ఉగాది..సకల శుభాది

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో మూడో మాసం- మార్చి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం. పన్నెండవది. అంటే తెలుగు సంవత్సరాల్లో చివరిది. కేవలం రెండు రోజులు మాత్రమే ఛైత్ర మాస తిథులు ఈ మాసంలో ఉన్నాయి. అందులో మొదటి తిథే చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడే ఉగాది. మార్చి 1, శనివారం, ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి మార్చి 29, ఫాల్గుణ బహుళ అమావాస్య, శనివారం వరకు ఫాల్గుణ మాస తిథులు, మార్చి 30, చైత్ర శుద్ధ పాడ్యమి, సోమవారం నుంచి చైత్ర మాస తిథులు. చైత్ర మాస తిథులు కేవలం రెండు మాత్రమే ఈ నెలలో ఉంటాయి. హోలీ, ఆమలిక ఏకాదశి, ఉగాది, వంటివి మార్చిలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.

2025- మార్చి 1, శనివారం, ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి
2025- మార్చి 31, సోమవారం, చైత్ర శుద్ధ విదియ వరకు..

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-ఫాల్గుణం/చైత్రం- శిశిరం/వసంతం- ఉత్తరాయణం

ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పున్నమి కలది ఫాల్గుణం. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని నింపే ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఫాల్గుణ మాస తిథులు ముగియడంతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరిక, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమైనవి. అందులో ఫాల్గుణం ఒకటి. ఫాల్గుణ మాసం శిశిర రుతువు కాలం. చెట్లన్నీ ఆకులు రాలుస్తాయి. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది (పన్నెండవది). మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. ఫాల్గుణ మాసంలో చేసే గోదానం, ధన దానం, వస్త్ర దానం శ్రీమహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తాయని అంటారు. తెలుగు సంవత్సరాల వరుసలో చివరిదైన ఫాల్గుణ మాసంలో.. అంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు చివరిదైన ఈ మాసంలో మళ్లీ కనిపిస్తాయనేది పండితుల ఉవాచ. అందుకే ఫాల్గుణం సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వ వ్రత సింహావలోకనంగా ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే ఫాల్గుణంలో చేసే దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని అంటారు. ఇక దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ఉసిరికాయతో ముడిపడి ఉన్న ఓ తిథి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసం తరువాత నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ దినమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంతకాలం ఆరంభమవుతుంది. వసంత రుతువుకు స్వాగతం పలికేది, తెలుగు సంవత్సరాలలో తొలిది చైత్ర మాసమే. చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలయ్యే వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతూ వాతావరణం మహా ఆహ్లాదభరితంగా ఉంటుందీ మాసంలో. జీవితాల్లో శుభాలను కలిగించేది.. జీవితాలకు శోభను చేకూర్చేది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇది మనకు కొత్త తెలుగు సంవత్సరాది. ఉగాది. ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం.

ఫాల్గుణ శుద్ధ విదియ
మార్చి 1, శనివారం

ఫాల్గుణ శుద్ధ విదియ తిథి రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్‍తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిన గురువు- రామకృష్ణ పరమహంస. ఈయన పుట్టినప్పటి పేరు గదాధర్‍ చటోపాధ్యాయ. పశ్చిమబెంగాల్‍ సాంస్క•తిక పునరుజ్జీవనంలో ఈయన పాత్ర, ప్రభావం చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద ఈయన శిష్యులలో ప్రథముడు. సృష్టిని ఏకత్వంతో చూడాలని, అన్ని జీవుల్లోనూ దైవత్వాన్ని దర్శించాలని, అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కామం, స్వార్థం, కామకాంచనాల నుంచి విడివడితేనే భగవంతుడిని దర్శించుకోగలమని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో దారులున్నట్టే.. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయని.. రామకృష్ణ పరమహంస బోధించారు.

