పుణ్యాధిక మాసం

2023- జూలై 1, శనివారం, ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి
2023- జూలై 31, సోమవారం, శ్రావణ (అధిక) శుద్ధ త్రయోదశి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-ఆషాఢం-శ్రావణం (అధిక)-వర్షరుతువు-దక్షిణాయణం

ఆంగ్లమానం ప్రకారం ఏడవ నెల జూలై. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ – శ్రావణ (అధిక) మాసాల కలయిక. ఆషాఢ మాసంలోని కొన్ని రోజులు, శ్రావణ (అధిక) మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆషాఢాన్ని శూన్య మాసమని, శుభప్రదమైనది కాదని అంటారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు నిర్వహించరు. కానీ, అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసం ఆషాఢం. జూలై 17, సోమవారం వరకు ఆషాఢ మాస తిథులు, జూలై 18 నుంచి 31 వరకు శ్రావణ (అధిక) తిథులు ఈ మాసంలో ఉంటాయి. జూలైలో వచ్చే ప్రధాన పర్వాల్లో గురుపూర్ణిమ ప్రధానమైనది. ఇంకా కామిక ఏకాదశి, పద్మిని ఏకాదశి వంటి పర్వాలూ ఈ నెలలో ప్రత్యేకమైనవి.

ఆషాఢ మాస తిథులు పదిహేడు రోజులు, శ్రావణ (అధిక) మాస తిథులు పద్నాలుగు రోజుల పాటు ఉండే జూలై నెలలో అంతగా శుభ ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా మహా వైశిష్టమైన మాసం. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. నిండైన వర్షాలతో ప్రకృతికాంత పులకించే తరుణం.. శ్రావణం. ఈ కాలంలో నేల నేలంతా సస్యశ్యామలమై విరాజిల్లుతుంది. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. ఆమె ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇక, ఆషాఢ మాస తిథుల్లో వచ్చే ప్రధాన పర్వాల్లో గురుపూర్ణిమ ప్రధానమైనది. ఈనాడు వేదవ్యాసుడిని, షిర్డీ సాయిబాబాను, జగద్గురువైన ఆదిశంకరాచార్యుల వారిని ఇతర గురువులను ఆరాధించడం ఆచారం. అయితే జూలైలో వచ్చే శ్రావణ మాస తిథులన్నీ అధిక మాసంలోనివి. కాబట్టి అధిక మాసంలోని తిథుల నాడు కూడా శుభకార్యాలేవీ తలపెట్టరు. మొత్తానికి జూలై.. శూన్య మాసం. ఇక, ఈ మాసం విశేషాలు.. ఈ మాసంలో వచ్చే వివిధ తిథుల్లో వచ్చే ముఖ్యమైన పర్వాల గురించి వివరాలు..

