పుణ్యాల భాద్రపదం

తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం సెప్టెంబరు మాసం భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది తొమ్మిదవ నెల. ఈ మాసంలోని 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు. సెప్టెంబరు 26 నుంచి ఆశ్వయుజ మాసం ఆరంభమవుతుంది. అటు గణపతి నవరాత్రుల శోభ.. ఇటు దేవీ నవరాత్రుల కోలాహలంతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. రిషి పంచమి, పరివర్తన ఏకాదశి, ఉండ్రాళ్ల తద్ది, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దుర్గామాత నవరాత్రి ఆరంభ దినాలతో ఈ మాసం విరాజిల్లుతుంది.

2022- సెప్టెంబరు 1, గురువారం, భాద్రపద శుద్ధ పంచమి నుంచి 2022- సెప్టెంబరు 30, శుక్రవారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం-భాద్రపదం-ఆశ్వయుజం-వర్షరుతువు- దక్షిణాయణం

ఆరోగ్యానికి భద్రత కల్పించే మాసం భాద్రపదం. భాద్రపదంలో వర్షాలు ధారాళంగా కురుస్తాయి. ఈ నెలలో వర్షాలతో నేలంతా చిత్తడిగా మారుతుంది. రోగాలు ముసురుకుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి తగిన ఆహార నియమాలతో ఈ మాసంలో వివిధ వ్రతాలు, నోములను మన పెద్దలు నిర్దేశించారు. ఇక భాద్రపద మాసం ఆధ్యాత్మికంగా చాలా మ్రుఖ్యమైనది. హైందవ ధర్మంలోని ప్రధాన దేవీ దేవతల పండుగలు, పర్వాలన్నీ ఈ నెల నుంచే శ్రీకారం చుట్టుకుంటాయి. ప్రధాన పండుగలన్నీ మనల్ని పలకరిస్తాయి. వీటికి సన్నద్ధం చేసేందుకంటూ భద్ర (శుభాలు) కలిగిస్తుంది భాద్రపదం. దేవుళ్లలో తొలిపూజ గణనాథుడిదే కదా. అదే విధంగా మన సనాతన ధర్మంలోని ప్రధాన పర్వాలన్నీ భాద్రపదం నుంచే శ్రీకారం చుట్టుకుంటాయి. ఇవి కూడా వినాయక చవితి నాడు గణపతి పూజతోనే ఆరంభమవుతుండటం ఈ మాసం విశేషం. ఆయా రోజుల్లో వచ్చే పండుగలకు విఘ్నాలు రాకుండా ఈ మాసంలో గణనాథుడిని విశేషంగా పూజించాలి. విఘ్నేశ్వరుడికి భాద్రపదం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇక సెప్టెంబరు మాసం రెండో అర్ధ భాగంలోనే ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి.

అందమైన ఈ రుతువులో వచ్చే
నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కంతిలో విలక్షణమైనవి.
ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు.
సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు.
సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు
ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. సకల బ్రహ్మంలో
సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం
నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా,
రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో
ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక అయిన సెప్టెంబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు, పండుగల పరిచయం..

భాద్రపద శుద్ధ పంచమి/రుషి పంచమి…
సెప్టెంబరు 1, గురువారం

భాద్రపద శుద్ధ పంచమి తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. దీని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది కేవలం ఆడవాళ్ల వ్రతం. బాద్రపద శుక్ల పంచమి మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి. ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతం ఏదైనా ఉంటే చెప్పాలని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట. ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. అంటే తెలిసో తెలియక చేసే తప్పులు ఈ వ్రతాచరణ ద్వారా పోగొట్టుకోవచ్చని అంటారు.

భాద్రపద శుద్ధ షష్టి…
సెప్టెంబరు 2, శుక్రవారం

భాద్రపద శుద్ధ షష్ఠి స్కంద షష్టి. ఈనాడు కుమారస్వామిని యథాశక్తి పూజిస్తారు. ఈనాడు స్కంద దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే, ఈ షష్ఠి నాడు సూర్యపూజ చేయాలని పురుషార్థ చింతామణిలో ఉంది. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది.
కాగా, సెప్టెంబరు 2 దివంగత ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి డాక్టర్‍ వైఎస్‍ రాజశేఖరరెడ్డి వర్ధంతి దినం.

