పూర్వం ఒక అడవిలో అనేక రకాలైన పక్షులు ఉండేవి. అవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని సుఖంగా, స్వేచ్ఛగా జీవిస్తుండేవి. అలాగే, ఒక్కోసారి వాటికి వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండేది. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని ఆనందంగా ఆ అడవిలో జీవిస్తుండేవి.
ఇదిలాఉండగా, ఒకరోజున ఆ అడవిలోకి ఎక్కడి నుంచో ఒక ముసలి కోతి వచ్చింది. అది కొద్దికాలానికే ఆ అడవి జంతువులతో బాగా కలిసిపోయింది. వాటితో కలసిమెలసి తిరుగుతూ, తన ప్రవర్తనతో తెలివైనదని అనిపించుకుంటూ ఆ జంతువులు, పక్షుల మధ్య చెలామణి అయ్యేది.
ఇలా ఉండగా, కొంతకాలానికి ఆ అడవిలోని పక్షులకు, జంతువులకు తమలో తాము ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. తాము గొప్ప అంటే తామే గొప్ప అంటూ ఇరుపక్షాలూ వాదులాడుకున్నాయి. ఎంతసేపటికీ వాటి తగవు తీరలేదు. చివరకు ఆ జంతువులు, పక్షులు అన్నీ కలిసి ముసలి కోతి వద్దకు వచ్చాయి. తమలో ఎవరు గొప్పో తేల్చి చెప్పాలని దాన్ని కోరాయి.
ముసలికోతి నెత్తి గోక్కుంటూ, పేలను నోటిలో వేసుకుంటూ, వాటితో ఇలా అంది-
‘మీలో ఎవరు గొప్పో తేల్చాలంటే ముందుగా మీరు పక్షులలో పక్షులు, జంతువులతో జంతువులు ఇట్లా ఒకరితో మరొకరు యుద్ధం చేయండి. అప్పుడు ఎవరు మిగులుతారో వారే గొప్ప కింద లెక్క’.
ముసలికోతి మాటలు వినడంతోనే పక్షులు, జంతువులు తమలో తాము కలహానికి దిగాయి. విచక్షణ మరిచిపోయి ఒకదానిపై మరొకటి పడి ముష్టియుద్ధానికి దిగాయి. అప్పుడు ఆ అడవి అంతా జంతువులు, పక్షుల అరుపులు, గర్జనలతో కోలాహలంగా మారిపోయింది. ఆ సమయంలో ఆ అడవికి చెంతనే గల పల్లెలో కొందరు బోయవాళ్లు ఉన్నారు. వారంతా పక్షులు, జంతువుల వేట కోసం సిద్ధంగా ఉన్నారు. ఈలోగా అడవిలోని కోలాహలమంతా వారి చెవిన పడింది. వెంటనే విల్లు బాణాలు తీసుకుని పరుగున అడవిలోకి వచ్చారు. తమలో తాము కలహించుకుంటున్న పక్షులు, జంతువులపైకి బోయవాళ్లు బాణాలు గురిపెట్టి వదిలారు. మామూలుగానైతే అవి వేటగాళ్ల ఉచ్చుకు, గురికి దొరక్కుండా తెలివిగా తప్పించుకునేవి. ఇప్పుడవి తమలో తాము దెబ్బలాడుకుంటూ వేటగాళ్ల ముప్పును గమనించలేకపోయాయి. దీంతో చాలా వరకు పక్షులు, జంతువులు వేటగాళ్ల బాణం దెబ్బలకు బలైపోయాయి. ఇన్నాళ్లూ ఒక్క పక్షీ, జంతువూ దొరకక, నిరాశతో రోజూ వెనుదిరిగిన అనుభవం గల వేటగాళ్లు దొరికిందే అదనుగా దొరికిన వాటిని దొరికినట్టు వేటాడసాగారు. ఇలా చాలా జంతువులు, పక్షులు బాణం దెబ్బలు తగిలి అక్కడికక్కడే మరణించాయి. మరికొన్ని మాత్రం తెలివి తెచ్చుకుని వేటగాళ్ల గురికి చిక్కకుండా తప్పించుకుని అడవిలోకి పారిపోయాయి. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్ని పక్షులు, జంతువులు కలిసి చెంపలేసుకున్నాయి. తమలో తాము కలహించుకుని, తెలివి తప్పి ప్రవర్తించడం వల్లనే వేటగాళ్లకు చిక్కి తమలోని కొన్ని జీవులు బలైపోయాయని రోదించాయి. అప్పటి నుంచి తమలో ఎవరు గొప్ప అనే భేషజాలకు పోకుండా అంతా కలసిమెలసి సుఖంగా జీవించాలని నిర్ణయించుకున్నాయి. అందరమూ సమానమనే భావంతో ఐక్యమత్యంతో జీవించాలని ప్రతినబూనాయి.
నీతి: ఎవరు గొప్ప అని కాదు. అందరూ కలిసి ఉంటేనే సుఖం.
Review ఎవరు గొప్ప?.