అధిక మాసం అంటే..?!
శ్రీ శోభకృత్‍ నామ సంవత్సరం 13 నెలలు లెక్క. సంవత్సరం అంటే పన్నెండు నెలలే కదా! మరి ఈ 13న నెల ఎలా వచ్చింది? తెలుగు క్యాలెండర్‍ ప్రకారం పన్నెండు నెలలకు బదులుగా 13 నెలలు వస్తాయి. ఇందుకు అధిక మాసం కారణం. శ్రావణ మాసంలో ఈ అధిక మాసం వచ్చింది. అంటే శ్రావణ మాసం రెండు నెలల కాలంగా ఉంటుంది. జ్యోతిష్యులు, పంచాంగకర్తల అభిప్రాయం ప్రకారం ప్రతి పందొమ్మిది (19) సంవత్సరాలకు ఒకసారి ఇలా జంట శ్రావణ మాసం వస్తుంది. దీనినే అధిక మాసం అంటారు. ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది.
హిందూ క్యాలెండర్‍ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. దీనినే శూన్య మాసం అని కూడా అంటారు. క్యాలెండర్‍ లెక్కింపులో ఉన్న వ్యత్సాసాలే అధిక మాసం రావడానికి కారణం.
సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే ఏడాదికి మూడు వందల అరవై ఐదు (365) రోజుల ఆరు (6) గంటల కాల ప్రమాణం.
అదే చంద్రమానం ప్రకారం అయితే, సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు (354) రోజులే ఉంటాయి. అంటే సౌర, చాంద్రమానాల మధ్య దాదాపు పదకొండు (11) రోజుల తేడా వస్తుంది. ఏడాది లెక్కింపులో వచ్చే ఈ తేడాను సరిచేయడానికే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక నెలను అదనంగా జోడించి ఇలా అధిక మాసం రూపంలో సవరిస్తుంటారు. ఈ పక్రియనే లీపు మాసం అని కూడా అంటారు.
2023, శోభకృత్‍ నామ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై 18న ప్రారంభమై ఆగస్టు 16 వరకు రెండు నెలల పాటు కొనసాగనుంది. అధిక మాసం శివవిష్ణువుల పూజలకు బాగా పనికొస్తుంది. ముఖ్యంగా అధిక మాసంలో శివుడిని ఆరాధించడానికి ఎక్కువ రోజులు లభించినట్టవుతుంది.
ఇక, అధిక మాసం సమయంలో వివాహాది, శుభకార్యాలను తలపెట్టరు. ఉపనయనం, గృహ ప్రవేశాల వంటివీ చేపట్టరు. అధిక మాసంలో కొత్త ఇళ్ల నిర్మాణం చేయకూడదు. అలాగే ఆస్తుల కొనుగోలుకు ఈ కాలం అంతగా మంచిది కాదు. కొత్త ప్రయత్నాలు చేయడం, భారీ ప్రాజెక్టులు చేపట్టడం, భారీ పెట్టుబడులను పెట్టడం వంటి వాటికి అధిక మాసం అనుకూలం కాదు. అలాగే కొత్తగా దుకాణాలను తెరవడం, వ్యాపారాలను ప్రారంభించడం వంటివీ చేయరు.
(జూలై 18 – ఆగస్టు 16: అధిక మాసం)

ఆషాఢ శుద్ధ త్రయోదశి
జూలై 1, శనివారం

ఆషాఢ శుద్ధ త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. అలాగే ఈ తిథి శని త్రయోదశిగానూ ప్రతీతి. ఆధ్యాత్మిక గురువు కుసుమ హరనాథ జయంతి తిథి కూడా ఈనాడే. ఈ తిథితోనే ఆంగ్లమాన జూలై మాసం ఆరంభమవుతుంది.
ఇక, భారతదేశంలో ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తుంటారు.

ఆషాఢ శుద్ధ చతుర్దశి
జూలై 2, ఆదివారం

ఆషాఢ శుద్ధ చతుర్దశి శివుడిని ఆరాధించడానికి ఉద్ధిష్టమైన తిథి.

ఆషాఢ శుద్ధ పౌర్ణమి/గురుపూర్ణిమ
జూలై 3, సోమవారం

ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురుపూర్ణిమగా ప్రతీతి. దీనినే గురుపౌర్ణమి, వ్యాస పూర్ణిమ అనీ అంటారు. సనాతన హైందవ సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే. అందుకే ఈనాడు గురువులను పూజించి, గౌరవిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడే వేదవ్యాసుడు జన్మించాడని, ఈ కారణంగానే దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చిందని అంటారు. చాతుర్మ్యాస కాలారంభంలో వచ్చే తొలి పౌర్ణమే గురుపూర్ణిమ కావడం విశేషం. తమకు సమీపంగా నివసిస్తున్న తపసంపన్నులను పూజించి, జ్ఞానాన్ని సంపాదించే ఆచారానికి గురుపూర్ణిమ ఒక భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్టమైనది. అందుకే ఈ పూర్ణిమ నాడు వేదవ్యాసుడితో పాటు జగద్గురు ఆదిశంకరుల వారిని, షిర్డీ సాయిబాబాను, దత్తాత్రేయుడిని, ఇతర గురుపరంపరలోని శ్రేష్ఠులను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఈనాడు మహా భారత గ్రంథ రచయిత, అష్టాదశ పురాణ గ్రంథకర్త అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని చెబుతారు. దక్షిణాదిలోని కుంభకోణంలో, శృంగేరిలో ఈనాడు శంకర పీఠాలు అత్యంత వైభవంతో వెలుగొందుతాయి. ఇంకా గురుపూర్ణిమ నాడు శివ శయన వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కోకిలా వ్రతాన్ని కూడా ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, మన తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలోని పూర్వ మహబూబ్‍నగర్‍ జిల్లా కసుమర్తి గ్రామంలో భీమా నది కృష్ణా నదిలో కలిసే చోట చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ జితేంద్రరాయ పేరిట దేవాలయం ఉంది. వ్యాస పూర్ణిమ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.

