ఘన ఫాల్గుణం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో మూడో నెల- మార్చి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది పదకొండవ మాసం. మార్చి నెల మాఘ – ఫాల్గుణ మాసాల కలయిక. మార్చి 2వ తేదీ వరకు మాఘ మాస తిథులు.. ఆపై మార్చి 31 ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో మహా శివరాత్రి, అమలకి ఏకాదశి, నృసింహ ద్వాదశి, వసంత పూర్ణిమ, హోలీ, రామకృష్ణ పరమహంస జయంతి వంటివి ముఖ్యమైనవి.

2022- మార్చి 1, మంగళవారం,
మాఘ బహుళ చతుర్దశి నుంచి
2022- మార్చి 31, గురువారం,
ఫాల్గుణ బహుళ చతుర్దశి వరకు..

శ్రీప్లవ నామ
సంవత్సరం-
మాఘం- ఫాల్గుణ
మాసం- శిశిర రుతువు- ఉత్తరాయణం

తెలుగు సంవత్సరాల వరుసలో చివరి మాసం (పన్నెండవది) ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ఇది చివరి నెల. ఈ కాలంలో ఉసిరికలు విరగకాస్తాయి. అందుకే కాబోలు ఉసిరిక పేరుతో ఫాల్గుణ మాసంలో ఒక ఏకాదశి కూడా ఉంది. దీనిని ‘అమలిక ఏకాదశి’ అంటారు. ఫాల్గుణ మాసం.. చెట్లన్నీ ఆకులు రాల్చే కాలం. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. వసంతానికి స్వాగతం పలికే ఈ మాసం.. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణంతో విరాజిల్లుతుంది. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనుకూలమైన మాసమని మత్స్య పురాణంలో ఉంది. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించడం వల్ల సువర్ణ, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు స్థిరపడింది. నువ్వులు, ఉసిరికలు, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమై ఉన్నాయి. వాటిలో ఫాల్గుణ మాసం ఒకటి.

ఇక, దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది. ఇంకా కామ దహనం, ద్వాపర యుగాది, శ్రీకంఠ జయంతి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, పొట్టి శ్రీరాములు జయంతి, హోలీ పూర్ణిమ, శ్రీలక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతి, రంగ పంచమి, పాపవిమోచన ఏకాదశి ఈ మాసపు ప్రధాన పర్వాలు.

మాఘ బహుళ చతుర్దశి/మహా శివరాతి
మార్చి 1, మంగళవారం

మాఘ కృష్ణ (బహుళ) చతుర్దశి తిథి మహా శివరాత్రి (మార్చి 1) పర్వతిథి. శైవమతంలో అతి విశేషమైన, సర్వోత్క•ష్టమైన పండుగ శివరాత్రి. ఈనాడు భక్తులు ఉదయాన్నే లేచి, స్నానాదులు చేసి, శివపూజ చేసి, ఉపవాసం ఉండి, రాత్రంతా మేల్కొని ఉండి మర్నాటి ఉదయం పారణ చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథన పఠనాలతో గడుపుతారు. పూర్వం శ్రీశైల క్షేత్రంలో ఈ ఉత్సవం ఎంత గొప్పగా జరిగేదో పాల్కురికి సోమనాథుడు తన ‘పండితారాథ్య చరిత్ర’లో గ్రంథస్తం చేశాడు. శివరాత్రి నాడు పూజలు, జాగరణాదులు చేసే వారు సర్వపాప విముక్తులై అంత:కాలంలో శివ సాయుజ్యం పొందుతారని, శివరాత్రి వ్రతాన్ని ఆచరించని వారు జన్మ సహస్రములలో కొట్టుమిట్టాడుతారని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి (శివరాత్రి పర్వ విశేషాల గురించి లోపలి పేజీల్లో చూడవచ్చు).
మాఘ కృష్ణ చతుర్దశి నాడు రటంతీ చతుర్దశి వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ తిథి నాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది. ప్రధానంగా ఇది- శివరాత్రి పర్వదినం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని ‘శివరాత్రి మహాత్మ్యం’ అనే గ్రంథం చెబుతోంది. అలాగే, ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి వదలాలి. ఈనాడు పులగం తినాలి. శివుడికి బిల్వార్చనం చేసి, తుమ్మి పూలతో పూజించాలి. ప్రతి రోజూ రాత్రి శివుడిని పదకొండు సార్లు తలుచుకుని నిద్రపోవాలని, అలా శివుడిని తలుస్తూ రాత్రులు నిద్రపోవడం వల్ల ప్రతి రాత్రి శివరాత్రి అవుతుందని అంటారు. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా రోజంతా శివుడిని తలచుకుని ఆధ్యాత్మికతను ఆస్వాదించే పర్వమే- శివరాత్రి.

