ఉడతా ఉడతా
ఉడతా ఉడతా హూత్
ఎక్కడికి వెడతావు హూత్
సంతకు వెడతాను హూత్
ఏమిటి తెస్తావు హూత్
బెల్లం తెస్తాను హూత్
బెల్లం తెచ్చి నాకిస్తావా హూత్
నేనివ్వను పో! థూ
అరటి మొలిచింది
ఆదివారం నాడు అరటి మొలిచింది
సోమవారం నాడు సుడివేసి పెరిగింది
మంగళవారం నాడు మారాకు తొడిగింది
బుధవారం నాడు పొట్టి గెల వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది
శుక్రవారం నాడు పచ్చగా పండింది
శనివారం నాడు చకచకా గెలకోసి
అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో
అందరికీ పంచితిమి అరటి అత్తములు.
అఆలు దిద్దుదాం
అఆ అఆ అఆ, అఆలు దిద్దుదాం
అమ్మ మాట విందాం
ఇఈ ఇఈ ఇఈ,
ఇఈలు చదువుదాం
ఈశ్వరుడిని కొలుద్దాం
ఉఊ ఉఊ ఉఊ,
ఉఊలు దిద్దుదాం
ఉడుతలను చూద్దాం
ఎఏ ఎఏ ఎఏ, ఎఏలు
అంటూ అందరినీ పిలుద్దాం
ఒఓ ఒఓ ఒఓ, ఒఓఔ అంటూ
ఓనమాలు దిద్దుదాం
అంఅ: అందరం పాడుదాం
బాలలం
బాలలం మేం బాలలం
భావితరానికి దివ్వెలం
నవ నాగరికత వెలుగులం
సమ సమాజ నిర్మాతలం
మానవతకు వెలుగులం
మహోన్నతికి రూపాలం
వినయానికి సంపన్నులం
ఐకమత్య ప్రబోధకులం
నీ ఇల్లెక్కడ
చిలుకా చిలుకా నీ ఇల్లెక్కడ?
చెట్టు తొర్రలో నా ఇల్లు
పిచ్చుకా పిచ్చుకా నీ ఇల్లెక్కడ?
వేలాడే గూళ్లు నా ఇల్లు
కాకమ్మ కాకమ్మ నీ ఇల్లెక్కడ?
ఎత్తయిన చెట్టుపై నా ఇల్లు
నాగరాజా నాగరాజా నీ ఇల్లెక్కడ?
చీమల పుట్టే నా ఇల్లు
సింహమా సింహమా నీ ఇల్లెక్కడ?
కొండ గుహలే నా ఇల్లు
నత్తా నత్తా నీ ఇల్లెక్కడ?
నాతో ఉందిలే నా ఇల్లు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి
చిన్ననాటే బాట వేసేవి… అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే… అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
గతమెంతో
ఘనకీర్తి గలవోడా!
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!
చేయెత్తి జై కొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి – ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు – నిదురపోతుండాది
జై కొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! ।।చే।।
వీర రక్తపుధార – వారబోసిన సీమ
పలనాడు నీదెరా – వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవోడూ! ।।చే।।
కాకతీయ రుద్రమ, మల్లమాంబా,
మొల్ల మగువ మాంచాల నీతోడ బుట్టిన వాళ్లే
వీరవనితలగన్న తల్లేరా ! ।।చే।।
నాగార్జునుడి కొండ, అమరావతీ స్థూపం
భావాల పుట్టలో – జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశ దేశాలలో ।।చే।।
దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్న మాట మరువబోకన్నాడు
అమర కవి గురజాడ నీవాడురా!
ప్రజల కవితను చాటి చూపాడురా! ।।చే।।
రాయలేలిన సీమ – రతనాల సీమరా
చాయగట్టె పరులు – దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా!
వారసుడ నీవేరా తెలుగోడా! ।।చే।।
కల్లోల గౌతమీ – వెల్లువలా కృష్ణమ్మ
తుంగభద్రా తల్లిల – పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదవలేదన్నా! ।।చే।।
కోడీ కోడీ రావే
కోడీ కోడీ రావే
రంగుల కోడీ రావే
ఇదిగో బుట్ట చూడవే
ధాన్యమున్నదీ తినవే
పొడిచి పొడిచి తినవే
పొట్ట నిండా తినవే
మంచి నీళ్ళూ తాగవే
తెల్లని గుడ్డూ పెట్టవే
Review పిల్లల ఆటపాటలు.