పల్లెకళ..ఆషాఢం భళా

ఆంగ్ల సంవత్సరాల వరుసలో ఆషాఢ మాసం.. జూలై నెల కింద వస్తుంది. ఇది ఆంగ్లమానం ప్రకారం ఏడవ నెల కాగా, తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో మాసం. యోగిని ఏకాదశి, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం, తొలి ఏకాదశి వంటి పర్వాలు ఈ మాసంలోనివే. ఇంకా ముఖ్యమైన గురు పౌర్ణమి, తెలంగాణ బోనాల ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. అలాగే, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యేది కూడా ఈ నెల నుంచే. శుభ ముహూర్తాల పరంగా ఆషాఢం అంతగా అనుకూలమైనది కాదని ప్రచారంలో ఉన్నా.. అమ్మవార్ల ఆరాధనకు ఈ మాసం నెలవు.

2022- జూలై 1, శుక్రవారం, ఆషాఢ శుద్ధ విదియ నుంచి 2022- జూలై 31, ఆదివారం, శ్రావణ శుద్ధ తదియ వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-ఆషాఢం-శ్రావణం- వర్షరుతువు- దక్షిణాయణం

తెలుగునాట పల్లెలు జాతర కళతో శిగాలూగే సమయానికి ఆషాఢ మాసం నెలవు. ఎటుచూసినా అమ్మవార్లు ఈ మాసంలో పూజలందుకుంటారు. అందుకే ఆషాఢం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది. గృహ నిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనదీ మాసం. ఆషాఢ మాసంతోనే నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మ్యాస వ్రతం శ్రీకారం చుట్టుకుంటుంది.
ఆషాఢం’ అనే మాటకు ‘బ్రహ్మచారుల చేత ఉండే మోదుగు దండం’, ‘మలయ పర్వతం’ అనే అర్థాలూ ఉన్నాయి. ఆషాఢం శూన్య మాసం. అయితేనేం సాంస్క•తిక వైశిష్ట్యాన్ని సంతరించుకున్న మాసమిది. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం. ఇక, తెలుగు నాట రైతుల నోట బాగా పలికే నానుడి- ‘ఆషాఢ మేఘం’. ఆకాశంలో నల్లమబ్బులు అలముకునే మాసమిది. అయితే, ఈ మేఘాలు త్వరగా కురవవు. దట్టంగా కమ్ముకుని .. మెల్లగా చెదిరిపోతాయి. అందుకే రైతులు ఆషాఢ మేఘాలను చూసి త్వరగా విత్తు విత్తరు. ఆషాఢ మేఘాలను నమ్మి సాగులో ముందుకు పోకూడదనేది రైతుల మాట. మరోపక్క ఆషాఢ మేఘాల తీరును బట్టే.. నమ్మించి మోసం చేసేవాళ్లను, అతి వినయం ఒలకబోసే వాళ్లను ‘ఆషాఢభూతు’లని అంటారు.
ఇక, అతివలు అరచేతుల నిండా గోరింటాకు సింగారించుకుని మురిసిపోయేదీ ఈ నెలలోనే! ఆషాఢంలో సాధారణంగా శుభ ముహూర్తాలు పెట్టుకోరు. వివాహ, గృహ సంబంధ కార్యాలను ఈ నెలలో వాయిదా వేస్తారు. అయితే, ఆయా తిథులను అనుసరించి నిర్వర్తించాల్సిన పూజాధికాలు, ఆచారాలు కొన్ని ఈ నెలలో ఉన్నాయి. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. మునగ కూర బాగా తినాలని నియమం. అలాగే, ఆషాఢంలో అనపపప్పు వాడాలని అంటారు. ఈ నెలలో వచ్చే పర్వాల్లో అత్యంత విశిష్టమైనది, విష్ణువుకు ప్రీతికరమైనది.. ‘తొలి ఏకాదశి’. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ నెల నుంచే ఆరంభమవుతుంది. గురువును సైతం దైవంగా భావించి, ఎంచి కొలిచే మన భారతీయ గడ్డపై గురువును పూజించడానికి ఒక విశిష్టమైన రోజు ఉంది. అదే గురుపూర్ణిమ. అదీ ఈ నెలలోనిదే. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథుల పరిచయం..