మాఘ బహుళ అమావాస్య/మన్వాది
మార్చి 2, బుధవారం

మాఘ కృష్ణ (బహుళ) అమావాస్య మాఘ మాసపు చివరి రోజు. పితృకర్మలు నిర్వహించడానికి ఇది అనువైన తిథి. ఈ దినం మన్వాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో పేర్కొన్నట్లుగా, ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడిని యథాశక్తి కొలవాలని అంటారు. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
మార్చి 3, గురువారం

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి, మార్చి 3వ తేదీ, గురువారం నుంచి ఫాల్గుణ మాసం ఆరంభమవుతుంది. ఇది ఫాల్గుణ మాస ఆరంభ తిథి. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది. పాడ్యమి నుంచి మళ్లీ చంద్ర దర్శనం. మీన సంక్రమణ దినం కూడా.

ఫాల్గుణ శుద్ధ విదియ
మార్చి 4, శుక్రవారం

ఫాల్గుణ శుద్ధ విదియ తిథి రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్‍తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిన గురువు- రామకృష్ణ పరమహంస. ఈయన పుట్టినప్పటి పేరు గదాధర్‍ చటోపాధ్యాయ. పశ్చిమబెంగాల్‍ సాంస్క•తిక పునరుజ్జీవనంలో ఈయన పాత్ర, ప్రభావం చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద ఈయన శిష్యులలో ప్రథముడు. సృష్టిని ఏకత్వంతో చూడాలని, అన్ని జీవుల్లోనూ దైవత్వాన్ని దర్శించాలని, అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కామం, స్వార్థం, కామవాంఛనాల నుంచి విడివడితేనే భగవంతుడిని దర్శించుకోగలమని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో దారులున్నట్టే.. భగవంతుడిని చేరడానికి అనేక మార్గాలున్నాయని.. రామకృష్ణ పరమహంస బోధించారు.

ఫాల్గుణ శుద్ధ తదియ
మార్చి 5, శనివారం

ఫాల్గుణ శుద్ధ తదియ.. పూర్వాభాద్ర కార్తె దినం. ఈనాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ చతుర్ధి
మార్చి 6, ఆదివారం

ఫాల్గుణ శుద్ధ చతుర్థి.. మంగళకరమైన తిథి. ఈనాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డుంఢి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. అలాగే, సంతానాన్ని కోరే వారు ఈనాడు పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు చేసే నువ్వుల దానం కారణంగానే ఈ చతుర్థికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది.

ఫాల్గుణ శుద్ధ పంచమి
మార్చి 7, సోమవారం

పంచమి తిథి సాధారణంగా అనంత పంచమీ వ్రతాచరణకు అనువైనదని అంటారు. కాబట్టి ఈనాడు అనంత పంచమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, తెలుగు క్యాలెండర్లలో ఈనాడు శ్రీకంఠ జయంతిగా పేర్కొన్నారు. అయితే, ఇది ఏ దైవానికి లేదా ఎవరికి సంబంధించినదనే వివరాలు తెలియ రావడం లేదు.

Review ఘన ఫాల్గుణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top