పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ , జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..
బిడ్డలు కొంచెం ఎదిగాక గోరుముద్దలు, గొలుసు ముద్దలు తినిపిస్తూ చందమామ ముచ్చట్లు చెబుతూ తల్లులు చందమామ పాటలు పాడతారు.
చందమామ రావె జాబిల్లి రావె
కొండెక్కి రావె గోగుపూలు తేవె
అని పాడుతూ మారాము చేస్తున్న బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి. ఇలా చేయడం ఈనాటికీ తెలుగు తల్లికి సరదా. ఆ మాటకు వస్తే బిడ్డను పెంచడంలో తెలుగుతల్లికి ఒక ప్రత్యేకత ఉన్నదని అనిపిస్తుంది. తన కనుసన్నలలో పెరిగిన బిడ్డలో వ్యక్తిత్వం తనంత తానే రూపొందుతుంది. ఆలోచన పెరుగుతుంది. ఊహలు ఊగిసలాడతాయి. తానే ఒక కవి అవుతాడు. గాయకుడు అవుతాడు. పాటలు కడతాడు.
ఉడతా ఉడతా ఊచ్
ఎక్కడికెళ్లా వోచ్
నూకలు పెడతా మేకలు కాస్తావ్?
పెద్దపులొస్తే జడవవుగా?
ఊగూ.. ఊగూ బసవన్నా
ఉలవలు తినరా బసవన్నా
ఇలా కొల్లలుగా పిల్లలు కాస్త పెరిగాక పాటలు పాడతారు. ఇది తెలుగు పిల్లల ప్రత్యేక ప్రవృత్తి. తెలుగు జానపద గేయాల సంపద. జోలపాటలు ప్రస్తుతం తెలుగునాట అపారంగా నిరాదరణకు గురై చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలినవి చాలా తక్కువ. ఉన్నవాటిలో కొన్ని ఇవి..
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద।।
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ।।జో।।
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ।।జో।।
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడుగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ।।జో।।
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కొండలనునేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ।।జో।।
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను
మాపుగానే వచ్చి మా మానములను
నా పాపడే చెరిచె నేమందుమమ్మ ।।జో।।
ఒకని యాలిని దెచ్చి నొకని కడబెట్టి
జగడములు గలిపించి పతిపతులబట్టి
పగలు నలు జాములను బాలుడై నట్టి
మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి ।।జో।।
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో బాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ।।జో।।
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమ్ముననున్న కంసుబడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
రీవితో నేలిన దేవకీపట్టి ।।జో।।
అంగుగా దాళ్లపా కన్నయ్య చా
శృంగార రచనగా జెప్పెనీ జోల
సంగతిగ నకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదన గోపాల ।।జో।।
పిల్లలకు విశేషంగా ఆసక్తిని కలిగించే సాహిత్య పక్రియలలో క్రమాలంకార సాధనాన్ని మించినది మరొకటి లేదు. ఒకే పదం పద్యంలో పదేపదే కానీ, పాటలో కానీ ఆమ్రేడితం కావడం వలన రచనకు సొబగు చేకూరుతుంది. అటువంటిది ఆకర్షణీయంగా ఉండటమే కాక అర్థంలో చమత్కారం మనసును ఆకట్టుకోవడం వంటి సత్ఫలితాలు లభిస్తాయి. అటువంటిది పోతన భాగవతంలోని ఒక పద్యం..
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెదవేరొండు గాధ పలుకగ నేలా?
ఈ పద్యంలో ‘పలుకు’ శబ్ద పలుగు గిలుకులు, కూర్చిన శోభ అంతా ఇంతా కాదు. ఇలాంటివే తెలుగునాట మరెన్నో పద్యాలు ఉన్నాయి.































































































































Review పాఠలే.. పాఠమై...