భాద్రపద శుద్ధ సప్తమి/ముక్తాభరణ వ్రతం
సెప్టెంబరు 3, శనివారం

భాద్రపద శుద్ధ భాద్రపద శుద్ధ సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలని, దీనినే ఆముక్తాభరణ వ్రతం అని అంటారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో రాశారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో వ్రత గ్రంథంలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని రాశారు.

భాద్రపద శుద్ధ అష్టమి/రాధాష్టమి
సెప్టెంబరు 4, ఆదివారం

భాద్రపద శుద్ధ అష్టమి నాడు రాధాష్టమి వ్రతం ఆచరిస్తారు. ఈనాడు రాధాకృష్ణులను పూజించాలి. దంపతుల మధ్య అనురాగం బలపడటానికి ఈ అష్టమి తిథి నాడు పూజలు చేయాలని అంటారు. యశోద ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్య గుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమ వారాశి రాధాదేవి. వీరిద్దరి ఆరాధించడానికి ఉద్దేశించినది ఈ రాధాష్టమి.

భాద్రపద శుద్ధ నవమి
సెప్టెంబరు 5, సోమవారం

భాద్రపద శుద్ధ నవమి గురించి వివిధ గ్రంథాలలో వివిధ రకాలుగా ఉంది. పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా ఈ తిథిని ఎంచుతారని అంటారు. దీనిని వారి భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం చేస్తారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
అలాగే, సెప్టెంబరు 5.. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. ఈనాడు డాక్టర్‍ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఆయన జయంతినే ఏటా ఈరోజు టీచర్స్డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇంకా, సెప్టెంబరు 5.. మదర్‍ థెరిసా వర్ధంతి దినం కూడా.

భాద్రపద శుద్ధ దశమి/దశావతార దశమి
సెప్టెంబరు 5, సోమవారం

భాద్రపద శుద్ధ దశమి.. నవమి ఘడియల్లోనే వస్తుంది. కాబట్టి సెప్టెంబరు 5నే దశమి తిథి కూడా. ఈనాడు దశావతారాలను పూజిస్తారు. ఈ కారణంగానే దీనికి దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త అనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు. దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు.
భాద్రపద శుద్ధ ఏకాదశి/పరివర్తన ఏకాదశి
సెప్టెంబరు 6, మంగళవారం
భాద్రపద శుద్ధ ఏకాదశిని వామన ఏకాదశి, పరివర్తినీ ఏకాదశి అని అంటారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశికి నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలవుతుంది. ఆయన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి అని పేరు వచ్చింది. కాగా, పరివర్తన ఏకాదశిని ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని దాల్చి బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపిస్తాడు. అందువల్లే ఈ ఏకాదశిని వామన ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు వామనావతారాన్ని పూజించడం వల్ల త్రిమూర్తులను పూజిస్తే కలిగే ఫలమంతా లభిస్తుందని అంటారు.

