పుష్య మాసం శని మాసం

ఈ మాసంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని.. మానవ శరీర జీవనాడి కారకుడు. జీవనాడి యొక్క ఒకశాఖ హృదయ స్పందనను, రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి, శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గడం వల్ల మకర మాసం మొదలయ్యే సమయానికే ఈ కొవ్వు కొరతను తీర్చాలని నియమం. ఇందువల్ల రవి ప్రభావం (ఎండ వేడిమి) ఎదుర్కోవడానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చేయడం వల్ల హృదయ స్పందన సక్రమంగా ఉండేటట్టు చేయగల ‘నువ్వులు – బెల్లం’ తినాలనే నియమం పెట్టారు.

శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించే వాడు అతడే. భక్తులు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్టలు పాటిస్తే శని తన ధర్మాలన్నిటినీ ప్రసాదిస్తాడు. మనిషి ఎప్పుడైతే న్యాయం, సత్యం, ధర్మం వంటి శుభ లక్షణాలను పొందగలమో అప్పుడే అతను బృహస్పతి (గురువు) అంతటి వాడవుతాడు.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి (గురువు). శనికి అధి దేవత యముడు. ‘యమం’ అంటే, ‘సం యమం’ అని అర్థం. అంటే ఆధీనంలో ఉంచుకోవడం. అంటే, శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవడం ఈ జీవనాడి మూలంగా మాత్రమే సాధ్యం. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్థం తక్కువైతే శరీరం చైతన్యం కోల్పోవడం, అనారోగ్యం మొదలైనవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి నువ్వులు, బెల్లానికి మాత్రమే ఉంది.

ఇక, పుష్యమాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం..

మార్గశిర బహుళ విదియ/ ఆంగ్ల నూతన సంవత్సరం : జనవరి 1, శుక్రవారం
మార్గశిర బహుళ విదియ తిథి నాటి నుంచి ఆంగ్లమానం ప్రకారం కొత్త సంవత్సర ఆరంభ దినం. పాశ్చాత్య సంస్క•తి ప్రభావంతో ఈనాడు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

మార్గశిర బహుళ తది : జనవరి 2, శనివారం
సాధారణంగా తదియ తిథి అక్షయాలను ప్రసాదించాలని కోరుతూ లక్ష్మీదేవిని పూజించడానికి అనువైనది.

మార్గశిర బహుళ చతుర్థి : జనవరి 3, ఆదివారం
చతుర్థి తిథి వినాయక పూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా చతుర్థి నాడు సంకష్ట హర చతుర్థి పూజలు నిర్వహిస్తారు.

మార్గశిర బహుళ పంచమి : జనవరి 4, సోమవారం
పంచమి తిథి నాగుల పూజకు ఉద్ధిష్టమైనది.

మార్గశిర బహుళ సప్తమి/ ఫల సప్తమీ వ్రతం : జనవరి 5, మంగళవారం
మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ అష్టమి/ కాలాష్టమి : జనవరి 6, బుధవారం
మార్గశిర బహుళ అష్టమి నాడు కాలాష్టమి వ్రతాన్ని, పూజల్ని చేస్తారు. అష్టమి తిథి నాడు కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఇంకా ఈ తిథి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని అంటారు.

మార్గశిర బహుళ నవమి/రూపా నవమి : జనవరి 7, గురువారం
మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ ఏకాదశి/సఫలైకాదశి : జనవరి 9, శనివారం
మార్గశిర బహుళ ఏకాదశికే ‘సఫలైకాదశి’ అని కూడా పేరు. తెలిసీ, తెలియక ఉపవాసం ఉంటే చాలు.. ఈనాడు తగిన ఫలాన్ని పొందుతారని ప్రతీతి. అందుకు నిదర్శనంగా నిలిచే కథ కూడా ఒకటి ఉంది. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కొడుకు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతనలా తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఇదంతా తనకు తెలియకుండానే మార్గశిర కృష్ణ ఏకాదశి నాడు జరిగింది. అయినా, లుంపకుడు ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పొందగలిగాడు.
అందుచేత ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది.

మార్గశిర బహుళ ద్వాదశి/ప్రదోష వ్రతం : జనవరి 10, ఆదివారం
మార్గశిర బహుళ ద్వాదశి.. మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశిగా ప్రసిద్ధి. ఈనాడు ఈ రెండు వ్రతాలు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరించే సంప్రదాయం ఉంది. ఈనాటి నుంచే ఉత్తరాషాఢ కార్తె ఆరంభమవుతుంది.

మార్గశిర బహుళ త్రయోదశి/యమ దర్శన : జనవరి 11, సోమవారం
మార్గశిర బహుళ త్రయోదశి తిథిని గురించి చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో యమ దర్శన త్రయోదశిగా వర్ణించారు. ఈనాడు యముడిని విశేషంగా పూజించాలి.

