లోకజ్ఞానం లేనిది పాండిత్యం ఎందుకు?

కొందరికి అపారమైన మేధస్సు ఉంటుంది కానీ, రోజువారీ వ్యవహారాలలో అది ఉప యోగపడక ఇబ్బందులు పడుతుంటారు. మనిషికి పాండిత్యమే కాదు, లోకజ్ఞానం కూడా ముఖ్యమే అని చెప్పేందుకు ఈ జాతీయాన్ని లేదా నానుడిని వాడుతుంటారు.
పూర్వం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఐదుగురు పండితులు వచ్చారు. ఎవరికి వారే సాటి. వారి ప్రతిభకు, పాండిత్యానికి రాయల వారు ముగ్ధులయ్యారు. వారిని బాగా పొగిడి, భారీగా సత్కరించాలని అనుకున్నారు. ఈలోపు మంత్రి తిమ్మరుసు వచ్చి- ‘పాండిత్యంతో పాటు లోకజ్ఞానం కూడా ముఖ్యమే. అది వీరిలో ఉందో లేదో పరీక్షిద్దాం. ఆ తరువాతే సత్కారం’ అన్నారు. రాయల వారు సరేనన్నారు. పండితులను పిలిచి, ‘మీరు స్వయంగా వంట చేసుకుని తిని రండి. ఆ తరువాత సత్కార కార్యక్రమం ఉంటుంది’ అన్నారు. పండితులకు పెద్ద వంటశాల కేటాయించారు. తర్కశాస్త్ర పండితుడు నెయ్యి తెస్తున్నప్పుడు అతనికి ఒక సందేహం వచ్చింది. ‘పాత్రకు నెయ్యి ఆధారమా? నెయ్యికి పాత్ర ఆధారమా?’ అని తెగ ఆలోచిస్తూ ఆ పాత్రను జారవిడిచాడు. నెయ్యి మొత్తం నేలపాలైంది. ‘నెయ్యికి పాత్ర ఆధారమనే సత్యం దీనితో నాకు బోధపడింది’ అని సంతోషించాడు.
వ్యాకరణ పండితుడు పెరుగు తేవడానికి వెళ్లాడు. అక్కడ ఎవరు ఏది మాట్లాడినా వారి మధ్య దూరి ‘ఆ పదాన్ని పలకాల్సింది అలా కాదు ఇలా’ అనసాగాడు. పుణ్యకాలం కాస్తా అక్కడే గడిచిపోయింది. ఇలా ఐదురుగు పండితులు తమ పాండిత్య భారంతో వంట చేసుకోలేక ఆకలి పాలయ్యారు. విషయం తెలుసుకున్న రాయల వారు ‘మీరు ఎంత గొప్ప పండితులైతే మాత్రం ఏమిటి? వ్యవహార జ్ఞానం లేకపోవడం వల్ల ఆకలితో బాధపడుతున్నారు’ అంటూ సుతిమెత్తగా మందలించి, వారికి భోజనం పెట్టి, ఆ తరువాత సత్కారం చేశాడు.
అందుకే అంటారు.. ‘మనం పాండిత్యం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, బతకడానికి అదెంత వరకు ఉపయోగపడుతుందనేదే ముఖ్యం’.

Review లోకజ్ఞానం లేనిది పాండిత్యం ఎందుకు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top