది. అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు. ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో నేలరాచింది. యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. సతీదేవి భస్మమైన విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది. పర్వతరాజుకు పుట్టడం చేత ఆమెను పార్వతి అని పిలవసాగారు. భవానీ ఆమె పర్యాయ పదం.

చైత్ర శుద్ధ నవమి/శ్రీరామ నవమి
ఏప్రిల్‍ 21, బుధవారం

ఇది శ్రీరామచంద్రుని జన్మతిథి. మహా విష్ణువు పది అవతారాల్లో శ్రీరామావతారం ఏడవది. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ పుట్టాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. విష్ణువు పది అవతారాల్లో మూడు అవతారాల జయంతులు చైత్ర మాసంలోనే రావడం విశేషం. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఏటేటా వచ్చే ఈ పది జయంతులలోనూ సంవత్సరాదికి పిమ్మట మొదట వచ్చే జయంతి పర్వం శ్రీరామ నవమే. శ్రీరామ నవమి పండుగ తొమ్మిది రోజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులలో ఉగాది పాడ్యమి మొదటి రోజు. ఈ తొలి రోజున ప్రారంభించి శ్రీరామ నవమి వరకు రామాయణ పారాయణం మొదలైన పనులు చేస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భ నవరాత్రులు అంటారు.

చైత్ర శుద్ధ దశమి
ఏప్రిల్‍ 22, గురువారం

ఇది శాలివాహన జయంతి తిథి. శాలివాహనుడు శాతవాహన పర్యామాభిధానుడు. ఆంధ్ర భూమిలో జన్మించిన మహా పురుషులలో ఈయన ఒకరు. విక్రమార్కుడిని సంహరించాడని అంటారు. కుమ్మరి కన్యకు జన్మించాడు. ఉగాది పర్వం ఈయనకు సంబంధించిన కథతో కూడా ముడి పడి ఉంది. అలాగే, ఈనాడు పాండవ అగ్రజుడైన ధర్మరాజును దమనముతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. రెండు ప్రధాన పర్వాలతో కూడిన చైత్ర శుద్ధ దశమి కాబట్టే ఈనాడు మన పంచాంగకర్తలు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని రాస్తారు. ఇంకా, రామ నవమి ప్రతాంగ హోమం ఈనాడే నిర్వహించాలని అంటారు.

చైత్ర శుద్ధ ఏకాదశి
ఏప్రిల్‍ 23, శుక్రవారం

ఏకాదశి తిథి సాధారణంగా ఉపవాసాల రోజు. ఇది పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. ఈమె సౌందర్యరాశి. మురాసురుడనే రాక్షసుడితో తలపడి అలసి, సొమ్మసిల్లిన విష్ణువు దేహం నుంచి ఈ సౌందర్యరాశి జనించింది. అనంతరం ఆమె మురాసురుడిని సంహరించింది. ఆమెకు దేవతలంతా కలిసి ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు. ఇక, చైత్ర శుద్ధ ఏకాదశి కామద ఏకాదశిగా ప్రసిద్ధి. కోరిన కోరికలు తీర్చే ఏకాదశి కాబట్టి ఇది కామద ఏకాదశి అయ్యింది. లలిత అనే గంధర్వ స్త్రీ ఈ తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన కోరికలను తీర్చుకుందట. ఆమె మనసులోని కామితం (కోరిక) నెరవేరింది కాబట్టి ఇది కామదౌకాదశి అయ్యింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశి పేరుతో జరుపుకుంటారు. ఈనాడు అక్కడి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈనాడు లక్ష్మీనారాయణులను దమనములతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.

చైత్ర శుద్ధ ద్వాదశి
ఏప్రిల్‍ 24, శనివారం

ఈనాడు శ్రీమహా విష్ణువును దమనములతో పూజించాలి. ఈ తిథిని వామన ద్వాదశిగానూ వ్యవహరిస్తారు. ఇది వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని ఈనాడు దమనంతో పూజించాలి. చైత్ర శుద్ధ ద్వాదశి గొప్పదనం గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు పుట్టాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు.

చైత్ర శుద్ధ త్రయోదశి
ఏప్రిల్‍ 25, ఆదివారం

ఇది అనంగ త్రయోదశి. దీనినే మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు బ్రహ్మ చేత, శివుడి చేత అనంగుడుగా (అంగాలు లేనివాడుగా) చేయబడినట్టు పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. అలాగే, ఈనాడు శివుడిని దమనములతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.
ఈనాడు మహావీరుని జయంతి దినం కూడా.

చైత్ర శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 26, సోమవారం

ఇది రౌచ్య మన్వాదిగా ప్రతీతి. చతుర్దశి తిథి శివుడికి ప్రీత్యర్థమైనది కాబట్టి దీనిని శైవ చతుర్దశి అనీ అంటారు. ఇక, రౌచ్యుడి వివరాల్లోకి వెళ్తే.. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. ఆ విధంగానే రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయగదగినది. ఈనాడు ఇంకా నృసింహ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవం వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ పౌర్ణమి
ఏప్రిల్‍ 27, మంగళవారం

పదహారు కళలతో ఒప్పుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతినిస్తంద్రుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతి నిస్తంద్రుడై ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పున్నమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్ర ఒకటి. అటువంటి చిత్తా నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి.
చైత్ర పూర్ణిమను మహాచైత్రి అని కూడా అంటారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.
చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి పర్వం. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది.
చైత్ర పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఈనాడు పశుపతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఈనాడే మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 27, మంగళవారం

చైత్ర బహుళ పాడ్యమి తిథి కూడా చైత్ర పూర్ణిమ తిథి నాడే ప్రవేశిస్తుంది. ఈనాడు పాతాళ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు
జ్ఞానావాప్తి వ్రతం కూడా
చేస్తారని తెలుస్తోంది.

Review ఉగాదులు..ఉషస్సులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top