ఊరంతా పండుగే..

2023- జనవరి 1, ఆదివారం,
పుష్య శుద్ధ దశమి నుంచి
2023- జనవరి 31, మంగళవారం,
మాఘ శుద్ధ దశమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-పుష్యమి -మాఘం-హేమంత రుతువు- ఉత్తరాయణం

జనవరి.. ఆంగ్లమానం ప్రకారం ఇది ఏడాదిలో మొదటి నెల. ఈ నెలతో 2023 కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఇక, మన తెలుగు పంచాంగాల ప్రకారం జనవరి.. పుష్య-మాఘ మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో పుష్య మాసం పదవది. ఈ మాసంలోని జనవరి 21వ తేదీ శనివారం వరకు పుష్య మాస తిథులు, ఆ తదుపరి జనవరి 31వ తేదీ మంగళవారం వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. సంక్రాంతి పుష్య మాసపు అతిపెద్ద పండుగ. పుత్రద ఏకాదశి, కూర్మ ద్వాదశి వంటివి ఇతర ప్రధాన పర్వాలు.

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని వర్ణం(పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన
పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల
కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని చెబుతారు. ఇక, పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం కూడా పుష్యమే. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య
పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యం. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి.

సంక్రాంతి వేళ ఏ ఇల్లు చూసినా అందమైన రంగవల్లులు హరివిల్లుల్లా పరుచుకుని ఉంటాయి. పాడిపంటలు ఇళ్లకు చేరుతుంటాయి. పిల్లల భోగిమంటల సన్నాహాలు, పెద్దల పండుగ పిండివంటల హడావుడి.. ఇవన్నీ కొత్త క్రాంతిని చేకూరుస్తూ సంక్రాంతిని ముంగిటకు తెస్తాయి. పుష్య మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలనే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఆచరణలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కూడా ఉంది. ఇక, జనవరి 22 నుంచి ప్రవేశించే మాఘ మాసం శిశిర రుతువు కాలం. శీతాకాలం (చలి) చేత ఈ కాలంలో దేహం ఇక్క లాక్కుపోతుంది. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైన మాసమిది. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మగవుడు’ అని కూడా అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం ‘మాఘం’ అయ్యింది. అలాగే, చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కనుక ఇది ‘మాఘం’ అయ్యింది. మాఘ మాసపు శిశిర రుతువులో చెట్లు ఆకులు రాలుస్తాయి. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. మాఘ మాసం కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకు, భగవచ్ఛింతనకు నెలవైనది. వైశాఖ – కార్తీక మాసాలకు మాదిరిగా మాఘ స్నానాలు పవిత్రమైనవి. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు. మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని అంటారు. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం తెలియచెబుతోంది. మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు గృహ స్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నాన ఫలం లభిస్తుందని ప్రతీతి. బావినీటి స్నానం పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం శత గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలం ఇస్తాయని పురాణ వచనం.
మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే ఈ మాసం ఎన్నో పవిత్ర పర్వాలకు నెలవు. మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనద్యాగమం అని మత్స్య పురాణంలో ఉంది. పుష్య-మాఘ మాసంలో వచ్చే పండుగలు, పర్వముల వివరాలివీ..

పుష్య శుద్ధ దశమి
జనవరి 1, ఆదివారం

పుష్య శుద్ధ దశమి తిథిని వివిధ వ్రత గ్రంథాలు దీనిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు.
ఇక, జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సర దినం. ఆంగ్లమానం ప్రకారం 2023 సంవత్సరారంభానికి ఇది తొలిరోజు, తొలి మాసం.

పుష్య శుద్ధ ఏకాదశి
జనవరి 2, సోమవారం

పుష్య శుద్ధ ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. అలాగే ఈ తిథి పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది.
రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.
రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు. అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.
అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. నీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది. దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు. రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.

పుష్య శుద్ధ ద్వాదశి
జనవరి 3, మంగళవారం

పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.

పుష్య శుద్ధ చతుర్దశి
జనవరి 5, గురువారం

పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేయాలి. గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు. అలాగే ఈ తిథి విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి.

పుష్య శుద్ధ పౌర్ణమి
జనవరి 6, శుకవ్రారం

పుష్య నక్షత్రంతో కూడిన పున్నమిని ‘పౌషీ’ అంటారు. ఇక, పుష్య శుద్ధ పూర్ణిమనే మహా పౌషీ అని కూడా అంటారు. దీనికే హిమశోధన పూర్ణిమ అనే మరో పేరు కూడా ఉంది. పుష్య పూర్ణిమను తమిళులు ‘పూసమ్‍’గా వ్యవహరిస్తారు. తై పూసమ్‍ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్‍వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్‍వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది. తమిళనాడులోని అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్‍ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది.

• శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.
• పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది.
• పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
• మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది.

పుష్య బహుళ పాడ్యమి
జనవరి 7, శనివారం

పుష్య కృష్ణ (బహుళ) పాడ్యమి నాడు విద్యావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.

Review ఊరంతా పండుగే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top