ఆషాఢ బహుళ పాడ్యమి
జూలై 4, మంగళవారం

ఆషాఢ బహుళ పాడ్యమి తిథి నాడు మృగశీర్షా వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభ వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, కోకిలా వ్రతాన్ని ఆచరించాలని కూడా అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో- ఆషాఢ బహుళ పాడ్యమి నాడు ధర్మావాప్తి వ్రతం ఆచరించాలని రాశారు.
ఇక, జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి. ఈయన మన్యంలో పుట్టి పెరిగిన విప్లవజ్యోతి. అల్ప సైన్యంతోనే ఆంగ్ల దొరలను ఎదురొడ్డి నిలిచిన ఈ స్వాతంత్య్ర సమరయోధుడిని ఏటా జూలై 4న స్మరించుకుని, ఘనంగా నివాళులర్పిస్తారు.

ఆషాఢ బహుళ విదియ
జూలై 5, బుధవారం

ఆషాఢ బహుళ విదియ తిథి నాడు లక్ష్మీ సమేత మధుసూదనుడిని పూజించాలి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ నాటి తిథి గురించి ‘క్షీరసాగరే సలక్ష్మీక మధుసూదన పూజ’ అని వర్ణించారు. అంటే, దీనిని బట్టి ఈనాడు లక్ష్మీ సహిత మధుసూదనుడిని పూజించాలని తెలుస్తోంది. ఇంకా ఈనాడు అష్టనాగ పూజ, మనసా పూజ నిర్వహించాలని వేర్వేరు గ్రంథాల్లో ఉంది. మరికొన్ని గ్రంథాలు ఆషాఢ బహుళ విదియ తిథి విజయతీర్థ పుణ్యదినమని పేర్కొంటున్నాయి.

ఆషాఢ బహుళ తదియ
జూలై 6, గురువారం

ఆషాఢ బహుళ తదియ తిథి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఇది గణపతికి సంబంధించిన పూజా కార్యక్రమం. అలాగే, ఈనాటి నుంచి పునర్వసు కార్తె ఆరంభమవుతుంది.

ఆషాఢ బహుళ షష్ఠి
జూలై 8, శనివారం

ఆషాఢ బహుళ షష్ఠి నాడు ప్రత్యేకించి ఆచరించాల్సిన విధాయ కృత్యాలు ఏమీ లేకున్నప్పటికీ, షష్ఠి తిథి నాడు కుమారస్వామిని ఆరాధించడం ఆనవాయితీ. సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఈనాడు విశేషంగా పూజిస్తారు.
అలాగే, జూలై 8.. ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‍ రాజశేఖరరెడ్డి జయంతి దినం.