ఆషాఢ శుద్ధ విదియ/పూరీ జగన్నాథ రథయాత్ర
జూలై 1, శుకవ్రారం

ఆషాఢ శుద్ధ విదియ.. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. ఇక్కడి జగన్నాథుని రథయాత్ర ఈనాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. జగన్నాథుడితో పాటు బలభద్ర, సుభద్ర రథాలపై వైభవంగా ఊరేగుతారు. పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ప్రసిద్ధం. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం.
ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క•తిక అంశాలుగా మారిపోయాయి. జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుంటారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగన్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్‍, తులసీదాస్‍, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థలు సైతం ఈ• రథోత్సవాన్ని చిత్రీకరించేందుకు దాదాపు నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటాయంటే అంతర్జాతీయంగా ఈ రథయాత్ర ఎంత ప్రసిద్ధమైనదో ఊహించుకోవచ్చు. నేత్రపర్వంగా చేసే రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా తిలకించాలని భక్తులు భావిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ విదియ నుంచి జూలై నెల ప్రారంభమవుతుంది. ఈ తిథి నాడు ఆచరించాల్సిన పూజాధికాలు, వ్రతాలు ప్రత్యేకించి ఏమీ లేవు.

ఆషాఢ శుద్ధ చతుర్థి
జూలై 3, ఆదివారం

ఆషాఢ శుద్ధ చతుర్థి.. గణేశ చతుర్థి తిథి. ఈనాడు గణపతిని పూజించాలి. ఈరోజు నుంచే తెలంగాణలో బోనాల పూజలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి జూలై 10, 17, 24 తేదీలలో సంబరాలు అంబరమంటేలా జరుగుతాయి. సృష్టి, స్థితి, లయ కారణభూతమైన ఆది పరాశక్తే బోనాల ఉత్సవాల్లో ఆరాధ్య దేవత. ఈనాటి నుంచి తెలంగాణ పల్లెల్లో కొలువుదీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. వీరికి బోనంలో భక్తులు మొక్కులు, నైవేద్యాలు సమర్పిస్తారు. బోనంలో వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతో కలిపిన నీరు ఉంటాయి. సాంక్రమిక వ్యాధుల నివారణకు ఈ దినుసులన్నీ ఎంతగానో ఉపకరిస్తాయి. మహిళలు మొక్కుబడులను బోనాల రూపంలో తీర్చుకుంటారు. మహంకాళి దేవతకు ఈ సంబరాల్లో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ప్రకృతి శక్తి విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. వీరి శుభ దీవెనల వల్లే గ్రామాల్లో ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. గోల్కొండ అమ్మవారి పూజలతో జూలై 3న బోనాల తొలి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆపై హైదరాబాద్‍ పాత నగరంలోని లాల్‍దర్వాజా అమ్మవారి జాతర జూలై 10న, జూలై 17న సికింద్రాబాద్‍ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు. జూలై 24 బోనాల సందర్భంగా తెలంగాణలో సెలవు దినం.

ఆషాఢ శుద్ధ పంచమి
జూలై 4, సోమవారం

ఆషాఢ శుద్ధ పంచమి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. అంటే ఇది మనకు ఇంచుమించు ఆషాఢ మాసంతో సమానమైనది. ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు.

