శ్రీరామ్‍ గారి లేఖలు

నా ప్రియమైన చెల్లాయికి..

మిగతా వ్యక్తుల విషయం తెలియదు కానీ.. నా మటుకు నాకు ఒంటరితనం ఎన్నో పాఠాలను నేర్పింది. అసలు నేను నేర్చుకున్నదంతా ఒంటరితనంలోనే. నా మనసు తుంటరితనం మాయమయ్యేది ఒంటరితనంలోనే. మనస్సును ఆక్రమించే ‘మాయ’ మూగబోయేది ఒంటరితనంలోనే. స్నేహితులపై ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో – నాకు ఒంటరితనమంటే అంత కన్నా ఎక్కువ ప్రేమ. నా పుట్టిన రోజున కూడా ఒంటరిగా ఉండటమే అలవాటు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒంటరితనం లోనే పుట్టాను, ఎదిగాను, తిరిగి ఒంటరిత నపు ఒడిలోకే ఎప్పుడూ ఒదుగుతూ ఉంటాను. చివరకు – నా చివరి శ్వాస కూడా ఒంటరిగా, ఎవరూ లేని చోట, ఎవరికీ తెలియకుండా వదలాలని ఆకాంక్ష.
నీలాంటి రాగమయి చెల్లాయి – తన గుండె వీణియపై వెలువరించే రసభరిత అనురాగ రాగాలు కూడా ఒంటరిగా వింటేనే ఆనందం. ఇక నా ‘ఒంటరితనం’ నీకు విసుగు కలిగించకముందే, నా ఒంటరితనాన్ని, ఒంటిదాన్ని చేయటం నా వంటికి మంచిదనుకుంటాను. నేను అక్కడికి వచ్చినపుడే చాలా భాగం మీ సమయాన్ని, సంతోషాన్ని తినివేశాను. అయినా అన్నయ్యతో అవస్థలు తప్పవు మరి. జూలై 17న హైదరాబాద్‍లో రవిని కలుద్దామనుకున్నాను. కాని అనుకోని అడ్డంకులు వల్ల వీలు కాలేదు. రవి, రాజు ఎలా ఉన్నారు?!
రవి – మనసు నిండా మమతల్ని పండించుకొన్న నిండు మనిషి. ఆధ్యాత్మికతను, జీవన వాస్తవికతతో సరైన పాళ్లలో మేళవించి – రెంటికీ న్యాయం చేయగల, చేస్తూన్న వ్యక్తి. తుఫానులో చిక్కుకొన్నా – చిన్మయత్వంతో తన్మయత్వం చెందగల నైపుణ్యం గల వ్యక్తి. ఎప్పుడూ పెదాలపై చెరగని నవ్వుతో, ఎవ్వరినీ నొప్పించక, బాధ ఉన్నా ఎవరికీ కనిపించకుండా తానే భరిస్తూ మమతల్ని పంచే మనిషి. ‘బాధ’ను సైతం ఆధ్యాత్మిక ‘బోధ’గా వాడుకోగల ప్రావీణ్యం ఉంది. సంసార వీణపై – ప్రాపంచికతను, ఆధ్యాత్మికతను సమన్వయించి – సంతోష సరిగమలు పలికించగలడు. అంతర్గతంగా బాగా ఎదుగుతున్నాడు. ఎంత ఎదిగినా, నమ్రతతో ఒదిగి ఉండగల మానసిక ఉన్నతి ఉన్న వ్యక్తి.
రవి – జీవన రతనాలపేటికలో ఎల్లప్పుడూ అమృత దరహాసాలు కదలాడాలనీ, అమృతం అద్దిన చంద్రకళల్లాంటి చిరునవ్వులు అన్ని వేళల్లో విసరాలనీ, తన జీవన రక్తనాళాల నడుమ ప్రవహించే చిన్మయ చైతన్య ధారల్లో పరవశించాలనీ, తన హృదయాంతర వీధులందు ఎప్పుడూ ఆనందదీపికలు వెలగాలనీ – ఆశిస్తూ … ఆనంద సమయాలలో కాకపోయినా సంతోషం సన్నగిల్లినపుడైనా – మమ్మల్ని – జ్ఞాపకం చేసుకోవాలని ఆకాంక్షిస్తాను.
