తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం అక్టోబరు మాసం ఆశ్వయుజ – కార్తీక మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదవ నెల. ఈ మాసంలోని అక్టోబరు 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆశ్వయుజ మాస తిథులు. అక్టోబరు 26 నుంచి కార్తీక మాసం ఆరంభమవుతుంది. అటు దేవీ శరన్నవరాత్రుల శోభ.. ఇటు కార్తీక దీప కాంతులతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. బతుకమ్మ పండుగ, విజయదశమి, తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అట్లతద్ది, నరక చతుర్దశి, దీపావళి, భగినీహస్త భోజనం వంటి పర్వాలు ఈ మాసం ప్రత్యేకం..
2022- అక్టోబరు 1, శనివారం, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నుంచి
2022- అక్టోబరు 31, సోమవారం, కార్తిక శుద్ధ సప్తమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-ఆశ్వయుజం-కార్తీకం- శరదృతువు- దక్షిణాయణం
అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. శరత్కాలంలో వచ్చే ఈ మాసంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. అందుకు నిదర్శనంగానే ఆశ్వయుజం అతివల పర్వమై వెలుగొందుతోంది. మహిళలు నోచే నోములు, వ్రతాలు, మరీ ముఖ్యంగా అమ్మవారి వేడుకకు ఆటపట్టయినదీ మాసం. సృష్టికి మూలమైన అమ్మవారు విశేషంగా పూజలందుకునేది ఈ మాసంలోనే. అందరికీ విజయాలను అందించే విజయ దశమి, జాతికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహాత్మాగాంధీ జయంతి, లోకాన అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి వెలుగులు నింపే దీపావళి వేడుక, ఆడపిల్లల వేడుక అట్లతద్ది, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ ఉత్సవాలు ఆశ్వయుజ మాసానికి శోభ తెస్తాయి. కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ నెలలో వచ్చే అట్లతద్ది, దసరా, దీపావళి తదితర పర్వాలన్నీ స్త్రీలకు సంబంధించినవే. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి.
సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. సమస్త జగత్తును పాలించే ఆ ఆది పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి అయి లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్య, శక్తిలను ప్రసాదిస్తోంది. ఆశ్వయుజ-కార్తీక మాసాల కలయిక అయిన అక్టోబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు, పండుగలు..
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
అక్టోబరు 1, శనివారం
ఆశ్వయుజ శుద్ధ షష్టితో దేవీ శరన్నవరాత్రులు
ఆరవ రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారు
కాత్యాయినిగా, శ్రీ మహాలక్ష్మిదేవిగా దర్శనమిస్తారు. అలాగే, తెలంగాణలోని బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈనాడు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి స్కందషష్ఠి తిథి. ఈనాడు కుమారస్వామిని ఆరాధించాలి. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాడు శ్రీవారి గరుడ సేవ నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాల్లో జరిగే సేవల్లో ఇదే విశేషమైన సేవ.
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
అక్టోబరు 2, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి నాటికి దేవీశరన్నవరాత్రులు ఏడవ రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారిని కాళరాత్రిగా, శ్రీ సరస్వతిదేవిగా అలంకరించి పూజిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి ఈనాడు డోలోత్సవం, సువర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. అలాగే, బతుకమ్మ పండుగకు ఇది ఎనిమిదవ రోజు. ఈనాడు వెన్నముద్దల బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతాయి. అలాగే, అక్టోబరు 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి దినం.
ఇక, సప్తమి తిథి సూర్యారాధనకు ఉద్ధిష్టమైనది. అందుకే ఈ తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు.
అలాగే, ఈనాడు గరుడ జయంతి దినం అని కూడా అంటారు. ఈనాడు మూలా నక్షత్రం కావడంతో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈనాడు అమ్మవారిని సరస్వతిగా అలంకరించి పూజిస్తారు. ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, పంచగవ్యములను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
అక్టోబరు 3, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమీ తిథి. ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు. ఇది మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి. ఇక, ఈ తిథి మన తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమీగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు. దుర్గాష్టమి వ్రతం ఆచరించాలి. ఈనాటితో దేవీ శరన్నవరాత్రుల వేడుకలు ఎనిమిదవ రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారిని దుర్గాదేవిగా, మహాగౌరిగా అలంకరిస్తారు. మరోపక్క తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో ఇది తొమ్మిదివ రోజు. ఈనాటితో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.
