ఆధ్యాత్మిక ‘మార్గ’దర్శి

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో పదకొండో మాసం- నవంబరు. తెలుగు పంచాంగం ప్రకారం ఇది కార్తీక- మార్గశిర మాసాల కలయిక. ఈ మాసంలో నవంబరు 20, గురువారం వరకు కార్తీక మాస తిథులు కొనసాగుతాయి. ఆ తదుపరి నవంబరు 21, శుక్రవారం నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతాయి. కార్తీక, మార్గశిర మాసాల కలయిక అయిన ఈ నవంబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపూర్ణిమ – జ్వాలా తోరణం, ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన్న ఏకాదశి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటివి ప్రధాన పర్వాలు. ఇంకా సత్యసాయిబాబా జయంతి, బాలల దినోత్సవం (నెహ్రూ జయంతి) వంటివీ ఈ నెలలోనే పలకరిస్తాయి.

2025- నవంబరు 1, శనివారం, కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి
2025- నవంబరు 30, ఆదివారం, మార్గశిర శుద్ధ దశమి వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-కార్తీకం /మార్గశిరం-శరద్‍
-హేమంత రుతువులు- దక్షిణాయణం

మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసానికి ‘మార్గశిర’ మాసం అని పేరు. మృగశిర అనే పేరుకు ‘అగ్రహాయణిక’ అనే పర్యాయనామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. అంటే మాసాల్లో మార్గశిరానిదే అగ్రస్థానమన్న మాట. అందుకే మనకు గల పన్నెండు మాసాల్లో అతి విశిష్టమైనదిగా, అగ్రగణ్యమైనదిగా ఈ మాసం ఉంది. ఒకప్పుడు మనకు సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అయ్యేదట. అందుకే కాబోలు శ్రీకృష్ణుడు గీతాబోధనలో తాను ‘మాసానాం మార్గశీర్షోహ:’ అన్నాడు. అంటే ‘మాసాలలో తాను మార్గశిరాన్ని’ అని భావం. కాబట్టి ఏ విధంగా చూసినా మార్గశిర మాసం ఉత్కష్టమైనది. మార్గశిరంతోనే హేమంత రుతువు ప్రారంభమవుతుంది. దీని మరుసటి మాసం పుష్యమితో కలిపి ఈ రుతువు కొనసాగుతుంది. హేమంత రుతువును భాగవత దశమ స్కంధంలో వర్ణిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగి జలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. కార్తీక మాసంలో పుట్టిన చలి.. మార్గశిరం నాటికి బాగా పెరుగుతుంది. ‘మార్గశిర మాసంలో పుట్టే చలి.. మంటలో పడినా పోద’ని సామెత. గజగజ వణికించే ఈ శీతాకాలపు మాసంలో మన పెద్దలు అందుకు తగిన ఆహార నియమాలను విధించారు. అందుకనుగుణంగా తగిన వ్రతాచరణను నిర్దేశించారు. ఇక, శ్రీమహా విష్ణువుకు ఈ నెలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. కుమారస్వామి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పూజలందుకుంటాడు. ఈనాటి పూజల పర్వాన్నే ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల్లో సుబ్రహ్మణషష్టిగా వ్యవహరిస్తారు. ఇక, ఈ నెలలోని మొదటి 20 రోజులు కార్తీకమాసంలోనివి. కార్తీకపూర్ణిమ, జ్వాలా తోరణ ఉత్సవం, చిలుక ద్వాదశి వంటి కార్తీకమాసపు పర్వాలు ఈ మాసాన్ని దేదీప్యమానం చేస్తాయి. ఇంకా మరెన్నో పండుగలకు, పర్వాలకు ప్రసిద్ధమైనది కార్తీక- మార్గశిర మాసాల కలయిక అయిన నవంబరు మాసం. ఆయా పండుగలు, పర్వాల విశేషాలు తెలుసుకుందాం.

కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబరు 1, శనివారం

కార్తీక శుద్ధ దశమి చాలా విధాలుగా ప్రశస్తమైనది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఇది. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే ఈనాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని, దేవుత్తని ఏకాదశి, ఉత్థాన్న ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి.
అలాగే, నవంబరు 1 ఆంధప్రదేశ్‍ అవతరణ దినోత్సవం.

కార్తీక శుద్ధ ద్వాదశి
నవంబరు 2, ఆదివారం

కార్తీక శుద్ధ ద్వాదశి అనేక విధాలుగా ప్రసిద్ధం. ఈ తిథి అనేక వ్రతాలు, పూజలకు ముగింపు, ఆరంభ దినం. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని, అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిలుక ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. కాబట్టి ఈ ద్వాదశికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈనాడు తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యమని చెబుతారు. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. కేవలం ఉసిరితో తినే పదార్థాలను మాత్రమే తయారు చేస్తారు.
అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు నిద్రలేచి, క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటాడు.
కాబట్టే ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఏర్పడింది. కొన్నిచోట్ల కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కల్యాణం కూడా నిర్వహిస్తారు. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి, •కైశిక ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వివిధ వ్రతాలు ఆచరిస్తారు. ఈ వ్రత నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఈనాడు తిరుమల శ్రీవారికి ఆస్థానం నిర్వహిస్తారు.

కార్తీక శుద్ధ త్రయోదశి
నవంబరు 3, సోమవారం

కార్తీక శుద్ధ త్రయోదశి శని త్రయోదశి తిథి. శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైన తిథి ఇది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గోత్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించాలని మరికొన్ని వ్రత పుస్తకాలలోనూ ఉంది. అలాగే, ఈనాడు సోమ ప్రదోష వ్రతాన్ని నిర్వహించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఇది శివ సంబంధమైన వ్రతం.

కార్తీక శుద్ధ చతుర్దశి
నవంబరు 4, మంగళవారం

కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం. కార్తీక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడని అంటారు. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని ఆయా వ్రత గ్రంథాలలో, పురాణాలలో ఉంది. కాబట్టి ఇది శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన పర్వదినం.

కార్తీక శుద్ధ పూర్ణిమ
నవంబరు 5, బుధవారం

కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశలా వెలుగొందుతుంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు

మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 720 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్‍ హిందూ హాలీడేస్‍ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.
జ్వాలాతోరణ ఉత్సవం

కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి వెంటులు ఆ మూడు బాజులకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం. పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ. ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇంకా, కార్తీక పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.

కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.
కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగిందని అంటారు. కొన్నిచోట్ల ఈనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
కాగా, ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల సువర్ణముఖీ నది తీర్థ ముక్కోటిని ఈనాడు నిర్వహిస్తారు. అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదేరోజు నాడు నారాయణవనం శ్రీవేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ముగుస్తుంది. చిత్తూరు జిల్లా నగరిలో వేంచేసి ఉన్న శ్రీ కరియ మాణిక్యస్వామి వారి పవిత్రోత్సవాన్ని ఈనాడే నిర్వహిస్తారు.
సిక్కు మత గురువు గురునానక్‍ జయంతి దినం కూడా ఈనాడే. పది మంది సిక్కు గురువులలో ఈయన మొదటి వారు.

కార్తీక బహుళ పాడ్యమి
నవంబరు 6, గురువారం

కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం చేస్తే మహా ఫలప్రదమని అంటారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈనాటి నుంచి విశాఖ కార్తె ప్రారంభమవుతుంది.

కార్తీక బహుళ విదియ
నవంబరు 7, శుక్రవారం

కార్తీక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది. ఇది దేవి (అమ్మవారు)కి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది.

