‘పసి’డి పలుకుల జైసీతారాం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే.
మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

పిల్లలు బడిలో కానీ, ఇంట్లో కానీ మొదట పాడుకునే పాట.. ‘చిట్టి చిలకమ్మ.. అమ్మ కొట్టిందా..’. నిజానికి ఇదెంతో ప్రాచుర్యం పొందిన పిల్లల పాటే అయినా.. అంతకంటే గేయాలు లేవా పిల్లల కోసం? పిల్లల పాటలు, గేయాలను ఎంతోమంది రాశారు. కానీ, అవన్నీ తరగతి గదిలో ఉపాధ్యాయులు, పిల్లలు తేలికగా పాడుకునేలా ఉండవు. కొందరు మాత్రమే పిల్లల హృదయాలను హత్తుకునేలా వారి కోసం గేయాలు రాయగలరు. అలా ఆణిముత్యాల్లాంటి పిల్లల పాటలు రాసిన వారిలో జైసీతారాం ఒకరు. ఆయన దాదాపు 150 వరకు పిల్లల గేయాలు రాశారు. అవన్నీ కూడా ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి. పిల్లలు లయబద్ధంగా, సులువుగా, రాగయుక్తంగా పాడుకునేలా ఉంటాయి. జైసీతారాం పిల్లల పాటలు రాయడమే కాదు.. వారితో కలిసి ఆడిపాడారు. వారి మనసులను దోచుకుని, అనుభూతి పొంది.. ఆ అనుభవసారాన్ని అక్షరీకరించి, ‘మేం పిల్లలం’ అనే ఓ పుస్తకానికి రూపాన్నిచ్చారు.
పిల్లల మనోభావాలకు అద్దం పట్టే ఈ చిట్టి గేయాన్ని ఒకసారి చదవండి..

అద్దంలో ఎవరమ్మ
ముద్దు మొగం బొమ్మా?
నే నెట్లు దువ్వితే
తానట్టె దువ్వు!
నేనెట్లు నవ్వితే
తానట్లె నవ్వు!

పిల్లలకు అత్యంత ఇష్టమైన వాటిలో అద్దం ఒకటి. కళ్లజోడు, టోపీ, దుస్తులు, మేజోళ్లు చిన్నారులకు అతి ఇష్టమైన వస్తువులు.
వాటిని వేసుకొన్నప్పుడు వారి కళ్లలో ఆనందం, గర్వం తొణికిసలాడుతుంటాయి. అలాంటి ఒక భావనను జైసీతారాం పై గేయంలో అందంగా అక్షరీకరించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబితే పిల్లలు వినరు. దాన్నే అందమైన గేయం రూపంలోకి మార్చి చెబితే.. కచ్చితంగా వింటారు.. పాటిస్తారు. సీతారాం అదే పని చేశారు.

ఈగా! ఈగా! వెళ్లిపో!
ఇల్లు విడిచి వెళ్లిపో
సుబ్బరంగ నువ్వుంటె
చెప్పకుండా వెళతా
దోమా! దోమా! వెళ్లిపో!
దూరంగా వెళ్లిపో
మురుగు నీరు లేకుంటె
తిరిగైన చూడను

యాభైయ్యారక్షరాల తెలుగు వర్ణమాలతో చిన్నారులకు దోస్తీ పెంచడానికి ఆయన మరో చక్కని గేయం రాశారు.

అ ఆ ఇ ఈ నేర్వండి అయ్యవారూ
హక్షరంక అక్షరాలు యాభైయ్యారూ
ఉయ్యాల జంపాల ఉ ఊ ఋ ఋ
ఎక్కడ? ఏవి? ఎ ఏ ఐ
ఒహో! ఓహక్ష! ఒ ఓ ఔ
అం మమ్మమ్మమా! అ: హహ్హహ్హ!

… ఇలా సాగే గేయం పిల్లలు పాడుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. అక్షరాలే కాదు.. ఒత్తులు, సర్వనామాలు, పోలికలు జైసీతారాం గేయాల ద్వారా పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతారు.
పిల్లలకు రంగులు, రుచులు, అంకెలు కూడా అన్యాపదేశంగా ఒత్తులు నేర్పే గేయమిది..

అక్కా! పెట్టు
చుక్కా బొట్టు
అవ్వా! నాకు
బువ్వా పెట్టు
అమ్మా! నాకు
బొమ్మా ఇవ్వు
నాన్నా! నాకు
పెన్నూ ఇవ్వు

రుచులను తెలుపుతూ, ‘అరటిపండు తీపు.. ఆదివారం రేపు’, రంగులను వివరిస్తూ, ‘కాకమ్మ నలుపు.. కారుమబ్బు నలుపు’, జంతువుల అరుపులను అనుకరిస్తూ,

‘పిల్లి పిల్లి ఏమాంటావ్‍?.. మ్యావ్‍ మ్యావ్‍ మ్యా•
గేయాలు జైసీతారాం కలం నుంచి జాలువారాయి.
‘పిల్లి పిల్లి’
గేయాన్ని ఆయన తరగతి గదిలో పాడుతుంటే, పిల్లలు ఆయనతో శ్రుతి కలిపేవారు. దాంతో పరిసరాలన్నీ కుక్క, నక్క, పిల్లుల వంటి జంతువుల అరుపులతో మారుమోగేవి. ఆయన వివిధ వాయిద్యాల శబ్దాలను తెలిపే