మార్గశిర బహుళ చతుర్దశి/మాస శివరాత్రి : జనవరి 12, మంగళవారం
సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి తిథి. ఈనాడు శివుడికి తగినరీతిలో పూజించాలి. కాగా, ఈనాడు జాతీయ యువజన దినోత్సవం. స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ రోజు యువత దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది

మార్గశిర బహుళ అమావాస్య/ భోగి : జనవరి 13, బుధవారం
మార్గశిర బహుళ అమావాస్య గురించి.. మహోదధ్యమావాస్య అని గదాధర పద్ధతి
అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇంకా దీనినే బకులామావాస్య అనీ అంటారు. పాలతో పాయసం వండి నివేదించడాన్నే ‘బకులక్షీరేణపాసంకృత్యా’ అంటారు. ఈనాడే సంక్రాంతి మూడు రోజుల పర్వంలోని తొలి రోజు అయిన భోగి పండుగ.

పుష్య శుద్ధ పాడ్యమి/మకర సంక్రాంతి : జనవరి 14, గురువారం
పుష్య శుద్ధ పాడ్యమి పుష్య మాసపు ఆరంభ దినం. ఈనాడే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరగతుడవుతాడు. ఈనాటి నుంచి ఉత్తరాయణ దినాలు ఆరంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు మకర సంక్రాంతి పర్వాని ఘనంగా జరుపుకుంటారు.

పుష్య శుద్ధ విదియ/కనుమ : జనవరి 15, శుక్రవారం
పుష్య శుద్ధ విదియ సంక్రాంతి పర్వంలోని మూడో పర్వమైన కనుమ దినం. ఈనాడు పశుపూజలు విశేషంగా జరుగుతాయి. ఈనాటి నుంచి గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. ఇదిలా ఉండగా, ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు.

పుష్య శుద్ధ తదియ : జనవరి 16, శనివారం
సంక్రాంతి పర్వం ఈనాటితో ముగుస్తుంది. దీనినే ముక్కాల పండుగ అనీ అంటారు.

పుష్య శుద్ధ పంచమి/నాగపూజ : జనవరి 18, సోమవారం
పుష్య శుద్ధ పంచమి నాడు చతుర్ధీ వ్రతం ఆచరించాలని వ్రత నియమం. మధుసూదన భగవానుడిని ఈనాడు పూజించాలి.
మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఆచారమై ఉంది

పుష్య శుద్ధ షష్ఠి/ కుమారషష్ఠి : జనవరి 19, మంగళవారం
పుష్య శుద్ధ షష్ఠిని కుమారషష్ఠి అని అంటారు. కుమారషష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం ఆచరణ తమిళులలో ఎక్కువగా కనిపిస్తుంది. అరవ వారిలో పలువురికి కుమారస్వామి ఇలవేల్పు. వారిలో ఆర్మొగమ్‍, షణ్ముగన్‍, కుమరన్‍ మున్నగు పేర్లు ఎక్కువగా ఉంటాయి. ప్రాచీనాంధ్ర కవులు తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ ఆంధ్ర దేశంలో హెచ్చుగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు తెలుగునాట నేటికీ నిలిచి ఉన్నాయి. దీనివల్ల ఒకప్పుడు ఇక్కడ కూడా కుమారస్వామి ఉత్క•ష్ట స్థాయిలో పూజలందుకున్నాడని తెలియ వస్తోంది. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేష పూజలందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే
మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇక, ఇదే మాదిరిగా తమిళులు జరుపుకునే పండుగ-పుష్య శుద్ధ షష్ఠి.

పుష్య శుద్ధ సప్తమి : జనవరి 20, బుధవారం
పుష్య శుద్ధ సప్తమి నాడు మార్తాండ సప్తమిగా ప్రతీతి. అలాగే ఈనాడు ద్వాదశ సప్తమి వ్రతం కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. వీటి పేర్లను బట్టి పరిశీలిస్తే.. ఇవి సూర్య సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. ఈనాడు సూర్య భగవానుడిని యథాశక్తి పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే ఈ అష్టమిని బుద్ధ అష్టమిగానూ ఆచరిస్తారు.

పుష్య శుద్ధ నవమి : జనవరి 22, శుక్రవారం
పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలి.

పుష్య శుద్ధ దశమి : జనవరి 23, శనివారం
పుష్య శుద్ధ నవమి చాలా విధాలుగా ప్రతీతమై ఉంది. వివిధ వ్రత గ్రంథాలు దీనిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ అని అర్థం. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, భారత జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‍ చంద్రబోస్‍ జయంతి దినం ఈనాడే.