కార్తీక బహుళ తదియ
నవంబరు 8, శనివారం

కార్తీక బహుళ తదియ నాడే సంకష్టహర చతుర్థి జరుపుకోవాలని పంచాంగాలు, క్యాలెండర్లలో ఉంది. నిజానికి చతుర్థి తిథి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కానీ, దీనిని ఈనాడే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

కార్తీక బహుళ చవితి
నవంబరు 9, ఆదివారం

కార్తీక బహుళ చతుర్ధి (చవితి) స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి. ఇది పన్నెండు సంవత్సరాలు, లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ తిథిని దశరథ చతుర్థిగానూ వ్యవహరిస్తారు.
అలాగే, సంకష్ట హర గణపతిని విశేషంగా పూజిస్తారు. కానీ, సంకష్టహర చతుర్థిని ఇంతకుముందు రోజే జరుపుకోవాలని పంచాంగాలలో ఉంది.
అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు.

కార్తీక బహుళ పంచమి
నవంబరు 10, సోమవారం

పంచమి తిథి నాగ సంబంధమైనది. కార్తీక బహుళ పంచమి నాడు ప్రజలు తమ శ్రేయస్సు, సంతోషం కోసం నాగ విగ్రహాల ముందు నూనె దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసే పూజల వల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

కార్తీక బహుళ షష్ఠి నాడు ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజలు, వ్రతాల గురించి వ్రత గ్రంథాలలోనూ, పంచాంగాలలోనూ విశేషంగా ఏమీ ప్రస్తావించలేదు.

కార్తీక బహుళ సప్తమి
నవంబరు 11, మంగళవారం

మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. కాగా, షష్ఠి ఘడియల్లోనే ఈ సప్తమి తిథి కూడా వస్తుంది. కాబట్టి నవంబరు 11నే ఈ పూజలు నిర్వహించుకోవాలి.

కార్తీక బహుళ అష్టమి
నవంబరు 12, బుధవారం

కార్తీక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి. ఇంకా ఈ తిథిని బుధ అష్టమిగానూ వ్యవహరిస్తారు. సాధారణంగా బుధవారంతో అష్టమి తిథి కూడి వస్తే దానిని బుధాష్టమిగా పిలుస్తారు. బుధాష్టమి నాడు ఉపవాసం ఉండి శివపార్వతులు, గణపతిని పూజిస్తారు. ఈనాడు చేసే పూజల వల్ల పుణ్యం లభిస్తుందని, జీవితంలో అభివృద్ధి సాధించవచ్చని అంటారు.

కార్తీక బహుళ నవమి
నవంబరు 13, గురువారం

కార్తీక బహుళ నవమి ప్రత్యేకించి ఏ పూజకూ, ఆచారానికీ నిర్దేశించి లేకపోయినా.. సాధారణంగా నవమి నాడు దుర్గామాతను పూజించడం సంప్రదాయం.

కార్తీక బహుళ దశమి
నవంబరు 14, శుక్రవారం

కార్తీక బహుళ దశమి నాడు తిథానుసారం ఆచరించాల్సిన పూజా విధులేమీ లేవు. కాగా, నవంబరు 14 మన భారత తొలి ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ జయంతి దినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నారులు ఆయనను ‘చాచా నెహ్రూ’గా పిలుచుకుంటారు. అందుకే ఆయన జయంతి దినమైన నవంబరు 14న ఏటా చిన్నారుల దినోత్సవం నిర్వహిస్తారు.

కార్తీక బహుళ ఏకాదశి
నవంబరు 15, శనివారం

కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఈ ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి, సర్వ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఈనాటి నుంచే వృశ్చిక సంక్రమణం ప్రారంభం అవుతుంది.

కార్తీక బహుళ ద్వాదశి
నవంబరు 16, ఆదివారం

కార్తీక బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకా ఈనాడు యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.
ఇలా ఉండగా, తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలకు ఈనాడు అంకురార్పణ పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు. అలాగే, నాగులాపురంలోని శ్రీవేద నారాయణస్వామి వారి పవిత్రోత్సవం కూడా ఈనాడే.