ఫాల్గుణ శుద్ధ తదియ
మార్చి 2, ఆదివారం

ఫాల్గుణ శుద్ధ తదియ నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ చవితి
మార్చి 3, సోమవారం

ఫాల్గుణ శుద్ధ చవితి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. పుత్ర సంతానం కోసం గణపతిని పూజిస్తూ ఆచరించే వ్రతమిది. ఈ వ్రతం కూడా దాదాపుగా వినాయక చవితి వ్రత విధానంలోనే ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ఆయనకు ప్రీతికరమైన పండ్లను, పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. ఉదయంతో పాటు సాయంత్రం గణపతిని పూజించిన అనంతరం దీక్షను విరమించాలి. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే ఎక్కువగా పుత్ర సంతానాన్ని కోరుకునే వారు. తమ తరువాత రాజ్యభారాన్ని కుమారులే స్వీకరించాలని భావించే వారు. ఇక, పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కూడా కుమారుడే అని శాస్త్ర వచనం. ఈ కారణంగా పుత్ర సంతానాన్ని కోరుకునే వారు ఫాల్గుణ శుద్ధ చవితి నాడే ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వారు. ఈ రోజున ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో గణపతిని పూజిస్తారో వారి కోరిక తప్పక నెరవేరుతుందని సాక్షాత్తూ పరమశివుడు పార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో ఉంది.
ఈనాటి ఉదయమే దంపతులు తలస్నానం చేసి, శుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశ స్థానపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్ర గణపతి వ్రత కథను చదువుతూ దంపతులు అక్షితలను తలపై వేసుకోవాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను, ఫలాలు, పత్రిని నైవేద్యంగా సమర్పించాలి.
ఫాల్గుణ శుద్ధ చతుర్థి ఇంకా పలు విధాలుగా ప్రశస్తమై ఉంది. ఇది మంగళకరమైన తిథి. ఈనాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డుంఢి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు చేసే నువ్వుల దానం కారణంగానే ఈ చతుర్థికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది.

ఫాల్గుణ శుద్ధ పంచమి
మార్చి 4, మంగళవారం

పంచమి తిథి సాధారణంగా అనంత పంచమీ వ్రతాచరణకు అనువైనదని అంటారు. కాబట్టి ఈనాడు అనంత పంచమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఫాల్గుణ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈనాడు శ్రీకంఠ జయంతి దినమని అంటారు. అయితే, ఇది ఏ దేవీ దేవతకు సంబంధించిన పర్వమో వివరాలు లేవు. అలాగే, ఈనాటి నుంచి పూర్వాభాద్ర కార్తె ప్రారంభం అవుతుంది.

ఫాల్గుణ శుద్ధ షష్ఠి
మార్చి 5, బుధవారం

ఫాల్గుణ శుద్ధ షష్ఠి తిథి.. స్కంద షష్ఠి పర్వం. కుమారస్వామిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఆచరించాలి.

ఫాల్గుణ శుద్ధ సప్తమి
మార్చి 6, గురువారం

ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించాలి. సప్తమి తిథి సూర్యారాధన సంబంధమైనది. చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం.. అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఈనాడు ఆచరించాలి. ఇవన్నీ సూర్యుడికి సంబంధించిన పర్వాలే.

ఫాల్గుణ శుద్ధ అష్టమి
మార్చి 7, శుక్రవారం

ఫాల్గుణ శుద్ధ అష్టమి.. మాసిక దుర్గాష్టమి తిథి. మాసానికి రెండుసార్లు (శుద్ధ/బహుళ) వచ్చే అష్టమిలు దేవీ ఆరాధనకు ఉద్ధిష్టమైనవి. ఇక, ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు దుర్గాష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు.

