ఘనం ఆషాడ బోనం

జూలై 1, సోమవారం, జ్యేష్ఠ బహుళ చతుర్దశి నుంచి – జూలై 31, బుధవారం, ఆషాఢ బహుళ చతుర్దశి వరకు
శ్రీ వికారి నామ సంవత్సరం-జ్యేష్ఠం-ఆషాఢం- గ్రీష్మ రుతువు-ఉత్తరాయణం.

ఆంగ్లమానం ప్రకారం ఏడవ మాసం జూలై. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ- ఆషాఢ మాసాల కలయిక. జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆషాఢం తెలుగు మాసాలలో నాలుగవది. ఈ మాసంలో వచ్చే పర్వాలలో తెలంగాణ బోనాల జాతర, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం వంటివి ముఖ్యమైనవి. అలాగే, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యేది కూడా ఈ నెల నుంచే.

ఆషాఢ మాసం పల్లెటూర్లలోని అమ్మవార్ల జాతర్లకు ప్రసిద్ధి. ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల్లో జాతర జాతర వాతావరణం అలముకుని ఉంటుంది. గ్రామ దేవతల పూజలతో బోనమెత్తిన పల్లెలు.. శిగల్లుగా భక్తజనంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గృహనిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనదీ మాసం. ఇంకా ఈ మాసంతోనే నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మ్యాస వ్రతం శ్రీకారం చుట్టుకుంటుంది. ‘ఆషాఢం’ అనే మాటకు ‘బ్రహ్మచారుల చేతిలో ఉండే మోదుగు దండం’, ‘మలయ పర్వతం’ అనే అర్థాలూ ఉన్నాయి. ఆషాఢం శూన్య మాసం. అయితేనేం సాంస్క•తిక వైశిష్ట్యాన్ని సంతరించుకున్న మాస మిది. కొన్ని తాల్లో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణ విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. ఇక, తెలుగు నాట రైతుల నోట బాగా పలికే నానుడి- ‘ఆషాఢ మేఘం’. ఆకాశంలో నల్లమబ్బులు అలుముకునే మాసమిది. అయితే, ఈ మేఘాలు త్వరగా కురిసేవి కావు. దట్టంగా కమ్ముకుని హడావుడి చేసి మెల్లగా చెదిరిపోతాయి. అందుకే రైతులు ఆషాఢ మేఘాలను చూసి త్వరగా విత్తు విత్తరు. ఎందుకంటే, ఆషాఢంలోనే ప్రధానమైన ఖరీఫ్‍ సీజన్‍ ఆరంభం అవుతుంది. చినుకు పడటమే ఆలస్యం.. దుక్కిదున్ని విత్తనాలు విత్తడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ, ఆషాఢ మేఘాలు ఎంతకీ చినుకు రాల్చవు. అందుకే ఆషాఢ మేఘాలను నమ్మి సాగులో ముందుకు పోకూడదని రైతులు అంటారు. మరోపక్క ఆషాఢ మేఘాల తీరును బట్టేనే•మో నమ్మించి మోసం చేసేవాళ్లను, అతి వినయం ఒలకబోసే వాళ్లను ‘ఆషాఢభూతు’లని అంటారు.

జ్యేష్ఠ బహుళ అమావాస్య, జూలై 2, మంగళవారం

ఈనాడు భోగసాయి పూజ చేయాలి. సుజన్మావ్యాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతాలు కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య మిథున సంక్రాంతి పర్వదినం.

ఆషాఢ శుద్ధ విదియ, జూలై 4, గురువారం

ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. ఇక్కడి జగన్నాథుని రథయాత్ర ఈనాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది.

ఆషాఢ శుద్ధ పంచమి, జూలై 7, ఆదివారం

ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు. స్కందుడి (కుమార స్వామి)ని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే, ఈ తిథి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ పండుగను వైభవంగా జరుపు కుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. అంటే ఇది మనకు ఇంచుమించు ఆషాఢ మాసంతో సమానమైనది.

తెలంగాణలో ఆషాఢ బోనాలు ప్రారంభం

జూలై 7వ తేదీ, ఆషాఢ శుద్ధ పంచమి నాటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలు శ్రీకారం చుట్టుకోనున్నాయి. ఆ తదుపరి వచ్చే ఆదివారాలు, అంటే జూలై 14, 21, 28 తేదీలలో సంబరాలు అంబర మంటేలా ఉత్సవాలు జరుగుతాయి. సృష్టి, స్థితి, లయ కారణభూతమైన ఆది పరాశక్తే బోనాల ఉత్సవాల్లో ఆరాధ్య దేవత. ఈనాటి నుంచి తెలంగాణ పల్లెల్లో కొలువుదీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. వీరికి బోనంలో భక్తులు మొక్కులు, నైవేద్యాలు సమర్పిస్తారు. బోనంలో వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతో కలిపిన నీరు ఉంటాయి. సాంక్రమిక వ్యాధుల నివారణకు ఈ దినుసులన్నీ ఎంతగానో ఉపకరిస్తాయి. మహిళలు మొక్కుబడులను బోనాల రూపంలో తీర్చుకుంటారు. మహంకాళి దేవతకు ఈ సంబరాల్లో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ప్రకృతి శక్తి విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. వీరి శుభ దీవెనల వల్లే గ్రామాల్లో ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. జూలై 15, ఆషాఢ శుద్ధ తదియ, ఆదివారం నుంచి బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ అమ్మవారి పూజలతో జూలై 7న బోనాల తొలి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆపై హైదరాబాద్‍ పాత నగరంలోని లాల్‍దర్వాజా అమ్మవారి జాతర జూలై 14న, జూలై 21న సికింద్రాబాద్‍ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. జూలై 28 బోనాల సందర్భంగా తెలంగాణలో సెలవు దినం.