పుష్య శుద్ధ ఏకాదశి : జనవరి 24, ఆదివారం
రైవతుడు అనే పేరు వచ్చింది. ఈయన రేవతి, దుర్దముల కొడుకు. ఇతను కాలక్రమేణ ధర్మవేది అయి మనువు అయ్యాడు. అతని మన్వంతరంలో విభుడు అనేవాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్థ్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్తరుషులు.
పుష్య శుద్ధ ఏకాదశి రైవత మన్వాది దినమే కాక పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది.

సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.

పుష్య శుద్ధ ద్వాదశి : జనవరి 25, సోమవారం
పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి, సుజన్మ ద్వాదశీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడే భారత గణతంత్ర దినోత్సవం.
పుష్య శుద్ధ చ్రతుర్దశి
జనవరి 27, బుధవారం
పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఇది విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేసి, గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు.

పుష్య శుద్ధ పౌర్ణమి : జనవరి 28, గురువారం
పుష్య నక్షత్రంతో కూడిన పున్నమికి ‘పౌషీ’ అని పేరు. ఏ మాసంలో పూర్ణిమావాస్య వస్తుందో ఆ మాసానికి పుష్యమాసమని పేరు. శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి.
పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి.

మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి. మనకు వచ్చే పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. దీనికి ‘అనుమతి’ అని పేరు. పదహారు కళలలో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. దీనికి ‘రాకా పూర్ణిమ’ అని పేరు. అనుమతి అయితేనేం, రాకా అయినేతేం.. మొత్తానికి మనకు ఏడాదికి పన్నెండు పూర్ణిమలు. ఈ పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా ఉన్నాయి.
హిందువుల పండుగలను పరిశీలిస్తే.. కృష్ణ పక్షంలో కంటే శుక్ల పక్షంలో పండుగలు ఎక్కువ. ఆస్వాదనీయమైన శుక్ల పక్షపు వెన్నెల వ్యర్థం కాకుండా మన పెద్దలు ఆ రోజుల్లో పండుగలు, పబ్బాలు, వ్రతాలు, ఉత్సవాలు ఏర్పాటు చేసి ఉంటారు. అందుకే తెలుగు నాట ‘పున్నమి’ గొప్ప తిథి.

మానవ ప్రపంచం ప్రచురించిన మహనీయులలో సాటిలేని మేటి గౌతమబుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడు ముఖ్య ఘట్టాల్లో ప్రముఖ స్థానాన్ని వహించింది. ఆయన పుట్టింది ఒక వైశాఖ పూర్ణిమ నాడైతే, ఆయన బుద్ధుడిగా అవతరించింది మరో వైశాఖ పూర్ణిమ నాడు. నిర్యాణం చెందినది మరో వైశాఖ పూర్ణిమ నాడు.

ఇక, దశావతారాల్లో ఒకటైన కూర్మావతారపు జయంతి వైశాఖ పూర్ణిమ నాడు. హనుమజ్జయంతి చైత్ర పూర్ణిమ నాడు. జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా ప్రసిద్ధి. శ్రావణ పూర్ణిమ రక్షా పూర్ణిమ.
భాద్రపద పూర్ణిమలు అధ్యాయ, ఉపాకర్మ పూర్ణిమలు. ఆశ్వయుజ పూర్ణిమ కోజాగరీ పూర్ణిమ. కార్తీక పూర్ణిమ త్రిపుర పూర్ణిమ. మార్గశిర పూర్ణిమ కోరల పున్మమ. పుష్య పూర్ణిముత్సర్జనోత్సవ పూర్ణిమ. మాఘ పూర్ణిమ మహా మాఘి పూర్ణిమ. ఫాల్గుణ పూర్ణిమ కాముని పున్నమి.
ఇక, మహా పౌషి (పుష్య పూర్ణిమ) విషయానికి వస్తే.. తమిళులు దీనిని ‘పూసమ్‍’ అంటారు. తై పూసమ్‍ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్‍వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్‍వేణిలో తామ్రపర్ణి నదిలో
స్నానం పాపక్షయకరమై ఉంటుంది. అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్‍ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది.
పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. అలాగే, మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది. పుష్య శుద్ధ పూర్ణిమినే హిమశోధన పూర్ణిమ అని కూడా అంటారు

పుష్య బహుళ పాడ్యమి : జనవరి 29, శుక్రవారం
పుష్య కృష్ణ పాడ్యమి నాడు విద్యావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.

పుష్య బహుళ తదియ : జనవరి 31, ఆదివారం
పుష్య కృష్ణ తదియ నాడు సంకష్ట హరి చతుర్థి వ్రతం ఆచరిస్తారు. గణనాథుడు ఈనాడు పూజలందుకునే దైవం.

Review పుష్య మాసం శని మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top