‘తప్పిట కొడితే ఢం! ఢం! ఢం!’
వంటి గేయాలను రాగయుక్తంగా, భావయుక్తంగా పాడినపుడు పిల్లల ఆనందానికి అవధులు ఉండేవి కావు.
వివిధ వృత్తుల మీద ఆయన రాసిన గేయం

‘ఎంతోమంది పనివాళ్లు’
దగ్గర నుంచి వారాలు, ఆటలు, పనిముట్లు, బంధుత్వాలు, అనుబంధాలు, పిల్లల బాధ్యతలు.. ఇలా ఆయన సృజించని అంశమే లేదు. చెప్పుకుంటూపోతే ప్రతి గేయం ఒక ఆణిముత్యమే. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో మాతృభాషపై మమకారం పెంచడానికి ఆయన రాసిన కింది గేయమైతే మేలిమి ముత్యమే అని చెప్పాలి.
ఐతే మాత్రం మరువం! మరువం!
మాతృభాష మధురం
‘అమ్మా’ అంటూ అమృతం ఒలికే
కమ్మని పలుకే పలకండీ!
‘నాన్న’ అంటూ వెన్నెల విరిసే
వెన్న మాటనే వాడండీ!
అమ్మా! అమ్మా! నాన్నా! నాన్నా!
అమ్మా! అమ్మా! నాన్నా! నాన్నా!

ఎలాంటి సంగీత పరిజ్ఞానం లేనివారైనా సులభంగా, భావయుక్తంగా పాడుకోగల గేయాలివి.
జైసీతారాం గారు రాసిన గేయాలన్నిటికీ కలిపి ‘మేం పిల్లలం’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన గేయాలను జై
సీతారాం తానే బొమ్మలు వేసుకునే వారు. ‘బాల సాహిత్యం అంటే పిల్లలకు అర్థమయ్యే భాషలోనే ఉండాలి’ అని చెప్పే ఆయన.. తన రచనలో ఆ ప్రమాణాలనే పాటించారు.
చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి అక్షరం ఆలంబన కావాలని కోరుకున్న జైసీతారాం 2000 సంవత్సరం, అక్టోబరు 9న పరమపదించారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో, ప్రతి ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుని వద్ద, చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ‘మేం పిల్లలం’.
భాషాభివృద్ధికి, సృజనాత్మకత పెంపునకు ఎంతో దోహదపడే ఈ గేయాలను పిల్లలకు తప్పక పరిచయం చేయాలి.
కుటుంబ బంధాలు, భావాలు, పండుగలు, కాలాలు, కొలతలు, లోహాలు, ఆటలు, పక్షులు, జంతువులు, రంగులు, రుచులు, శబ్దాలు, అక్షరాలు, కారణాలు, కార్యకారణాల నుంచి చరిత్ర, భూగోళశాస్త్రం, సామాజిక అంశాల వరకు రచనా వస్తువు ఏదైనా కావచ్చు.
పిల్లలకు గేయం అర్థమైతే చాలు.. అది వారిలో ఊహాశక్తిని, పరిసరాల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ప్రేమించే తత్వాన్ని నేర్పుతుంది.
పిల్లల్ని విజ్ఞానఖనుల్లా తీర్చిదిద్దుతుంది. అలాంటి మేలిమి ముత్యాల్లాంటి గేయాలనే రాశారు జైసీతారాం. అవి చిన్నారుల్లో చదవాలనే తలంపును పెంచుతాయి. వాటి ఉజ్వల భవిష్యత్తుకు, వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి.

బాలల దినోత్సవం నాడే
ఆయన పుట్టిన రోజు

వేగుచుక్క లేచింది
తూరుపు వాకిలి తెరిచింది
గడపకు కుంకుమ పూసింది
బంగరు బిందె తెచ్చింది
ముంగిట వెలుగులు చల్లింది

పిల్లల కోసం అలతి అతలి పదాలతో, పొందికైన భావాలతో చక్కటి గేయాలను రాసిన జైసీతారాం.. 1924, నవంబరు 14న అంటే..
బాలల దినోత్సవం నాడే ఈ పిల్లల గేయకవి ఆంధప్రదేశ్‍లోని అనంతపురం జిల్లా కోగిర గ్రామంలో జన్మించారు. గౌని ఓబుల్‍రెడ్డి, చెన్నమ్మ తల్లిదండ్రులు.
ఉపాధ్యాయునిగా 1949-85 మధ్య కాలంలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పారు. 1983లో ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారాన్ని అందుకున్నారు. 1984-85 విద్యా సంవత్సరానికి రెండో తరగతి వాచకాన్ని రచించారు.
ఎక్కువ కాలం ఒకటో తరగతి ఉపాధ్యాయుడిగా, ఏకోపాధ్యాయుడిగా పని చేయడంతో పసిపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. పిల్లలకు సులువైన పద్ధతిలో బోధన చేయడానికి గేయాలను రాసి, పాడేవారు.
‘ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భయపడకూడదు. ఆటపాటలతో వారికి దగ్గరవ్వాలి. వారి మనస్తత్వాలను తెలుసుకుని చదువు చెప్పాలి. అదే నా లక్ష్యం’ అని చెప్పేవారాయన. అందుకు తగినట్టే ఆయన పిల్లల గేయాలను అనేకం రాశారు.
వాటికి నేటి కాలం పిల్లలకు మరింతగా పరిచయం చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి.

Review ‘పసి’డి పలుకుల జైసీతారాం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top