ఫాల్గుణ శుద్ధ నవమి
మార్చి 8, శనివారం

ఫాల్గుణ శుద్ధ అష్టమి మాదిరిగానే నవమి తిథి కూడా దుర్గా సంబంధమైనదే. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే, ఈనాడు దుర్గాపూజ చేయాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
అలాగే, మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విజయం సాధించిన, ఆదర్శంగా, స్ఫూర్తిమంతంగా నిలుస్తున్న నారీమణుల విజయానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తున్నారు. అలాగే, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
మార్చి 10, సోమవారం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనేక విధాలుగా ప్రసిద్ధమై ఉంది. వీటిలో మొదట చెప్పుకోవాల్సింది ‘అమలిక ఏకాదశి’ గురించి.
అమలికం అంటే ఉసిరికాయ. అంటే ఇది ఉసిరికాయతో ముడిపడిన ఏకాదశి. అందుకే దీనిని అమలైక్యాదశిగా వినుతికెక్కింది. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు. అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు వివిధ నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే అమలకిలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించి ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక. ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత నియమాల్లో దానికో స్థానాన్ని కలిగించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మన వంటకాల్లో ఏదో విధంగా ఉసిరి వాడాలనేది ఈ పర్వం ఉద్దేశం. బహుశా ఉసురు (ప్రాణం) నిలిపేది కాబట్టి తెలుగులో ఇది ఉసురుకాయ.. కాల క్రమంలో ఉసిరి కాయ అనే పేరు స్థిరపడి ఉంటుంది. అరవం, కన్నడం, మలయాళంలో దీనిని నెల్లికాయ అని పిలుస్తారు. సంస్క•తంలో ఉసిరికాయకు ఐదారు పేర్లు వరకు ఉన్నాయి. ఆమలకం (గుణమును ధరించునది), ధాత్రి (దాది వంటిది), వయస్థ (వయస్సున నిలుపునది), ఫలరవ (సారవంతమైనది), అమృత (అమృతము వంటిది), శీతఫలి ( శీతవీర్యము కలది) అనే అర్థాలు కలిగిన పేర్లు ఉసిరికాయకు ఉన్నాయి.
అలాగే, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మరో విధంగా కూడా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని పురాణగాథ. దీనినే ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల వారు ‘కోరుకొండ ఏకాదశి’ అనీ అంటారు. కోరుకొండలో నరసింహస్వామి కోవెలలో ఈనాడు గొప్ప తిరునాళ్లు జరుగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉండిన మామిడికాయలు ఇప్పటికి కోడిగుడ్డు పరిమాణానికి ఎదుగుతాయి. ఇది చెప్పడానికే పై సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
మార్చి 11, మంగళవారం

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రతీతి. ఈ ద్వాదశి తిథి పుష్యమితో కూడి వస్తే ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైన పర్వమే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజలు కూడా చేసే ఆచారం ఉంది.

ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
మార్చి 12, బుధవారం

ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
మార్చి 13, గురువారం

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు కూడా హోలికా దహన్‍ నిర్వహిస్తారు. దీనిని ‘చోటీ హోళీ’గా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి
మార్చి 14, శుక్రవారం

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు. దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని హోలీ పూర్ణిమ వృత్తాంతం (దీనికి సంబంధించిన కథ కోసం ఆధ్యాత్మి‘కథ’ శీర్షిక చూడవచ్చు) తెలియ చెబుతుంది.
ఇంకా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ పలు విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.
భగవద్గీత, కృష్ణతత్వాన్ని విస్త•తంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు వారి జయంతి తిథి కూడా ఈనాడే.

ఫాల్గుణ బహుళ పాడ్యమి
మార్చి 15, శనివారం

ఫాల్గుణ బహుళ పాడ్యమినే హోలీ పర్వదినంగానూ భావిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ తరువాత దినమే కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్‍లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్‍లీల ఆరంభమవుతుంది.
హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు తెరగుల రంగులతో పువ్వులు పొటమరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు.
ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంభోత్సవ సమయం. అయితే, మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం.. పౌర్ణమి నాడే హోలీ పర్వమని పేర్కొన్నారు.

ఫాల్గుణ బహుళ విదియ
మార్చి 16, ఆదివారం

ఫాల్గుణ బహుళ విదియ కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చే తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.
అలాగే, ఈనాడు ఆంధప్రదేశ్‍ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం ఈయన జీవితాంతం పాటుబడ్డారు. ఈయన 1901, మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరి జిల్లాలోని పడమటిపాలెం. 25 ఏళ్ల వయసులో భార్యను, బిడ్డను కోల్పోయిన ఈయన వైరాగ్యంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనంతరం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952, అక్టోబర్‍ 19న బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952, డిసెంబర్‍ 15న దీక్షలోనే పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. తదనంతర పరిణామాలతో అదే ఏడాది డిసెంబర్‍ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.

ఫాల్గుణ బహుళ తదియ
మార్చి 17, సోమవారం

ఫాల్గుణ బహుళ తదియ తిథిని కల్పాది దినంగా ఆయా వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈనాటి నుంచి ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం అవుతుంది.

ఫాల్గుణ బహుళ చతుర్థి
మార్చి 18, మంగళవారం

ఫాల్గుణ బహుళ చతుర్థి వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి. దీనినే సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు. చతుర్థి తిథి ఘడియల్లోనే పంచమి తిథి కూడా ప్రవేశిస్తోంది. ఈ కారణంగా ఇదేరోజు రంగ పంచమి వ్రతాలను ఆచరించాలి.