భాద్రపద శుద్ధ ద్వాదశి/వామన ద్వాదశి
సెప్టెంబరు 7, బుధవారం

భాద్రపద శుద్ధ ద్వాదశిని వైష్ణవ పరివర్తన ఏకాదశి అనీ, కల్కి ద్వాదశి దినమని, వామన జయంతి దినమని అంటారు. విష్ణుమూర్తి దాల్చిన అవతారాలలో ఐదవది.. వామనావతారం. ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి. మంచివాడే. కానీ, స్వభావసిద్ధంగా రాక్షసుడు కావడం వల్ల దేవతలంటే పడేది కాదు. ఒకనాడు రాక్షస గురువైన శుక్రాచార్యుడి సలహాతో బలి ఏకంగా స్వర్గంపైకి దండెత్తుతాడు. అతడిని నిలువరించడం ఎవరి వల్లా కాలేదు. అందరూ కలిసి విష్ణువును శరణువేడారు. ఆయన అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మించి, బలి సంగతి చూస్తానని అభయమిస్తాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన జన్మించాడు. కాగా, అదే సమయంలో బలి చక్రవర్తి అశ్వమేథ యాగాన్ని తలపెట్టాడు. అతడిని అణగదొక్కడానికి అదే సరైన సమయంగా భావించిన అదితి పుత్రుడు ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. ఏం కావాలో కోరుకొమ్మన్నాడు బలి. మూడడుగుల స్థలం కావాలంటాడు వామనుడు. తొలి అడుగు కింద భూమినీ, రెండో అడుగు కింద ఆకాశాన్నీ వామనుడు కోరాడు. కానీ, మూడో అడుగు వేయడానికి లోకంలో ఎక్కడా చోటులేదు. దీంతో తన తలపై మూడో అడుగు వేయాలని బలి విష్ణుఉవును కోరుకున్నాడు. ఆ విధంగా బలి చక్రవర్తిని వామనుడు (విష్ణుమూర్తి) పాతాళానికి తొక్కేశాడు. కానీ, ఎంతైనా బలి చక్రవర్తి మంచివాడు. తన ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. అందుకే పాతాళం నుంచి ఎప్పుడైనా తిరిగి వచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరాన్ని విష్ణువు ఈయనకు అనుగ్రహించాడు. బలి పాలించిన ప్రాంతంగా చెప్పే కేరళ రాజ్యానికి ఆయన ఒకసారి వస్తాడని, తనవాళ్లందరినీ తృప్తిగా చూసుకుని తిరిగి స్వర్గానికి వెళ్లిపోతాడని అంటారు. అలా బలి చక్రవర్తి వచ్చే రోజునే కేరళవాసులు ‘ఓనం’ పండుగగా జరుపుకుంటారు.

భాద్రపద శుద్ధ త్రయోదశి
సెప్టెంబరు 8, గురువారం

భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఈనాడు మొదలు మూడు రోజులు అగస్త్యార్ఘ్య దానం చేయాలని నియమం. ఈనాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అలాగే, కేరళీయులకు ముఖ్యమైన ఓనం పండుగ ఈనాడే. వామనుడి చేతి పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి ఈనాడే స్వర్గం నుంచి తమను చూడ్డానికి వస్తాడని కేరళవాసులు నమ్ముతారు. అందు నిమిత్తం నిర్వహించే పండుగే ఓనం. ఈనాడే తిరిగి సగౌరవంగా బలిని స్వర్గానికి పంపుతారు.