ఆషాఢ శుద్ధ షష్ఠి/స్కందవత్రం
జూలై 5, మంగళవారం

ఆషాఢ శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం ఆచరిస్తారు. సాధారణంగా షష్ఠి నాడు కుమారస్వామిని పూజిస్తారు. అందుకే దీనిని కుమార షష్ఠి అన్నారు. ఈనాటి వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని శోడశోపచారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి. ఈ వ్రతాచరణను ప్రధానంగా శరీరారోగ్యానికి నిర్దేశించారు. ఇక, కుమారస్వామి జన్మ వృత్తాంతంలోకి వెళ్తే.. కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యుడనే పేర్లతో పిలుస్తారు. కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు చెబుతున్నాయి. శివ పార్వతులు మన్మథ క్రీడలో ఉండగా, వారికి తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని భయపడిన ఇంద్రుడు వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని ఆ సమయంలో చూసిన శివుడు పార్వతికి దూరం జరిగాడు. శివతేజం (వీర్యం) భూమిపై పడింది. అగ్ని దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని రెల్లు పొదల్లో జారవిడిచింది. ఆ రెల్లు పొదల్లో కుమారస్వామి జననం జరిగింది. శరవనం (రెల్లు)లో జన్మించిన కారణంగా శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకెళ్లి బదరికా వనంలో వదిలారు. కృత్తికలు పెంచిన వాడు కనుక కార్తికేయుడయ్యాడు.

ఆషాఢ శుద్ధ సప్తమి/ద్వాదశ సప్తమి
జూలై 6, బుధవారం

ఈనాడు నాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని కూడా అంటారు.

ఆషాఢ శుద్ధ అష్టమి
జూలై 7, గురువారం

ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషఘ్నీ పూజ చేయాలని స్మంతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామ అష్టమీ అని పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది.

ఆషాఢ శుద్ధ నవమి
జూలై 8, శుకవ్రారం

ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఐంద్రాదేవిని పూజించాలని స్మంతి కౌస్తుభంలో వివరించారు. ఈమె కూడా శక్తి దేవతే.

ఆషాఢ శుద్ధ దశమి/శాకవత్రారంభం
జూలై 9, శనివారం

ఆషాఢ శుద్ధ దశమి నాటి నుంచే శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమంగా పెట్టారు. ఆరోగ్య పరిరక్షణ ఈ శాక వ్రతం ఉద్దేశం. మన ఆధ్యాత్మిక పర్వాల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. అందుకు నిదర్శనమే.. శాక వ్రతం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి/ తొలి ఏకాదశి
జూలై 10, ఆదివారం

ఆషాఢ శుద్ధ ఏకాదశి.. తొలి ఏకాదశి. ఇది పుణ్యతిథి. పవిత్రమైన రోజు. కుల, వర్గ భేదాలకు అతీతంగా ఏకాదశి రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం అనూచానంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవడానికి అనువైన సమయమిది. ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక పౌరాణిక గాథలు ఈ వ్రతం ఇహపరాల నడుమ సేతుబంధనం వంటిదని వర్ణించాయి. ఆషాఢ మాసంలో వచ్చే ప్రథమ ఏకాదశి ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, ఆ రోజు నుంచి చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవుతుందని అంటారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి నాడు ఉపవససించి యథాశక్తి భగవంతుడిని కొలవాలని ఆయా పురాణాలు చెబుతున్నాయి.
ఇక, ఏకాదశి విశేషాల్లోకి వెళ్తే.. ఏకాదశి అంటే, ప్రతి పక్షము (15 రోజులు)నకు ఒకసారి వచ్చే పదకొండవ (11) తిథి అని అర్థం. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా ఇలా 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశులన్నీ పుణ్యప్రదాలు. ఆ రోజున హరినామ కీర్తన ప్రధానంగా చేస్తారు. కాబట్టి ఏకాదశిని ‘హరివాసరం’ అని కూడా అంటారు. శిష్టులు ఏకాదశి నాడు పరమ నిష్టగా ఉండి ఉపవాసం ఆచరిస్తారు. దశమి రాత్రి నిరాహారుడై, ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా, ద్వాదశి ఉదయం పారణమొనర్చి, ద్వాదశి నాడు రాత్రి కూడా నిరాహారుడై ఉండాలి. అప్పుడు కాని ఏకాదశి వ్రతం సంపూర్ణం కాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఆ రోజు సూర్యచంద్రాది గ్రహణముల కాలంలో భూరి దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది. అంతేకాక అశ్వమేథ యజ్ఞ ఫలం, అరవై వేల సంవత్సరాల తపఃఫలం పొందుతారని ప్రతీతి. ఏకాదశి నాడు ఉపవసించడం- బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కంటే, విద్యార్థులకు వేద విద్యాదానం చేయడం కంటే ఉత్తమమైనదని పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఏకాదశి నాడు ఉపవసించలేని వారికి వాయు పురాణంలో ప్రత్యామ్నాయాలు చూపారు. ఉపవాసం చేయలేనపుడు వాయు భక్షణం, అది చేతకానపుడు పంచగవ్యం లేక నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. అదీ సాధ్యం కానపుడు ఉడకని పదార్థాలు లేక హవిష్యాన్నం తినవచ్చు. ఇది కూడా చేయలేని వారు ఒక్క పొద్దు ఉండవచ్చు.
ఏకాదశి నాడు భుజించే వాడు చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ పాపాన్ని పోగొట్టుకోలేడని ప్రతీతి. ఒకసారి బ్రహ్మ ఫాల భాగం నుంచి ఒక చెమట బిందువు కిందపడిందట. దాని నుంచి ఓ రాక్షసుడు పుట్టాడు.
‘ప్రభూ! నాకు నివాసం చూపు’ అని ఆ రాక్షసుడు బ్రహ్మను కోరాడు.
అప్పుడు బ్రహ్మ- ‘నువ్వు ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో వారి శాల్యన్నపు మెతుకులతో నివసిస్తావు. పిదప వారి కడుపుల్లోకి చేరి క్రిములుగా మారతావు’ అని చెప్పాడట. అందువల్లే దక్షిణ భారతదేశంలో ఏకాదశి నాడు వరి అన్నం చాలామంది తినరు.