ఫాల్గుణ బహుళ పంచమి
మార్చి 19, బుధవారం

ఫాల్గుణ బహుళ పంచమి తిథిని రంగ పంచమి అని కూడా అంటారు. అయితే, ఈనాడు ఈ పంచమి నాడు ఆచరించాల్సిన విధాయకృత్యాలేమిటో పంచాంగాలలో వివరణ లేదు. అలాగే ఈనాటి నుంచి శుక్ర మౌడ్యమి దినాలు ఆరంభం అవుతాయి.

ఫాల్గుణ బహుళ షష్ఠి
మార్చి 20, గురువారం

ఫాల్గుణ బహుళ షష్ఠి దేవసేనకు అధిపతి అయిన కుమారస్వామిని పూజించడానికి అనువైన తిథి. ప్రత్యేకించి తమిళనాట షష్ఠి నాడు ఈయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుమారస్వామి.. వివిధ ప్రాంతాల్లో స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధమై ఉన్నాడు.

ఫాల్గుణ బహుళ సప్తమి
మార్చి 21, శుక్రవారం

ఫాల్గుణ బహుళ సప్తమి తిథి శీతల సప్తమి దినం. ఈనాడు శీతలా మాత అనుగ్రహం కోసం ఆమెను విశేషంగా పూజిస్తారు. శీతలా దేవిని పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశపు పండుగ. మశూచి, స్ఫోటకం తదితర పిల్లలకు సోకే వ్యాధుల నుంచి రక్షించే దేవతగా ఈమెను పరిగణిస్తారు. అలాగే మంచి భర్తను పొందడానికి, ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందడానికి ఆమెను పూజిస్తారు. భక్తుల జీవనోపాధి వనరులను కాపాడే దేవతగానూ ఈమెను పూజిస్తారు. కరువు, వర్షాభావం, పశువుల వ్యాధుల నివారణకు కూడా ఈ దేవతను ప్రార్థిస్తారు. ఈమె ఒక చేతిలో చీపురును, మరో చేతిలో నీటికుండను ధరించి దర్శనమిస్తుంది. ఆ నీటి కుండలో ఔషధాలు ఉంటాయని అంటారు. స్కాంద పురాణంలోని కాశీఖండ విభాగంలో శీతల దేవి మశూచి, స్ఫోటకపు మచ్చలను పోగొట్టే దేవతగా వివరిస్తూ, ఆ వ్యాధులను నయం చేసే విధానాల గురించి వివరణ ఉంటుంది. ఈమె వేపచెట్టుపై నివాసం ఉంటుందని అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ దేవత ఆలయాలు చాలా ఉన్నాయి.

ఫాల్గుణ బహుళ అష్టమి
మార్చి 22, శనివారం

ఫాల్గుణ బహుళ అష్టమి తిథి.. సీతాదేవి పుట్టిన రోజు. ఈమె జనక మహారాజు కుమార్తె. రాముడి భార్య. ఈమె పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటంతో వేదవతి అనే పేరు పెట్టారు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపోదీక్షలోకి వెళ్లిపోయింది. విష్ణును తప్ప వేరెవరినీ పెళ్లాడనని ప్రతినబూనింది. తపోదీక్షలో ఉన్న ఆమెను రావణుడు తాకుతాడు. దీంతో ఆగ్రహోదగ్రురాలైన ఆమె అయోజనిగా ఈ భూమిపై తాను తిరిగి పుట్టి నిన్ను పుత్రమిత్ర కళత్రంగా సర్వనాశనం చేస్తానని శపిస్తుంది. అన్నట్టే యోగాన్ని సృష్టించుకుని ఆహుతైపోతుంది. పిమ్మట భూమిలో జనకుడికి పసిబిడ్డగా దొరకగా, సీతగా నామకరణం చేసి పెంచుకుంటాడు. రాముడిని పెళ్లాడి.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల రీత్యా రావణ సంహారానికి కారకురాలవుతుంది. ఇంకా ఈనాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా జరుపుకుంటారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. అయితే కొన్ని తెలుగు క్యాలెండర్లలో సీతా జయంతి మే 5, 2025గా సూచిస్తున్నారు. ఫాల్గుణ బహుళ అష్టమి తిథి నాడే నూతన శక సంవత్సరారంభమని కూడా అంటారు.

ఫాల్గుణ బహుళ నవమి
మార్చి 23, ఆదివారం

ఫాల్గుణ బహుళ నవమి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన పూజలు, వ్రతాలు ఏమీ లేదు. కానీ, సాధారణంగా నవమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమై ఉంది. ఈనాడు దుర్గాపూజలు చేస్తారు.