భాద్రపద శుద్ధ చతుర్దశి
సెప్టెంబరు 9, శుక్రవారం

భాద్రపద శుద్ధ (శుక్ల) చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశిగా ప్రసిద్ధి. అందుకే ఈ తిథిని పద్మనాభ చతుర్దశిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు అనంత వ్రతాన్ని ఆచరించాలి. అనుంతుడు అనేది విష్ణువు యొక్క అనేక నామాల్లో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనదని స్మ•తి దర్పణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఉత్కళ దేశంలో దీనిని అఘోర చతుర్దశి అంటారని ఆమాదేర్‍ జ్యోతిషీ వ్రత గ్రంథంలో రాశారు. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యం. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది.
భారతీయులు ఆచరించే కామ్య వ్రతాల్లో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఒకటి. ఈ వ్రతాచరణకు ఉదయ వ్యాపిని అయిన చతుర్దశి ముఖ్యం. పూర్ణిమ ఘడియలు ఏ కొంచెం ఉన్నా ఈ వ్రతానికి ఇంకా శ్రేష్ఠమై ఉంటుంది. అనంతుని వ్రతానికి ముఖ్యమైన అంగాలు మూడు. అవి-
1. యమునా జల పూజనం
2. అనంతుని పూజ
3. ప్రతిసర పూజ
అనంతుడు అనగా ఆదిశేషువు. విష్ణువు, రుద్రుడు అనే అర్థాలూ ఉన్నాయి. కానీ, ఇక్కడ పూజను అందుకునేది విష్ణువు పాన్పు, భూమిని మోసేవాడు అయిన ఆదిశేషువు. పద్మాల పిండితో ఏడు పడగలు గల పామును చిత్రించాలి. దర్భలతో పాము బొమ్మను వేస్తారు. దీని మీద కలశాన్ని ఉంచుతారు. ‘సహస్ర శిరసేనమ:’, ‘ఫణైస్సప్తభిరావిష్టం’ అనే మంత్రాలతో అనంతుని పూజించాలి. అలాగే అనంతుని ముందు ఒక తోరాన్ని ఉంచి పూజించాలి. అది పద్నాలుగు ముళ్లు గలదిగా ఉండాలి. కుంకుమాయుక్తమై ఉండాలి. పూజారంభానికి ముందు ముందటి సంవత్సరపు పాత తోరం ధరించాలి. పూజచేసిన అనంతరం దీనిని దక్షిణ కరానికి కట్టుకుని అప్పుడు పాత తోరాన్ని తీసివేయాలి.
అనంతుని పూజలో పద్నాలుగు (14) సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది.
విష్ణువుకు పానుపు అయిన ఆదిశేషుడికి ఏడు (పద్నాలుగులో సగం) పడగలు.
చతుర్దశి తిథి పద్నాలుగోది.
తోరం పద్నాలుగు పోచలతో చేసినది.
ఆ తోరానికి పద్నాలుగు గ్రంథులు.
అలాగే, అనంతుని పూజకు ఉపయోగించే పత్రులు- పద్నాలుగు.
నైవేద్యానికి పద్నాలుగు రకాల పండ్లు, పద్నాలుగు రకాల పిండివంటలు వాడటం ఆచారం. వాయన దానానికి పద్నాలుగు అతిరసములు వాడాలి.
గోధుమ పిండితో ఇరవై ఎనిమిది (రెండు పద్నాలుగులు) అతిరసములు చేయాలని వ్రత వివరణలో ఉంది. అలాగే, పద్నాలుగేసి ఏళ్లకు ఒకసారి వ్రతానికి ఉద్యాపనం చేయాలి.
మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు. అందుకే భారతదేశంలో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చాలా ప్రాముఖ్యమైది. ఈ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా విశేష పూజలు నిర్వహిస్తారు.
అరణ్యవాసం చేస్తున్న పాండవులు ఏ వ్రతం చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయో చెప్పాలని శ్రీకృష్ణుడిని కోరారు. కృష్ణుడు వారికి అనంత పద్మనాభ వ్రతాన్ని ఉపదేశించాడు. కృష్ణుడు పాండవులకు ఈ వ్రత కథను వివరంగా చెప్పడంతో పాటు ఇంకా ఇలా చెప్పాడు.
‘ధర్మరాజా! లోపాముద్ర సమేతంగా అగస్త్యుడీ వ్రతాన్ని ఆచరించి లోకాన వ్యాపింప చేశాడు. సగర, భరత, దిలీప, హరిశ్చంద్ర, జనకాది రాజులంతా తమ తమ ధర్మపత్నులతో సహా ఈ వ్రతాన్ని ఆచరించి తరించారని బోధించాడు.
అయితే, కాలాంతరాన, యుగ ధర్మం రీత్యా పురుషులంతా సంసార వ్యవహారాలలో మునిగి తేలడంతో ఈ వ్రతాన్ని ప్రస్తుతం స్త్రీలు ఆచరించడం ఆచారంగా మారింది. తమ యొక్క, తమ భర్తల యొక్క, పుత్రుల యొక్క, ప్రియుల యొక్క శ్రేయస్సును కోరి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించలేని స్త్రీలు- భక్తి పూర్వకంగా ఈ కథను విన్నా, చదివినా కూడా కష్టదూరాలూ, ఇష్టాప్రాప్తలూ అయి చిరకాలం సుఖిస్తారు.
ఇంకా, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు పాలీ చతుర్దశీ వ్రతం, కదలీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
అలాగే, గణపతి నిమజ్జనోత్సవం కూడా ఈనాడే కావడం విశేషం.

