పలుకుబడి

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని
పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

పొరుగూరి సేద్య
సేద్యం అంటే.. కష్టం ఎక్కువ.. లాభం తక్కువ. మన కష్టాన్ని నమ్ముకుంటే మాత్రమే చాలదు. విధిని కూడా విధిగా నమ్ముకోవాలి. అన్నీ కలిసొస్తే రైతుకు కలిసివస్తుంది. అతడి కంట్లో వెలుగు నిండుతుంది.
చేయూత ఇవ్వడానికైనా, మాట సాయానికైనా మన వాళ్లంటూ కొందరు ఉండాలి. మన వాళ్లంటూ కొందరు ఉన్నప్పటికీ సేద్యం అనేది ముళ్ల మీద నడకైనప్పుడు ఇక పొరుగూరిలో సేద్యం అనే వ్యవహారంలో ఎన్నెన్ని కష్టాలు ఉంటాయో కదా!
ఈ నేపథ్యంలో నుంచే ‘పొరుగూరి సేద్యం.. తనను తినేదే కానీ, తాను తినేది కాదు’ అనే సామెత పుట్టుకొచ్చింది.
అయితే, ‘పొరుగూరి సేద్యం’ అనే జాతీయాన్ని కేవలం వ్యవసాయం విషయంలోనే కాదు.. ‘ఫలానా పని కలిసిరాదు’, ‘ఫలానా పని చేయడం వల్ల సమయం వృథా’, ‘ఫలానా పనిలో శ్రమ అధికం.. ఫలితం శూన్యం’లాంటి విషయాల్లోనూ ఉపయోగిస్తుంటారు.
సాధారణంగా మన తెలుగులో ‘పొరుగింటి పుల్లకూర’ జాతీయం కూడా ఎక్కువగా వాడుకలో ఉంది. దాదాపు ఇది కూడా దానికి సరిపోలే జాతీయమే. మనం తినే కూర కంటే పొరుగింటి కూరే రుచిగా ఉందని అనుకుంటాం. అలాగే, రైతులు తాము చేసే వ్యవసాయాన్ని నష్టదాయకంగా భావిస్తుంటారు. పొరుగు రైతులు చేసే సేద్యాన్ని మాత్రం ‘భలే చేస్తున్నాడు’ అని భావిస్తారు. నిజానికి ఇది భావన మాత్రమే. అవతలి రైతు తన సేద్యంలో ఎంత కష్టనష్టాల పాలవుతున్నాడో ఇవతలి రైతుకు తెలియదు. అయితే, అతను లాభపడుతున్నట్టే భావిస్తాడు.

అటైతే వైద్యకట్నం ఇటైతే వైతరణీ గోదానం
ప్రాణసంకట పరిస్థితుల్లో మీద పడే ఖర్చుకు అట్టే బాధపడకుండా ఎవరికి వారే నచ్చ చెప్పుకునేందుకు పుట్టిన జాతీయం ఇది. ఇదివరకటి కాలంలో రోగి చావు బతుకుల్లో ఉన్నప్పుడు వైద్యుడికి గోవును సమర్పించుకుంటే రోగం కుదిరి ప్రాణా పాయం తప్పుతుందని నమ్మేవారు. నమ్మ కాలు ఎల్లవేళలా పనిచేయవు కదా!. వైద్యు డికి గోవును ఇచ్చుకున్నప్పటికీ ఒక్కోసారి రోగి గుటుక్కుమనే వాడు. అదృష్టవశాత్తూ వైద్యం పనిచేసి రోగికి నయమైతే వైద్యుడికి ఇచ్చిన గోవును వైద్యకట్నంగా సరిపెట్టుకునేవారు. అలాకాకుండా, రోగికి ఆయువు తీరి చనిపోతే, ఎలాగూ అంత్యక్రియల్లో చేయాల్సిన వైతరిణి గోదానాన్ని ముందుగానే చేసేసినట్టుగా భావించి ఊరట చెందేవారు. అంటే, ఏదీ దక్కలేదనే అర్థంలో ఎక్కువగా ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

పిల్లినడక
పిల్లి నడిస్తే చప్పుడు రాదు. అందుకే దాని రాకపోకలను కనిపెట్టడం కష్టం. ఏదో వస్తువు కింద పడితే కానీ దాని ఉనికి అనేదే తెలిసిరాదు. దొంగలు కూడా పిల్లినడకనే అనుసరిస్తారు. ‘పిల్లినడక’ అనేది ‘ఎవరికీ అనుమానం రాకుండా’ అనే అర్థంలో వాడుతుంటారు. అమాయకంగా, నిశ్శబ్దంగా
ఉంటూనో, ఎవరికీ తెలియ కుండా మోసం చేసే వ్యక్తిని ‘పిల్లి నడక నడిచే వ్యక్తి’ అంటారు.