ఫాల్గుణ బహుళ దశమి
మార్చి 24, సోమవారం

ఫాల్గుణ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజావిధులేమీ లేవు. దశమి తిథిని కూడా దుర్గాదేవి ఆరాధనలు విశేషంగా జరుపుతారు.

ఫాల్గుణ బహుళ ఏకాదశి
మార్చి 25, మంగళవారం

ఫాల్గుణ బహుళ ఏకాదశి పాప విమోచన ఏకాదశిగా ప్రసిద్ధి. ఇంకా స్మార్త ఏకాదశి అనీ అంటారు. నీలమత పురాణంలో తెలిపిన ప్రకారం ఈనాడు కాశ్మీర్‍లో ఛందో దేవపూజ చేస్తారు. అలాగే, ఈనాడు కృష్ణైకాదశి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ ఏకాదశినే కామద ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి ఏకాదశి. ఈ ఏకాదశి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
పూర్వం కుబేరుని పుష్ప వాటికలో అప్సరసలు విహరిస్తుండే వారు. ఎంతో అందమైన ఆ ఉద్యానవనంలో దేవతలతో పాటు మునీశ్వరులు తపస్సు చేసుకుంటుండే వారు. ఆ పుష్ప వనానికి ఒకనాడు ఇంద్రుడు తన పరివారంతో వస్తాడు. ఆ వనంలో మేధావి అనే పేరు గల మునీశ్వరుడు ఉన్నాడు. ఇంద్రుని పరివారంలో ఉన్న మంజుఘోష అనే అప్సరస.. మేధావి ముని తపస్సుకు భంగం కలిగించాలని ఎత్తులు వేస్తుండేది. ఈ క్రమంలో ఒకనాడు ఆమె పట్ల మోహావేశుడైన ముని.. తన తపస్సును వదిలి ఆమెతో గడుపుతుంటాడు. కొన్నాళ్లకు తన లోకానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆ మునిని మంజుఘోష అడుగుతుంది. అయితే మేధావి ముని ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. అలా యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు గడిచిపోయాయి. చివరకు ఆమె తనతో గడిపిన కాలాన్ని లెక్క వేసుకోవాలని మునికి చెబుతుంది. ఆమెతో గడిపిన రోజుల్ని లెక్కబెట్టుకున్న మేధావి ముని.. అన్ని రోజులు వ్యర్థమైపోయినందుకు చింతిస్తాడు. ఆ కోపావేశంలో మంజుఘోషను దారుణంగా శపిస్తాడు. తనకు శాపవిమోచనం ఇవ్వాలని ఆమె అభ్యర్థిస్తుంది. శాంతించిన ముని.. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు పాప విమోచన వ్రతాన్ని ఆచరించాలని తరుణోపాయం చెబుతాడు. ఆయన సలహాను అనుసరించి మంజుఘోష ఈ ఏకాదశి నాడు పాప విమోచన వ్రతాన్ని ఆచరిస్తుంది. ఫలితంగా ఆమె శాప విమోచనాన్ని పొందుతుంది. ఆమెకు శాప విముక్తి కలిగించిన ఏకాదశి కాబట్టి ఇది శాప విమోచన ఏకాదశి అయ్యింది.

ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, ఆ రోజు ఉపవాసం ఉండి, ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలి.

ఫాల్గుణ బహుళ ద్వాదశి
మార్చి 26, బుధవారం

ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం ఆచరించాలి. నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు ఫాల్గుణ శ్రవణ ద్వాదశి వ్రతం ఆచరించాలని ఉంది. ఈశ్వర సంబంధమైన యోగేశ్వర భగవానుడిని పూజించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ బహుళ చతుర్దశి
మార్చి 28, శుక్రవారం

ఫాల్గుణ బహుళ చతుర్దశినే పిశాచ చతుర్దశి అని కూడా అంటారు. ఈ తిథి నాడు శివపూజ చేసి పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని నీలమత పురాణంలో ఉంది.

ఫాల్గుణ బహుళ అమావాస్య
మార్చి 29, శనివారం

ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు ఈనాడు గోదావరి తీరవాసులు ఏరువాక సాగుతారు. అమావాస్యను సాధారణంగా అశుభంగా భావిస్తారు. కానీ, శుభాశుభాలతో నిమిత్తం లేకుండా ఈనాడు ఆంధప్రదేశ్‍లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారు ఈ పర్వాన్ని వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వాన్ని దొంగ ఏరువాకగా కూడా పేర్కొంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామ గ్రామాన ఈనాడు దేవతల ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. అలాగే, ఈ తిథి నాడు మీన సంక్రమణం కనుక అయితే, అందుకు సంకేతంగా ఈనాడు మత్స్యవాసులదేవులను పూజించాలని హేమాద్రి అనే పండితుడి అభిప్రాయం.