భాద్రపద శుద్ధ పౌర్ణమి
సెప్టెంబరు 10, శనివారం

భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. కాబట్టే ఈ తిథి అనేక విధాలుగా ప్రతీతమై ఉంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు మంచిది కాకపోయినా, వీలులేక పోయినా ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు. భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది.
భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది. ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది.
పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు.

భాద్రపద బహుళ పాడ్యమి/మహాలయ పక్షం
సెప్టెంబరు 11, ఆదివారం

భాద్రపద బహుళ పాడ్యమి తిథి నుంచి మహాలయ పక్షం ఆరంభమవుతుంది. ఇది వేదకాలం నుంచీ ఆచరణలో ఉన్న పండుగ. దీనినే పితృ పక్షమని కూడా అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై ఆ మాసపు అమావాస్యతో ముగుస్తుంది. ఆ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణ శ్రాద్ధ దినం వ్యక్తులకు సంబంధించినది. మహాలయ పక్షము సాముదాయకంగా పితరులను పూజించడానికి ఏర్పడింది. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి 96 శ్రాద్ధాలని చెప్పారు. వీటిలో పితృ పక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
తండ్రి బతికి ఉండగా తల్లిని కోల్పోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమి నాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు గంట కాలం పుచ్చుకుంటుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసే వాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై ఉంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి. ఇదే విధంగా తండ్రికి కూడా శ్రాద్ధకర్మను నిర్వహించాలి. పురోహితులు సూచించిన మేరకు దర్బగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్ద పిండాలు. ఈ పిండాల పక్కన చిన్న పిండాలు, మరికొన్ని ధర్మ పిండాలు ఉంచుతారు. వీటినన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీదట మంత్ర పుష్పాంజలి చేస్తారు. చివరగా నైవేద్యపు వస్తువును ఆరుబయట కాకి తినడం కోసం ఉంచుతారు. కాని ఈ నైవేద్యాన్ని కాకి ఎంత తొందరగా ముట్టుకుంటే పితృ దేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారని తలుస్తారు. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుడిని పితృ దేవతలు శపిస్తారని అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రులు భావిస్తారు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయలేని వారు కనీసం తర్పణమైనా విడవాలి. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలితో సరిపెడితే సరిపోతుంది.

భాద్రపద బహుళ విదియ
సెప్టెంబరు 12, సోమవారం

భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగిగా ప్రసిద్ధి. కొన్ని పండుగలకు పూర్వ దినాలను భోగి అనడం వాడుకలో ఉంది. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను (ముందు వచ్చే రోజులను/ముందురోజులను) భోగి అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుగట్ల గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.

భాద్రపద బహుళ తదియ/ఉండ్రాళ్ల తద్ది
సెప్టెంబరు 13, మంగళవారం

భాద్రపద బహుళ తదియ (తద్ది) అమ్మాయిలకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తన భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాలలూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, బాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్పలేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్పలేదు. సాధారణంగా భాద్రపద శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉదహరించాడు. గుడాపూపములు దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను విసర్జిస్తారు. వామదేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవేద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు.
కాగా, ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారంగా ఉంది.

భాద్రపద బహుళ చతుర్థి
సెప్టెంబరు 14, బుధవారం

భాద్రపద బహుళ చతుర్థి.. సంకష్టహర చతుర్థి దినం. ఈనాడు గణపతిని విశేషంగా పూజిస్తారు. భాద్రపద బహుళ చతుర్ధి నాడు దికాల్ప పూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. ఇంకా ఈనాటి నుంచే మహా భరణి.. ఉత్తర కార్తె ప్రారంభమవుతుంది.

