మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
చెమ్మచెక్క
చెమ్మ చెక్క, చేరడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ, ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
చూచి వద్దాం రండి, సుబ్బరాయుడి పెండ్లి
సూర్యదేవుడి పెండ్లి చూచివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకువద్దాం రండి..!
గుడు గుడు కుంచం
గుడుగుడుకుంచం గుండే రాగం
పావడ పట్టల పడిగే రాగం
అప్పడాల గుర్రం ఆడుకోబోతే
పే పేగుర్రం పెళ్లికిపోతే
అన్నా! అన్నా! నీ పెళ్లెపుడంటే
రేపు కాక ఎల్లుండి
కత్తి కాదు, బద్ద కాదు గప్చిప్!
చుట్టాల సురబి
చుట్టాల సురభి – బొటన వ్రేలు
కొండేల కొరవి – చూపుడు వ్రేలు
పుట్టు సన్యాని – మధ్య వ్రేలు
ఉంగరాల భోగి – ఉంగరపు వ్రేలు
పెళ్లికి పెద్ద – చిటికెన వ్రేలు
తిందాం తిందాం ఒక వ్రేలు
ఎట్లా తిందాం ఒక వ్రేలు?
అప్పు చేసి తిందాం ఒక వ్రేలు!
అల్లీబిల్లీ పాట
కొండాపల్లీ కొయ్యా బొమ్మా
నీకో బొమ్మా నాకో బొమ్మా
నక్కాపల్లీ లక్కా పిడతలు
నీకో పిడత నాకో పిడత
నిర్మలపట్నం బొమ్మల పలకలు
నీకో పలకా నాకో పలకా
బంగినపల్లీ మామిడి పండ్లూ
నీకో పండూ నాకో పండూ
ఇస్తానుండూ తెచ్చేదాకా
చూస్తూ ఉండూ ఇచ్చేదాకా!
Review పిల్లల ఆటపాటలు….