చైత్ర శుద్ధ పాడ్యమి/ఉగాది
మార్చి 30, ఆదివారం

చైత్ర శుద్ధ పాడ్యమి చైత్ర మాస ఆరంభ దినం. అంతేకాదు తెలుగు సంవత్సరాది ఆరంభ దినం కూడా. ఈనాటి నుంచే తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచి చైత్ర మాస తిథులు ప్రారంభమవుతాయి. దీనినే వసంత మాసమని కూడా అంటారు. ఈ మాసపు తొలి తిథే ఉగాది. దీనినే సంవత్సరాది అనీ అంటారు. వరాహమిహిరాచార్యుడు వసంత విషువత్తు కొన్ని శతాబ్దాలాకు ముందే అశ్వినీ నక్షత్రాదికి చలించడాన్ని గుర్తించాడు. వేదాంగ జ్యోతిష కాలం కంటే ప్రాచీనమైన బ్రాహ్మణముల కాలంలో వసంత విషువత్కాలమూ కృత్తికా నక్షత్రంలో సంభవించడాన్ని పరిశీలించాడు. వసంత విషువత్తు తన కాలంలో అశ్విన్యాదిలో సంభవించడాన్ని గ్రహించి అది ప్రాచీనమైన దేవమాన దిన ప్రారంభమైన ఉత్తరాయణ పుణ్యకాలమనీ, సంప్రదాయానుసారంగా అదే వసంత కాలమనీ, వసంత విషువత్కాలమే ఉగాది అని నిర్ణయించి మాసరుతు సమతుల్యం సాధించాడు. వరాహమిహిరాచార్యుని నిర్ణయానుసారమే మనం చైత్ర మాసం పాడ్యమి తిథినే సంవత్సరారంభ దినంగా భావించి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ, ధర్మసింధు, నిర్ణయ సింధుకారులు అన్నట్టు శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్నే నెలగా పరిగణిస్తున్నాం. కనుక చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పాటించే ఆచారం ఏర్పడింది. అలా ఉగాదికి బీజం పడింది.
ఉగాది అనే సంస్క•త పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగమునకు వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి, ఆ తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి.. ఈ మూడింటినీ ఉగాదిగా జరుపుకునే వారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు ప్రాంతాల వారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చేసే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారం ఏర్పడినవే. మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉడాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గు పెట్టి, అటకలతో సహా అన్ని గదులలోనూ బూజు దులిపి, ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి ఆకులతో లేదంటే వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్ట దేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలనూ, ఉగాది పచ్చడినీ నివేదించాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిరోహించినదీ ఉగాది నాడేనని చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి కొత్త కార్యాలను ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభ తరుణం మరొకటి లేనే లేదు. మంచి పనులకు, సంకల్పాలకు ఈనాడే శ్రీకారం చుట్టాలి.
ఉగాది పర్వం ఆచరణ ఆర్యుల కాలం నుంచీ ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. శాలివాహనుడి శక స్థాపన దినము చైత్ర శుద్ధ పాడ్యమే. ఇక, శాస్త్రాలను తిరగేస్తే ఈనాడే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించాడని అంటారు. ఉగాది నాడు ప్రధానంగా ఆచరించాల్సిన పది విధాయ కృత్యాలను మన శాస్త్రకారులు విస్పష్టంగా పేర్కొన్నారు. అవి-
1) ప్రతిగృహ ధ్వజారోహణం: అంటే ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయడం. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయచిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించడం.
2) తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
3) నవ వస్త్రభరణధారణం- ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
4) దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మదేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
5) సర్వాకచ్ఛాంతకర మహాశాంతి – పౌరుషప్రతిపద్వ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ కృత్యం.
6) నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
7) పంచాంగ పూజ – పంచాంగ శ్రవణం: పంచాంగ శ్రవణం, ఆ ఏడాది కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
8) ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
9) రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
10) వాసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది నాడు ఈ పది విధాయ కృత్యాలను విధిగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడపాలనే వారంతా ఈ పది విధాయ కృత్యాలను విధిగా పాటించాలని శాస్త్ర నియమం.