భాద్రపద బహుళ పంచమి
సెప్టెంబరు 15, గురువారం

భాద్రపద బహుళ పంచమి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తిపరచాలని అంటారు. ఈనాడు రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసేదిగా ఉంది. మొదట స్నానం చేసి మట్టితో వేదిక చేయాలి. దానిని పేడతో అలకాలి. పువ్వులతో అలంకరించాలి. దర్భలు పరిచి దాని మీద గంధం ఉంచాలి. పువ్వులు ఉంచాలి. ధూపం వేయాలి. దీపం ఉంచాలి. సప్తరుషి పూజ చేయాలి. అర్ఘ్యదానం ఇవ్వాలి. దున్నకుండా, నాటకుండా పండిన శ్యామాక ధాన్యంతో బియ్యం చేసి వండి నైవేద్యం పెట్టి తాను ఆ అన్నమే తినాలి. ఇలా చేస్తే సప్తర్షుల అనుగ్రహం కలుగుతుంది.
అలాగే, ఈ తిథిని మహా భరణిగానూ వ్యవహరిస్తారు.
సెప్టెంబరు 15.. భారత జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. ప్రఖ్యాత ఇంజనీర్‍ సర్‍ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి దినాన్ని ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహించుకోవడం రివాజు.
అలాగే, ఈనాటి నుంచి శుక్ర మౌడ్యమి ప్రారంభమవుతుంది.

భాద్రపద బహుళ షష్ఠి
సెప్టెంబరు 16, శుక్రవారం

భాద్రపద బహుళ షష్టి నాడు ఎంఎస్‍ సుబ్బులక్ష్మి జయంతి దినం. ఈమె విఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు. గాయని. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను పొందిన మొదటి సంగీత కళాకారిణి. సుబ్బులక్ష్మి గారు పాడిన అనేక దైవగీతాలను ప్రతి ఇంటా వింటారు.

భాద్రపద బహుళ సప్తమి
సెప్టెంబరు 17, శనివారం

ఈనాడు కన్యా సంక్రమణం.