ఆషాఢ బహుళ సప్తమి
జూలై 9, ఆదివారం

ఆషాఢ బహుళ సప్తమి నాడు సికింద్రాబాద్‍లోని ప్రసిద్ధ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక కుండలో వండిన అన్నాన్ని సుందరంగా అలంకరించి, మహిళలంతా జాతరగా కదిలి వెళ్లి అమ్మవారికి నివేదించడం ఈనాటి ప్రధాన ఆచారం. జూలై 9న బోనాలు, 10న రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈనాడు లక్షలాది మంది తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. సికింద్రాబాద్‍లో జరిగే బోనాల ఉత్సవాలనే లష్కర్‍ బోనాలు అని కూడా అంటారు. సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహాంకాళి ఆలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్‍లోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య అప్పటి బ్రిటిష్‍ ఆర్మీలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఆయన 1813లో మధ్యప్రదేశ్‍లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. అప్పట్లో అక్కడ కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో అప్పయ్య తన సహోద్యోగులు కొందరితో కలిసి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయిని ప్రజలను కలరా వ్యాధి నుంచి కాపాడాలని, పరిస్థితులు మెరుగైతే తన స్వస్థలమైన సికింద్రాబాద్‍లో ఉజ్జయిని అమ్మవారికి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారు. అనంతరం కొద్దిరోజులకు కలరా తగ్గుముఖం పట్టింది. అమ్మవారి కరుణతోనే ఇదంతా జరిగిందని భావించిన అప్పయ్య, 1815లో ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్‍ వచ్చారు. ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో తన కుటుంబసభ్యులు, స్నేహితుల సాయంతో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో ఉన్నప్పుడు తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢ మాసంలో కావడంతో ఇక్కడా ఆషాఢ మాసంలోనే అమ్మవారి జాతర నిర్వహించాలని సురిటి అప్పయ్య నిర్ణయించారు. జాతరకు వచ్చే భక్తులకు నీటి సదుపాయం కోసం పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ బయటపడింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా పిలుస్తున్నారు. అలా అప్పటి నుంచి ఏటా ఆషాఢ మాసంలో లష్కర్‍ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ బహుళ అష్టమి
జూలై 10, సోమవారం

ఆషాఢ బహుళ అష్టమి తిథి రౌచ్య మన్వంతరాది తిథి. రౌచ్యుడు పదమూడవ మనువు. అతనికి రేచ్చుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన రుచి అనే వాని కుమారుడు. మొదట రుచి మహర్షి వివాహం చేసుకోలేదు. అందువల్ల ఒకనాడు పితరులు అతనికి కనిపించి పెళ్లి చేసుకుని సంతానం పొందాలని చెబుతారు. లేదంటే తాము నరకంలో పడతామని అంటారు. ఈ క్రమంలో అతను బ్రహ్మ ఆదేశానుసారం మాలిని అనే అప్సరస కుమార్తెను వివాహమాడతాడు. ఫలితంగా ఆయనకు ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశి మన్వంతరాధి పత్యం వహిస్తున్నాడు. ఈ మన్వంతరానికి దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ బహుళ నవమి
జూలై 11, మంగళవారం

ఆషాఢ బహుళ నవమి.. సాధారణంగా నవమి తిథి దుర్గాపూజకు ఉద్దేశించినది. ఈనాడు అమ్మవారిని ఆరాధించడం రివాజు.
అలాగే, ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంటారు.

ఆషాఢ బహుళ ఏకాదశి
జూలై 13, గురువారం

ఆషాఢ బహుళ ఏకాదశి.. కామికైకాదశి పర్వం. దీనినే కామిక ఏకాదశి అనీ అంటారు. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల అభీష్టాలు నెరవేరుతాయని అంటారు. .‘కామ’ అంటే కోరిక అని అర్థం. మనసులోని కోరికలను సిద్ధింపచేసే ఏకాదశి కాబట్టి ఇది కామిక ఏకాదశి అయింది. విష్ణువును ఆరాధించడం, తులసీ దళాలతో ఆయనను పూజించడం, వెన్నను దానం చేయడం వంటి ఈ ఏకాదశి ప్రత్యేకతలు. ఈనాడు శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలం కాశీలోని గంగాస్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దాని కన్నా, గురు గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. ఈ ఏకాదశి నాడు పాలు ఇచ్చే ఆవును, దూడ, గ్రాసంతో కలిసి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. గతంలో చేసిన పాపాలకు భయపడే వారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఇక, కామిక ఏకాదశి నాడు జారగణ చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు రాత్రంతా నిద్రపోకుండా జాగారం ఉండే వారు యమధర్మరాజు కోపానికి గురికారని అంటారు. అలాగే, తులసీ మాతను కూడా ఈనాడు ఆరాధిస్తారు. తులసీ పూజ చేసే వారి పుణ్యాన్నే తప్ప పాపాన్ని చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడని అంటారు.

