అద్భుతహ: మార్గశీర్షోహ

2023- డిసెంబరు 1, శుక్రవారం, కార్తీక బహుళ చతుర్థి నుంచి
2023- డిసెంబరు 31, ఆదివారం, మార్గశిర శుద్ధ చతుర్థి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-కార్తీకం- మార్గశిరం- హేమంత రుతువు-దక్షిణాయణం

ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక – మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. డిసెంబరు 1, కార్తీక బహుళ చతుర్థి నుంచి డిసెంబరు 12 కార్తీక బహుళ అమావాస్య వరకు కార్తీక మాస తిథులు, ఆపై డిసెంబరు 13 మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి డిసెంబరు 31 మార్గశిర శుద్ధ చతుర్థి వరకు మార్గశిర మాస తిథులు కొనసాగుతాయి.
ఉత్పన్న ఏకాదశి, నాగ పంచమి, మోక్షద ఏకాదశి, మత్స్య ద్వాదశి, గీతా జయంతి, హనుమద్వ్రతం, దత్తాత్రేయ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటివి ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.

మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసానికి ‘మార్గశిర’ మాసం అని పేరు. మృగశిర అనే పేరుకు ‘అగ్రహాయణిక’ అనే పర్యాయనామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. అంటే మాసాల్లో మార్గశిరానిదే అగ్రస్థానమన్న మాట. అందుకే మనకు గల పన్నెండు మాసాల్లో అతి విశిష్టమైనదిగా, అగ్రగణ్యమైనదిగా ఈ మాసం ఉంది. ఒకప్పుడు మనకు సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అయ్యేదట. అందుకే కాబోలు శ్రీకృష్ణుడు గీతాబోధనలో తాను ‘మాసానాం మార్గశీర్షోహ:’ అన్నాడు. అంటే ‘మాసాలలో తాను మార్గశిరాన్ని’ అని భావం. కాబట్టి ఏ విధంగా చూసినా మార్గశిర మాసం ఉత్క•ష్టమైనది. మార్గశిరంతోనే హేమంత రుతువు ప్రారంభమవుతుంది. దీని మరుసటి మాసం పుష్యమితో కలిపి ఈ రుతువు కొనసాగుతుంది. హేమంత రుతువును భాగవంత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. కార్తీక మాసంలో పుట్టిన చలి.. మార్గశిరం నాటికి బాగా పెరుగుతుంది. ‘మార్గశిర మాసంలో పుట్టే చలి.. మంటలో పడినా పోద’ని సామెత. గజగజ వణికించే ఈ శీతాకాలపు మాసంలో మన పెద్దలు అందుకు తగిన ఆహార నియమాలను విధించారు. అందుకనుగుణంగా తగిన వ్రతాచరణను నిర్దేశించారు. ఇక, శ్రీమహా విష్ణువుకు ఈ నెలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. కుమారస్వామి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పూజలందుకుంటాడు. ఈనాటి పూజల పర్వాన్నే ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల్లో సుబ్రహ్మణ్య షష్టిగా వ్యవహరిస్తారు. త్రిమూర్తుల అంశతో జన్మించిన విశ్వగురువు దత్తాత్రేయుని జయంతి తిథి కూడా ఈ మాసంలోనిదే. ఇక, ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా మార్గశిర మాసంలోనే. ఇంకా మరెన్నో పండుగలకు, పర్వాలకు ప్రసిద్ధమైనది మార్గశిర మాసం. వాటి విశేషాలు తెలుసుకుందాం.

కార్తీక బహుళ చతుర్థి
డిసెంబరు 1, శుక్రవారం

కార్తీక బహుళ చతుర్థితో డిసెంబరు మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా చతుర్థి తిథి వినాయక సంబంధమైనది కాబట్టి ఆయనను ఈనాడు పూజించాలి. ఈ చతుర్థి బహుళ చతుర్థిగా ప్రతీతి. కార్తీక బహుళ చవితి నాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ పూజా పక్రియనే బహుళ చతుర్థి వ్రతంగా వ్యవహరిస్తారు. ఇది పన్నెండు సంవత్సరాలు లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు సంబంధించిన సౌభాగ్యప్రదమైన వ్రతాలలో ఇది ఒకటి. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఇక, ఏటా డిసెంబర్‍ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం.