ఆషాఢ శుద్ధ ద్వాదశి/ చాతుర్మాస్యం ఆరంభం
జూలై 11, సోమవారం

ఆషాఢ శుద్ధ ద్వాదశి నాటి నుంచి నాలుగు నెలల చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ‘చతుర్మాస్యం’ అంటే నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారుతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువున చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.
చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన పాలును, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, రా•మాషములు, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు.
పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.
భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో పలుచోట్ల ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.
వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతికరమైనది.

ఆషాఢ శుద్ధ పూర్ణిమ / గురుపూర్ణిమ
జూలై 13, బుధవారం

ఆషాఢ శుద్ధ పూర్ణిమకు వ్యాస పూర్ణిమ అని పేరు. ఈనాడు యతులు మహా భారత గ్రంథ రచయిత, అష్టాదశ పురాణ గ్రంథకర్త అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని చెబుతారు. దక్షిణాదిలోని కుంభకోణంలో, శృంగేరిలో ఈనాడు శంకర పీఘాలు అత్యంత వైభవంతో శోభిల్లుతాయి. ఇంకా ఈనాడు శివ శయన వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కోకిలా వ్రతాన్ని కూడా ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, మన తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలోని పూర్వ మహబూబ్‍నగర్‍ జిల్లా కసుమర్తి గ్రామంలో భీమా నది కృష్ణా నదిలో కలిసే చోట చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ జితేంద్రరాయ పేరిట దైవం ఉంది. వ్యాస పూర్ణిమ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.
సనాతన హైందవ సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే. అందుకే ఈనాడు గురువులను పూజించి, గౌరవిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడే వేదవ్యాసుడు జన్మించాడని, ఈ కారణంగానే దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చిందని అంటారు. చాతుర్మాస్య కాలారంభంలో వచ్చే తొలి పౌర్ణమే గురుపూర్ణిమ కావడం విశేషం. తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను పూజించి, జ్ఞానాన్ని సంపాదించే ఆచారానికి గురుపూర్ణిమ ఒక భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్టమైనది. అందుకే ఈ పూర్ణిమ నాడు దక్షిణామూర్తి, వేదవ్యాసుడితో పాటు జగద్గురు ఆదిశంకరులు, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుడు, ఇతర గురుపరంపరలోని శ్రేష్ఠులను పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ బహుళ పాడ్యమి
జూలై 14, గురువారం