ఆషాఢ బహుళ ద్వాదశి
జూలై 14, శుక్రవారం

ఆషాఢ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అలాగే, ఈనాడు రోహిణి వ్రతాన్ని కూడా ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

ఆషాఢ బహుళ త్రయోదశి
జూలై 15, శనివారం

ఆషాఢ బహుళ త్రయోదశి నాడు శని త్రయోదశి పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా త్రయోదశి తిథి శనీశ్వరుని పూజలకు ఉద్ధిష్టమైనది.
అలాగే, ఏటా జూలై 15న ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవాన్ని (యూత్‍ స్కిల్స్ డే) నిర్వహిస్తుంటారు. యువత తమలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని, తమ ఆలోచనలకు పదును పెట్టాలని చాటడానికి, అలాగే, ప్రపంచవ్యాప్తంగా యువత సాధించిన నైపుణ్య విజయాలను తెలియచెప్పడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఆషాఢ బహుళ చతుర్దశి
జూలై 16, ఆదివారం

ఆషాఢ బహుళ చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి. ఈనాడు శివుడిని విశేషంగా ఆరాధిస్తారు. అలాగే, ఈనాడు హైదరాబాద్‍ పాతబస్తీలో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆషాఢ మాసం చివరిలో అమ్మవారికి జరిగే ఉత్సవమిది. దీనినే లాల్‍దర్వాజ బోనాలని కూడా అంటారు. ఈ బోనాల ఉత్సవాలకు నూట నాలుగు సంవత్సరాల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్‍ను ముంచెత్తిన సమయంలో నిజాం నవాబు ఇక్కడి సింహవాహిని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని, ఆపదను గట్టెక్కిస్తే గుడి కట్టిస్తానని వేడుకున్నారని అంటారు. అప్పటి నుంచి లాల్‍దర్వాజ (పాతబస్తీ) బోనాల ఆనవాయితీ ఏటా కొనసాగుతోంది. గోల్కొండ రాజుల కాలంలో వారి ఆస్థానంలోని అక్కన్న, మాదన్నలు తొలిసారి ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించారని చరిత్ర చెబుతోంది. బోనాల ఉత్సవాల మర్నాడు జూలై 17న రంగం నిర్వహిస్తారు.

ఆషాఢ బహుళ అమావాస్య
జూలై 17, సోమవారం

ఆషాఢ బహుళ అమావాస్యతో తెలంగాణలో బోనాల పండుగ ముగుస్తుంది. ఈనాడు పాత నగరంలోని మహంకాళి ఆలయంలో రంగం నిర్వహిస్తారు. ఇక, ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈనాడు ఇంట్లోని ఇత్తడి దీప స్తంభాలు, కుందులు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్య పలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీప స్తంభాలు దాని మీద ఉంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. సాయంత్రం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. ఈ పక్రియనే దీప పూజగా వ్యవహరిస్తారు. అలాగే, ఈనాడు కర్కాటక సంక్రమణం. దక్షిణాయం ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది. ఈనాటితో జూలై మాసంలోని ఆషాఢ మాస తిథులు ముగుస్తాయి.

శ్రావణ శుద్ధ పాడ్యమి (అధిక)
జూలై 18, మంగళవారం

ఈనాటి నుంచి శ్రావణ మాసం (అధిక) ఆరంభమవుతుంది. వర్షరుతువు ఆరంభ దినం కూడా ఇదే. సాధారణంగానైతే శ్రావణ శుద్ధ పాడ్యమి నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కానీ, అధిక మాసంలో వచ్చిన శ్రావణ తిథి కావడం వల్ల ఈనాడు ఏమీ జరుపుకోరు. కానీ, ఈనాటి మంగళగౌరీ వ్రతం గురించి కొంతైనా తెలుసుకోవడం అవసరం కాబట్టి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం పొడవునా వచ్చే ప్రతి మంగళవారం నిర్వహించుకుంటారు. ఈ తిథి పవిత్రారోపణాలకు ఉద్ధిష్టమైనది. అంటే శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరములను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవ అంటారు. దీనినే తోరబంధన క్రియ అని కూడా అంటారు. దర్భలను ‘పవిత్రం’ అంటారు. వీటికి మొదట పూజ చేసిన తరువాత దేవునికి అలంకరణ ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు తిథిని బట్టి వచ్చే గురు దేవతల పేరుతో పంచుతారు. ఇదే పవిత్రారోపణోత్సవ పక్రియ.