కార్తీక బహుళ షష్ఠి
డిసెంబరు 3, ఆదివారం

ఈనాటి నుంచి జ్యేష్ట కార్తె ఆరంభమవుతుంది. ఈనాడు ప్రత్యేకంగా ఆచరించాల్సిన వ్రత విధులేమీ లేవు.

కార్తీక బహుళ సప్తమి
డిసెంబరు 4, సోమవారం

కార్తీక బహుళ సప్తమి నాడు వచ్చే పైతా మహాకృచ్ఛ వ్రతం మిక్కిలి విచిత్రమైనది. మనకు ఏటా అనేక వ్రతాలు వస్తుంటాయి. వాటి ఆచరణ విధానాలు రకరకాలుగా ఉంటాయి. అయితే కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో వివరంగా ఉంది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని ఆ గ్రంథంలో వివరించారు. అలాగే, సప్తమి తిథి సూర్యారాధనకు సంబంధించినది. కాబట్టి దీన్ని మిత్రా సప్తమిగానూ వ్యవహరిస్తారు.

కార్తీక బహుళ అష్టమి
డిసెంబరు 5, మంగళవారం

కార్తీక బహుళ అష్టమిని ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అని వ్యవహరిస్తారు. ఈ క్రమంలో ఈ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి వ్రతం కూడా ఆచరిస్తారు. సాధారణంగా ఏడాది పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమిని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సంవత్సరంలో వచ్చే కార్తీక బహుళ అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలనేది ఈ వ్రత నియమం. పేరును బట్టి ఇది దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే వ్రతం కావచ్చునని పండితుల అభిప్రాయం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. అష్టమి తిథి కాలభైరవుడి పేరున ప్రసిద్ధినొంది ఉంది.

కార్తీక బహుళ ఏకాదశి
డిసెంబరు 8, శుక్రవారం

మనకు ఏటా నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. వీటిలో బహుళ (కృష్ణ) పక్షంలో వచ్చే ఏకాదశులు కొన్ని కాగా, శుక్ల (శుద్ధ) పక్షంలో వచ్చే ఏకాదశులు మరికొన్ని. మొత్తానికి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంది. వీటిలో ఏ ఏకాదశి ప్రత్యేకత, విశేషం ఆ ఏకాదశిదే. ఈ క్రమంలో వచ్చే కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. దీనినే ఉత్పన్న ఏకాదశి అనీ అంటారు. ఆయా ఏకాదశుల నాడు వివిధ దేవతలను పూజించడం ఆచారమైతే.. చాలా వరకు ఏకాదశి తిథులు విష్ణు పూజార్హంగానే ఉంటాయి. ఇక, ఈ కార్తీక బహుళ ఏకాదశి నాడు ‘ఏకాదశి దేవి’ని పూజిస్తారు. ఏకాదశీ దేవి ఈ తిథి నాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే ఈ ఏకాదశికి ఆమె పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని పురాణ కథనం. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు
ఉపవాసం ఉంటారు.

కార్తీక బహుళ ద్వాదశి
డిసెంబరు 9, శనివారం

కార్తీక బహుళ ద్వాదశి యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. ఈనాడు దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.

కార్తీక బహుళ త్రయోదశి
డిసెంబరు 11, సోమవారం

కార్తీక బహుళ ద్వాదశి తిథి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమధర్మరాజుకు తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు. అలాగే, ఈనాడు ధన్‍తేరస్‍ పర్వాన్ని నిర్వహించుకునే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. దీనినే ధన్వంతరి త్రయోదశి అనీ అంటారు. ఈ సందర్భంగా ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటుంటారు. ఈ రెండు పర్వాల గురించి తెలుగు పత్రిక నవంబరు సంచికలో మనం వివరంగా తెలుసుకున్నాం.