కార్తీక బహుళ త్రయోదశి
నవంబరు 17, సోమవారం

కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు.
కాగా, త్రయోదశి తిథి నాడు ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరిని కూడా పూజిస్తుంటారు. త్రయోదశి తిథి నవంబరు 18న కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ రోజు కూడా.. అంటే నవంబరు 17, 18 (సోమ, మంగళవారాలు) తేదీల్లో యమదీప దానం, ధన్వంతరి పూజ, ధన త్రయోదశి పర్వాలను నిర్వహించుకోవచ్చు. ప్రదోష వ్రతాన్ని కూడా ఈరోజే నిర్వహించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్‍ ప్రకారం ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి పర్వాలు ఈనాడే. కాగా, తిరుచానూరు శ్రీపద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచి ప్రారంభం అవుతాయి. తి.తి.దే కేలండర్‍ ప్రకారం ఈనాడే మాస శివరాత్రి.

కార్తీక బహుళ చతుర్దశి
నవంబరు 19, బుధవారం

కార్తీక బహుళ చతుర్దశి తిథి సాధారణంగా భౌమవారం (బుధవారం)తో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు. ఈ తిథి సరిగ్గా బుధవారం నాడే ఉంది కాబట్టి ఈనాడు చిత్రా చతుర్దశిని ఆచరించాలి. సాధారణంగా చిత్రా చతుర్దశి నాడు శివుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలంతో స్నానం చేయాలి. చంద్రాస్తమయ వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి.

కార్తీక బహుళ అమావాస్య
నవంబరు 20, గురువారం

కార్తీక బహుళ అమావాస్య తిథి.. అమావాస్య దినం. కార్తీక మాసంలో ఇది చివరి తిథి. ఈనాటితో కార్తీకమాసం ముగుస్తుంది. కార్తీకబహుళ అమావాస్య గీతా జయంతి దినమని కూడా కొందరు చెబుతారు. గీతా జయంతి ఎప్పుడనే విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. కార్తీక బహుళ అమావాస్య (నవంబరు 20, 2025) నాడని కొందరు, మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబరు 1, 2025) నాడని ఇంకొందరు అంటారు. ఇక, కొన్ని కేలండర్లలో నవంబరు 30 గీతా జయంతి దినంగా సూచిస్తున్నారు. కాబట్టి మనకు వివాదాలతో పని లేకుండా ఈ రెండు తిథుల్లోనూ గీతా జయంతిని నిర్వహించుకుంటే ఏ గొడవా ఉండదు. ఇక, గీతా జయంతి గురించి వ్యావహారికంలో ఉన్న వాస్తవాల ప్రకారం.. కార్తీక బహుళ అమావాస్య నాడు భగవద్గీత పుట్టిందని కొందరు అంటారు. అంటే ఈరోజు గీతా జయంతి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర
శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
కానీ, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జనన దినంగా నిర్ధారించి చెప్పడానికి లేదని ఇంకొందరు పండితులు వాదిస్తారు.
మహా భారత కాలమానం ప్రకారం.. మాఘ

శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది (58) రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. దీన్ని వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీకబహుళ అమావాస్య అవుతుంది.
కార్తీకమాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తీకపూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం నాడు, అనగా శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. దీనిని బట్టి కార్తీకబహుళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు. భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు దు:ఖ పీడితుడు అయ్యాడు. యుద్ధంలో తన బంధువులను వధించడం తన వల్ల కాదని శోకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం కార్తీకబహుళ అమావాస్య నాటి ఉదయమేనని అంటారు. ఇక, మన తెలుగు పంచాంగాలలో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‍ 1, 2025) తిథి నాడే గీతా జయంతిగా పేర్కొన్నారు. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయమై ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి, పవిత్రమైన గీతా పఠనాన్ని, గీతా జయంతిని ఈ రెండు దినాల్లోనూ, అంటే.. ఇటు కార్తీక బహుళ అమావాస్య (నవంబరు 20 2025, గురువారం) నాడు, అటు మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్‍ 1, 2025, సోమవారం) నాడు సాగించడం మధ్యేమార్గం, పుణ్యప్రదం కూడా.

