చక్కా వచ్చాం చక్కగా వచ్చాం..

కుదురుగ పాపడూ

కుదురుగ పాపడు గుమ్మడికాయ
విరిసిన పాపడు విఘ్నేశాయ
సాగిన పాపడు సాంబశివాయ
చెలగిన పాపడు శ్రీకృష్ణాయ
అందెల పాపడు ఆంజనేయాయ
చెంగటి పాపడు శ్రీలోలాయ
జోలిన పాపడు జోసూర్యాయ
సందిట పాపడు సహచంద్రాయ
తారుచు పాపడు తాతారాయ
బొజ్జన్న పాపడు పూర్ణబ్రహ్మాయ
ఆడిన పాపడు ఆనందాయ

కృష్ణమ్మా

వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమ్మా
ఆవుల కాసే కృష్ణమ్మ వీడే ముద్దుల కృష్ణమ్మ
కాళ్లగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి
మెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండి
చదువులనిచ్చే కృష్ణమ్మా
సంపదలిచ్చే కృష్ణమ్మా
పాపల కాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మ
వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమా

పాపాయి కన్నుల్లు కలువరెక్కలు

పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
పాపాయి జుంపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు
పాపాయి చేతులు పొట్లకాయల్లు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మ పండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిలకల్లు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెలు

పప్పు పెట్టి పాయసం పెట్టి

పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యిపోసి ముద్ద చేసి
ముద్దు చేసి తినిపించి
చేయికడిగి మూతికడిగి
తాతగారింటికి దారేదండి
అత్తారింటికి దారేదండి
ఇట్లా పోయి అట్లా పోయి
మోచేతిపాలెం ముందర
నుంచి పోయి
ఇట్లా పోయి అట్లా పోయి
అదిగో వచ్చాం ఇదిగో వచ్చాం
చక్కా వచ్చాం చక్కగ వచ్చాం
చక్కిలి గిలిగిలి చక్కిలి గిలి

Review చక్కా వచ్చాం చక్కగా వచ్చాం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top