శ్రావణ శుద్ధ విదియ (అధిక)
జూలై 19, బుధవారం

శ్రావణ శుద్ధ విదియ నాటి పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనాదికాలు చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రారోపణం’ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. తిథి తత్వం దీనినే ‘మనోరథ ద్వితీయ’ అని చెబుతోంది. అయితే, ఈ తిథి అధిక మాసంలో వచ్చినందున ఈరోజేమీ ఈ విధాయకృత్యాన్ని ఆచరించరు. ఈనాటి నుంచి చంద్రోదయం ఆరంభం.

శ్రావణ శుద్ధ తదియ (అధిక)
జూలై 20, గురువారం

శ్రావణ శుద్ధ తదియ నుంచి పుష్య కార్తె ఆరంభమవుతుంది. శ్రావణ శుద్ధ తదియ నాడు సాధారణంగానైతే మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలి. క••త్యసార సముచ్చయము అనే వ్రత గ్రంథంలో ఈ వివరాలు ఉన్నాయి. అయితే, ఇది అధిక మాసపు తిథి కావడం వల్ల ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించడానికి వీల్లేదు. తదియ తిథి జూలై 20, 21 (గురు, శుక్రవారం) తేదీల్లో రెండ్రోజుల పాటు కొనసాగనుంది.
ఇక, ఏటా జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రీడపై నేటి తరానికి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని ఉద్దేశించారు. మెదడుకు పదును పెట్టే క్రీడల్లో చదరంగానికి మించినది లేదు.

శ్రావణ శుద్ధ చవితి (అధిక)
జూలై 22, శనివారం

శ్రావణ శుద్ధ చవితి తిథి విఘ్న పూజకు ఉద్ధిష్టమైనదని వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. అంటే ఈనాడు వినాయకుడిని విశేషంగా పూజించాలి. ఇక ఇది శ్రావణ మాసంలో వచ్చే తొలి శుక్రవారం. ఈనాడు శ్రావణ శుక్రవార లక్ష్మీ పూజలను విశేషంగా ఆచరిస్తారు. దీని తరువాత వచ్చే శుక్రవారమే, అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమే వరలక్ష్మీ వ్రతాచరణకు ఉద్ధిష్టమైనది. అయితే, ఇది అధిక మాసపు శ్రావణ తిథి కావడం వలన పైన చెప్పుకున్నవేవీ ఈనాడు ఆచరించరు.

శ్రావణ శుద్ధ పంచమి (అధిక)
జూలై 23, ఆదివారం

శ్రావణ శుద్ధ పంచమి తిథిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమిగా చెబుతున్నాయి. నాగపంచమి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు వాడుకలో ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకొంటారు. ఆంధప్రదేశ్‍లో మాత్రం కార్తీక శుద్ధ పంచమి నాడు నాగపంచమి జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. మొత్తానికి ఈ తిథి నాటి ఉదయమే స్త్రీలు పాముల పుట్టల వద్ద పూజ చేస్తారు. ఈనాడు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజిస్తారు. మట్టితో చేసిన పామును పూజించి, పువ్వులు, మంచి గంధం, పసుపు, వేపుడు బియ్యం, చిక్కుడు గింజలు, వేసిన ఉలవలు మొదలైన పూజా ద్రవ్యాలతో దీపారాధనం, కర్పూర నీరాజనం ఫలాలు, భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి నాడు భూమి దున్నకూడదని అంటారు. అందుకే రైతులు ఈనాడు అరక కట్టరు. అయితే, ఈ శ్రావణ శుద్ధ పంచమి (జూలై 23) అధిక మాసపు తిథి కావడం వలన ఈనాడు నాగపంచమి జరుపుకోరు. కేవలం తిథి పర్వం గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