మార్గశిర శుద్ధ పాడ్యమి
నవంబరు 21, శుక్రవారం

ఈనాటి నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఇది హేమంత రుతువు ఆరంభ దినం. ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పోలి స్వర్గం ఈ తిథినాడేనని అంటున్నారు. దీనినే పోలి పాడ్యమి అనీ అంటారు. కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చే ము్య•మైన రోజు ఇది. ఈరోజు మహిళలు సమీపంలోని చెరువులు, నదులలో కనీసం 30 వత్తులతో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి వదులుతారు. అనంతరం పోలి కథను చదువుతారు. శివాలయాల్లో శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ‘పోలి’ కథ ఆసక్తికరమైనది.
ఒక ఊళ్లో ఉమ్మడి కుంటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. పోలి అంటే ఆమె అత్తకు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అనుకుంటూ పోలి దైవభక్తిని తక్కువ చేసి చూసేది. పోలిని కలుపుకోకుండా మిగతా నలుగురు కోడళ్లతో కలిసి పూజలు, వ్రతాలు చేయించేది. ఒకసారి కార్తీక మాసంలో ఎలాగైనా చిన్న కోడలు పోలి చేత దీపం వెలిగించకుండా చేయాలని అత్త పన్నాగం పన్నింది. నలుగురు కోడళ్లనూ వెంటబెట్టుకుని శివాలయానికి వెళ్లింది. పోలి దీపం వెలిగించకుండా, పూజ చేయకుండా ఉండేలా పూజా సామగ్రి లేకుండా చేసింది. కానీ, పోలి మాత్రం ఇంటి పెరట్లోని పత్తి చెట్టు నుంచి కొద్ది పత్తిని తీసుకుని వత్తులు చేసుకుంది. కవ్వానికి మిగిలిన కొద్ది వెన్నను ఊడ్చి దీపం వెలిగించింది. ఆ దీపం అత్తగారి కంటపడకుండా దానిపై బుట్ట బోర్లించింది. ఇలా కార్తీక మాసం పొడవునా చాటుగా పూజలు చేస్తూ, దీపాలు వెలిగించింది. మాసం చివరిలో కార్తీక బహుళ అమావాస్య నాడు తక్కిన కోడళ్లతో గుడికి వెళ్తూ.. పోలికి చేతినిండా ఇంటి పని అప్పజెప్పింది. కార్తీక మాసం చివరి రోజు చేసిన పూజ కార్తీక మాసం పొడవునా చేసిన పూజకు సమానం అవుతుంది కాబట్టి ఆ పుణ్యం పోలికి దక్కకూడదనేది అత్త ప్రయత్నం. కానీ, పోలి మాత్రం ఇంటి పనులన్నీ పూర్తి చేసి, పూజ ముగించి దీపం వెలిగించింది. అత్త ఎన్ని అవాంతరాలు పెట్టినా తన పూజాదులు మానని పోలి భక్తికి మెచ్చిన దేవతలు ఆమె ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లడానికి పుష్పక విమానంలో వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్లు దేవతలు, విమానం తమ కోసమే వచ్చాయని భావించారు. దేవతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్తుండగా, అత్త, మిగిలిన తోటికోడళ్లు పోలి కాళ్లు పట్టుకుని తామూ వెళ్లేందుకు యత్నించారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని, మీకు లేదని చెప్పి దేవతలు అత్తను, నలుగురు కోడళ్లును నెట్టేశారు. అలా పోలి పాడ్యమి/ పోలి స్వర్గం ఆచరణలోకి వచ్చింది. ఈనాడు 30 వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు దీపదానం చేయడం చాలా మంచిదని అంటారు.

మార్గశిర శుద్ధ తదియ
నవంబరు 23, ఆదివారం

మార్గశిర శుద్ధ తదియ నాడు ఆచరించదగిన వ్రతాలు చాలానే ఉన్నాయి. ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ తదితర వ్రతాలు వీటిలో ముఖ్యమైనవి. వీటి గురించి వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి. అలాగే, ఈ తిథి నాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు తెలుగు వారి ఆరాధ్య దైవమైన పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా పుణ్య తిథి కూడా.