ఆషాఢ శుద్ధ షష్ఠి, జూలై 8, సోమవారం

సాధారణంగా షష్ఠి నాడు కుమారస్వామిని పూజిస్తారు. అందుకే దీనిని కుమార షష్ఠి అన్నారు. ఈనాడు ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని శోడశోప చారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి.

ఆషాఢ శుద్ధ సప్తమి, జూలై 8, సోమవారం

షష్ఠి తిథిలోనే ఆషాఢ శుద్ధ సప్తమి తిథి కూడా ప్రారంభమవుతుంది. ఈనాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్ట మైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని కూడా అంటారు.

ఆషాఢ శుద్ధ అష్టమి, జూలై 9, మంగళవారం

ఈనాడు మహిషాగ్ని పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామి యాష్టమీ అని గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని అందులో ఉంది.

ఆషాఢ శుద్ధ నవమి, జూలై 10, బుధవారం

ఈ తిథి నాడు బంద్రాదేవిని పూజించాలని స్మ•తి కౌస్తుభంలో వివరించారు. ఈమె అనేకానేక శక్తి దేవతలలో ఒకరు.

ఆషాఢ శుద్ధ దశమి, జూలై 11, గురువారం

ఆషాఢ శుద్ధ దశమి నాటి నుంచి శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి, జూలై 12, శుక్రవారం

ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రతీతి. ఇది పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధం. కుల, వర్గ భేదాలకు అతీతంగా పండుగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం సాంప్రదాయంగా వస్తున్న గొప్ప ఆచారం. ఆషాఢ మాసంలో వచ్చే ప్రథమ ఏకాదశి ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, ఆ రోజు నుంచి చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవుతుందని అంటారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది.

ఆషాఢ శుద్ధ ద్వాదశి, జూలై 13, శనివారం

చాతుర్మ్యాస వ్రతం ఈనాటి నుంచే ఆరంభమవుతుంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.

ఆషాఢ శుద్ధ పూర్ణిమ, జూలై 16, మంగళ•వారం

ఆషాఢ శుద్ధ పూర్ణిమకు వ్యాస పూర్ణిమ అని పేరు. ఈనాడు యతులు మహా భారత గ్రంథ రచయిత, అష్టాదశ పురాణ గ్రంథకర్త అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని చెబుతారు. దక్షిణాదిలోని కుంభకోణంలో, శృంగేరిలో ఈనాడు శంకర పీఘాలు నితాంత వైభవంతో శోభిల్లుతాయి. ఇంకా ఈనాడు శివ శయన వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కోకిలా వ్రతాన్ని కూడా ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, మన తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలోని పూర్వ మహబూబ్‍నగర్‍ జిల్లా కసుమర్తి గ్రామంలో భీమా నది కృష్ణా నదిలో కలిసే చోట చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ జితేంద్రరాయ పేరిట దైవం ఉంది. వ్యాస పూర్ణిమ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.

ఆషాఢ బహుళ పాడ్యమి, జూలై 17, బుధవారం

ఈ తిథి నాడు మృగశీర్షా వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభ వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, కోకిలా వ్రతాన్ని ఆచరించాలని కూడా అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో- ఆషాఢ బహుళ పాడ్యమి నాడు ధర్మావాప్తి వ్రతం ఆచరించాలని రాశారు.

ఆషాఢ బహుళ విదియ, జూలై 18, గురువారం

ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ నాటి తిథి గురించి ‘క్షీరసాగరే సలక్ష్మీక మధుసూదన పూజ’ అని వర్ణించారు. అంటే, దీనిని బట్టి ఈనాడు లక్ష్మీ సహిత మధుసూదనుడిని పూజించాలని తెలుస్తోంది. ఇంకా ఈనాడు అష్టనాగ పూజ, మనసా పూజ నిర్వహించాలని వేర్వేరు గ్రంథాల్లో ఉంది. మరికొన్ని గ్రంథాలు ఆషాఢ బహుళ విదియ తిథి విజయతీర్థ పుణ్యదినమని పేర్కొంటున్నాయి.

ఆషాఢ బహుళ అష్టమి, జూలై 25, గురువారం

ఈ తిథి రౌచ్య మన్వంతరాది తిథి. రౌచ్యుడు పదమూడవ మనువు. అతనికి రేచ్చుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన రుచి అనే వాని కుమారుడు. మొదట రుచి మహర్షి వివాహం చేసుకోలేదు. అందువల్ల ఒకనాడు పితరులు అతనికి కనిపించి పెళ్లి చేసుకుని సంతానం పొందాలని చెబుతారు. ఈ క్రమంలో అతను బ్రహ్మ ఆదేశానుసారం మాలిని అనే అప్సరస కుమార్తెను వివాహమాడతాడు. ఫలితంగా ఆయనకు ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశి మన్వంతరాధి పత్యం వహిస్తున్నాడు. ఈ మన్వంతరానికి దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ బహుళ ఏకాదశి, జూలై 28, ఆదివారం

ఈనాడు కామికైకాదశి పర్వం. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల అభీష్టాలు ఈడేరుతాయని అంటారు.

Review ఘనం ఆషాడ బోనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top