ఆశ్వయుజ శుద్ధ నవమి
అక్టోబరు 4, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ నవిమి మహర్నవమి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈనాడు దుర్గాదేవిని మహిషాసురమర్దనిదేవిగా, సిద్ధిధాత్రిదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈనాటి అమ్మవారి ప్రధాన అలంకరణ- మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు ఈనాడే సంహరించారని అంటారు. ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. వివిధ కులవృత్తుల వారు తమ పనిముట్లను, విద్యార్థులు తమ విద్యాసామగ్రిని, వివిధ బతుకుదెరువులు, జీవనోపాధులకు ఆధారమైన వస్తువులను ఈనాడు విశేషంగా పూజిస్తారు.ఇంకా ఈనాడు మాతృ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు.
ఈనాడు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది.
అలాగే, ఏటా అక్టోబరు 4న అంతర్జాతీయ జంతు దినోత్సవం పాటిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి/దసరా/విజయదశమి
అక్టోబరు 5, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ దశమి.. విజయదశమి/దసరా పర్వదిన తిథి. ఈనాడు జమ్మిచెట్టు వద్ద పూజలు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూరులో దసరా, ఆయుధపూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని ఈనాడు నిమజ్జనం చేస్తారు. అలాగే, విజయవాడ కనకదుర్గమ్మకు ఈనాడు వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా ఏనుగుల సంబరం జరుగుతుంది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు తిరుచానూరు పద్మావతి తాయార్ల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దశమి నాటితో ముగుస్తాయి. ఇక, విజయదశమి పర్వదిన విశేషాల్లోకి వెళ్తే.. ప్రాచీన కాలం నుంచి విజయదశమి (దసరా) ఆచరణలో ఉంది. మైసూరులో ఈనాడు గొప్ప వేడుక నిర్వహిస్తారు. అలాగే, శమీ పూజలు విశేషంగా ఆచరిస్తారు. ఈనాటితో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ తిథినాడు శక్తిపూజ మహోత్క•ష్టమైనది.
రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం ఈ వృక్ష దర్శనం చేసుకుంటారు. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో ఆ దేవి పూజలందుకుంటుంది. ప్రాంతాలు, ఆచారాలను బట్టి ఆయా రోజులలో అవతారాలు మారుతుంటాయి. సాధారణంగా మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి ప్రజల పూజలు అందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరింపబడే దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి.
గదాధర పద్ధతి, ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథాలలో ఈ తిథిని అపరాజితా దశమిగా పేర్కొన్నారు. ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. ఆమె పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ నిమర్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మున్నగునవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయాభిదానాలతో ప్రజలచే పూజలను పొందే శుభవాసరాలివి.
లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను ఆలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన పిదపే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు. ఆశ్వయుజ శుద్ధ దశమి మధ్వాచార్య జయంతి దినం కూడా. విళంబి నామ సంవత్సరం, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోజ్జీవాన్ని కలిగించారు.
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి/పాశాంకుశైకాదశి
అక్టోబరు 6, గురువారం
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పాశాంకుశైకాదశిగా ప్రతీతి. దీనినే పరాంకుశ ఏకాదశి అనీ అంటారు. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది అని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాశాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మాలు పెట్టాలి. వాటిలో అయిదు దీపాలు ఉంచాలి. అయిదు విధాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 7, శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి తిథి పలు విధాలుగా ప్రసిద్ధి. ఈనాడు విశోక ద్వాశి, గోవత్స ద్వాదశీ వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం చేయాలని, వాసుదేవ పూజ ఆచరించాలని ఆయా గ్రంథాలలో ఈనాడు ఉపవాసం ఉండాలని స్మంతికౌస్తుభంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు.
Review ఆశ్వయుజం..ఆధ్యాత్మికం.