నీ గురించి కూడా ‘రవి’ ఎన్నోసార్లు పొగడ్తల పొగడపూల పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అలాంటి వ్యక్తి భర్తగా లభించినందుకు నీవు అదృష్టవంతురాలివి. నీలాంటి వ్యక్తి భార్యగా దొరికినందుకు తనూ అదృష్టవంతుడు. మీలాంటి వ్యక్తులు నాకు ఆత్మీయులైనందుకు నేనూ అదృష్టవంతుణ్ణే. ఆధ్యాత్మికానంద జలధారల్లో మీ జీవితాల పైరు పంటలు పండాలని ఆశిస్తాను. మీ ఇద్దరి జీవితాలు రవ్వల వీణపై రాగమెత్తిన రీతిగా, వికసించిన వెన్నలరాత్రిలా విలసిల్లుగాక!
చిరంజీవులు పిల్లలు – ఎలా ఉన్నారు?! ఆదిత్య సైకిలుతో ఇంకా ఆడుతున్నాడా? బాబు స్కూలు అనుభవాలేమిటి? మీకు హ•మ్‍ వర్క్ పెరిగిందనుకుంటాను. ఇల్లాలి కంటి మిలమిలలో, పిల్లల బోసినవ్వుల గలగలలో – తేలే రవిరాజును చూస్తే – నాకు రోజూ ఈర్ష్య కలుగుతుంది.
నన్నూ, నా జీవితాన్ని – చూస్తే ఓ కవిగారి వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.

ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలేగాని,
ఇట ఉషస్సులు లేవు, భరింపరాని
అంబు వాహ సందోహ నిశాళికాని
వెన్నెలలు లేవు, వున్నను కన్నె లేదు, పైడి వన్నెల నెలవంక జాడ లేదు,
చుక్కలే లేవు, ఆకాశ శోకవీథి
ధూమథామమ్ము దు:ఖ సంగ్రామ భూమి.
బూజు పట్టి, దు:ఖభాజనంబైన శిథిలాలయం లాంటి నా జీవితానికి, రోజుల విరజాజులపై ఆనందంగా అడుగు లే•సే రవిరాజు జీవితానికి – ఎంత తేడా!?

ఏమ్మా! జ్యోతీ.. ఇంకేం రాయమంటావు?! నీవు దూరాన ఉన్నా.. హేమంత విభావరీ తుహిన బిందువు లాంటి నీ హృదయ సాగర తీరంలో కూర్చుని మమతల కెరటాల్ని మైమరచి చూస్తూ ఉంటాను.
నేను ఏమీ కాకపోయినా, నాలో ఏమీ లేకపోయినా, నేనెప్పుడో మరణించినా నాపై అమర అనురాగ వర్షధారల్ని కురిపిస్తున్న నీకు ఎలా కృతజ్ఞతలను తెలుపగలను?! మరొక్కమారు నీ చిరునవ్వుల సెలయేటి పాటను వింటూ మమతల బంగారు నీడల్లో సేద తీర్చుకోవాలని కాంక్షించటం తప్ప! అలా తప్ప నా జీవితంలో నిరంతరం స్రవించే స్వేదం ఆవిరవదు. మరొక్కమారు తమ్ముడు గోపీకి, రవిరాజుకు శుభాకాంక్షలు చెప్పండి. రవిరాజుగారి – అన్నయ్య వదిన గారికీ శుభాకాంక్షలు అందజేస్తూ – రవిరాజు అక్కయ్య ‘జ్యోతి’ గారిని కూడా అడిగినట్లు చెప్పగలరు. బాబు రాజేష్‍ కూడా స్కూలుకి వెళుతున్నాడనుకుంటాను. ప్రేమాశీస్సులు తెలుపగలరు. బేబీ దీప, వాళ్ళ సోదరుడు ఎలా ఉన్నారు ? వాళ్ళకూ శుభాకాంక్షలు.