కార్తీక బహుళ చతుర్దశి
డిసెంబరు 11, సోమవారం

త్రయోదశి ఘడియల్లోనే చతుర్దశి తిథి కూడా ఇమిడి ఉంది. కాబట్టి త్రయోదశి, చతుర్దశి తిథులు ఒకే తేదీన ఉన్నాయి. ఇక, కార్తీక బహుళ చతుర్దశి తిథిని సాధారణంగా చిత్రా చతుర్ధశిగా వ్యవహరిస్తుంటారు. ఈ తిథి భౌమవారం (మంగళవారం)తో కలిసి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అనడం పరిపాటి. ఈనాటి పూజా కలాపం శివుడికి సంబంధించినది. కాబట్టే ఈనాడు పరమేశ్వరుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలం (నువ్వుల నూనె)తో స్నానం చేయాలి. చంద్రాస్తమయ సమయంలో ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి. ఇంకా ఈనాడు చతుర్దశశాక భక్షణ, బ్రహ్మకూర్చ, యమ, జలకృచ్ఛ, కృచ్ఛ మున్నగు వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

కార్తీక బహుళ అమావాస్య
డిసెంబరు 12, మంగళవారం

గీతా జయంతి ఎప్పుడనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కార్తీక బహుళ అమావాస్య (డిసెంబరు 12, 2023) నాడని కొందరు, మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబరు 23, 2023) నాడని ఇంకొందరు అంటారు. కాబట్టి మనకు వివాదాలతో పని లేకుండా ఈ రెండు తిథుల్లోనూ గీతా జయంతిని నిర్వహించుకుంటే ఏ గొడవా ఉండదు. ఇక, గీతా జయంతి గురించి వ్యావహారికంలో ఉన్న వాస్తవాల ప్రకారం.. కార్తీక బహుళ అమావాస్య నాడు భగవద్గీత పుట్టిందని కొందరు అంటారు. అంటే ఈరోజు గీతా జయంతి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
కానీ, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జనన దినంగా నిర్ధారించి చెప్పడానికి లేదని ఇంకొందరు పండితులు వాదిస్తారు.

మహా భారత కాలమానం ప్రకారం.. మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది (58) రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. దీన్ని వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తిక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తిక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తిక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం నాడు, అనగా శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. దీనిని బట్టి కార్తిక బహుళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు. భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు దు:ఖ పీడితుడు అయ్యాడు. యుద్ధంలో తన బంధువులను వధించడం తన వల్ల కాదని శోకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం కార్తిక బహుళ అమావాస్య నాటి ఉదయమేనని అంటారు.
ఇక, మన తెలుగు పంచాంగాలలో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‍ 23, 2023) తిథి నాడే గీతా జయంతిగా పేర్కొన్నారు. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయమై ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి, పవిత్రమైన గీతా పఠనాన్ని, గీతా జయంతిని ఈ రెండు దినాల్లోనూ, అంటే.. ఇటు కార్తీక బహుళ అమావాస్య (డిసెంబర్‍ 12, 2023, మంగళవారం) నాడు, అటు మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‍ 23, 2023, శనివారం) నాడు సాగించడం మధ్యేమార్గం, పుణ్యప్రదం కూడా.

మార్గశిర శుద్ధ పాడ్యమి
డిసెంబరు 13, బుధవారం

ఈనాటి నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఇది హేమంత రుతువు ఆరంభ దినం. అలాగే, ధనుర్మాసం ప్రారంభం కూడా ఈనాటి నుంచే. ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర శుద్ధ తదియ
డిసెంబరు 15, శుక్రవారం

మార్గశిర శుద్ధ తదియ నాడు ఆచరించదగిన వ్రతాలు చాలానే ఉన్నాయి. ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ తదితర వ్రతాలు వీటిలో ముఖ్యమైనవి. వీటి గురించి వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి. అలాగే, ఈ తిథి నాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి దినం.