చైత్ర శుద్ధ విదియ
మార్చి 31, సోమవారం

చైత్ర శుద్ధ విదియ నాడు ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను దమనములతో పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. బ్రహ్మ పురాణంలో ఈ మేరకు వీరికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పార్వతి తన భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అగ్ని అక్కడకు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా జరిగాడు. అప్పుడు శివుడికి వీర్యపతనం అయ్యింది. క్రీడా భంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాలని ఆజ్ఞాపించింది. అగ్ని ఆ వీర్యాన్ని భరించి కుమారస్వామి జననానికి కారణభూతుడయ్యాడు. ఇక, స్కంధ పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఆ వ్రతం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు తృతీయ వరకు చేయాలని అంటారు. ఇది స్త్రీల సుమంగళత్వాన్ని కాపాడ్డానికి ఉద్దేశించిన వ్రతం. అయితే, ప్రస్తుతం ఎక్కడా అరుంధతీ వ్రతం ఆచరిస్తున్న దాఖలాలు లేవు. అయితే, వివాహ సందర్బాలలో అరుంధతీ దర్శనం చేయించే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి నాటి రాత్రి ఔపోసనానంతరం నక్షత్ర రూపంలో ఉండే అరుంధతిని ప్రాతివత్య నిష్టకు ప్రతీకగా పెళ్లి కుమార్తెకు చూపిస్తారు. అరుంధతి అంటే- ఏ కారణం చేత కానీ ధర్మాన్ని అతిక్రమించనిది అని అర్థం.

అర్జునుడు పుట్టిన మాసం
ఫాల్గుణ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమైన మాసం. భాగవతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
• ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు (12) రోజుల పాటు పయో వ్రతం ఆచరించి, శ్రీమహా విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్టసిద్ధి కలుగుతుందని అంటారు.
• దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో పయో వ్రతం ఆరచించే వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.
• శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, పేదలకు అన్నదానం లాంటివి చేయడం మంచిది. దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుంది.
• ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయల్దేరాడని రామాయణంలో ఉంది.
• ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడి మధ్య యుద్ధం ప్రారంభమైంది.
• హరిహర సుతుడైన అయ్యప్పస్వామి పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
• అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండటం ఈ మాసం విశిష్టతకు ప్రతీక.
• మహాభారతంలో- ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని వివిధ పురాణాల్లో ఉంది.
• ఫాల్గుణ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణుపూజకు ప్రాధాన్యం ఇవ్వాలి.
• ఫాల్గుణ మాసంలో శుద్ధ తదియ, చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండీ గణపతికి సంబంధించిన పూజ ఇది.
• ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజున ఫాల్గొణోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు.
• ఫాల్గుణంలో ముఖ్యమైనవి ఫాల్గుణ పౌర్ణమి. ఈనాడు శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజించాలి.

శ్రీవిశ్వావసు
నామ సంవత్సరం

తెలుగు మాసాలలో మొదటిది చైత్రం. ఈ మాసపు ఆరంభ దిన (చైత్ర శుద్ధ పాడ్యమి)మే ఉగాది. మార్చి 30 ఉగాది పర్వదినం. ఈ తెలుగు సంవత్సరానికి ‘శ్రీ విశ్వావసు నామ సంవత్సరం’ అని పేరు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల యుగమే ఉగాది. తిథి సంపదలను, వారం ఆయుష్షును ఇస్తుంది. నక్షత్రం పాపాలను హరిస్తుంది. యోగం రోగాలను నివారిస్తుంది. చివరిదైన కరణం విజయాన్ని సిద్ధింప చేస్తుంది. సంపదలను కోరుకునే వారు తిథిని, దీర్ఘాయుష్ణును కోరుకునే వారు వారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాప పరిహారం కోసం నక్షత్రం విషయంలో, రోగ నివారణకు యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విజయం కోసం కరణం విషయంలో శ్రద్ధ చూపాలి. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు, అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఇతర మంచి పనుల ప్రారంభానికి ముందు ఈ ఐదు అంగాలు బలంగా, అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇష్టదేవతను పూజించి ఆనందంగా గడపడం ఉగాది ప్రధాన కృత్యమైతే ఆనాడు ఆచరించే విధుల్లో ప్రధానమైనది పంచాంగ శ్రవణం. వ్యక్తిగత జీవితంలో కలిగే మార్పులతో పాటు సమాజంలో చోటుచేసుకునే పరిణామాలు, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ స్థితిగతులన్నీ ఇందులో భాగమై ఉంటాయి. రాశుల వారీగా సంవత్సర ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు వంటివి పండితులు చదివి వినిపిస్తారు. శాస్త్రోక్తమైన పంచాంగ శ్రవణం గ్రహదోషాల్ని నివారిస్తుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అపమృత్యు భయాలు తొలగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. సంపదలు కలుగుతాయి. శుభ ఫలితాలు లభిస్తాయి.
ఉగాది నాడు మధుర, తిక్త, లవణ, ఆమ్ల, కటు, కషాయం వంటి షడ్రుచులతో చేసిన పచ్చడిని తినడం సంప్రదాయం. జీవితం అంటేనే సుఖదుఃఖాల మిశ్రమం. వాటిని సమభావంతో స్వీకరించి, సమన్వయంతో నెగ్గుకురావాలనే అంతరార్థం ‘ఉగాది పచ్చడి’లో ఇమిడి ఉంది. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది మంచికానీ, చెడుకానీ దానిని సమర్థంగా ఎదుర్కొని నిలవాలని సందేశాన్ని ఇచ్చే పర్వం- ‘ఉగాది’. ఈ నూతన సంవత్సరం మనకు సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు, భయక్రోధాలకు అతీతమైన పరమోన్నతమైన స్థితిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుందాం.