నాకు ఒకవేళ – సోమరితనం వల్లనో, ఇంకే కారణం వల్లనో ఉత్తరాలు సకాలంలో రాయటం వీలు కాకపోయినా, మీరు మాత్రం వీలుండి, ఓపిక ఉండి రాయాలనిపించినపుడల్లా – రాస్తూ ఉండండి. దూరాలు దాటి దగ్గరలో కూర్చుని మాట్లాడుకోవటం వీలు పడదు కాబట్టి – ఉత్తరాలు ఆ లోటును భర్తీచేస్తాయి.
ఏమ్మా! ఇక మెల్లగా ముగించనా?! ఉత్తరం రాస్తూ ఉంటే నీవు ఎదుటే కూర్చుని వింటున్నట్లు అనిపిస్తుంది. రాయటం ఆపాలంటే మనసు ఒప్పటం లేదు. ఏదో అనంతంగా అలా రాస్తూ పోవాలని ఆకాంక్ష కాని పట్టపగ్గాల్లేని సోమరితనం, ఇక రాయలేమని స్ట్రైక్‍ చేస్తూ మొండికేస్తున్న వేళ్లు, నిద్రాదేవి మధ్యమధ్యలో విసరుతున్న క్రీగంటి చూపుల సమ్మోహన శక్తి, రాయటానికి ఏమీ అందివ్వక సమ్మె చేస్తున్న మెదడు – ఇవన్నీ ఇక మెల్లగా ఉత్తరాన్ని ముగించమని ఆజ్ఞాపిస్తున్నాయి. అపుడే అర్ధరాత్రి దాటిపోయింది. నీకు ఉత్తరాలు రాస్తున్నా, ఆప్యాయతల వలల్ని విసురుతూ సంభాషిస్తున్నా ‘గడియారం’ పై బాగా కోపం వస్తూంది. ఏదో పెద్దగా పని ఉన్నట్లు గడియారం ముళ్లు ఎలా పరుగెత్తుతున్నాయో చూడు!
అయినా రేయికి అలవాటు పడ్డ రాయిలాంటి జీవితం నాది కాబట్టి – ఎలాగో ఈ ధరాతలంపై నా జీవిత మృతకాయాన్ని ఈడుస్తూ, నడుస్తూ, నిలువెత్తు మంటల్లో తడుస్తూ, కాలాన్ని రబ్బరులా సాగదీస్తూ, విధి విసరికొట్టిన రబ్బరు బంతిలా తిరిగి ఎగురుతూ, అప్పుడప్పుడు అపార కారుణ్యంతో, ఆయాచితంగా కాలం – నీలాంటి చెల్లాయి రూపంలో అందజేసే – అనురాగాల అరటి గెలల్ని ఆహారంగా స్వీకరిస్తూ, నీలాంటి ఆత్మీయుల గుండె లోతుల్లోంచి ఎగసిపడే జీవజలధారల్ని తాగుతూ, వాళ్లు అందజేసే మమతల మణితోరణాలను మెళ్లోదాలుస్తూ జీవితంతో రణం చేస్తూ, మరణిస్తూ, తిరిగి జీవిస్తూ-శవంలా, జీవచ్ఛవంలా ‘సమాధి’లో సమయం గడుపుతూ ఉంటాను.