సామెత కద
‘‘అఆలు రావుకానీ అగ్రతాంబూలం నాకే అన్నాట్ట’’
కొందరు ఏమీ రాకున్నా, చేయకున్నా అంతా తమకే దక్కాలని అనుకుంటారు. ఉదాహరణకు రాజకీయాలను తీసుకుందాం. ఎందరో కార్యకర్తలు ఉంటారు. కొందరే నాయకులు ఉంటారు. ఒకాయన ఎంతోకొంత పలుకుబడి
ఉన్నప్పటికీ.. తన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుని
ఉంటాడు. ఏదైనా సందర్భంలో పార్టీ సమావేశం జరిగినపుడు అతని కంటే పేరు, పలుకుబడి ఉన్న నేతలను వేదికపైకి పిలుస్తారు. కానీ, ఈయనను పిలవరు. ఎందుకంటే వారితో పోలిస్తే ఈయనకు ఉన్న జనాదరణ, పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు అంతంతే. కానీ, తనను వేదికపైకి పిలవాలని, సన్మానించాలని ఈయన ఉబలాట పడతాడు. అటువంటి సందర్భాలలోనే ఈ సామెతను ప్రయో గిస్తుంటారు. మనం ఏదైనా కోరుకుంటున్నామూ అంటే అందుకు తగిన అర్హత ఉండాలి. అవి మనకు ఉన్నాయా లేవా? అనేది ఆలోచించాలి అనే నీతిని ఈ సామెత బోధిస్తుంది.

‘‘అగడ్తలో పడ్డ పిల్లికి అక్కడే వైకుంఠం’’
ఒక పిల్లి బద్ధకస్తురాలు. ఏ పనీ చేయదు. తన సహజ స్వభావం అయిన వేటను కూడా అది విడిచిపెట్టేసింది. తానున్న స్థితినే అది ప్రేమిస్తుంది. ఒకనాడు అది గోతిలో పడింది. అందులో నుంచి బయటపడాలనే విషయాన్ని ఆలోచించడం మానివేసి.. అందులోనే సుఖాన్ని వెతుక్కునే ప్రయత్నం చేసింది.
కొందరు ఏ పనీ చేయరు. ఎటువంటి ప్రయత్నాలూ చేయరు. ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం ఎదగాలని కానీ, మారాలని కాని అనుకోరు. తామున్న స్థితినే కంఫర్ట్ జోన్‍గా భావించి అదే భ్రమలో బతికేస్తుంటారు. అటువంటి వారిని ఉద్దేశించి ఈ సామెత ఉపయోగిస్తుంటారు.

‘‘అడుక్కునే వారికి అరవై ఆరు కూరలు’’
నిజానికి ఇది ఎవరినీ కించపరచడానికి కాదు కానీ, తెలుగులో బాగా వ్యాప్తిలో ఉన్న సామెత ఇది. సాధారణంగా ఇళ్లలో ఒకటి రెండు మించి కూరలు చేసుకోం. వీటిని తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. వండని కూరనో, లేదా తమ మనసులో తినాలని ఉన్న కూరనో కావాలని మారాం చేస్తుంటారు. అటువం టప్పుడు తల్లిదండ్రులు- ‘చేసింది తిను. పద్నా లుగు కూరలు వస్తాయనుకున్నావా? అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు. మనకెలా అవన్నీ వస్తాయి. పెట్టింది తిను’ అంటుండటం కద్దు. నిజానికి ఒక ఇంట్లో ఉన్న అందరి కోరికలకు తగినన్ని కూరలు రోజూ వండటం సాధ్యం కాదు. వండినవి తినడానికి మనస్కరించని వారిని ఉద్దేశించి ఈ సామెత ఉపయోగిస్తుంటారు. అలాగే, ఇదే సామెతను మరికొన్ని సందర్భాల్లో కూడా వాడుతుంటారు. ఉదాహరణకు కొందరు అతి ఎక్కువగా చేస్తుంటారు. తమకు ఉన్నవన్నీ ప్రదర్శించాలని అనుకుంటారు. అటువంటి వారిని చూసి ఇతరులు ‘వాడికేంటిరా.. అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలన్నట్టు.. వీడికి వాళ్ల నాన్న సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎంతైనా అనుభవిస్తాడు’ అని ఉదహరిస్తారు.

Review పలుకుబడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top