శ్రీలక్ష్మీ జయంతి
లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధంగా ప్రాదుర్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వాయంభువ మన్వంతర కాలంలో భృగు మహర్షి, ఖ్యాతి దంపతుల కుమార్తెగా జన్మించింది. సార్వోచిష మన్వంతరంలో అగ్ని నుంచి ఆవిర్భవించిందని అంటారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుంచీ, తామస మన్వంతరంలో భూమి నుంచీ, రైవత మన్వంతరంలో బిల్వవృక్షం నుంచీ, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుంచీ, వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరం నుంచీ శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించినట్టు ఆయా పురాణ కథనాలను బట్టి తెలుస్తోంది. వీటిలో క్షీరసాగర మథనం నుంచి లక్ష్మి ఆవిర్భవించిన దినమే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ అని, కాబట్టి ఆనాడే లక్ష్మీ జయంతి అనీ అంటారు.
ప్రతి ఒక్కరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఎందుకంటే ఆ తల్లి దయతోనే మనకు కావాల్సిన ధనధాన్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. సుఖవంతమైన జీవనం గడపడానికి అవసరమైనవన్నీ లక్ష్మీకృపతోనే సాధ్యమని అంటారు. అందుకే నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ (మార్చి 14, 2025) నాడు తాము నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సంప్రదాయానుసారం ఆ తల్లిని ఆహ్వానిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయాల్సిన పూజలు, చదవవలసిన మంత్రాలు అనేక పురాణాల్లో ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరుల వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తవం పఠించారని, అప్పుడు లక్ష్మి కరుణించి ఒక పేదరాలి ఇంట్లో కనక (బంగారు) వర్షం కురిపించారనే కథ లోక ప్రాచుర్యం పొందింది. లక్ష్మీ జయంతి నాడు భక్తులు తమకు ఐశ్వర్యానందాలను ప్రసాదించాలంటూ తల్లిని పూజిస్తారు. లక్ష్మీ సహస్ర నామావళి (వెయ్యి లక్ష్మీదేవి నామాలు), శ్రీ సూక్తం కూడా పఠిస్తారు. దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెలో ముంచిన తామర పువ్వులను నైవేద్యంగా ఉపయోగిస్తారు.
లక్ష్మీదేవి జయంతి నాడు పాటించే ఒక చిత్రమైన ఆచారం కూడా ఉంది. అదేమిటంటే.. హోలికా దహనం చేసిన తరువాత కొంత బూడిదను తీసుకుని ఇంట్లో ఉంచి, దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో ప్రతిష్ఠించుకున్న లక్ష్మీదేవి విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అనంతరం ఆ బూడిదను తీసి ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థికలాభం కలుగుతుందని అంటారు. లక్ష్మీ జయంతి నాడు తులసి మొక్కను నాటడం, పూజించడం శుభప్రదంగా భావిస్తారు. క్షీరసాగర మథన సమయంలోనే లక్ష్మీదేవి జనించింది కాబట్టి ఆమెను జగద్వితమైన ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం..’ అనే శ్లోకంతో ప్రస్తుతిస్తారు.

Review ఉగాది..సకల శుభాది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top