విశ్వంభర వైభవం..

ఈ ప్రకృతి దివ్యవైభవం మన హృదయాలను ఆనందమయం చేస్తుంది. పుడమి ధరించిన ముత్యాలదండలు, ఆ మంచుకొండలు. పృథ్వి హృదయమంత లోతైన లోయలు, ధాత్రి కీర్తిలా పరిమళించే పలు వర్ణాల పుష్పమాలికలు, ఇవి తిలకించి గాలిలో తేలియాడే మనస్సుల వలే విహరిస్తున్న విహంగాలు, పరవశాన పొంగి ప్రవహించే నదీనదాలు, వయ్యారాల మయూరాల నాట్యవిలాసాలు, కలువ కన్నెల చెక్కిళ్లపై జాబిలి తునకల వంటి మంచు బిందువులు – అహా! ఈ విశ్వమంతా విశ్వనాథుని దివ్యసన్నిధిగా అభివ్యక్తమవుతున్నది. నేను ఘనతరమైన నయాగరా జలపాతం వీక్షించినపుడు, ఉత్తుంగతరంగ సురగంగ అంగరంగ వైభవంతో గోచరించింది. పరతత్వం జలరాశిగా ప్రభవించిన పరమసత్యం నా మనోనేత్రానికి సాక్షాత్కరించింది. ఈ విధంగా లోకేశ్వరుని ఉనికి ప్రకటితమవుతుండగా అన్నిటా అంతటా ఎందుకు దైవాన్ని దర్శించలేం? సృష్టి అణువణువునా వెల్లివిరిసే సోయగాలను దర్శించితీరాలనేకాంక్షతో తపనపడే కళ్ళకు మాత్రమే ఈ దివ్యానందం లభ్యవుతుంది.
ఒక కవి, ‘ఇసుక రేణువులో శాశ్వతత్వాన్ని అనంతత్వాన్ని దర్శిస్తున్నాను’ అని అంటున్నాడు. సత్యాన్వేషి, ఆధ్యాత్మిక పథగామి అయిన వ్యక్తి ఇంకెంత సునిశితంగా అధ్యయనం చేయాలి? సౌందర్యానికి స్పందించే సున్నితత్వం కావాలి. అది లేకపోతే పర్వతసానువు రాళ్లగుట్టలా కనబడుతుంది.
సృష్టిలోని ప్రతి విషయం అసాధారణం, అద్భుతమనే సత్యం మనం గ్రహించలేకపోతున్నాం. విశ్వలోని ప్రతి అంశమూ అద్భుతమయమేకాదు, సౌందర్యభరితం కానీ అందరికీ ఇవన్నీ అందుబాటులోఉండటం వల్ల వాటి విలువను గుర్తించలేక, మరేవో అసాధారణమైన వాటి కోసం వెతుకుతున్నాం. మనకు పైకి అద్భుతంగా కనిపించే విషయాలు, తరచి చూస్తే సామాన్యమైనవే. ఎంతో మామూలుగా అనిపించే కార్యాలను నిశితంగా పరిశీలిస్తే అవి మహాద్భుతాలు. వీటన్నిటిలో దైవసన్నిధిని అనుభూతి చెందడం అలవరచుకోవాలి.
ఒకసారి మన జీర్ణవ్యవస్థను పరికించి, పరిశీలిద్దాం. జీర్ణక్రియ నోటితో ఆరంభమవుతుంది. ఆహారం నోటిలో చేరగానే ఆరగించడానికి అనుకూలంగా ఆహారాన్ని మెత్తగా చేసేందుకు ముప్ఫైరెండు గట్టి పిండిమరలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఎన్నిరకాల ఆహారాలు తానందిస్తున్నాడో అన్ని రకాల దంతాలు సృష్టించాడు. చీల్చడానికి కొన్ని, ముక్కలు చెయ్యడానికి కొన్ని, మెత్తగా నుజ్జుచెయ్యడానికి మరికొన్ని ఎంతోతెలివిగా, మనకనువుగా నిర్మించాడు. ఏదో చేశామంటే చేశాంలే అన్నట్టుగా చేశాడా! ఎంత అందంగా దంతాలమర్చాడు! ముఖసౌందర్యంలో ప్రముఖ స్థానమిస్తూ మిలమిలలాడే పలువరుసలు తీర్చిదిద్దాడు. అతని సౌందర్యకాంక్ష అటువంటిది! అన్నవాహికలో ఆహారం ప్రయాణించేటప్పుడు పొరబాటున ఊపిరితిత్తుల్లోకి జారకుండా ‘ఎపిగ్లాటిస్‍’ అనే పొరను అడ్డుగా ఉంచాడు అన్నపూర్ణాధీశుడు. జీర్ణాశయంలోని గాఢ హైడ్రోక్లోరిక్‍ ఆమ్లం ఆహారంలోని హానికర క్రిములను నశింపచేస్తుంది. యాంటీసెప్టిక్‍గా పనిచేస్తుంది. మన రక్షణ విషయంలో మన తండ్రికెంత ఆసక్తి! తీవ్ర గాఢత కలిగిన హైడ్రో క్లోరిక్‍ ఆమ్లం, జీర్ణాశయపు గోడలకు సునాయాసంగా రంధ్రాలు చేసి ధ్వంసం