భాద్రపద బహుళ అష్టమి/జీమూతవాహనుడి పూజ
సెప్టెంబరు 18, ఆదివారం

భాద్రపద బహుళ అష్టమి నాడు జీమూత వాహనుడిని పూజించాలని అంటారు. అశోకాష్టమీ వ్రతం ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడు దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఈనాటి ప్రధాన దైవనమైన జీమూత వాహనుడి గురించి వివరణ..
జీమూత వాహనుడు విద్యాధర యువకుడు. ఆయన ఆత్మత్యాగులలో అతిలోకుడు. అతనికి పట్టము కట్టి తల్లిదండ్రులు వానప్రస్థానికి వెళ్లారు. రాజ్యం చేస్తూనే తరచూ తల్లిదండ్రులకు పరిచర్యలు చేయడానికి జీమూతవాహనుడు వనాలకు వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్లిన క్రమంలో ఒకసారి మలయవతి అనే కన్యను చూసి మోహించాడు. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలం తరువాత ఓనాడు జీమూత వాహనుడు విహారం చేస్తూ ఒకచోట పాముల ఎముకలు గుట్టలుగా పడి ఉండటం చూశాడు. విచారించగా, అవి గరుడినికి ఆహారమవుతున్న పాముల ఎముకలని తెలిసింది. అలా గరుడుడు రోజూ ఎన్నో పాములను చంపసాగాడు. దీంతో రోజూ ఒక పామును తామే అతనికి ఆహారంగా ఇచ్చేలా నాగరాజైన వాసుకి గరుడునితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా గరుడుడు చాలా పాములను చంపకుండా వాసుకి నియమం చేశాడు.
జీమూత వాహనుడు అక్కడ ఉండగానే ఆనాడు గరుత్మంతునికి ఆహారం కావాల్సిన వంతు వచ్చిన శంఖచూడుడనే నాగ కుమారుడు వచ్చాడు. అతని వెంట ఏడుస్తూ అతని తల్లి వచ్చింది. గరుడినికి ఆహారం కావడానికి పూర్వం పన్నగ కుమారుడు ధరించాల్సిన ఎర్రని బట్టలు నాగరాజు తెచ్చాడు. ఆహారబలికి అంతా సిద్ధమంతోంది. ఇదంతా చూసి జీమూత వాహనుని హృదయం ద్రవించింది. శంఖచూడునికి బదులుగా తానే గరుడికి ఆహారం కావాలని అతను నిశ్చయించుకున్నాడు. నాగరాజు తెచ్చిన ఎర్రబట్టలు తనకివ్వాలని కోరగా, శంఖచూడుడు తానే బలికి వెళ్తానని ఇవ్వడానికి నిరాకరించాడు. అంతలో విద్యాధరుల్లో ఉన్న ఆచారాన్ని బట్టి కొత్త పెళ్లికొడుక్కి ఇవ్వాల్సిన కొత్త ఎర్రబట్టలను జీమూత వాహనుడికి అత్తగారు పంపుతుంది. వాటిని ధరించిన జీమూత వాహనుడు వధ్యశిల ఎక్కుతాడు. అంతలో గరుత్మంతుడు వస్తాడు. తనకై వచ్చిన నాగ కుమారుడే అతను అనుకుని తినడానికి సిద్ధమవుతాడు. ఈలోగా శంఖచూడుడు వధ్యశిలపైకి వచ్చిన తనను తినాలని కోరతాడు. తననే తనివి తీరా ఆరగించాలని జీమూత వాహనుడు అడుగుతాడు. గరుడుడు తానప్పుడు తింటున్నది పన్నగ కుమారుడిని కాదని తెలుసుకుంటాడు. జీమూత వాహనుడి త్యాగబుద్ధికి వెరగొందుతాడు.
ఈలోగా జీమూత వాహనుడిని వెతుక్కుంటూ కాబోయే భార్య మలయవతి, ముసలి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు.
అమృతం తెచ్చి ఇచ్చి అయినా తమ కుమారుడిని బతికించాలని వారు గరుత్మంతుడిని కోరతారు. గరుడుడు చలించి.. అమృతం తెచ్చి జీమూత వాహనుడిని బతికిస్తాడు. అనంతరం తనతో పాటు అప్పటి వరకు చచ్చిన పాములన్నిటిపై కూడా జీమూత వాహనుడు అమృతపు జల్లులు చల్లి బతికిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై జీమూత వాహనుడిని విద్యాధర చక్రవర్తిని కమ్మని ఆశీర్వదిస్తుంది. ఇకపై పాములను చంపపని గరుత్మంతుడు చెబుతాడు. జీమూత వాహనుడి ఆత్మత్యాగం గరుడునిలో ఈ పరివర్తన తెచ్చింది. అనంతరం జీమూత వాహనుడు మలయవతితో కూడి సుఖంగా రాజ్యపాలన చేస్తూ విద్యాధరి చక్రవర్తి అయ్యాడు.
ఇదెంతో కదిలించే కథ. ఒకప్పుడు ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాలలో ఈ గాథ ఉపవాచకంగా ఉండేది. ఇటువంటి కథలే చిన్నారులకు త్యాగం, దయ, కరుణ బుద్ధులను నేర్పుతాయి. పెద్దలు కూడా తప్పక చదవాల్సిన త్యాగగాథ ఇది.

భాద్రపద బహుళ నవమి
సెప్టెంబరు 19, సోమవారం

భాద్రపద బహుళ నవమి తిథి నీరాజన నవమి పర్వమని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీపూజాధికాలు చేయాలని అందులో వివరించారు. ఇక, కొన్ని పంచాంగాలలో ఈ తిథిని అహిర్ణవమిగానూ, దుర్గోత్థాపనగానూ వ్యవహరిస్తున్నారు.

భాద్రపద బహుళ ఏకాదశి
సెప్టెంబరు 21, బుధవారం

భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరైకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలో దీనిని ‘ఇంద్రైకాదశి’గా పేర్కొన్నారు. ఇంద్రసేనుడనే వాడు ఈనాడు యమలోకంలో యాతనలు పడసాగాడు. అదే సమయంలో భూలోకంలో అతని కొడుకు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా యమలోకం నుంచి ఇంద్రసేనుడు స్వర్గలోకానికి వెళ్లాడని పురాణకథ.

భాద్రపద బహుళ త్రయోదశి
సెప్టెంబరు 23, శుక్రవారం

భాద్రపద బహుళ త్రయోదశి కలియుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. ద్వాపర యుగాది అని తిథి తత్వంలోనూ, చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది. భాద్రపద కృష్ణ త్రయోదశి కలియుగాది దినం. ఈ యుగమున ఒక పాదాన మాత్రమే ధర్మం నడుస్తుందని అంటారు. కొంతకాలానికి అది కూడా నశిస్తుంది. అధర్మమే ప్రవర్తిస్తుంది. భగవంతుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులై ఉంటారు. దీనిని అయోమయ యుగమని కూడా అంటారు. ఈ యుగమున ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 మానవ సంవత్సరాలు.

