సామెత కథ

మన నోరు మంచిదైతే…
మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘‘సామెత’’లను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

‘‘నోరు మంచిదైతే ఊరు మంచిదవు తుంది’’.
ఇది ఇప్పటికీ చాలా వాడుకలో ఉన్న సామెత. మనం మాట్లాడే మాటలు బాగుండాలి.. మన మాటల్ని బట్టే అవతలి నుంచి స్పందన, ప్రతిస్పందన అనేవి ఆధారపడి ఉంటాయి. మనం మంచిగా మాట్లాడితే మంచి స్పందనే లభిస్తుంది. నోరు జారితే.. పరిస్థితి తారుమారవుతుంది.
ఈ సామెత ఎలా పుట్టిందనే దానికి సంబంధించి ఓ కథ కూడా వాడుకలో ఉంది. ఉదాహరణ..
సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తన వృత్తి నిమిత్తం వివిధ ఊళ్లు తిరిగే వాడు. అయితే, అతనికి కొంచెం నోటి దురుసు ఎక్కువ. ఏదైనా ఊరికి వెళ్లగానే.. ‘ఈ ఊళ్లో ఉండే వ్యక్తులు ఎటువంటి వారు? అందరూ మంచి వారేనా?, మర్యాదస్తులేనా? గొడవలు పడతారా?…’ ఇలా రకరకాలుగా కనిపించిన అందరి వద్దా ఆరా తీస్తుండేవాడు. అతను ఎక్కడికి వెళ్లినా ఇదే తీరు. ఇదే క్రమంలో మరో ఊరికి వ్యాపారం నిమిత్తం వెళ్లాడు. వెళ్లగానే తన అలవాటు కొద్దీ ఆ ఊళ్లో మనుషులు ఎటువంటి వారో ఆరా తీయడం మొదలు• •ట్టాడు. ఒకతని వద్దకు వెళ్లి ‘ఈ ఊళ్లో మనుషుల్ని చూస్తుంటే అందరూ అదోలా అనిపిస్తున్నారు. మంచి ఊరేనా ఇది?’ అని అడిగాడు. అతను ఒక్క క్షణం ఆలోచించి ‘‘నువ్వు శుద్ధ పనికిమాలిన వాడిలా ఉన్నావు’’ అన్నాడు. దీంతో సోమయ్యకు చిర్రెత్తుకొచ్చింది. నన్నే పనికిమాలిన వాడివి అంటావా అంటూ గొడవకు దిగాడు. ఇద్దరూ కలబడి దాదాపు కొట్టుకున్నంత పని చేశారు.
అవతలి వ్యక్తి నవ్వుతూ..
చూశావా? నిన్ను పనికి మాలిన వాడివి అనగానే నీకు రోషం తన్నుకొచ్చింది. అదే నువ్వు మంచోడివి అని ఉంటే ఎలా ఉండేది. ఈ గొడవ జరిగేదా? కాబట్టి మనం ఉపయోగించే భాష, మాటల్ని బట్టే ఊరైనా, మనుషులైనా మంచివాళ్లవుతారు. అంతే తప్ప ఊరైనా, మనుషులైనా పూర్తిగా మంచిగానూ ఉండరు, చెడ్డగానూ ఉండరు. నువ్వు అందరితో స్నేహంగా ఉండి, మంచిగా మాట్లాడితే నీతో అందరూ మంచిగానే ఉంటారు. చెడుగా మాట్లాడితే చెడ్డ స్పందనే లభిస్తుంది. ఊళ్లకే కాదు.. ఏ దేశానికైనా వెళ్లు. అక్కడి పరిస్థితు లను బట్టి నువ్వు మసులుకొంటూ, మంచిగా ప్రవర్తిస్తే అంతా మంచే జరుగుతుంది. దురుసుగా మాట్లాడి, దురుసుగా ప్రవర్తిస్తే అవతలి వారి నుంచి దురుసుతనమే ఎదురవుతుంది. కాబట్టి, మనం మాట్లాడే మాటల్ని ఆచితూచి వాడితే అంతా మంచే జరుగుతుంది’ అని హితవు చెప్పాడు.
దీంతో సోమయ్య కళ్లు తెరుచుకున్నాయి. అవతలి వ్యక్తుల మంచిచెడులనేవి తాను మాట్లాడే మాటల్ని బట్టే ఉంటాయని, అంతేతప్ప మనుషులు పూర్తిగా మంచిగా కానీ, చెడుగా కానీ ఉండరని, ఎటువంటి వారినైనా మృదువైన మాటలతో మాత్రమే ఆకట్టుకుని మంచితనాన్ని రాబట్టుకోగలమని సోమయ్య అర్థం చేసుకున్నాడు.

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top