చేస్తుంది. ఈ ప్రమాదం నుండి తప్పించడానికి మ్యూకస్‍ పొరల లైనింగ్‍తో భద్రత కల్పించబడింది. ఎంత శ్రద్ధ విశ్వేశ్వరునికి! ఈ ఆమ్లంతో పాటు పెప్సిన్‍ అనే ఎంజైమ్‍ కలిసి, రెండు గంటలు ఆహారమథనం జరిగి కైమ్‍ అనే చిక్కటి ద్రవం ఏర్పడుతుంది. చిన్నప్రేవుల ముఖద్వారమైన డుయోడినమ్‍ నాలుగు రోడ్ల జంక్షన్‍ వంటిది. కుడివైపు నుంచి కాలేయం (లివర్‍) తయారు చేసిన పైత్యరసం, ఎడమ నుండి క్లోమం (పాన్‍క్రియాస్‍) పంపిన క్లోమరసం, పైనుండి జీర్ణాశయం చేరవేసిన ద్రవాహారం, ఈ మూడింటినీ క్రింద చిన్నప్రేవులలోకి జార్చుతుంది. జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‍ ఆసిడ్‍ ఒక ఆమ్లం. పాన్‍క్రియాస్‍లోని క్లోమరసం ఒక క్షారం. ఈరెండూ విరుద్ధలక్షణాలు కలవి. చిన్నప్రేవులలో ఈ రెండూ కలిసి పనిచేసి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. పరస్పర వ్యతిరేక ద్వంద్వాల కలయిక జగన్నాటకంలో అనివార్యమని శాస్త్రీయంగా నిరూపించాడు పరమేశ్వరుడు. పైకి వైరుధ్యం కనిపించినా ఒకదానికొకటి సహకరించుకుంటాయనీ, వాటి సమన్వయమే జీవనగమనమీ బోధించాడు. జీర్ణపక్రియలో భాగంగా జీర్ణవ్యవస్థలోని వివిధ అవయవాలు అనేక జీర్ణరసాలను, ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి. లాలాజలం, జఠరరసం, పైత్యరసం, క్లోమరసం వంటి రసాలు, పెప్సినోజిన్‍, రెనిన్‍, ఎమైలేజ్‍, లైపేజ్‍, ఎంటరోకైనేజ్‍, ట్రైప్సిన్‍, ఎరిప్సిన్‍ వంటి ఎంజైములు కలిసి ఆహారంలోని పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్) మాంసకృత్తులు (ప్రొటీన్స్) కొవ్వు పదార్థాలు (ఫాట్స్) జీర్ణం చేస్తాయి. తాను ఏయే ఆహారపదార్థాలను బిడ్డలకు అందిస్తున్నాడో అవన్నీ అరగడానికి ప్రేమతో కడుపులో ఏర్పాట్లు చేశాడు. అన్ని రుచులూ మనకు అవసరమేనని, తీపి, కారం, చేదు, పులుపు, ఉప్పు, వగరు అనే షడ్రుచులనూ అంగీకరించాలని తనదైన శైలిలో తెలియపరిచాడు. ఆహారసారం గ్రహించడానికి ‘జీర్ణరసాలు’, ఆనందసారం గ్రహించడానికి ‘నవరసాలు’ అనుగ్రహించాడు. రససిద్ధాంతానికి ఏకైక అలంకారమైనాడు సారసలోచనుడు.
ఇన్ని రసాయనపదార్థాలు మనం తయారుచేయాలంటే ఎన్ని పరిశ్రమలు స్థాపించాలి! ఎంత స్థలం కావాలి! ఎన్ని వనరులు, ఎంత సిబ్బంది కావాలి! ఎన్ని యంత్రాలు, ఎన్నెన్ని ముడిసరుకులు!. అమ్మో! వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేర్వేరు రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కష్టపడాలి. కానీ తండ్రీ! ఇంత తేలికగా, ఇంత తెలివిగా, ఇంత సహజంగా, కోట్ల సంవత్సరాల నుండీ కోటానుకోట్ల జీవులలో ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నావు! అదీ, గుట్టుచప్పుడు కాకుండా! ఇన్ని రసాయనకర్మాగారాలను చిన్నపొట్టలో ఎంత ఒద్దికగా పెట్టినావయ్యా! బ్రహ్మాండభాండాలు నీ కుక్షిలో నిక్షిప్తం చేసుకున్నావని పెద్దలు చెప్పిన మాటలు, ఇంత చూశాక నమ్మక తప్పటం లేదయ్యా భదాద్రినిలయా! నీ అనంత శక్తి సామర్య్థాలకూ,చాతుర్యానికీ, ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరించడం తప్ప మేమేం చేయ్యగలం!