శ్రావణ శుద్ధ షష్ఠి (అధిక)
జూలై 24, సోమవారం

తిథానుసారమైతే.. ఈనాడు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. ఇది సూర్యారాధనకు సంబంధించినది. ఇంకా ఈనాడు పాపనాశినీ సప్తమి (హస్తా నక్షత్రం వస్తే) వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో, అవ్యంగ సప్తమీ వ్రతం, భాస్కరస్య పవిత్రారోపణమని మరికొన్ని గ్రంథాల్లో ఉంది. శ్రావణ శుద్ధ షష్ఠి తిథి కల్కి జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. అలాగే, ఈ రోజు గుహస్య పవిత్రారోపణమ్‍ అని స్మ•తి కౌస్తుభంలో ఉంది. సూపౌదన వ్రతం చేస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో రాశారు. ఈనాడు శివుడిని పూజించి పప్పన్నం నివేదించాలి. అనంతరం దానినే భుజించాలి. (సూప + ఓదనం= సూపౌదనం. సూప అంటే పప్పు. ఓదనం అంటే అన్నం). కానీ, ఇది అధిక మాసపు తిథి కావడం వల్ల ఈ పర్వాలేవీ ఈనాడు ఆచరించదగినవి కావు.

శ్రావణ శుద్ధ సప్తమి (అధిక)
జూలై 25, మంగళవారం

తిథానుసారం ఈనాడు కుమారస్వామిని ఆరాధిస్తారు. అధిక మాసం కావడం వలన విశేషమైన పూజలేవీ ఈనాడు లేవు.

శ్రావణ శుద్ధ అష్టమి (అధిక)
జూలై 26, బుధవారం

సాధారణంగా దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనది. శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అనీ అంటారు. కానీ, ఈ తిథి అధిక మాసంలో వచ్చింది కాబట్టి పైన చెప్పుకున్న పర్వాలు, పూజలు ఈనాడు వర్తించవు.

శ్రావణ శుద్ధ నవమి (అధిక)
జూలై 27, గురువారం

శ్రావణ శుద్ధ నవమి తిథి నాడు కౌమారీ నామక పూజనమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అధిక మాసానికి ఇది వర్తించదు.

శ్రావణ శుద్ధ దశమి (అధిక)
జూలై 28, శుక్రవారం

శ్రావణ శుద్ధ దశమి తిథి ఆశా దశమిగా ప్రసిద్ధి. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని ప్రతీతి. పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలని నియమం.

శ్రావణ శుద్ధ ఏకాదశి (అధిక)
జూలై 29, శనివారం

శ్రావణ శుద్ధ ఏకాదశి పద్మిని ఏకాదశిగా ప్రతీతి. ఈనాటి ఉదయాన్నే నిద్రలేచి, శుచిగా స్నానం చేయాలి. ఉపవాసం ఈనాటి ప్రధానం విధాయకృత్యం. పప్పు, బియ్యం, బచ్చలికూర, తేనె వంటిని ఈనాడు అసలు ముట్టకూడదు. పండ్లు, పాల ఉత్పత్తులను మాత్రం ఫలహారంగా తీసుకోవచ్చు. పూర్తిగా సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ ఆహారాన్ని ఉల్లిపాయ, వెల్లుల్లి ఉపయోగించకుండా తయారు చేసుకోవాలి. ఈ ఏకాదశికి రాత్రంతా జాగరణ ఉంటారు. ఈనాడు శ్రీమహావిష్ణువుకు పంచామృతాభిషేకాన్ని నిర్వహించాలి. పుష్పాలు, తులసీ దళాలతో పూజించాలి. ఈనాడు విష్ణు సహస్ర నామాలను పఠించడం ఎంతో పుణ్యప్రదం. బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. పద్మిని ఏకాదశి గురించి స్కంద పురాణంలో వివరంగా ఉన్నాయి. ఈ వ్రతాచరణ గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడని అంటారు. పద్మిని ఏకాదశిని మొదట కార్తవీర్య రాజు సతీమణి రాణి పద్మిణి ఆచరించింది. ఆనాడు ఈ ఏకాదశి ఆచరణలో ఆమె చూపిన శ్రద్ధాభక్తుల కారణంగా ఈ ఏకాదశిగా ఆమె పేరు మీదుగానే పద్మిని ఏకాదశి అనే పేరు వచ్చింది.

శ్రావణ శుద్ధ ద్వాదశి (అధిక)
జూలై 30, ఆదివారం

శ్రావణ శుద్ధ ద్వాదశి (అధిక) తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి.

Review పుణ్యాధిక మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top