ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదో మాసం` అక్టోబర్. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఏడవ మాసం. అక్టోబర్ మాసం భాద్రపద ` ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబర్ 6వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్ 7వ తేదీ నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం` ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ నెలలో దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తారు. ఇంకా అనేకానేక పర్వాల సమాహారం ఆశ్వయుజ మాసం.
వెన్నెల పుచ్చ పువ్వులా విరగాసే మాసం ఆశ్వయుజం. మేఘాలు దూదిపింజల్లా ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందమైన ఈ శరదృతు కాలంలో ఆధ్యాత్మిక వికాసం వెల్లివిరుస్తుంది. శక్తి (అమ్మవారి) ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసమిది. ఈ నెలలో సూర్యచంద్రులు నిర్మలంగా దర్శనమిస్తారు. సూర్యుడు శక్తి కారకుడైతే, చంద్రుడు మన: కారకుడు. ఈ ఇద్దరూ కలిసి ఈ నెలలో ఆరాధించే అమ్మవారి భక్తులపై తమ శక్తులను ప్రసరిస్తారు. సృష్టికి మూలం స్త్రీ. పురుషుడు ప్రాణదాత అయితే, స్త్రీ శరీరధాత్రి. అటువంటి శక్తిని ఆలవాలమైన మాసం` ఆశ్వయుజం. ఈ మాసమంతా అతివల పర్వాలే. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు` సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ ముగ్గురమ్మలు శరన్నవరాత్రుల పేరిట ఏకకాలంలో పూజలందుకునేది ఆశ్వయుజ మాసంలోనే. ఇదే దసరా సర్వంగా ప్రసిద్ధి. దసరా నాడే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని అంటారు. అర్జునుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలను తీసి కౌరవ వీరులను జయించినదీ విజయదశమి నాడేనని పురాణోక్తి. ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వాల విశేషాలు..
ఆశ్వయుజ మాస విశేషాలు
సమస్త జగత్తును పాలించేది ఆది పరాశక్తి. ఈ పరాశక్తి. త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి అయి లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్య, శక్తిలను ప్రసాదిస్తున్నాయి. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు వాగ్దేవి సరస్వతీ పూజ చేయాలి. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి.
కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల 6 నెలల కాలం స్త్రీ రూపాత్మకం.
ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలో వచ్చే తొలి మాసం ఆశ్వయుజం. ఇది అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజ మాసంలో వచ్చే అట్లతద్ది, దసరా తదితర పర్వాలన్నీ స్త్రీలకు సంబంధించినవే. అందుకే ఆశ్వయుజం అతివల పర్వంగా ప్రసిద్ధి. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం.
ఆశ్వయుజి అంటే స్త్రీ.
దేవి, సరస్వతి, లక్ష్మి` వీరి ఆరాధన ఈ నెలలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. దసరా శరన్నవరాత్రులతో పాటు పాశాంకుశ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, బతుకమ్మ ఉత్సవాలు, పద్మనాభ ద్వాదశి, వాల్మీకి జయంతి, అట్లతద్ది, కాలాష్టమి వంటివి ఈ నెలలో వచ్చే ముఖ్య పర్వాలు, పండుగలు. దసరా తరువాత ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాల్లో అట్లతద్ది ఒకటి. ఇది పూర్తిగా అతివల పర్వం. యువతులు, బాలికలు ఈనాడు ఆడిపాడుతూ ఉల్లాసంగా గడుపుతారు. చేతుల నిండా గోరింటాకు పూసుకుంటారు.
Review జయ జయ ఆశ్వయుజ.