చిన్నప్రేవులలో సూక్ష్మాతిసూక్ష్మంగా చేయబడిన పోషకపదార్థాలు విల్లై ద్వారా రక్తంలోకి, లింఫ్‍ వ్యవస్థలోకి పంపబడతాయి. జీర్ణం కాగా మిగిలిన వ్యర్థపదార్థాలు పెద్దప్రేవులలోకి చేరతాయి. తర్వాత శరీరం నుండి విసర్జింపబడతాయి. ఎంత విలువైన ఆహారం తీసుకున్నా, ఎంతో కొంత వ్యర్థపదార్థంగా మిగులుతుంది. ఎంత స్వచ్ఛమైన సంతోషమైనా, కొంత విషాదాన్ని శేషంగా మిగుల్చుతుంది. ఈ విశేషం అనునిత్యం చెప్పకనే చెపుతున్నాడు శేషశయనుడు. తీసుకున్న ఆహారం శరీరంలో శక్తిగా మారేందుకు కనీసం అయిదారు గంటల సమయం పడుతోంది. నోట్లో వేసుకున్న వెంటనే బలం వచ్చేయదు. ఓర్పు వహించాలి. ఎంత కృషి చేసినా ఫలితం రావలసిన సమయానికే వస్తుంది. సహనం విజయానికి వాహనం. ఇదే గరుడవాహనుని సందేశం.
ఈ అద్భుతజీర్ణపక్రియను తానే నిర్వహిస్తున్నానని భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో పురుషోత్తమయోగంలో స్పష్టంగా ప్రకటించాడు ప్రద్యుమ్నుడు.
‘‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్‍’’
(సర్వ ప్రాణుల శరీరముల యందుండి, ప్రాణ, అపానవాయు సంయుక్తమైన వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) రూపములో, నాలుగు విధముల ఆహారమును నేనే జీర్ణము చేయుచున్నాను)
ఇదంతా మనకేమీ పట్టదు. కడుపు నిండా సుష్టుగా భోజనం చేసి, ఒంటి నిండా దుప్పటి కప్పుకుని కంటి నిండా నిద్రపోతాం.
ఒకరోజు నా మిత్రడు అన్నవరం నుండి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తాం. ప్రసాదం తినడం దీవెనగా భావిస్తాం.
అన్నం అంటే ఆహారం, వరం అంటే కానుక అని అర్థం కదా! అన్నాన్ని వరంగా భావిస్తే అన్నవరాన్ని దర్శించినట్లు కాదా! రోజూ అందరం ఆహారం తీసుకుంటున్నాం. భోజనం సక్రమంగా జీర్ణం కావడం దీవెన కాదా? ఆహారం జీర్ణమై మనలో శక్తిగా మారడం దేవుని కానుక కాదా ? భగవంతుడు అనితరసాధ్యంగా నిర్మించి, కానుకగా ఇచ్చిన ఈ అమూల్యమైన శరీరాన్ని, ఉపవాసాలే ఆధ్యాత్మికత అనుకుని శుష్కింపచేసేవారికంటే, మంచి పోషణతో దేహదారుఢ్యాన్ని పెంచుకునే వస్తాదులు, ఆ శిల్పిచెక్కిన చక్కదనాలను మెరుగులు దిద్దుకునే సౌందర్యాభిలాషులు, దేవుని ఆకాంక్షను, ఆశయాన్ని తమకు తెలియకుండానే నెరవేరుస్తున్నారు.
ఈ స్థాయికి మన ఆలోచనాశక్తి ఎదిగినప్పుడు దైవానుగ్రహం మనపై ప్రసరించినట్లే. నిజానికి ఆధ్యాత్మికత అంటే ప్రకృతిని తన్మయత్వంతో అనుభవించటం ద్వారా, అందులో దాగిన పరమాత్మను ఆస్వాదించి అలౌకిక ఆనందాన్ని పొందటమే. ఈ విశ్వంభర వైభవ సౌరభాన్ని ఆఘ్రాణించటమే.

Review విశ్వంభర వైభవం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top