మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
అమ్మా వేళ్లాకుంగారాలూ ఎంతో బాగున్నాయ్
రెండు రెండూ ఉంగరాలూ తీసీనాకియ్యీ
ఉంగరాలూ పెట్టూకోనీ పెళ్లికి వెళతానూ
గోరింటాకూ పెట్టూకోనీ పెళ్లికి వెళతానూ
పట్టూచీరా కట్టూకోనీ పెళ్లికి వెళతానూ
పట్టూ రవికా తొడుగూకోనీ పెళ్లికి వెళతానూ
లడ్డూ మిఠాయి జిలేబీలూ నాకూ పెడతారూ
ఒడ్డూ పొడుగు చూడకనాకే గౌరవమిస్తారు
పసుపుకుంకుమ పారాణీలూ నాకూ పెడతారూ
తాంబూలాలూ వాయీనాలూ నాకూ ఇస్తారూ
రెండూ రెండే ఉంగరాలూ తీసీ నాకియ్యీ
వేళ్లకు నేనూ పెట్టూకోనీ పెళ్లికి వెళతానూ
చెలిమి వెన్నెల కలిమి వెన్నెల
పాల వెన్నెల పూల వెన్నెల
పాల కడలికి పట్టి వెన్నెల
తేట వెన్నెల పాట వెన్నెల
పాలమీగడ తొరక వెన్నెల
తరపి వెన్నెల వలపు వెన్నెల
నగవు వెన్నెల తొగరు వెన్నెల
చెలిమి వెన్నెల కలిమి వెన్నెల
తెలుపు విరిసిన దిగంతాలకు
మెరుపు తీగల నగల వెన్నెల
కలల మెలకువ కొసలు తాకిన
పులకరింతల ముద్దు వెన్నెల
పాల వెన్నెల పూల వెన్నెల
పాల కడలికి పట్టి వెన్నెల
తేనె కలిపిన వెన్న వలే
హృదయాలు చేరే జాలి వెన్నెల
నీ మోము చూడకముందే,
నీ స్వరం వినకముందే,
నీ గుణం తెలియక ముందే,
నిన్ను నిన్నుగా ప్రేమించే
గొప్ప వ్యక్తి అమ్మ
మాతృదేవోభవ
జో అచ్యుతానంద
తాళ్లపాక అన్నమయ్య రాసిన కీర్తనల్లో మేలిమి ముత్యం.. జో అచ్చుతానంద జోజో ముకుందా.. అనే కీర్తన. ఇది తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన. తెలుగు నేలపై ఈ కీర్తనలోని ఒకటి రెండు చరణాలనైనా బిడ్డలను నిద్రపుచ్చడానికి పాడని తల్లులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కీర్తన పూర్తి వివరాలివీ..
జో అచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దు రంగ
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
హంగుగా తాళ్లపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ కీర్తనను చాలా మధురంగా గానం చేశారు. ఇంకా మన తెలుగు వారైన ప్రియా సిస్టర్స్ సైతం అద్భుతంగా ఆలపించారు. 1945లో ‘స్వర్గసీమ’ అనే సినిమా కోసం బి.జయమ్మ, 1952లో ‘చిన్నమ్మ కథ’ సినిమా కోసం పి.లీల జో అచ్యుతానంద పాటను గానం చేశారు. ఇవి ఇప్పటికీ చాలాచోట్ల వినవస్తూనే ఉంటాయి.
Review అమ్మవేళ్ల ఉంగరాలు.