నీ పాట తీయనిది..

భావానికి తేనెలు.. భాషకు పరిమళాలు అద్ది తెలుగు సినిమా పాటను స్వరరాగ పదయోగ సమభూషితంగా తీర్చిదిద్దిన అక్షర చైతన్యం.. సినారె. ఆయన సినీ గీతాల్లోని పదలాలిత్యం, భావ సౌకుమార్యం.. ఆ పాటల్ని వినినంతనే మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయన జనరంజకమైన సినీ గేయాలు తెలుగు వాకిట పాటల పూదోటలై వికసిస్తూనే ఉంటాయి.
‘గులేబకావళి కథ’ (1962) ద్వారా ఎన్టీఆర్‍ ఆహ్వానం మేరకు ఆయన తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాకు అన్ని పాటలూ తానే రాసి సింగిల్‍ కార్డ్ క్రెడిట్‍ను పొందారు. తెలుగు సినిమా పాటల పల్లకీని నేటి వరకు మోస్తున్న బోయీలలో ప్రముఖంగా పేర్కొనదగిన పన్నెండు మందిలో ఒకరైన సినారె సినీ గేయ చరిత్రలో మూడవ తరానికి చెందిన కవి. ‘పాటలోనే నాదు ప్రాణాలు కలవ’న్న ఆయన సినీ గేయ సాహిత్యంలో వైవిధ్యభరితమైన ప్రయోగాలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడం వల్ల ఆ భాషలోని గజళ్లు ఆయన తెలుగు పాటకు నడకలు నేర్పాయి. హిందీ పాటల బాణీలు సినీ గేయ రచనలో విలక్షణతకు, వైవిధ్యానికి దోహదం చేశాయి. తెలంగాణలోని హరికథలు, పల్లెపాటలు, వీధి బాగోతాలు ఆయనలోని సంగీత జ్ఞానాన్ని తట్టి లేపి సినిమాల్లో తెలంగాణ మాండలిక గీతాల్ని రాయించాయి. అధ్యాపక వృత్తిలో ఉండగా అలవడిన ప్రాచీన కావ్య పరిజ్ఞానం, పదసంపద, అలంకార ప్రియత్వం ఆయన కలం నుంచి రసరమ్య గీతాలు వెలువడేలా చేశాయి. ఆయన పాటల్లో తెలుగు నుడికారం తెలుగు వారి నాలుకలపై మౌనగీతాలై పల్లవిస్తాయి. ‘అమ్మక చెల్ల’, ‘ఛాంగురే’, ‘మగరేడు’, ‘మచ్చెకంటి’, ‘మజ్జారే’ మొదలైన ప్రాచీన పదాలను, ‘పిండివెన్నెల’, ‘పూల రుతువు’, ‘మల్లెలవాడ’, ‘నీలికన్నుల నీడలు’ వంటి అందమైన పదబంధాలను కూర్చి సినిమా భాషకు కొత్త సొబగులు అద్దిన ఘనత సినారెది. తెలుగు సినీ పాటలో శబ్దాధికారానికి సినారె అధిపతి. ‘చరణ కింకణులు’, శివరంజనీ..’, ‘సంగీత సాహిత్య సమలంకృతే’, ‘వంశీకృష్ణా యదు వంశీకృష్ణా’ వంటి గీతాలన్నీ అందుకు మచ్చుతునకలు. తెలుగు సినీ చరిత్రలో ఎక్కువ మంది దర్శకులతో కలిసి పనిచేసిన ఘనత ఆయనది. సంగీత సాహిత్యాలలో అపరిమితమైన పరిజ్ఞానం గల సినారె సినీ వాగ్గేయకారుడిగా నిలిచిపోతారనడంలో అతిశయోక్తి లేదు. సుదీర్ఘమైన అధ్యాపకవృత్తి వల్ల అలవడిన అలంకార ప్రియత్వం ఆయన సినీ గేయాల్లోనూ పరిమళిస్తుంది. అర్థాలంకారాలలో ఉత్తరాలంకారం (ప్రశ్న-సమాధానాలు), శబ్దాలంకారాలలో అంత్యానుప్రాస అంటే ఆయనకు అమితమైన ప్రీతి. తెలుగు సినీ గేయ చరిత్రలో ఆయన మూర్తి, ఆయన కీర్తి ఎప్పటికీ రాజస విరాజమానాలు.
సినారె వ్యక్తిగా ఎంత హుందాగా ఉంటారో, ఎంత ఉన్నతంగా కనిపిస్తారో ఆయన సినిమా పాట కూడా అంతే హుందాగా, అందంగా తెరపై నడిచింది. తన కంటే ముందు సినీ రంగాన్ని ఏలిన రెండు తరాల కవులకు, ఆ తరువాత వచ్చిన వారికి భిన్నంగా సినారె సినిమా గేయ రచనను ప్రవృత్తిగా స్వీకరించి పాటల శిఖరాన్ని అధిరోహించిన అక్షర రాజర్షి. మిగతా వారి మాదిరిగా ఆయన పాట రాస్తానని ఎవరి వెంటా పడలేదు. ఎవరికి పడితే వారికి రాయలేదు. కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల సినిమాలకే ఆయన రాశారు.. అదీ తనకు నచ్చితేనే. అందుకే ఆయన పాట ఎవరికీ తలవంచలేదు. ఎక్కడా తలదాచుకోలేదు. తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసి సరస్వతీ పుత్రులలో సినారెది నిస్సందేహంగా విలక్షణ స్వరం, విశిష్ట స్థానం. ఆయన తన ప్రతి పుట్టిన రోజుకు ఓ కావ్యం చొప్పున దాదాపు తన వయసుతో సమానమైన సంఖ్యలో కావ్యాలను వెలువరించారు. సినారె అనేక తన కావ్యాల మాదిరిగానే ‘సినీ ఫొటో బయోగ్రఫీ’ని కూడా ‘పాటలో ఏముంది? నా మాటలో ఏముంది?’ అనే మకుటంతో రెండు సంపుటాలుగా వెలువరించారు. ప్రబంధ కవుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఎలాగో, తెలుగు సినీ కవులలో సినారె అంతటి సమున్నత వ్యక్తి. రాస్తూ రాస్తూ పోతాను సిరా యింకే వరకుపోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు అంటూ తన సంకల్పాన్ని ‘ఇంటి పేరు చైతన్యం’ అనే కవితా సంపుటిలో ప్రకటించిన సి.నారాయణరెడ్డి.. చివరి వరకు తాను అన్న మాటను నిలబెట్టుకున్నారు. ఆయన ఎన్నో కావాల్యను తెలుగు సాహితీ జగత్తుకు కానుకగా అందించారు. అటువంటి ఆధునిక ‘కవికుల గురువు’ ఈ భువిపై మరొకరు లేరు, రారు.

Review నీ పాట తీయనిది...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top