మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయ.
‘‘మనిషికి మాటే అలంకారం’’
మనం భౌతికంగా ఎంతగానైనా అలంకరించుకోవచ్చు. ఇదంతా పైకి కనిపించేది. కానీ, పైకి కనిపించని అలంకారం ఒకటి ఉంటుంది. అది మన ‘మాట’. మాటను బట్టే మనకొక విలువ ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. కొందరు అదేపనిగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్లు మాట్లాడే మాటలకు అడ్డూ అదుపూ ఉండదు. ఎవరి గురించైనా, ఎంతైనా మాట్లాడేస్తుంటారు. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. తాము మాట్లాడే దానిలో నిజమెంతో, అబద్ధమెంతో అనేది అసలు ఆలోచించరు. అంతా తాము చూసినట్టు, చేసినట్టే మాటలు వదిలేస్తుంటారు. ఇంకొందరు ఉంటారు. తమ మధ్యలో లేని మూడో వ్యక్తి గురించి అదేపనిగా మాట్లాడుతుంటారు. విమర్శలు చేస్తారు. నిందిస్తారు. మరికొందరు వదంతులను, పుకార్లను ప్రచారం చేస్తుంటారు. వాస్తవం, అవాస్తవం గురించి పట్టించుకోరు. చెవిలో ఏదైనా విషయం పడటం ఆలస్యం.. దాన్ని బయటకు వదిలేస్తారు. సదరు వదంతి వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా? అనేది అసలు ఆలోచించరు. ఇంకా మరికొందరు అయిన దానికీ కాని దానికీ తగాదా పెట్టుకుంటారు. మాటకు మాట అనడం ద్వారా ఘర్షణకు దిగుతారు. ఇంకా రకరకాల మనుషులు మన మధ్య ఉంటారు. ఎవరెలాంటి వారైనా కానీ, మాటలను ఆచితూచి మాట్లాడితేనే మర్యాదను ఇచ్చిపుచ్చుకో గలుగుతాం. మాటలు పొదుపుగా వాడాలి. ఏదైనా విషయం మాట్లాడేటపుడు సమయం సందర్భాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనం నిత్యజీవితంలో ఏదైనా మాట్లాడేటపుడు మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. నిజంగా ఆ విషయం గురించి మాట్లాడే అవసరం ఉందా?, దాని గురించి మాట్లాడటం వల్ల వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా?, ఆ విషయం గురించి మాట్లాడటం వల్ల ఇతరులకు కష్టనష్టాలు కలుగుతాయా? .. ఈ మూడు అంశాలను నిరంతరం మనం దృష్టిలో ఉంచుకుంటే జీవితంలో అనవసరంగా మాట్లాడే మాటలు వాటికవే తగ్గిపోతాయి. మనం ఏ విషయం గురించైనా స్థాయికి తగినట్టు మాట్లాడితే ఆ మాటల వల్ల గౌరవం పొందగలుగుతాం. చెడు విషయాలను మాట్లాడే వారిని ఏమంటారు? ‘వాడు ఎప్పుడూ చెత్త విషయాలే మాట్లాడుతాడు’ అంటారు. అలాగే, మంచి మాటలు మాట్లాడే వారిని ఏమంటారు? ‘అతను మాట్లాడే మాటల్లో చాలా నిజం ఉంది. వాటి గురించి ఆలో చించాల్సిన అవసరం ఉంది’ అంటారు. అందుకే మనం ‘మంచితనం’ అనే అలంకారం పొందాలంటే మంచి మాటలనే మాట్లాడాలి. మంచిని మాత్రమే మాట్లాడాలి. ఇది పైకి కనిపించని అలంకారం. కానీ, ఇంటా బయటా చాలా ప్రయోజనకం కలిగిస్తుంధీ.
Review మాటకు మాట నష్టమే సుమా!.