మార్గశిర శుద్ధ చవితి
నవంబరు 24, సోమవారం

చతుర్థి తిథి సాధారణంగా వినాయక పూజార్హమై ఉంటుంది. కాబట్టి ఈనాడు వినాయకుని ప్రీత్యర్థం పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరాలు గలిగిన వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు డుండి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది. డుండి అనే పదం గణపతి సంబంధమైనదే. కాబట్టి ఇది కూడా వినాయక సంబంధమైన పూజాకల్పమే.

మార్గశిర శుద్ధ పంచమి
నవంబరు 25, మంగళవారం

మార్గశిర శుద్ధ పంచమి తిథి దక్షిణాదిన నాగపంచమిగా ప్రసిద్ధి. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

మార్గశిర శుద్ధ షష్ఠి
నవంబరు 26, బుధవారం

మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిథి. తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారం. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు దట్టంగా అలముకుంటాయి. కానీ వర్షాలు పడవు. కాబట్టే వానలు కురవని మబ్బులను షష్ఠి మబ్బులని అంటారు. ఇక, తమిళులు మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని
సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగిందని ఐతిహ్యం. పురాణగాథ ఇలా ఉన్నా.. ఇది ప్రధానంగా నాగులకు సంబంధించిన పర్వం. ఈనాడు నాగులను పూజిస్తారు. సంతాన భాగ్యం కోరుకునే వారు సర్పపూజ రూపేణా కుమారస్వామినే ఆరాధిస్తారు. పాములు వ్యవసాయదారులకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటాయి. ఎలుకలను తినడం ద్వారా ఇవి పంటలను కాపాడతాయి. అలాగే, చలి ముసురుకునే ఈ కాలంలో పాములు పొలాల్లోని బొరియలు, భూమి అడుగు భాగంలో దాక్కుని ఉంటాయి. వ్యవసాయ సంబంధ పనులు చేసేటపుడు అటు సర్పాలకు, తమకు కూడా హాని కలగకూడదనే ఉద్దేశంతో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు రైతులు ఎక్కువగా పువ్వులు, పడగలు సమర్పించి నాగపూజలు చేస్తుంటారు.
మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఇంకా చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలకు కూడా ప్రతీతమై ఉందని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.

మార్గశిర శుద్ధ సప్తమి
నవంబరు 27, గురువారం

మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్య పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.

మార్గశిర శుద్ధ అష్టమి
నవంబరు 28, శుక్రవారం

దుర్గాపూజకు, ఇటు కాలభైరవుని పూజకు ప్రతీతి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగానే ఆచరణలో ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి తదితర పేర్లు కాలాష్టమికి ఉన్నాయి.
ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహిమ విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’. ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. అలా కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడయ్యాడు. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. కాశీలోనే కాదు.. ఈ భూమిపై ఉన్న ప్రతి శివాలయానికీ కాలభైరవుడే క్షేత్ర పాలకుడు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తుతించిన స్తోత్రం మన భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో మహత్తరమైనది.

మార్గశిర శుద్ధ నవమి
నవంబరు 29, శనివారం

మార్గశిర శుద్ధ నవమి నాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది. మొత్తానికి నవమి తిథి శక్త్యారాధనకు విశేషమైనది. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా అర్చిస్తారు. తెలుగు పంచాగాలలో ఈనాటి తిథి గురించి శుక్ర మౌడ్యమి త్యాగము అని పేర్కొన్నారు. ఈనాడు నందిని నవమి అని తెలుగు పంచాంగాలలో ఉంది.

మార్గశిర శుద్ధ దశమి
నవంబరు 30, ఆదివారం

మార్గశిర శుద్ధ దశమి తిథి నాడు ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించాల్సిన ఆయా వ్రతాల పేర్లను బట్టి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబధించి ఉద్దేశించిన తిథిగా కనిపిస్తోంది.

Review ఆధ్యాత్మిక ‘మార్గ’దర్శి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top