ఆషాఢ బహుళ పాడ్యమి నాడు మృగశీర్షా వ్రతం ఆచరించాలని స్మంతి కౌస్తుభ వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, కోకిలా వ్రతాన్ని ఆచరించాలని కూడా అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో- ఆషాఢ బహుళ పాడ్యమి నాడు ధర్మావాప్తి వ్రతం ఆచరించాలని రాశారు.

ఆషాఢ బహుళ విదియ
జూలై 15, శుకవ్రారం

ఆషాఢ బహుళ విదియ నాడు లక్ష్మీమధుసూదనులను పూజించాలి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ నాటి తిథి గురించి ‘క్షీరసాగరే లక్ష్మీక మధుసూదన పూజ’ అని వర్ణించారు. అంటే, దీనిని బట్టి ఈనాడు లక్ష్మీ సహిత మధుసూదనుడిని పూజించాలని తెలుస్తోంది. ఇంకా ఈనాడు అష్టనాగ పూజ, మానసపూజ నిర్వహించాలని వేర్వేరు గ్రంథాల్లో ఉంది. మరికొన్ని గ్రంథాలు ఆషాఢ బహుళ విదియ తిథి విజయతీర్థ పుణ్యదినమని పేర్కొంటున్నాయి.

ఆషాఢ బహుళ అష్టమి
జూలై 21, గురువారం

ఆషాఢ బహుళ అష్టమి తిథి రౌచ్య మన్వంతరాది తిథి. రౌచ్యుడు పదమూడవ మనువు. అతనికి రేచ్చుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన రుచి అనే ముని కుమారుడు. మొదట రుచి మహర్షి వివాహం చేసుకోలేదు. అందువల్ల ఒకనాడు పితరులు అతనికి కనిపించి పెళ్లి చేసుకుని సంతానం పొందాలని చెబుతారు. ఈ క్రమంలో అతను బ్రహ్మ ఆదేశానుసారం మాలిని అనే అప్సరస కుమార్తెను వివాహమాడతాడు. ఫలితంగా ఆయనకు ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశి మన్వంతరాధిపత్యం వహిస్తున్నాడు. ఈ మన్వంతరానికి దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ బహుళ ఏకాదశి
జూలై 24, ఆదివారం

ఆషాఢ బహుళ ఏకాదశి.. కామికైకాదశి పర్వం. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల అభీష్టాలు ఈడేరుతాయని అంటారు.

ఆషాఢ బహుళ ద్వాదశి
జూలై 25, సోమవారం

ఈనాడు రోహిణీ వ్రతం ఆచరిస్తారు.

ఆషాఢ బహుళ అమావాస్య
జూలై 28, గురువారం

ఆషాఢ బహుళ అమావాస్యతో తెలంగాణలో బోనాల పండుగ ముగుస్తుంది. ఈనాడు పాత నగరంలోని మహంకాళి ఆలయంలో మహా జాతర జరుగుతుంది.
ఇక, ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఈనాడు ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీప స్తంభాలు దాని మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. సాయంత్రం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. ఈ పక్రియనే దీప పూజ అంటారు.

శావ్రణ శుద్ధ పాడ్యమి/శావ్రణ మాసారంభం
జూలై 29, శుకవ్రారం

ఈ తిథి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి పవిత్రారోపణాలకు ఉద్ధిష్టమైనది. అంటే శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవ అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ.

శావ్రణ శుద్ధ విదియ
జూలై 30, శనివారం

శ్రావణ శుద్ధ విదియ నాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది.

శావ్రణ శుద్ధ విదియ
జూలై 31, ఆదివారం

శ్రావణ శుద్ధ తదియ నాడు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే వ్రత గ్రంథంలో వివరించారు.

Review పల్లెకళ..ఆషాఢం భళా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top