మార్గశిర శుద్ధ చతుర్థి
డిసెంబరు 16, శనివారం

చతుర్థి తిథి సాధారణంగా వినాయక పూజార్హమై ఉంటుంది. కాబట్టి ఈనాడు వినాయకుని ప్రీత్యర్థం పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరాలు గలిగిన వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు ఢుంఢి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది. ఢుంఢి అనే పదం గణపతి సంబంధమైనదే. కాబట్టి ఇది కూడా వినాయక సంబంధమైన పూజాకల్పమే.

మార్గశిర శుద్ధ పంచమి
డిసెంబరు 17, ఆదివారం

మార్గశిర శుద్ధ పంచమి తిథి నాడు దక్షిణాదిన నాగపంచమిగా ప్రసిద్ధి. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. కాగా, ధనుర్మాసం ప్రారంభం ఈనాటి నుంచేనని మరికొన్ని పంచాంగాలలో ఉంది.

మార్గశిర శుద్ధ షష్ఠి
డిసెంబరు 18, సోమవారం

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిథి. తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు,

పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారం. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు దట్టంగా అలముకుంటాయి. కానీ వర్షాలు పడవు. కాబట్టే వానలు కురవని మబ్బులను షష్ఠి మబ్బులని అంటారు. ఇక, తమిళులు మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగిందని ఐతిహ్యం.
పురాణగాథ ఇలా ఉన్నా.. ఇది ప్రధానంగా నాగులకు సంబంధించిన పర్వం. ఈనాడు నాగులను పూజిస్తారు. సంతాన భాగ్యం కోరుకునే వారు సర్పపూజ రూపేణా కుమారస్వామినే ఆరాధిస్తారు. పాములు వ్యవసాయదారులకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటాయి. ఎలుకలను తినడం ద్వారా ఇవి పంటలను కాపాడతాయి. అలాగే, చలి ముసురుకునే ఈ కాలంలో పాములు పొలాల్లోని బొరియలు, భూమి అడుగు భాగంలో దాక్కుని ఉంటాయి. వ్యవసాయ సంబంధ పనులు చేసేటపుడు అటు సర్పాలకు, తమకు కూడా హాని కలగకూడదనే ఉద్దేశంతో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు రైతులు ఎక్కువగా పువ్వులు, పడగలు సమర్పించి నాగపూజలు చేస్తుంటారు.
మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఇంకా చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలకు కూడా ప్రతీతమై ఉందని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.

మార్గశిర శుద్ధ సప్తమి
డిసెంబరు 19, మంగళవారం

మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్య పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.

మార్గశిర శుద్ధ అష్టమి
డిసెంబరు 20, బుధవారం

మార్గశిర శుద్ధ అష్టమి తిథి అటు దుర్గాపూజుకు, ఇటు కాలభైరవుని పూజకు ప్రతీతి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగానే ఆచరణలో ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి తదితర పేర్లు కాలాష్టమికి ఉన్నాయి.
ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహిమ విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’. ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తుతించిన స్తోత్రం మన భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తిరుగులేనిది.

మార్గశిర శుద్ధ నవమి
డిసెంబరు 21, గురువారం

మార్గశిర శుద్ధ నవమి నాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది. మొత్తానికి నవమి తిథి శక్త్యారాధనకు విశేషమైనది. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా అర్చిస్తారు. తెలుగు పంచాంగాలలో ఈనాటి తిథి గురించి శుక్ర మౌడ్యమి త్యాగము అని పేర్కొన్నారు. ఈనాడు నందిని నవమి అని తెలుగు పంచాంగాలలో ఉంది.