భాద్రపద బహుళ చతుర్దశి
సెప్టెంబరు 24, శనివారం

భాద్రపద బహుళ చతుర్దశి తిథి మాసశివరాత్రి. ఈనాడు ఉపవాసం ఉండటం వలన శివలోకప్రాప్తి అని తిథి తత్వం చెబుతోంది. స్మ•తి కౌస్తుభంలో ‘శస్త్రాదిహితన్యైకోదిఇష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు

భాద్రపద బహుళ అమావాస్య
సెప్టెంబరు 25, ఆదివారం

భాద్రపద బహుళ అమావాస్యను పితృకామావాస్యగా ఆయా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. దీనినే పితరమావాస అని కూడా అంటారు. ఈనాడు పితృ దేవతల సంతృప్తి కోసం తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు.
ఈనాటితో సెప్టెంబరు మాసంలో భాద్రపద మాస తిథులు ముగుస్తాయి.
ఈనాటి నుంచే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూలను అందంగా అలంకరించి గ్రామ దేవతలను పూజించే ప్రకృతి పర్వం బతుకమ్మ. ఈనాటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. దసరాకు ముందు రోజు నాడు బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
సెప్టెంబరు 26, సోమవారం

ఈనాటి నుంచి ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతాయి. దేవీ శరన్నవరాత్రులకు ఇది ఆరంభ తిథి. ఈ తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత
పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల పూజలు ఈ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దుర్గాదేవిని శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు.
అలాగే, బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈనాడు తెలంగాణ అటుకల బతుకమ్మను పూజిస్తారు.
ఇక, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగేది ఈనాడే.
అలాగే, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి

ఆశ్వయుజ శుద్ధ విదియ
సెప్టెంబరు 27, మంగళవారం

ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు చంద్ర దర్శనం. దేవీ నవరాత్రి ఉత్సవాలు రెండో రోజైన ఈనాడు అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో బ్రహ్మచారిణి దేవిగా, మరికొన్ని ప్రాంతాలలో బాలా త్రిపురసుందరిగా అలంకరించి పూజిస్తారు.
ఇక, బతుకమ్మ వేడుకల్లో ఇది మూడో రోజు. ఈనాడు ముద్దపప్పు బతుకమ్మ వేడుక జరుపుకుంటారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచి ఆరంభం. మొదటి రోజు ధ్వజరోహణం గావిస్తారు. ఈనాటి నుంచే హస్త కార్తె ప్రారంభమవుతుంది

ఆశ్వయుజ శుద్ధ తదియ
సెప్టెంబరు 28, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ తదియ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు. ఈనాడు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా, శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరించి కొలుస్తారు.
ఇక, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాను బియ్యం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
అలాగే, పంచాంగానన్నుసరించి.. ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి నాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు.

ఆశ్వయుజ శుద్ధ చతుర్థి
సెప్టెంబరు 29, గురువారం

ఆశ్వయుజ శుద్ధ చతుర్థి నాటికి దేవీ శరన్నవరాత్రులు నాలుగో రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారికి కొన్ని ప్రాంతాలలో కూష్మాండదేవిగానూ, మరికొన్ని ప్రాంతాలలో శ్రీగాయత్రి దేవిగానూ అలంకరిస్తారు.
అలాగే, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు అట్ల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
ఇక, తిథానుసారం.. ఈనాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పంచమి
సెప్టెంబరు 30, గురువారం

ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలి. శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
ఇక, దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజైన ఈనాడు దుర్గాదేవిని స్కందమాతగానూ, శ్రీ లలిత త్రిపురసుందరిదేవిగానూ అలంకరించి పూజిస్తారు.
అలాగే, తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆరవ రోజైన ఈనాడు అలిగిన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు

Review పుణ్యాల భాద్రపదం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top