వెలుగు నీడల్ని కలబోసుకుని, సుఖదు:ఖాల సమ్మేళనంలో అనంతంగా సాగే ఈ జీవిత యాత్రలో మనకు చివరికి మిగిలేవి, మనకు ఆనందాన్ని నిజంగా మిగిల్చేవి – అందమైన ప్రబంధాల్లాంటి ఆత్మీయతాను బంధాలు రాల్చే రతనాల్లాంటి ఈ మధురానుభూతులే. చాలామంది అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడుస్తూ – జీవితాన్నంతా తీరిక లేనట్లు దేనికో వెచ్చిస్తూ, అసలే ప్రబంధ సుందరి నడుములా చిక్కిపోయిన క్షణభంగురమైన జీవితాన్ని వృధాచేస్తూ, చివరికి వ్యధల పాలైపోతుంటారు. ఈ ‘మాయ’ కబంధ హస్తాల్లోంచి బయటపడి జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవటం కఠోర ప్రయత్నం, అకుంఠిత దీక్షతో చేస్తే తప్ప దాదాపు అసాధ్యం. పసిపాప తన కంటి పాపలో పరమాత్ముణ్ణి దాచుకుందన్న విషయం ఎంతమందికి తెలుసు?! అలాంటి పాపను ఆయా ఒళ్లో వదలి, గుళ్లో భగవంతుణ్ణి వెదికేవాళ్లు ఎంతమంది లేరు? అమాయకంగా తప్పటడుగులు వేసే పసిపాపల మృదువైన పాదాలలో మధురమైన వేదనాదాలు ఎంత మంది వినగలరు?! అరవిరసిన ప్రకృతి అందాల్లో పరమాత్ముని పాదముద్రలు ఎంతమందికి కనిపిస్తాయి?! అంతెందుకు వాత్సల్యం వర్షించే, ఏ కన్నుల్లో కన్నయ్య లేడు?! అన్నిచోట్లా ఆనందంతో తాండవం చేసే భగవంతుడు సారం లేని భవసాగరంలో మునుగుతూ, మాయతో మూయబడ్డ కళ్లకు ఆయన ఎక్కడా కనిపించడు. ఆయన గొంతు కూడా సంసార సాగర ఫె•ష నిండిన చెవులకు వినిపించదు. శ్మశానంలో శివతాండవాన్ని శవాలు చూస్తున్నాయా ?! సముద్రపు అలల్ని చూడాలన్న నా చిరకాల కలలు మీ మద్రాసులో నిజాలయ్యాయి. అదీ మీలాంటి ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటూ మళ్లీ ఆ అవకాశం నా జీవితాకాశంలో ఎపుడు వస్తుందో?!
దూరాలు దాటి మద్రాసు సాగరాన్ని, నీ మనసు తీరాన్ని తాకేదెపుడో!? రెక్క విప్పుకొన్న రాజహంసలా ఆనంద గగనంలో ఎగిరేదెప్పుడో?! నిద్రాభారంతో రెప్పలు బరువెక్కుతున్నాయి. నీ మనో హిమవత్‍ పర్వత సానువుల నుండి జారిపడే అనురాగ గంగా ఝరీతరంగాలు తీగలుగా సాగి మనస్సును పెనవేసుకొంటున్నాయి. ఆప్యాయతల ప్రసూన పరిమళాలతో అలంకరించిన ప్రపుల్లమైన మీ రూపు నా మనోగవాక్షం గుండా తొంగి చూస్తూ, ఆనంద దీపాలను వెలిగిస్తూ, మనసును ముసురుతున్న చీకట్లను పారద్రోలుతుంది.
ఈ అనురాగబంధం ఏ రుణానుబంధమో!

త్వరలో ఉత్తరం రాస్తావు కదూ.
తమ్ముడు ‘గోపీ’కి మరొక్కమారు జ్ఞాపకం చేయగలవు!
‘‘ఈ ప్రపంచంలో ఉత్తమమైనది ప్రతీది నీ హస్తాల్లోంచి వొస్తుందని నీ వాగ్దానం.
అందువల్లనే నా కన్నీళ్లలో నీ కాంతి మెరుస్తుంది’’ –ఠాగూర్‍
– శ్రీరామ్‍ (ఆత్మీయులకు
రాసుకున్న లేఖల నుంచి..)

Review శ్రీరామ్‍ గారి లేఖలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top