మార్గశిర శుద్ధ దశమి
డిసెంబరు 22, శుక్రవారం

మార్గశిర శుద్ధ దశమి తిథి నాడు ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించాల్సిన ఆయా వ్రతాల పేర్లను బట్టి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి ఉద్దేశించిన తిథిగా కనిపిస్తోంది.

మార్గశిర శుద్ధ ఏకాదశి
డిసెంబరు 23, శనివారం

మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి డిసెంబరు 23న ఉండగా, డిసెంబరు 22, దశమి తిథి నాడు మోక్షజ ఏకాదశి అని తెలుగు క్యాలెండర్లలో ఉంది. ఈమధ్య తిథుల విషయంలో తరచూ గందరగోళం నెలకొంటోంది. ఇదలా ఉంచితే, ఈ ఏకాదశి తిథి మోక్షజ ఏకాదశిగా ప్రతీతి. దీనినే ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ, ఈనాడు వైకాసనుడనే రాజు తన తండ్రికి తను ఆచరించిన వ్రతం ద్వారా మోక్షం కలిగించినందున మోక్షదైకాదశి అనీ అంటారు. దీనికే సౌఖ్యదైకాదశీ అనే పేరూ ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఇట్లు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనిని మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఇక, ఈనాడే గీతా జయంతి అని తెలుగు పంచాంగాలలో ఉంది.

మార్గశిర శుద్ధ ద్వాదశి
డిసెంబరు 23, శనివారం

మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి ఏకాదశి తిథితోనే కూడి ఉంది. కాబట్టి డిసెంబరు 23నే ద్వాదశి నాటి వ్రతకర్మలను ఆచరించాలి. ఇంకా ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం. భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.

మార్గశిర శుద్ధ త్రయోదశి
డిసెంబరు 24, ఆదివారం

మార్గశిర శుద్ధ త్రయోదశి తిథి నాడు అనంగ త్రయోదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని జరుపుతారు.

మార్గశిర శుద్ధ చతుర్దశి
డిసెంబరు 25, సోమవారం

మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శావ్రణికా తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆంబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
కాగా, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతిని కొన్ని ప్రాంతాల్లో ఈనాడే నిర్వహిస్తారు. మరికొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు ఆయన జయంతిని జరుపుతారు.

మార్గశిర శుద్ధ పూర్ణిమ
డిసెంబరు 26, మంగళవారం

మార్గశిర శుద్ధ పౌర్ణమి అనేక విధాలుగా ప్రశస్తమై ఉంది. ఈ పౌర్ణమి విశేషాల్లోకి వెళ్తే.. వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. మార్గశిర పూర్ణిమతో ఈ యమదంష్ట్ర దినాలు అంతమవుతాయి. మార్గశిర పూర్ణిమ నాడు ఆంధప్రదేశ్‍లోని పలు ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి ఉంది. ఇలా రొట్టెలు కొరికి కుక్కలకు వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం. మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది. మార్గశిర పూర్ణిమను తెలుగునాట కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడూ ఇలాగే నోము అసంపూర్తిగా ముగుస్తుంది. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. ఈనాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. జోగుళాంబ గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరులో సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం ఉంది. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.
ఇక దత్తాత్రేయుని జయంతి తిథి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడేనని కూడా అంటారు. మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల (శుద్ధ) చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం.

మార్గశిర బహుళ పాడ్యమి
డిసెంబరు 26, మంగళవారం

మార్గశిర బహుళ పాడ్యమి నాడు నవ సంవత్సరోత్సవ మహోత్సవం నిర్వహించాలని నీలమత పురాణం చెబుతోంది. ఇది కాశ్మీర్‍లో కొత్త సంవత్సర మహోత్సవమని తెలుస్తోంది. ఎందుకంటే నీలమత పురాణం కశ్మీర దేశానికి చెందిన విశిష్ట రచన. దీనిని బట్టి కాశ్మీర్‍కు ఇది ఉగాది పర్వదినం వంటిది. ఇంకా, ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

Review అద్భుతహ: మార్గశీర్షోహ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top